పెట్టుబడుల రంగంలో రారాజు... రాకేశ్ ఝుంఝన్ వాలా!
టాటాలకు టాటా కంపెనీ... బిర్లాలకు బిర్లా కంపెనీ... ప్రేమ్ జీకి విప్రో, సంతూర్... అంబానీలకు రిలయన్స్, అడాగ్ కంపెనీలు... మరి రాకేశ్ ఝుంఝన్ వాలాకు ఎన్ని కంపెనీలు... 'ఒకటేగా' అనేయకండి. ఎందుకంటే, ఆయనకు చాలా కంపెనీలే ఉన్నాయి. వాటి పేర్లను చెప్పడం కాదు కదా, వాటి సంఖ్యను చెప్పడం కూడా దుస్సాధ్యమే. ఎందుకంటే... ఈ రోజు పది కంపెనీలుంటే..,రేపు వాటి సంఖ్య పెరగొచ్చు. లేదంటే, తగ్గనూ వచ్చు. అదేంటంటే, అదంతే మరి! విశ్వవిఖ్యాత ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ లాగే రాకేశ్ ది కూడా పెట్టుబడులే వ్యాపారం.
ఈ రోజు ఓ కంపెనీలోని తన షేర్లను ఉన్నపళంగా అమ్మేసి, మరో రెండు కంపెనీల్లో పెట్టుబడి పెట్టవద్చు. లేదా రెండింటిలోని షేర్లను విక్రయించేసి,. ఒక కంపెనీలో పెట్టవచ్చు. అందుకే ఆయనకు ఎన్ని కంపెనీలు ఉన్నాయంటే... చెప్పడం కష్టమే. కంపెనీలే కాదండోయ్, ఆయన ఆస్తుల విలువను కూడా కరెక్టుగా లెక్కలేసి చెప్పడం కష్టమే.
తొలి లాభం, టాటా టీ షేర్లతోనే
చదువు పూర్తి కాగానే నేరుగా ఇన్వెస్ట్ మెంట్ రంగంలోకి దూకేసిన ఝుంఝన్ వాలా, ఓ రూ.5 వేలతో టాటా టీ షేర్లను కొనుగోలు చేశారట. అది 1985 నాటి మాట. నాడు సెన్సెక్స్ సూచీ 150 వద్ద తచ్చాడుతోంది. ఒక్కో షేరును రూ.43కు కొన్న రాకేశ్... వాటిని కనీసం ఏడాది తిరగకముందే రూ.5 లక్షల లాభానికి అమ్మేశారు. అంటే... ఏడాది కాలంలో ఝుంఝన్ వాలా రూ.5 వేల పెట్టుబడితో రూ.5 లక్షల మేర లాభాన్ని జేబులో వేసుకున్నారు. టాటా టీ షేర్లే ఎందుకు కొనాలి? ఏ కంపెనీ షేర్లు లాభాలిస్తాయన్న విషయం ఝుంఝన్ వాలాకు బాగా తెలుసు. అందుకే నాడు టాటా టీ షేర్లకు ఉన్న వృద్ధిని అంచనా వేశారు కాబట్టే, ధైర్యంగా అడుగేశారు. అందరిని అచ్చెరువొందించేలా కేవలం రూ. 5 వేలతో రూ. 5 లక్షల మేర లాభాలను జేబులో వేసుకున్నారు.
మొదటి పెట్టుబడి అప్పుగా తీసుకున్నదే!
ఝుంఝన్ వాలా తన తొలి పెట్టుబడి... ఓ మహిళ వద్ద తీసుకున్న అప్పేనని తెలిస్తే ఆశ్చర్యం వేయక మానదు. తనకు పరిచయం ఉన్న ఓ మహిళ వద్ద డబ్బు కోసం ప్రాధేయపడ్డంత పనిచేశారట. అప్పటికే బ్యాంకు డిపాజిట్ల ద్వారా 10 శాతం మేర లాభాలు తీసుకుంటున్న సదరు మహిళ వద్దకెళ్లి 18 శాతం వడ్డీ ఇస్తానంటూ అప్పు అడిగారట. ఇచ్చేందుకు ఇబ్బందేమీ లేదు కాని, గ్యారంటీగా ఏం ఇస్తావని సదరు మహిళ అడిగారట. ఈయన వద్ద గ్యారంటీ ఇవ్వడానికి ఏమీ లేదు. ఎలాగైతేనేం 15 రోజుల్లోగా ఇచ్చేస్తానని ఆమెను ఒప్పించి, రూ.2.5 లక్షలను అప్పుగా తీసుకున్నారు. అలాగే ఇచ్చేశారు కూడా!
చేదు అనుభవాలు కూడా చవిచూశారట!
పెట్టుబడుల రంగంలో భారత్ లోనే పేరెన్నికగన్న ఝుంఝన్ వాలా... షేర్ మార్కెట్ల ఒడిదుడుకుల నేపథ్యంలో చేతులు కాల్చుకున్న సందర్భాలూ లేకపోలేదు. అత్యంత నమ్మకంతో కొనుగోలు చేసిన వీఐపీ ఇండస్ట్రీస్ షేర్లను అమ్మబోతే కొనే నాథుడే కరువయ్యాడట. అప్పటికే సదరు కంపెనీలో పెద్ద సంఖ్యలో షేర్లను కొనుగోలు చేసిన ఝుంఝన్ వాలా... ఈ దెబ్బతో చాలా మేరకు కోల్పోయారు. అయితే, ఇక షేర్ మార్కెట్ వదిలేద్దామన్న యోచనే ఆయనకు రాలేదు. మరింత కాలం వేచి చూసి, తాను పెట్టుబడులు పెట్టిన ఇతర కంపెనీల విలువ పెరగడంతో వీఐపీ నష్టాల నుంచి బయటపడగలిగారు. దీనికంతటికీ కొంత సమయమైతే పట్టింది కాని, ఆయన మాత్రం ఓటమిని అంగీకరించలేదు. చేతులు కాలిన దగ్గర నుంచి మరింత జాగరూకత వహించిన ఝుంఝన్ వాలా... ఆ తర్వాత స్పష్టమైన లెక్కలేసుకుని మరీ పెట్టుబడులు సాగిస్తున్నారు.
చార్టర్డ్ అకౌంటెన్సీ విద్యతో నైపుణ్యం
తండ్రి ఇన్ కమ్ ట్యాక్స్ ఉద్యోగి కావడంతో చిన్నప్పటి నుంచే కంపెనీల ఆర్థిక లావాదేవీలపై ఆసక్తి పెంచుకున్న ఝుంఝన్ వాలా డిగ్రీ పూర్తి కాగానే చార్టర్డ్ అకౌంటెన్సీ చదివారు. చదువుతుండగానే పెట్టుబడులపై విషయ పరిజ్ఞానాన్ని పెంచుకున్న ఝుంఝన్ వాలా... చదువు పూర్తి కాగానే బొంబాయి స్టాక్ ఎక్సేంజీ మెట్లు ఎక్కారు. అందుకోసం రేర్ ఎంటర్ ప్రైజెస్ ను స్థాపించారు. కంపెనీ పేరులాగే ఝుంఝన్ వాలా కొనుగోలు చేసే షేర్లు కూడా భలే విచిత్రంగానే ఉండేవి. కంపెనీ సామర్థ్యంతో పాటు సదరు కంపెనీ ఉత్పత్తులకు భవిష్యత్తు మార్కెట్, యాజమాన్యం నిపుణత తదితర అంశాలను అంచనా వేసి, ఎవ్వరూ దృష్టి సారించని షేర్లను కొనుగోలు చేసేవారు. అంతేకాక పెట్టుబడుల విషయంలో ఏ ఒక్కరి సలహాలు తీసుకోని ఆయన తన సొంత మేధస్సుతోనే ముందుకెళ్లారు. అయితే రాధాకృష్ణ దమానీని ఆయన తన గురువుగా చెప్పుకుంటారు.
పెద్ద కంపెనీల షేర్లు వద్దేవద్దట!
వేల రూపాయలతో మొదలుపెట్టి, కోట్లకు పడగలెత్తిన ఝుంఝన్ వాలా... మదుపరులకు లాభాల పంట పండించిన టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ తరహా కంపెనీల షేర్ల జోలికి వెళ్లనే లేదు. అయితే ఎన్నో కంపెనీల షేర్లు కొనుగోలు చేశారు. ఈ కంపెనీల షేర్లు కూడా దక్కించుకుని ఉంటే, భారీ లాభాలు వచ్చి ఉండేవిగా అంటే, 'నా అభిప్రాయాలు నాకుంటాయిగా' అంటూ సుతిమెత్తగానే సమాధానం చెబుతారు. అప్పటికప్పుడు ఉవ్వెత్తున ఎగసిపడే కంపెనీల షేర్లంటే తనకు భయమని కూడా చెబుతారు ఝుంఝన్ వాలా. అయితే తెలివైన పెట్టుబడులు పెట్టే మదుపరిగా పేరుగాంచిన ఝుంఝన్ వాలాను మార్కెట్ వర్గాలు ఇండియన్ బఫెట్ గా కీర్తిస్తాయి. ఆయన పెట్టుబడులు పెట్టిన కంపెనీలను చూసినా, చాలా వైవిధ్యం కనిపిస్తుంది. చిన్న కంపెనీలైనప్పటికీ, సుధీర్ఘ కాలం మనగలిగే సత్తా ఉన్న కంపెనీలే ఆయన దృష్టిని ఆకర్షిస్తాయి.
ప్రతిదాంట్లోనూ ఆడంబరమే!
సాధారణంగా పెట్టుబడిదారులు చాలా పొదుపుగా ఖర్చు పెడతారు. కాని నైపుణ్యం కలిగిన పెట్టుబడిదారుగా గుర్తింపు పొందిన ఝంఝన్ వాలాకు ఆడంబరాలంటే అత్యంత ప్రీతిపాత్రమట. కొంతకాలం క్రితం ముంబైలో సంపన్న దిగ్గజాలుండే ప్రాంతంలో కోట్ల రూపాయలతో ఓ ఇల్లు కొనుగోలు చేశారు. అంతేకాదు, ఇటీవల గుర్రపు పందాలపై మక్కువ పెంచుకున్న ఆయన... మిత్రులతో కలిసి ఏకంగా 20 రేసు గుర్రాలను కొనుగోలు చేశారు.
నిత్యం పెట్టుబడుల చుట్టూనే ఆలోచనలు చేసే ఝుంఝన్ వాలా తీరిక సమయాల్లో గుర్రపు రేసులను చూస్తూ సేదదీరుతారట. ఇద్దరు కొడుకులు, ఓ కూతురు ఉన్న ఝుంఝన్ వాలా... వారిని మాత్రం వారికిష్టమైన రంగాల్లో ప్రవేశించేందుకే అనుమతిస్తానని చెబుతారు. ప్రస్తుతం భారత ధనవంతుల్లో 56వ స్థానంలో ఉన్న ఆయన ... 1.90 బిలియన్ డాలర్ల ఆస్తితో ప్రపంచ బిలియనీర్ల జాబితాలో ఎప్పుడో చోటు సాధించేశారు. అయితే ఝుంఝన్ వాలా ఆస్తి సాయంత్రానికి తగ్గొచ్చు. లేదంటే పెరగనూ వచ్చు. స్థిరంగా మాత్రం ఉండదు.