నాణ్యమైన విద్య, ఉద్యోగం కోసం సింగపూర్!
నాణ్యమైన విద్య, సౌకర్యవంతమైన జీవనానికి చిరునామా సింగపూర్. దక్షిణాసియాలో విద్యకు ముఖ్య కేంద్రం. కంప్యూటర్ సైన్స్, లా, యానిమేషన్, గేమింగ్ డెవలప్ మెంట్, డిజైన్, మ్యూజిక్, పీజీ, మేనేజ్ మెంట్ కోర్సులకు ఇక్కడ మంచి ఆదరణ ఉంది. ఏటా భారత్ నుంచి సుమారు 4 వేల మంది విద్యార్థులు సింగపూర్ వెళుతున్నారు. అమెరికా, యూకే లాంటి దేశాలతో పోలిస్తే ట్యూషన్ ఫీజులు తక్కువ. అంతేకాదు, భారత్ నుంచి పది వేల రూపాయలతో కూడా సింగపూర్ వెళ్లగల సౌలభ్యం. విద్యార్థులకు సురక్షిత దేశం. విద్య తర్వాత చక్కని ఉద్యోగ అవకాశాలతో సింగపూర్ ఆకర్షణీయ దేశంగా మారింది.
ప్రఖ్యాతిగాంచిన విద్యా సంస్థలు...
సింగపూర్ లో 34 యూనివర్సిటీల వరకు ఉన్నాయి. అందులో ఆరు జాతీయ స్థాయి యూనివర్సిటీలు కాగా, వీటిలో నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్, నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ(ఎన్టీయూ)లను టాప్ 2గా చెబుతారు. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ప్రపంచంలో 12వ ర్యాంకులో ఉంది. ఆసియా వరకు చూస్తే ఇదే నంబర్ 1. సివిల్, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ కోర్సుల పరంగా ఈ యూనివర్సిటీ ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది. నేచురల్ సైన్స్ కోర్సుల్లో దీని స్థానం 10.
ఇక నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ ప్రపంచంలోని టాప్ యూనివర్సిటీల్లో 13వ స్థానంలో ఉంది. ఈ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కోర్సులకు ఎంతో గుర్తింపు ఉంది. మేనేజ్ మెంట్ కోర్సుల కోసం అయితే అత్యున్నత విద్యా సంస్థ సింగపూర్ మేనేజ్ మెంట్. సింగపూర్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ డిజైన్ కూడా అత్యున్నత నాణ్యతతో కూడిన విద్యను అందిస్తోంది. మేనేజ్ మెంట్ డెవలప్ మెంట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సింగపూర్, పీఎస్ బీ అకాడమీ, జర్మన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలకు కూడా మంచి గుర్తింపు ఉంది.
స్టూడెంట్ పాస్
సింగపూర్ లో ఏదేనీ విద్యా సంస్థలో ఫుల్ టైమ్ కోర్స్ లో అడ్మిషన్ లభించిన విద్యార్థులు స్టూడెంట్ పాస్ కోసం ఇమిగ్రేషన్ అండ్ చెక్ పాయింట్స్ అథారిటీ (ఐసీఏ) వద్ద దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రైవేట్ ఎడ్యుకేషన్ విద్యా సంస్థలు, టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్స్, పాలిటెక్నిక్ యూనివర్సిటీలు.. ఇలా విద్యా సంస్థల కేటగిరీల ఆధారంగా స్టూడెంట్ పాస్ నిబంధనల్లో మార్పులు ఉంటాయి. ఇందుకోసం సింగపూర్ ఎంబసీని సంప్రదించవచ్చు. వీసా ప్రాసెసింగ్ ఫీజు కూడా విద్యా సంస్థలకు అనుగుణంగా వేర్వేరుగా ఉంటుంది.
చదువుతూనే ఉద్యోగం...
డిగ్రీ తదితర ఫుల్ టైమ్ కోర్సుల్లో ఉన్న వారు చదువుతూనే వారానికి 16 గంటలపాటు ఉద్యోగం చేసుకోవచ్చు. సెలవుల్లో పని చేసుకునేందుకు ప్రత్యేకంగా అనుమతి అవసరం లేదు. డిగ్రీ పూర్తి అయిన తర్వాత అక్కడే ఉద్యోగం చేయాలనుకుంటే ఏడాది కాల వ్యవధిగల విజిట్ పాస్ కోసం ఇమిగ్రేషన్ అండ్ చెక్ పాయింట్స్ అథారిటీ (ఐసీఏ)కి దరఖాస్తు చేసుకోవాలి.
దేనికి ఎంత ఖర్చు?
సొంతంగా ఆహారాన్ని వండుకుంటే ఖర్చు తగ్గుతుంది. ఇందుకు ఒక్కరికి సుమారు 200 సింగపూర్ డాలర్ల వ్యయం అవుతుంది. రెస్టారెంట్లకు వెళితే పాకెట్ గుల్లే. ప్రజా రవాణా ఖర్చులు చాలా తక్కువగా ఉంటాయి. నీరు, గ్యాస్ బిల్లు 200 నుంచి 600 డాలర్లలోపు ఉంటుంది. ప్రైవేటు హాస్టల్లో ఉండాలనుకుంటే 750 డాలర్ల ఖర్చును భరించగలగాలి. ఇళ్లల్లో ఓ గది అద్దెకు తీసుకోవాలంటే 800 నుంచి 1200 డాలర్ల వరకు ఉంటుంది. విద్యార్థులు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తప్పక తీసుకోవాలి. దీని వ్యయం 50 డాలర్ల వరకు ఉంటుంది.
స్కాలర్ షిప్ లకు అవకాశం కూడా ఉంది. ఇంజనీరింగ్ విద్య ఇక్కడ చదివి ఇంటర్న్ షిప్ చేస్తే ఉద్యోగ అవకాశాలు విరివిగా ఉంటాయి. విద్య అనంతరం ఉద్యోగం చూసుకునేందుకు వీలుగా జాబ్ సెర్చ్ పాస్ తీసుకుని అక్కడ అన్వేషణ సాగించవచ్చు. ఉద్యోగం అవకాశాన్ని సొంతం చేసుకున్నవారు ‘ఈపాస్’ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత సింగపూర్ లోనే శాశ్వతంగా ఉండాలనుకుంటే పర్మినెంట్ రెసిడెన్స్ పాస్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.