ఇంటికీ... ఇంట్లో వస్తువులకూ.. షాపులకు... ఆఫీసులకూ... అన్నింటికీ ఉంది 'బీమా' రక్ష

బోర్ డ్ లైఫ్... ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి మళ్లీ నిద్రకు ఉపక్రమించే వరకు ఒకటే షెడ్యూల్ తో విసుగెత్తిన మన్మథరావుకు మార్పు కోసం బంధువుల ఇంటికో... ఏ తీర్థయాత్రకో లేక పర్యాటక ప్రదేశానికో వెళ్లి వద్దామని అనిపించింది. కానీ, మన్మథరావు ఉంటున్న ప్రాంతంలో దొంగల బెడద ఎక్కువగా ఉంది. బంగారం, వెండి వరకు బ్యాంకు లాకర్ లో పెట్టి రాగలడు. ఆ విషయంలో ఆయనకు కూడా ఎలాంటి భయం లేదు. కానీ, ఇంట్లో ఉన్న మ్యాక్ బుక్ ల్యాప్ టాప్, మినీ థియేటర్ ను తలపించే శామ్ సంగ్ టీవీ, ఏసీ, కంప్యూటర్ ఇలా విలువైన వస్తువులన్నీ అలా ఒక్కసారి అతడి కళ్ల ముందు కదలాడాయి. అంతే తర్వాత వెళ్దాంలే... అని అనుకుని దిన చర్యలో మునిగిపోయాడు. 

ఈ సమస్య ఒక్క మన్మథరావుది మాత్రమే కాదు. ఇలాంటి వారు మన మధ్య ఎంతో మంది ఉన్నారు. అంతేకాదు, నేడు అగ్ని ప్రమాదాలు కూడా ఎక్కువగానే జరుగుతున్నాయి. ఎక్కడ షార్ట్ సర్క్యూట్ అవుతుందో తెలియదు. మంటలు ఏ రూపంలో మొదలై ఇంటిని చుట్టుముట్టేస్తాయో చెప్పడం కూడా కష్టమే. గ్యాస్ సిలిండర్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎంతో కొంత రిస్క్ ఉండనే ఉంటుంది. 

మనకు ఏదైనా జరగరానిది జరిగితే మన కుటుంబం కష్టాల్లో పడకూడదని బీమా తీసుకుంటాం. మరి అదే విధంగా విలువైన వస్తువులకు కూడా రక్షణ ఉండాలని కోరుకోవడంలో తప్పు లేదు. అందుకే ఇలాంటి ప్రమాదాల వల్ల, దొంగతనాల వల్ల ఆర్థికంగా నష్టపోకుండా బీమా కంపెనీలు పాలసీలను అందిస్తున్నాయి. జీవిత బీమా గురించి దాదాపు అందరికీ తెలుసు. అలాగే, ఇంటికి బీమా, ఇంట్లోని వస్తువులకు బీమా, ఇతర విలువైన వస్తువులకు కూడా బీమా సదుపాయం ఉంది. వీటి వల్ల ఉపయోగాలు, వీటి విషయంలో నిబంధనలు ఇతర సమాచారం తెలుసుకుందాం 

ఆ ఒక్కటి ఉండి ఉంటే...

representational imageస్వప్న, శ్రీనివాస్ కొత్తగా పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లే. రెండు చేతులా సంపాదన. అందుకే పెళ్లయిన నెలకే 40 లక్షలు పెట్టి ఖరీదైన లగ్జరీ ఫ్లాట్ ను కొనుగోలు చేశారు. 30 లక్షల రూపాయలు లోన్ తీసుకున్నారు. మిగతా పది లక్షలు సొంతంగా సర్దుబాటు చేసుకున్నారు. ఒక రోజు ఇద్దరూ ఇంటికి తాళం పెట్టి ఆఫీసుకు వెళ్లారు. అపార్ట్ మెంట్ సెక్రటరీ నుంచి స్వప్నకు కాల్ వచ్చింది. వారి ఫ్లాట్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని. కంగారుగా భర్తకు కూడా విషయం తెలిపి వెంటనే ఇంటి దగ్గరకు చేరుకున్నారు. ప్రమాదంలో ఫ్లాట్ కు ఏమీ కాలేదు. కానీ ఇంట్లో ఉన్న 8 లక్షల విలువైన ఫర్నిచర్ ఎందుకూ పనికిరాకుండా పోయింది. ఇద్దరూ చాలా అప్ సెట్ అయిపోయారు. నిజానికి బ్యాంకు లోన్ తీసుకుంటున్న సమయంలోనే హోమ్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోవాలని బ్యాంకు వాళ్లు సలహా ఇచ్చారు. కానీ ఆ సలహా కొత్త జంటకు రుచించలేదు. ఫలితం యువ జంటపై ఆర్థిక భాారం. ఒకవేళ ఇన్సూరెన్స్ పాలసీ ఉండి ఉంటే ఇలా బాధపడాల్సి వచ్చేది కాదు మరి. 

నిజానికి ఇప్పటికీ చాలా మంది హోమ్ ఇన్సూరెన్స్ ఎందుకులే దండగ అని భావిస్తుంటారు. ఆ ఆలోచన అక్షరాలా తప్పు. మీ విలువైన ఆస్తులు, వస్తువులకు బీమా అనేది రక్షణ కవచం. అన్నేసి లక్షలు పోసి విల్లా, ఫ్లాట్, ఇండివిడ్యువల్ హౌస్ కొనుక్కుంటాం. ఏటా దాని రక్షణకు ఓ రెండు మూడు వేల రూపాయలు ఖర్చు పెట్టడానికి మాత్రం సంకోచం ఎందుకు? 

దేశంలో 60 శాతం భూభాగానికి భూకంపాల ముప్పు పొంచి ఉందని జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. అలాగే, 8 శాతం భూభాగం తుఫాను వంటి ముప్పులను ఎదుర్కొంటోంది. ఇవి కాకుండా అగ్ని ప్రమాదాలు, దొంగల భయం ఉండనే ఉంది. అందుకే ఇంటితోపాటు ఇంట్లోని వస్తువులన్నింటికీ కలిపి రక్షణ కల్పించే కాంప్రహెన్సివ్ పాలసీలను తీసుకోవడం మంచి నిర్ణయం.  

ఇంటి యజమానే కానక్కర్లేదు

సొంతిల్లు లేని వారు సైతం హోమ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇల్లు మీది కాకపోవచ్చు. ఆ ఇంట్లో ఉంటున్న మీకు విలువైన వస్తువులు ఎన్నో ఉండి ఉంటాయి కదా. వాటి కవరేజీ కోసం బీమా కంపెనీలు పాలసీ తీసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. ఇక అద్దెకు ఇచ్చే ఇంటికి రక్షణ ఎందుకులే అని యజమానులు భావించడం సరైనది కాదు. అద్దెకిచ్చినంత మాత్రాన విలువైన ఇంటికి నష్టం జరిగితే భారం ఎవరిపై పడుతుంది...? అందుకే ఇంటికి రక్షణ కోసం పాలసీ తప్పకుండా తీసుకోవాలి.   

కవరేజీ వీటికి... 

representational imageఇంటిపై విమానం కూలి నష్టం జరిగినా, అగ్ని ప్రమాదం, పిడుగుపాటు, అల్లర్లు, సమ్మెల సందర్భంగా జరిగే నష్టం, తుఫాను, పెను తుఫాను, వరదలు, క్షిపణీ పరీక్షలు, భూకంపాలు, దోపిడీ, దొంగతనం, షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం ఇలాంటి ఘటనల్లో ఇల్లు, ఇంట్లోని వస్తువులకు జరిగే నష్టాన్ని బీమా కంపెనీలు భర్తీ చేస్తాయి. 

అలాగే, పాస్ పోర్ట్, టైటిల్ డీడ్ తదితర పత్రాలకు కూడా బీమా పాలసీలో రక్షణ కోరవచ్చు. ఫర్నిచర్, యంత్రాలు, ఫిట్టింగ్స్, వస్త్రాలు, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు అయిన రిఫ్రిజిరేటర్లు, టీవీలు, సీడీ/డీవీడీ ప్లేయర్లు, వీడియో క్యాసెట్ రికార్డర్లు, ప్లేయర్లు, వాషింగ్ మెషిన్లు, మైక్రోవేవ్ ఓవెన్లు, మ్యూజిక్ సిస్టమ్స్, కంప్యూటర్స్, ల్యాప్ ట్యాప్ లు, ఏసీలు, ఇతర విలువైన వస్తువులకు కవరేజీ తీసుకోవచ్చు. పాక్షిక కవరేజీకి కూడా అవకాశం ఉంది. 

నిర్మాణంలో ఉన్న భవనానికి సైతం అగ్ని ప్రమాదం, ఇతర ప్రమాదాల నుంచి రక్షణ కోసం పాలసీ తీసుకోవచ్చు. నిర్మాణం పూర్తయిన తర్వాత దాన్ని పూర్తి స్థాయి హోమ్ ఇన్సూరెన్స్ కింద మార్చుకోవచ్చు. తాను ఉపయోగించకుండా, మరొకరికి ఇల్లు అద్దెకివ్వకుండా ఖాళీగా అట్టిపెట్టేవారు కూడా ఉంటారు. ఇలాంటి వారు కూడా పాలసీ తీసుకోవచ్చు. దీనితోపాటు ఇంట్లో ఉండేవారు పర్సనల్ యాక్సిడెంటల్ కవర్ కూడా తీసుకోవచ్చు. ప్రమాదాల సమయంలో ఇంట్లో ఉన్న వారికి ఏదైనా జరిగితే పరిహారం పొందవచ్చు. ఒకవేళ మీ ఇంటిని బ్యాంకు వద్ద తనఖా పెట్టి మార్ట్ గేజ్ రుణాన్ని పొందినా హౌస్ హోల్డ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవచ్చు. 

representational imageఒక అపార్ట్ మెంట్ లో 20 ఫ్లాట్స్ ఉంటే అన్నింటికీ కలిపి కామన్ కవరేజీ తీసుకోవచ్చు. అప్పుడు ప్రతీ ఫ్లాట్ లో ఉండేవారు విడిగా తమ ఇళ్లల్లోని వస్తువులకు పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది. ఇల్లు, లేదా ఫ్లాట్ ఇద్దరి పేరుతో ఉంటే ఇద్దరూ కలసి లేదా ఒకరైనా పాలసీ తీసుకోవచ్చు. క్లెయిమ్ చేసుకోవాల్సిన సందర్భం వస్తే మరొకరి నుంచి ఎన్వోసీ తీసుకుని కంపెనీకి సమర్పించాల్సి ఉంటుంది. 

ఇల్లు జీర్ణ దశకు చేరిందనుకుంటే దానికి బీమా చేయించడం దండగే. అలాగే, ఇంట్లో ఉన్న పరికరాలు కొనుగోలు చేసి దశాబ్ద కాలం దాటితే వాటిని పాలసీలో చేర్చుకోకపోవడమే నయం. ఎందుకంటే చేర్చుకుంటే వచ్చే పరిహారం నామమాత్రమే. ప్రీమియం మాత్రం పెరిగిపోతుంది. 

ప్రీమియం ఎంతుంటుంది....?

టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీల్లో ప్రీమియం ఎంత ఉంటుందో ఇంచుమించు అదే స్థాయిలో హోమ్ ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా ఉంటుంది. ఉదాహరణకు ఓ భవనానికి 10 లక్షల రూపాయలు, దానిలోని కంటెంట్స్ కు 5 లక్షల రూపాయలు.. మొత్తం కలిపి 15 లక్షల రూపాయలకు హెచ్ డీఎఫ్ సీ ఎర్గో కంపెనీ సుమారు 3వేల రూపాయలను ప్రీమియంగా వసూలు చేస్తోంది. ఇంటి వయసు, కోరుకుంటున్న బీమా మొత్తం... ఇంట్లోని కంటెంట్స్ కు ఎంత మొత్తం బీమా కావాలన్న అంశాల ఆధారంగా ప్రీమియం ఉంటుంది. 

మినహాయింపులు

బీమా రక్షణ ఉంది కదా అనే నిశ్చింతతో నిర్లక్ష్యంగా ఉండరాదు. ఇంటికి, ఇంట్లోని వాటికి రక్షణ కోసం పాలసీదారులు తగిన జాగ్రత్తలు తీసుకుని ఉండాలి. నిర్లక్ష్యంగా ఉండి నష్టానికి కారకులైతే బీమా కంపెనీలు క్లెయిమ్ లను తిరస్కరిస్తాయి. యుద్ధం, అణు ప్రమాదాలు, కాలుష్యం వల్ల వాటిల్లే నష్టానికి పరిహారం ఉండదు. వయసు ఆధారంగా క్షీణించడం వల్ల పరిహారం అందదు. ఉదాహరణకు ఓ ఫ్రీజ్ తీసుకుని పదేళ్లు దాటిపోయిందనుకోండి. దాని పనిచేసే కాలం తీరి చెడిపోతే కంపెనీలు పరిహారం ఇవ్వవు. అప్పటికే కొంత కాలం వినియోగించిన వస్తువులు అయితే ఆ మేరకు విలువను తగ్గించి మిగిలిన విలువకే కవరేజీని ఇస్తాయి కంపెనీలు. ఇంట్లోని వస్తువులకు బీమా తీసుకోవాలనుకుంటే వాటికి సంబంధించిన బిల్లు కాపీలు ఉంచుకోవాలి. క్లెయిమ్ సమయంలో ఇవి అవసరం అవుతాయి. ఇంట్లోని నగదు, బాండ్లు, స్టాక్స్ కు పరిహారం రాదు. ఒకవేళ పాలసీ తీసుకుని ఉంటే ఆ తర్వాత ఇంట్లో విలువైన వస్తువులు చేరినా, ఇంట్లో ఉన్న మార్బుల్ రాయి తీయించి అత్యంత ఖరీదైన గ్రానైట్ ఫ్లోర్ వేయించినా ఆ మేరకు పాలసీ కవరేజీని పెంచుకోవడానికి అవకాశం ఉంది. 

కేవలం ఇంటికి మాత్రమే రక్షణ కల్పించేలా పాలసీ తీసుకోవచ్చు. లేదా ఇంట్లోని కంటెట్స్ కు బీమా తీసుకోవచ్చు. లేదా రెండింటికీ బీమా పరిహారం లభించేలా కాంప్రహెన్సివ్ పాలసీ తీసుకోవచ్చు. అసలు వాస్తవిక విలువపైనే పరిహారం తీసుకోవడం తెలివైన నిర్ణయం. అందుకే పాలసీ తీసుకునే ముందు నిపుణుల నుంచి అసెస్ మెంట్ కాపీని తీసుకుని పాలసీ తీసుకోవడం బెటర్. ఇంట్లోని అన్ని వస్తువులకూ బీమా కవరేజీ ఆశిస్తే పాలసీ డాక్యుమెంట్ ను జాగ్రత్తగా చదవాలి. బంగారు నగలు, అత్యంత ఖరీదైన సెల్ ఫోన్లు తదితర ఎక్కువ విలువతో కూడిన వస్తువులకు అన్నీ కంపెనీలు బేసిక్ పాలసీలో కవరేజీ ఇవ్వడం లేదు. అందుకే పాలసీ పత్రాన్ని చూసి వీటికి కూడా కవరేజీ ఉందోలేదో చూడాలి. ఉన్నా పరిమితులు ఉన్నాయేమో గమనించాలి.   

ఉదాహరణకు రిలయన్స్ హౌస్ హోల్డర్స్ ప్యాకేజీ పాలసీ చూస్తే... ఇంటితోపాటు ఇంట్లోని వస్తువులకు కవరేజీ అందిస్తోంది. మొబైల్స్, టీవీలు, కంప్యూటర్లు, ఫర్నిచర్, మెకానికల్, ఎలక్ట్రికల్ అప్లయెన్సెస్, కుటుంబ సభ్యుల ప్రాణాలకు వాటిల్లే నష్టం, భూకంపాలు, దొంగతనాలు, దోపిడీలు, అగ్ని ప్రమాదాలు, ఉగ్రవాద చర్యల వల్ల కలిగే నష్టాలకు కూడా పరిహారం అందిస్తోంది. ఇందులో చెద పురుగుల నుంచి ఇంటికి రక్షణ, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు చెడిపోతే సర్వీస్, ఇంట్లోని నీటి కుళాయిలు, పైపులైన్ల సర్వీసు తదితర సేవలను కూడా ఉచితంగా అందిస్తోంది. ఇలా ప్రతీ కంపెనీ ఎన్నో రకాల ఆకర్షణీయ సదుపాయలతో అందిస్తోంది. 

అగ్ని ప్రమాదం కారణంగా ఇల్లు దగ్ధమైతే కొత్తిల్లు కట్టుకుంటా పరిహారం ఇవ్వు అంటే కంపెనీలు ఇవ్వవు. దగ్ధమైన ఇంటిని తిరిగి సాధారణ ఇల్లులా మార్చేందుకు అయ్యే వ్యయాన్ని మాత్రమే చెల్లిస్తాయి. మరో ఉదాహరణ ప్రకారం టీవీ కాలిపోతే బాగు చేస్తే బాగవుతుందనుకోండి. రిపేర్ కు అయ్యే ఖర్చునే చెల్లిస్తుంది కంపెనీ. 

representation image

వ్యాపారస్థులకు, కంపెనీలకు ఇన్సూరెన్స్ పాలసీలు

చిన్న షాపు నుంచి పెద్ద సైజు మాల్ వరకు... చిన్న కంపెనీ నుంచి బడా కంపెనీ వరకు అన్నింటికీ బీమా రక్షణ అవసరం. అనుకోకుండా అగ్ని ప్రమాదం జరిగితే వాటిల్లే నష్టం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించడం కష్టం. అందుకే ఆయా సంస్థలకు బీమా కంపెనీలు వివిధ రకాల కవరేజీలను అందిస్తున్నాయి. 

బర్గలరీ ఇన్సూరెన్స్

వ్యాపార సముదాయాల్లో దొంగతనాలు, దోపిడీల కారణంగా విలువైన వస్తు సామగ్రి, ఉత్పత్తులు, ఇతరత్రా నష్టం వాటిల్లితే నిర్వాహకులు నష్టపోకుండా ఈ పాలసీ తీసుకోవచ్చు. ఇలాంటి ఘటనల్లో కోటి రూపాయల కవరేజీకి పాలసీ తీసుకుంటే... జరిగిన నష్టం అంతకు లోపే ఉంటే ఆ మేరకు... అంతకు మించితే కోటి రూపాయల వరకే బీమా పరిహారాన్ని కంపెనీలు చెల్లిస్తాయి. అందుకే పాలసీ తీసుకునేటప్పుడు అన్నింటి విలువనూ కలిపి ఆ మేరకు తీసుకోవాలి. 

మనీ ఇన్సూరెన్స్

అగ్ని ప్రమాదం లేదా దొంగతనం ఘటనల్లో జరిగే నష్టానికి పాలసీ ఉన్నప్పటికీ నగదు పరంగా జరిగే నష్టానికి పాలసీలో పరిహారం ఉండదు. అందుకే ప్రత్యేకంగా మనీ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. నగదుతోపాటు బ్యాంకు డ్రాఫ్ట్స్, చెక్కులు, పోస్టల్ అండ్ పే ఆర్డర్లకు పరిహారం చెల్లిస్తాయి. 

డేటాకూ రక్షణ

representational imageబర్గలరీ పాలసీతో ఫిజికల్ డ్యామేజీకి పరిహారం అందుతుంది. మరి కంప్యూటర్లలో ఉన్న విలువైన డేటా పరిస్థితి ఏంటి? అందుకే ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ ఎక్విప్ మెంట్ పాలసీ తీసుకోవడం వల్ల కంప్యూటర్లు, హార్డ్ డ్రైవ్స్, వాటిలోని డేటా పరంగా కలిగే నష్టానికి కూడా పరిహారంతోపాటు ఆ వస్తువులను తిరిగి ఏర్పాటు చేయడానికి అయ్యే ఖర్చును కూడా పొందవచ్చు. 

ఆఫీసు అంబరిల్లా పాలసీ... షాప్ కీపర్స్ ఇన్సూరెన్స్

చిన్నసంస్థల నుంచి పెద్ద సైజు బహుళజాతి కంపెనీల వరకు తమ కార్యాలయాల రక్షణ కోసం ఈ పాలసీలను బీమా కంపెనీలు అందిస్తున్నాయి. చిన్న చిన్న షాపులకు బీమా రక్షణ కల్పించేలా షాప్ కీపర్స్ ఇన్సూరెన్స్ పాలసీలను బీమా కంపెనీలు అందిస్తున్నాయి.  

హోమ్ బేస్డ్ బిజినెస్

కొంత మంది తమ ఇళ్ల నుంచే చిన్న వ్యాపారాలను నిర్వహిస్తుంటారు. వీరికి హోమ్ ఇన్సూరెన్స్ పాలసీలు కవరేజీ ఇవ్వవు. ఇలాంటప్పుడు హోమ్ బేస్డ్ బిజినెస్ పాలసీలు అక్కరకు వస్తాయి. 

ఫైర్ అండ్ అలైడ్ పెరిల్స్

అగ్ని ప్రమాదం.. ప్రమాదవశాత్తూ జరిగినా లేక ఎవరైనా నిప్పు పెట్టడం వల్ల జరిగినా ఈ పాలసీ కింద పరిహారం అందుతుంది. సహజ విపత్తులు, వరదలు, తుఫానులు, అల్లర్లు, ఉగ్రవాద చర్యల వల్ల జరిగిన నష్టాలకు కూడా బీమా కవరేజీని కంపెనీలు అందిస్తున్నాయి. 

కార్యకలాపాలు ఆగడం వల్ల వాటిల్లే నష్టానికీ... 

అగ్ని ప్రమాదంతో సంస్థ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడవచ్చు. దాని కారణంగా లాభాలకు గండి పడవచ్చు. ఆ నష్టాన్ని బీమా కంపెనీలు పరిహారం రూపంలో భర్తీ చేస్తాయి. ఈ తరహా పాలసీలను జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు అందిస్తున్నాయి. అంటే అగ్నిప్రమాద సమయంలో వాటిల్లే నష్టంతోపాటు ఆ ప్రమాదం కారణంగా కార్యకలాపాలపై పడే ప్రభావంతో వాటిల్లే నష్టాన్ని కూడా భర్తీ చేస్తాయి. 

ఇవి కాకుండా ప్రమాదాల్లో ఇతరులకు, వారి ఆస్తులకు (థర్డ్ పార్టీ లయబిలిటీస్) కలిగే నష్టాన్ని భర్తీ చేసే రకరకాల పాలసీలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి వాటిల్లో ప్రొడక్ట్ లయబిలిటీ ఇన్సూరెన్స్ కూడా ఒకటి

ప్రొడక్ట్ లయబిలిటీ ఇన్సూరెన్స్

కంపెనీ ఏవైనా ఉత్పత్తులను మార్కెట్లో విక్రయిస్తుంటే ఈ పాలసీ తప్పనిసరి. కంపెనీ తన ఉత్పత్తి సురక్షితంగా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో ఏదైనా తప్పిదం జరగవచ్చు. తద్వారా ఎదురయ్యే న్యాయపరమైన చిక్కులు, పరిహారం చెల్లింపులకు ఈ పాలసీ కవరేజీ అందిస్తాయి. 

మోసం చేస్తే కూడా ఉంది రక్షణ

ఉద్యోగి మోసపూరిత చర్యల వల్ల కంపెనీకి కలిగే నష్టాన్ని భర్తీ చేసే పాలసీలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు అకౌంట్స్ విభాగాల్లో కీలక స్థానాల్లో ఉన్న ఉద్యోగులు కోట్ల రూపాయల్లో టోపీలు పెట్టిన ఘటనలు వినే ఉంటారు. ఇలాంటి మోసపూరిత చర్యల వల్ల కలిగే నష్టాన్ని ఈ  పాలసీ ద్వారా పొందవచ్చు. ఈ పాలసీని కంపెనీలో ప్రత్యేకంగా ఓ ఉద్యోగి పేరుతోనూ తీసుకోవచ్చు. 

వర్క్ మెన్ కాంపన్సేషన్ పాలసీ

కంపెనీలో ఏదైనా ప్రమాదం జరిగి ఉద్యోగులు మరణించినా లేదా తీవ్రంగా గాయపడినా వారికి లేదా వారి కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని చట్టాలు నిర్ధేశిస్తున్నాయి. ఇందుకోసం వర్క్ మెన్ కాంపన్సేషన్ పాలసీలు తీసుకోవాల్సి ఉంటుంది. 

ఉద్యోగికి ఏదైనా జరిగి తద్వారా వాటిల్లే నష్టానికీ...

కీ మ్యాన్ ఇన్సూరెన్స్... కంపెనీకి కీలక ఆధారమైన ఉద్యోగులకు అనుకోకుండా ఏదైనా జరిగి వారు లేని పరిస్థితుల్లో వాటిల్లే నష్టానికి ఈ పాలసీలు పరిహారం అందిస్తాయి. ఉదాహరణకు సంస్థ వ్యవస్థాపకుడు, డైరెక్టర్, ప్రాజెక్టు మేనేజర్ ఇలాంటి వారు కంపెనీకి చాలా కీలకం. ఇలాంటి వారికి టర్మ్ ప్లాన్ ను కంపెనీలు అందిస్తున్నాయి. వీరికి జరగరానిది ఏదైనా జరిగి మరణానికి గురైతే కంపెనీకి వాటిల్లే నష్టాన్ని బీమా కంపెనీలు పరిహారంగా అందిస్తాయి. ఇవే అని కాదు, కంపెనీకి సంబంధించిన అన్ని వాహనాలకు (ఎక్కడున్నా గానీ) బీమా పొందవచ్చు. ఇలా ప్రతీ దానికి పరిహారం అందించేలా పాలసీలు అందుబాటులో ఉన్నాయి. అలాగే అన్నింటికీ కలిపి కాంప్రహెన్సివ్ కవరేజీని ఇచ్చేవి కూడా ఉన్నాయి. 

ట్రావెల్ ఇన్సూరెన్స్ 

representational imageహైదరాబాద్ నుంచి అమెరికా ప్రయాణం పెట్టుకున్నాం. విమానంలో సాంకేతిక లోపం కారణంగా ప్రయాణం ఆలస్యం అయింది. లేదా సకాలంలో విమానాన్ని అందుకోలేకపోయారు. ఫలితంగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. లేదా విమానంలో విలువైన వస్తువులు, పాస్ పోర్ట్, వీసా తదితర డాక్యుమెంట్లతో కూడిన బ్యాగ్ మాయం అవడం వల్ల నష్టం కలిగింది. లేదా పర్యటన సమయంలో ఏదైనా అనారోగ్యం ఎదురైందనుకోండి. ఇలాంటి వాటివల్ల కలిగే నష్టాలకు కంపెనీలు పరిహారం అందిస్తాయి. అంతేకాదు అనారోగ్యం కారణంగా చివరి నిమిషంలో పర్యటనను రద్దు చేసుకోవడం వల్ల వాటిల్లే నష్టానికి కూడా ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీల్లో పరిహారం అందిస్తున్నాయి కంపెనీలు. 

ఇందులోనూ ఒక పర్యటన, ఒకటికి మించిన పర్యటనలు, దీర్ఘకాల పర్యటనలు (3 నుంచి 18 నెలల కాలానికి)కు ఉద్దేశించిన పాలసీలు ఉన్నాయి. అంతేకాదు, పర్యటనల్లో భాగంగా ఆరోగ్య పరంగా ఎదురయ్యే వ్యయానికి మెడికల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీలు కూడా ప్రత్యేకంగా ఉన్నాయి. ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీల్లో డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్, సీనియర్ సిజిజన్ ట్రావెల్స్ ఇన్సూరెన్స్, స్టూడెంట్ ట్రావెల్స్ ఇన్సూరెన్స్, ఫ్యామిలీ ట్రావెల్ ఇన్సూరెన్స్, ఇండివిడ్యువల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీలు  ఉన్నాయి. కార్పొరేట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీల ద్వారా కంపెనీలు తమ ఉద్యోగుల విదేశీ పర్యటనలకు కవరేజీని అందించే అవకాశం కూడా ఉంది. 


More Articles