: ప్రపంచంలోనే తొలిసారిగా.. రాష్ట్రంలో అంధులకోసం ఇంజినీరింగ్ కళాశాల
ప్రపంచంలోనే మొదటిసారి అంధులకోసం ఓ ఇంజినీరింగ్ కళాశాల స్థాపించేందుకు దేవ్ నార్ ఫౌండేషన్ సిద్ధమవుతోంది. బిట్స్ పిలానీ సహకారంతో కోట్ల రూపాయల వ్యయంతో ఈ కాలేజీని నెలకొల్పనున్నారు. ఈ తరహా కళాశాలకు అనువైన స్థలం కోసం ప్రస్తుతం దేవ్ నార్ ఫౌండేషన్ యాజమాన్యం అన్వేషిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో 700 వరకు ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నా వాటిలో ఒక్కటీ వికలాంగులకోసం ప్రత్యేకించినది కాదు. ఈ నేపథ్యంలోనే తాము అంధులకోసం ఈ స్పెషల్ కళాశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నామని దేవ్ నార్ సేవా సంస్థ వ్యవస్థాపకుడు ఎ.సాయిబాబా గౌడ్ తెలిపారు.
సికింద్రాబాద్ వద్ద కొంత స్థలం తమ ఇంజినీరింగ్ కళాశాలకు అనువుగా ఉంటుందని భావిస్తున్నామని, ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేశామని గౌడ్ అన్నారు. త్వరగా భూమి కేటాయిస్తే, నిర్మాణం ఆరంభిస్తామని పేర్కొన్నారు. ఇప్పటివరకు తాము నిర్వహిస్తున్న అంధుల పాఠశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యార్థుల్లో కొందరు బోస్టన్, డెన్వర్ నగరాల్లో ఇంజినీరింగ్ చదువుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. కాగా, తమ ఇంజినీరింగ్ కళాశాల కోసం బిట్స్ పిలానీ ప్రొఫెసర్లు ప్రత్యేకంగా డిజిటల్ బెయిలీ పాఠ్యాంశాలను రూపొందిస్తున్నారని గౌడ్ వెల్లడించారు.