న్యాయవ్యవస్థ నిర్మాణం... దిగువ కోర్టు నుంచి సుప్రీమ్ కోర్టు వరకు..!

శాసన వ్యవస్థ... కార్య నిర్వాహక వ్యవస్థ... న్యాయ వ్యవస్థ ఈ మూడు కూడా ప్రభుత్వంలో భాగమే. ఈ మూడూ దేశానికి మూల స్తంభాల్లాంటివి. ముఖ్యంగా న్యాయవ్యవస్థ విషయానికొస్తే... పౌరుల హక్కులు, స్వేచ్ఛను పరిరక్షించడంతోపాటు, రాజ్యాంగం, చట్టాలకు అనుగుణంగా ఆయా వివాదాలను పరిష్కరించి, న్యాయాన్ని అందించడమే కోర్టుల విధి. విచారణ, తీర్పుల్లో నిష్పాక్షికత ఉన్నప్పుడే న్యాయం సాధ్యమవుతుందని తెలుసు కదా. అందుకే న్యాయ వ్యవస్థ మిగతా రెండు వ్యవస్థలకు భిన్నంగా, స్వతంత్రంగా పనిచేస్తుంటుంది. 

కోర్టుల నిర్మాణాన్ని పరిశీలిస్తే... 

దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. దేశంలో ఉన్న అన్ని కోర్టులకు ఇదే సుప్రీమ్. తర్వాత రాష్ట్రాల స్థాయిలో హైకోర్టు ఉన్నత న్యాయస్థానంగా పనిచేస్తుంది. తర్వాత జిల్లా కోర్టులు, వాటి కింద మున్సిఫ్ కోర్టులు పని చేస్తుంటాయి. కొన్ని ప్రాంతాల్లో గ్రామ న్యాయాలయాలు కూడా ఉన్నాయి.  

సుప్రీంకోర్టు 

representational imageభారత్ ను సమాఖ్య దేశంగా చెబుతారు. అధికారాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభజన జరిగి ఉంటాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఫెడరల్ కోర్టుగా వ్యవహరిస్తుంది. దిగువ కోర్టుల తీర్పులపై అప్పీల్ రూపంలోనే కాదు... ఆర్టికల్ 131 ప్రకారం అంతర్రాష్ట్ర సమస్యలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాల కేసులను నేరుగా విచారించే అధికారం సుప్రీంకోర్టుకు ఉంది. తనకున్న అధికారాల మేరకు కోర్టు ధిక్కారం కింద ఎవరినైనా శిక్షించగలదు. సుప్రీంకోర్టుకు న్యాయసమీక్షాధికారం కూడా ఉంది. అంటే పార్లమెంటు, రాష్ట్రాల శాసనసభలు రూపొందించిన చట్టాలు పౌరుల హక్కులకు భంగకరం అనుకుంటే వాటిని చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధంగా సుప్రీంకోర్టు ఆదేశాలివ్వగలదు. ఈ మేరకు రాజ్యాంగం సుప్రీంకోర్టుకు విశేష అధికారాలను కట్టబెట్టింది. 

సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తి ఒకరు ఉంటారు. అలాగే మరో 30 మంది న్యాయమూర్తులు కూడా ఉంటారు. 1950 జనవరి 28న సుప్రీంకోర్టు కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తారు. రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత కూడా సుప్రీంకోర్టుపై ఉంది. సుప్రీంకోర్టులో వివిధ డివిజన్ బెంచ్ లు ఉంటాయి. వీటినే ధర్మాసనం అని అంటుంటాం. ఇవి ఇద్దరు లేదా ముగ్గురు న్యాయమూర్తులతో ఉంటాయి. ఫుల్ బెంచ్ లో ముగ్గురి నుంచి ఐదుగురు వరకు న్యాయమూర్తులు కొలువుదీరి కేసుల విచారణ చేపడతారు. అతిపెద్ద బెంచ్ రాజ్యాంగ ధర్మాసనం. అందులో ఐదు నుంచి ఏడుగురు జడ్జిలు ఉంటారు. రాజ్యాంగంలోని అంశాలకు సంబంధించి వివాదాలు ఏర్పడితే ఈ ధర్మాసనమే పరిష్కరిస్తుంది. అలాగే సింగిల్ జడ్జి బెంచ్ లు కూడా ఉంటాయి. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేసుకోవచ్చు. 65 ఏళ్ల వయసు వరకు న్యాయమూర్తులు తమ పదవుల్లో కొనసాగవచ్చు. న్యాయమూర్తుల దుష్ప్రవర్తన, అశక్తత తదితర కొన్ని ప్రత్యేక అంశాల ఆధారంగా పార్లమెంటు అభిశంసన (ఇంపీచ్ మెంట్) ద్వారా రాష్ట్రపతి సదరు న్యాయమూర్తిని తొలగించవచ్చు. 

అప్పీలేట్ జ్యురిస్ డిక్షన్

హైకోర్టులు ఇచ్చిన తీర్పులపై సుప్రీంకోర్టుల్లో అప్పీల్ కు వెళ్లవచ్చు. సంబంధింత కేసు రాజ్యాంగంలోని అంశాలతో ముడిపడి ఉంటే, చట్టానికి సంబంధించి ఎన్నో సందేహాలతో ముడిపడి ఉందంటూ హైకోర్టులు పేర్కొంటే ఆ కేసుల విచారణను సుప్రీంకోర్టులు అప్పీల్ కు స్వీకరించవచ్చు. సివిల్ కేసులకు సంబంధించి ఒక కేసు ప్రజా ప్రయోజనాల కోణంలో ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతోందంటూ హైకోర్టు నిర్ధారిస్తే సుప్రీంకోర్టు ముందు అప్పీల్ కు వెళ్లవచ్చు. క్రిమినల్ కేసుల్లో హైకోర్టులు దిగువ కోర్టులు ఇచ్చిన నిర్దోషిత్వపు తీర్పును రిజర్వ్ లో ఉంచి దోషిగా ప్రకటిస్తే దానిపై సుప్రీంకోర్టులో అప్పీల్ కు వెళ్లవచ్చు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయవచ్చు. 

రిట్ జ్యురిస్ డిక్షన్

ఫ్రాథమిక హక్కులకు విఘాతం కలిగినట్టు భావిస్తే వ్యక్తి లేదా సంస్థ నేరుగా హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయవచ్చు. ఇలాంటి సందర్భాల్లో పౌరుల హక్కులు, స్వేచ్ఛ పరిరక్షణ కోసం రిట్ (ఉత్తర్వు) జారీ చేయవచ్చు. 

అడ్వైజరీ జ్యురిస్ డిక్షన్

రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం ప్రజా అవసరాలు, ప్రాధాన్యం దృష్ట్యా ఏదైనీ ఒక విషయాన్ని భారత రాష్ట్రపతి సుప్రీంకోర్టుకు నివేదించవచ్చు. సుప్రీంకోర్టు సలహా కోరవచ్చు. అప్పుడు దానిపై సుప్రీంకోర్టు రాష్ట్రపతికి తమ సలహానందిస్తుంది. దీన్ని అడ్వైజరీ జ్యురిస్ డిక్షన్ అంటారు. అలాగే, దేశంలోని ఏ కోర్టు తీర్పుపైనైనా అప్పీల్ చేసుకునేందుకు సుప్రీంకోర్టు ప్రత్యేక అనుమతి జారీ చేయగలదు. 

representation image

హైకోర్టు

వాస్తవానికి హైకోర్టు అధికారాలు, నిర్వహణకు సంబంధించి రాజ్యాంగంలో నిర్వచనం ఇవ్వలేదు. కేవలం సుప్రీంకోర్టు అధికారాలు, నిర్వహణ విషయంలోనే స్పష్టత ఉంది. అయితే, రాజ్యాంగం అమల్లోకి రాకముందున్నట్టే హైకోర్టు అధికార పరిధి ఉంటుందని రాజ్యాంగంలో పేర్కొన్నారు. దీని ప్రకారం హైకోర్టు అధికారాలు, నిర్వహణ ఇలా వుంటాయి. 

 హైకోర్టులోనూ చీఫ్ జస్టిస్ (ప్రధాన న్యాయమూర్తి) ఒకరు ఉంటారు. నమోదయ్యే కేసుల్లో ఎక్కువ శాతం దిగువ కోర్టులు ఇచ్చిన తీర్పులపై అప్పీలుగా వచ్చేవే ఉంటాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించడం ద్వారా హైకోర్టు న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తుంటారు. ఆ రాష్ట్రంలోని అన్ని రకాల కోర్టులు, ట్రైబ్యునళ్లు కూడా హైకోర్టు అధికార పరిధిలోకే వస్తాయి. మిలటరీ కోర్టులు, మిలటరీ ట్రైబ్యునళ్లకు మాత్రం మినహాయింపు ఉంది. డిస్ట్రిక్ట్ జడ్జిల పోస్టింగ్ విషయంలో గవర్నర్ కు సలహా ఇస్తుంది. 

సివిల్, క్రిమినల్ కేసుల అప్పీళ్లపై విచారించే అధికారం హైకోర్టుకు ఉంది. సివిల్ కేసుల్లో డిస్ట్రిక్ట్ జడ్జి, సబార్డినేట్ జడ్జిలు ఇచ్చిన తీర్పులపై అప్పీల్ కు వెళ్లవచ్చు. అలాగే, క్రిమినల్ కేసుల్లో సెషన్స్ కోర్టులు ఇచ్చిన తీర్పులపై అప్పీల్ కు వెళ్లవచ్చు. ఇదెలా అంటే... సెషన్స్ జడ్జి లేదా అడిషినల్ సెషన్స్ జడ్జి ఏడేళ్లకు మించి జైలు శిక్ష విధించినప్పుడు హైకోర్టులో సవాల్ చేయవచ్చు. అలాగే, చిన్న కేసులు కాకుండా ప్రత్యేకమైన కేసుల్లో అసిస్టెంట్ సెషన్స్ జడ్జి, మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ లేదా జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఇచ్చిన తీర్పులపై సైతం అప్పీళ్లు దాఖలు చేసుకోవచ్చు. హైకోర్టులో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై కూడా హైకోర్టు డివిజన్ బెంచ్ లో సవాల్ చేయవచ్చు. అలాగే, సబార్డినేట్ కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసు రాజ్యాంగ అంశాలతో ముడిపడినదని హైకోర్టు భావిస్తే ఆ కేసు విచారణను తాను స్వయంగా చేపట్టి తీర్పు ఇవ్వగలదు. అప్పీలేట్ జ్యురిస్ డిక్షన్ కింద సేల్స్ ట్యాక్స్, ఇన్ కమ్ ట్యాక్స్, కాపీ రైట్, పేటెంట్ రైట్ తదితర కేసులపై డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టు లేదా సెషన్స్ జడ్జి కోర్టు ఇచ్చిన తీర్పులపై అప్పీళ్లను విచారణకు స్వీకరిస్తాయి. 

ప్రాథమిక హక్కులు, ఇతర కీలకమైన అంశాల్లో హైకోర్టులు ప్రత్యేక ఆదేశాలను (రిట్) జారీ చేయవచ్చు. ఆర్టికల్ 32 ప్రకారం ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగినప్పుడు, అలాగే ఆర్టికల్ 226 ప్రకారం ఇతర హక్కులకు నష్టం కలిగిన సందర్భాల్లోనూ ఎవరైనా సరే నేరుగా హైకోర్టుల్లో రిట్ పిటషన్ దాఖలు చేయవచ్చు. అన్ని సబార్డినేట్ కోర్టులను హైకోర్టు పర్యవేక్షిస్తూ అవసరాన్ని బట్టి నిబంధనలు, మార్గదర్శకాలను జారీ చేస్తుంటాయి.  రాజ్యాంగ పరమైన అంశాలపై వివాదం ఉంటే జోక్యం చేసుకుంటాయి. రాష్ట్ర ప్రభుత్వ చట్టాలను సమీక్షించే అధికారం, ఆ చట్టం రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటే చెల్లుబాటు కాదని ప్రకటించే అధికారం కూడా ఉంది. దేశంలో 24 హైకోర్టులు ఉన్నాయి. కొన్నిచోట్ల రెండు రాష్ట్రాలకు ఒకటే హైకోర్టు ఉంది. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో న్యాయమూర్తులు 49 మంది వరకు ఉన్నారు. అలహాబాద్ హైకోర్టులో అత్యధికంగా 95 మంది ఉన్నారు. ఇలా కోర్టును బట్టి న్యాయమూర్తుల సంఖ్య వేర్వేరుగా ఉంది. 

జిల్లా స్థాయిలో కోర్టులు

జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి ఉన్నత న్యాయమూర్తిగా వ్యవహరిస్తారు. జిల్లా పరిధిలో అన్ని దిగువ కోర్టులపై అప్పీలేట్ కోర్టుగా డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు వ్యవహరిస్తుంది. సివిల్ కేసులకు గాను జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, సీనియర్ సివిల్ జడ్జి కోర్టులు వరుసగా ఉంటాయి. క్రిమినల్ కేసుల విచారణకు గాను సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు, ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు, చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులు ఉంటాయి. కుటుంబ వివాదాల పరిష్కారానికి గాను ఫ్యామిలీ కోర్టులు ఉంటాయి. ఫ్యామిలీ కోర్టులోఉండే ప్రిన్సిపల్ జడ్జి జిల్లా జడ్జి హోదాను కలిగి ఉంటారు.

ముందుగా ఒక కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత విచారణ ప్రారంభం అవుతుంది. ఈ కేసులో సంబంధిత కోర్టు ఇచ్చిన తీర్పు న్యాయసమ్మతంగా అనిపించకపోతే ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేసుకోవచ్చు. డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టులో సివిల్, క్రిమినల్ కేసులను నేరుగా దాఖలు చేయవచ్చు. సివిల్ కేసులను విచారించే సమయంలో డిస్ట్రిక్ట్ జడ్జి అని, క్రిమినల్ కేసులను విచారించే సమయంలో అదే జడ్జిని సెషన్స్ జడ్జి అని అంటారు. అందుకే డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి అని పిలుస్తుంటారు. మెట్రో సిటీ ( పది లక్షల మంది జనాభా దాటిన ప్రాంతం) పరిధిలో డిస్ట్రిక్ట్ జడ్జిని మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జిగా పేర్కొంటారు. ఈ కోర్టు పరిధిలో ఉండే దిగువ కోర్టులకు కూడా ముందు మెట్రోపాలిటన్ అనే పదం ఉంటుంది. 

గ్రామ న్యాయాలయాలు

వీటినే లోక్ అదాలత్ లేదా న్యాయపంచాయతీలు అని కూడా అంటారు. వివాదాల కోసం కోర్టుల వరకూ రాకుండా స్థానికంగానే ప్రత్యామ్నాయ పరిష్కారం చూపేందుకు వీటిని అమల్లోకి తెచ్చారు. దేశవ్యాప్తంగా ఐదువేల మొబైల్ కోర్టులు ఏర్పాటు చేయాలని తలంచగా... కేవలం 151 మాత్రమే ఇప్పటి వరకు అందుబాటులోకి వచ్చాయి. 

ఫాస్ట్ ట్రాక్ కోర్టు

న్యాయం ఆలస్యమైతే న్యాయాన్ని తిరస్కరించినట్టేనని ఓ నానుడి. సకాలంలో తీర్పు వస్తేనే న్యాయం దక్కినట్టు అని దీనర్థం. కానీ, దేశంలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. అన్ని కోర్టులలో కలిపి 3 కోట్ల కేసుల వరకు పెండింగ్ లో ఉన్నాయి. వీటిలో మూడింట రెండొంతుల కేసులు మూడేళ్లుకుపైగా విచారణల దశలోనే ఉన్నాయి. అందుకే కేసుల విచారణను త్వరితగతిన పూర్తి చేసేందుకు వీలుగా దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని 11వ ఆర్థిక సంఘం సూచించింది. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న కేసులను చేపట్టేందుకు 1734 కోర్టులను ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. ప్రతి కోర్టు నెలకు 40 కేసుల వరకు పూర్తి చేసేలా విధానాన్ని రూపొందించారు.  

అయితే, వీటిలో 1562 కోర్టులు మాత్రమే ఏర్పాటయ్యాయి. 2011 మార్చి వరకు కేంద్రమే వీటి నిర్వహణ వ్యయాన్ని భరించింది. తర్వాత రాష్ట్రాలకు వదిలిపెట్టింది. దీంతో రాష్ట్రాలు ఆ భారాన్ని భరించడం ఇష్టలేక వాటిని వదిలించుకునేందుకు మొగ్గు చూపాయి. ప్రస్తుతం 473 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు మాత్రమే పని చేస్తున్నాయని ఒక అంచనా. 

స్పెషల్ కోర్టులు

పేరులో ఉన్నట్టుగానే ప్రత్యేకంగా ఓ విభాగానికి సంబంధించిన కేసుల విచారణకు గాను వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఉదాహరణకు... చిన్నారులపై లైంగిక వేధింపుల కేసుల విచారణను సత్వరం పూర్తి చేసి దోషులకు శిక్ష పడేందుకు వీలుగా దేశవ్యాప్తంగా 654 ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేశారు. భారీ కుంభకోణమైన 2జీ స్పెక్ట్రమ్ కేసు విచారణకు కూడా ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసిన విషయం తెలిసే ఉంటుంది. అలాగే, మహిళలపై వేధింపుల కేసుల విచారణను వేగవంతంగా పూర్తి చేసేందుకు వీలుగా 14 స్పెషల్ కోర్టులను మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ఇక కార్పొరేట్ కంపెనీల మోసాలకు సంబంధించిన కేసుల విచారణకుగాను కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసింది. ఇలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేసుల సత్వర విచారణకు గాను ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేస్తుంటాయి. 

ఇవే కాకుండా పెండింగ్ లో ఉన్న కేసులు పరిష్కరించుకునేందుకు, సామరస్యపూర్వకంగా ఇరు పార్టీలు రాజీకొచ్చేలా లోక్ అదాలత్ కార్యక్రమాలను తరచుగా నిర్వహిస్తుంటారు. 

ట్రైబ్యునళ్లు

ట్రైబ్యునళ్లు కోర్టుల్లాంటివే గానీ కోర్టులు కావు. ప్రత్యేకంగా వివిధ రంగాల కోసం ఏర్పాటు చేసిన ట్రైబ్యునళ్లలో ఆయా రంగాలకు సంబంధించి న్యాయ నిపుణులైన వారు సభ్యులుగా ఉంటారు. దీంతో వాస్తవాల ఆధారంగా వివాదాలకు సంబంధించిన కేసులను విచారించి ఆదేశాలు ఇస్తుంటారు. కోర్టుల్లో కేసుల విచారణలో జరుగుతున్న జాప్యం నేపథ్యంలో వివిధ రంగాల్లో ముఖ్యమైన కేసులను సత్వరం విచారించేందుకు వీలుగా వీటిని ఏర్పాటు చేస్తుంటారు. 

జాతీయ హరిత ట్రైబ్యునల్, డెట్ రికవరీ ట్రైబ్యునల్, అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్, ఆర్మ్ డ్ ఫోర్స్ ట్రైబ్యునల్, ఈపీఎఫ్ అప్పీలేట్ ట్రైబ్యునల్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అప్పీలేట్ బోర్డ్, సైబర్ అప్పీలేట్ ట్రైబ్యునల్, మోటారు యాసిడెంట్స్ క్లెయిమ్స్ ట్రైబ్యునల్... ఇలా ఎన్నో ఉన్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 323ఏ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్స్ కు ఉద్దేశించినది కాగా, 323బీ ఇతర వ్యవహారాల కోసం ఉద్దేశించనది. ఆర్టికల్ 323బీ పార్లమెంటు, అసెంబ్లీలకు ట్రైబ్యునళ్లను ఏర్పాటు చేసుకునే అధికారాన్ని కట్టబెట్టింది. దీని కింద పన్నుల చట్టాలు, ఫారీన్ ఎక్స్చేంజ్, ఎగుమతులు, దిగుమతుల వ్యవహారాలు, పరిశ్రమలు, కార్మికుల వివాదాలు, భూ సంస్కరణలు ఇలా పలు రకాల అంశాలకు సంబంధించి ట్రైబ్యునళ్లను ఏర్పాటు చేసుకోవచ్చు. 

డెట్ రికవరీ ట్రైబ్యునల్ విధులను చూస్తే... బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమకు బకాయి ఉన్న రుణాలను రాబట్టుకునేందుకు వీలుగా ట్రైబ్యునల్ ను ఆశ్రయిస్తాయి. వీటిని ఏర్పాటు చేయకముందు వివిధ కోర్టుల్లో కేసులు దాఖలు చేసి ఏళ్ల తరబడి తీర్పు కోసం వేచి చూడాల్సి వచ్చేది. ట్రైబ్యునల్ వల్ల కాలయాపన లేకుండా రుణాలను రికవరీ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అలాగే, పర్యావరణ సంబంధిత అంశాలపై గ్రీన్ ట్రైబ్యునల్ ను ఆశ్రయించినట్టయితే, నిబంధనలు పాటించని పక్షంలో జరిమానా విధింపు, పరిహారం చెల్లింపు, పర్యావరణానికి విఘాతం కలిగించే కట్టడాలు, నిర్మాణాల నిలిపివేతకు ఆదేశాలు పొందవచ్చు.  

ఉద్యోగికి, ప్రభుత్వానికి మధ్య వివాదాలు నెలకొంటే వాటిని అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ లో పరిష్కరించుకోవచ్చు. ఉద్యోగుల సర్వీసు అంశాలపై వివాదం నెలకొంటే న్యాయం కోసం ఉద్యోగి ట్రైబ్యునల్ కు ఆశ్రయించవచ్చు. కేసును విచారించిన తర్వాత ట్రైబ్యునళ్లు ప్రభుత్వానికి తగిన ఆదేశాలు ఇస్తుంటాయి. వీటిని ప్రభుత్వం అమలు చేయాలి. ట్రైబ్యునళ్లు ఇచ్చే ఆదేశాలపై అప్పీలేట్ అథారిటీ, హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో అప్పీల్ కు వెళ్లవచ్చు. ట్రైబ్యునళ్లు విచారణలో భాగంగా సమన్లు జారీ చేయడంతోపాటు ఎవరినైనా తమ ముందు హాజరుపరచాలని ఆదేశించవచ్చు. సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించవచ్చు. డాక్యుమెంట్లను సమర్పించాలని కోరవచ్చు. మధ్యంతర ఆదేశాలను సైతం ఇస్తాయి. 

ఫ్యామిలీ కోర్టు

వివాహం, కుటుంబ వివాదాలకు సంబంధించిన కేసులను సత్వరం పూర్తి చేసేందుకు వీలుగా ఫ్యామిలీ కోర్టులు ఏర్పాటయ్యాయి. జిల్లా జడ్జి హోదా కలిగిన వారే ఫ్యామిలీ కోర్టు జడ్జిగా వ్యవహరిస్తారు. విడాకుల మంజూరు, చిన్నారుల సంరక్షణ, భరణం, భృతి కోసం వీటిని ఆశ్రయించవచ్చు. ఫ్యామిలీ కోర్టులు ఇచ్చిన తీర్పులపై హైకోర్టును ఆశ్రయించవచ్చు.   

కన్జ్యూమర్ ఫోరం 

వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం వీటిని ఏర్పాటు చేశారు. కస్టమర్ తాను కొన్న ఉత్పత్తి, లేదా సేవ నాసిరకమనిపించినా, లేదా అర్ధంతరంగా పాడైపోయినా కంపెనీలపై న్యాయ పోరాటం చేసేందుకు వీటిని ఆశ్రయించవచ్చు. ఒక్కోసారి ఉత్పత్తి విలువ చాలా తక్కువే ఉండవచ్చు. కానీ వాటి విషయంలో కంపెనీలపై న్యాయపోరాటానికి ఖర్చు తడిసి మోపెడవుతుంది. అందుకే తక్కువ వ్యాయానికే వేగంగా న్యాయం అందించేందుకు ప్రతి జిల్లాకు ఒక కన్జూమర్ ఫోరం, స్టేట్ కమిషన్, నేషనల్ కమిషన్ ఏర్పాటు చేశారు. ఫోరానికి అధ్యక్షుడిగా న్యాయమూర్తి ఉంటారు. పలువురు సభ్యులు కూడా ఉంటారు. 

టాడా కోర్టు

టాడా కోర్టు కేవలం టాడా చట్టం కింద నమోదైన కేసుల విచారణ కోసమే ఏర్పాటు చేయబడినది. ప్రస్తుతం టాడా చట్టం అమల్లో లేదు. ఉగ్రవాద, విధ్వంసక చర్యల నిరోధక చట్టాన్ని సంక్షిప్తంగా టాడా అని పేర్కొంటారు. దేశంలో ఉగ్రవాద చర్యల నిరోధానికి తీసుకొచ్చిన తొలి చట్టం ఇదే. 1985 నుంచి 1995 వరకు అమల్లో ఉంది. ఈ చట్టం దుర్వినియోగమవుతోందని పెద్ద ఎత్తున నిరసనలు, అభ్యంతరాలు వ్యక్తం కావడంతో 1995లో దీన్ని రద్దు చేశారు. ఉగ్రవాద, సమాజ విధ్వంసక కార్యకలాపాలకు సంబంధించిన కేసులను దర్యాప్తు చేసే సంస్థలకు ఈ చట్టం అసాధారణ అధికారాలను కట్టబెట్టింది. ఎలా అంటే ఆరోపణలపై అదుపులోకి తీసుకున్న వ్యక్తిని 24 గంటల్లో జడ్జి ముందు ప్రవేశపెట్టాల్సిన పని లేదు. అలాగే, ఏడాది పాటు నిర్బంధించే అధికారం కూడా ఉంది. 

1993 ముంబై బాంబు పేలుళ్ల కేసు విచారణను టాడా కోర్టే చేపట్టింది. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కూడా తొలుత టాడా చట్టం కిందే విచారణను ఎదుర్కొన్నారు. అయితే, ఈ చట్టం కింద మోపిన అభియోగాలు ఏవీ నిరూపణ కాకపోవడంతో అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నందుకు ఆయుధాల చట్టం కింద కోర్టు శిక్ష విధించింది. ముంబైకి చెందిన ఓ బిల్డర్ హత్య కేసులో అబూసలేమ్ కు కూడా టాడా కోర్టే దోషిగా ప్రకటించి శిక్ష విధించింది. అలాగే, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసును కూడా టాడా కోర్టే విచారించింది. ఈ కోర్టులలో విచారణ ఇన్ కెమెరా (రహస్య విచారణ) పద్ధతిలో  జరుగుతుంది. ఈ కోర్టు ఇచ్చిన తీర్పుపై కేవలం సుప్రీంకోర్టులోనే అప్పీలుకు అవకాశం ఉంటుంది. 

ఈ చట్టం కింద 76వేల మందికి పైగా అరెస్ట్ కాగా అందులో 25 శాతం మందిపై ఎటువంటి అభియోగాలు లేవంటూ దర్యాప్తు సంస్థలే కేసులను ఉపసంహరించుకున్నాయి. నమోదైన కేసుల్లో కేవలం 35 శాతం మాత్రమే విచారణ దశకు రాగా, అందులో 95 శాతం నిందితులు నిర్దోషులుగా బయటపడ్డారు. కేవలం 2 శాతం లోపే దోషులుగా తేలారు. అయితే, టాడా చట్టం అమల్లో ఉన్న కాలంలో నమోదైన కేసుల విచారణకు గాను టాడా కోర్టు ముంబైలో ఇప్పటికీ కొనసాగుతోంది. 

సీబీఐ కోర్టు

సీబీఐ అన్నది దేశంలో స్వతంత్ర దర్యాప్తు సంస్థ. ఈ సంస్థ చేపట్టిన కేసుల విచారణకు గాను ప్రతీ రాష్ట్రంలోనూ ప్రత్యేకంగా సీబీఐ కోర్టులు ఏర్పడ్డాయి. సాధారణ కోర్టులపై కేసుల భారం పెరిగిపోవడంతో సీబీఐ కేసుల విచారణ భారం కూడా వాటిపైనే మోపకుండా ఉండేందుకు సీబీఐ కోర్టులను ఏర్పాటు చేశారు. ఇవి ఇచ్చే తీర్పులపై హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో మాత్రమే అప్పీల్ కు అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి కేసులను కూడా సీబీఐ సంస్థే దర్యాప్తు చేస్తుంటుంది.

ఏసీబీ కోర్టు

అవినీతి వ్యవహారాల నిరోధానికి రాష్ట్ర స్థాయిలో ఏర్పాటైందే అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ). ప్రభుత్వ యంత్రాంగంలో ఎవరైనా అవినీతికి పాల్పడితే ఆయా కేసుల విచారణను ఏసీబీ చూస్తుంటుంది. ఈ కేసుల విచారణను సత్వరం పూర్తి చేసేందుకు, మిగిలిన కోర్టులపై పనిభారం తగ్గించేందుకు వీలుగా ఏసీబీ కోర్టులను ఏర్పాటు చేశారు.


More Articles