: ఆరు నెలలకంటే ఎక్కువకాలం ఉంటే ఆరోగ్యపన్ను
బ్రిటిష్ ప్రభుత్వం ఆరునెలలకంటే ఎక్కువ కాలం నివశించే విదేశీయులకు ఆరోగ్య పన్ను చెల్లించాల్సిందిగా చెబుతోంది. ఎందుకంటే అక్కడ ప్రజలందరికీ దాదాపు ఉచితంగా ప్రభుత్వం ఆరోగ్య సేవలు అందిస్తుంటుంది. ఇందులో విదేశీయుల కోసం కూడా పెద్దమొత్తంలో వెచ్చించాల్సి వస్తోంది. ఇందుకోసం ఆరు నెలల కంటే ఎక్కువ కాలం ఉండే విదేశీయులపై పన్ను విధించేందుకు ప్రత్యేక కసరత్తు మొదలుపెట్టింది. ఐరోపా యూనియన్ మినహాయించి మిగిలిన దేశాలనుండి వచ్చిన వారందరికీ ఈ పన్ను విధింపు వర్తించనుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై బుధవారం నాడు అభిప్రాయసేకరణ ప్రారంభించింది కూడా.
ఇంగ్లండ్‌లోని జాతీయ ఆరోగ్య సేవా విధానం (ఎన్హెచ్ఎస్) చాలా బలమైంది. దీనికింద ప్రభుత్వం ప్రజలకు ఉచిత ఆరోగ్య సేవలందిస్తుంది. బ్రిటిష్ ప్రభుత్వం ప్రజలకు అందించే ఉచిత వైద్యంలో విదేశీయులకోసం ఏటా దాదాపు 200 మిలియన్ పౌండ్లను వెచ్చిస్తున్నట్టు అంచనా. అయితే ప్రతి బ్రిటిష్ కుటుంబం ఏటా 5000 పౌండ్లు అంటే రూ.4.6 లక్షలు ఈ ఎన్హెచ్ఎస్ కోసం చెల్లిస్తోంది. అయితే కొంతకాలంగా ఆ దేశంలో ప్రజలు చెల్లించే పన్నుతో విదేశీయులు ఉచితంగా ఆరోగ్య సేవలు అందుకోవడం ఏంటనే విమర్శలు వినవస్తున్నాయి. అందుకే, ఈ తాజా ఆరోగ్య పన్ను ప్రతిపాదన అలా విమర్శించే పార్టీ నోరు మూయించడానికేనని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు.