రెజ్యుమే... రాయాలి ఇలా!

రెజ్యుమే అంటే...? రిక్రూటర్ల మనసును గెలుచుకునే డాక్యుమెంట్. ఒక ఉద్యోగానికి నేనే తగిన వాణ్ణి అని వివరించే కరపత్రమే రెజ్యుమే. ఆ ఉద్యోగానికి ఎలా అర్హులు? మీకున్న విద్యార్హతలు, సామర్థ్యాలు, నైపుణ్యాలు, అనుభవం, ఆ జాబ్ మీకే ఇస్తే ఏం సాధించగలరు? ఇవన్నీ తెలియజేస్తూ రిక్రూటర్లు ‘హీ/షీ ఈజ్ పర్ఫెక్ట్ ఫర్ ద పొజిషన్’ అని భావించే విధంగా చేసే డాక్యుమెంట్ రెజ్యుమే. ఇవేమీ తెలుసుకోకుండా స్నేహితుడి దగ్గరో, ఆన్ లైన్ లోనే ఏదో ఒక రెజ్యుమే ఫార్మాట్ కాపీ కొట్టి పేర్లు మార్చి పంపే ఆలోచన చేయకండి. మీకు మీరుగా మీ గురించి అద్భుతంగా చెప్పుకోండి. అందుకోసం ఈ టిప్స్ ఫాలో అయిపోండి. 

మనసుపెట్టి..

రెజ్యుమే మనసు పెట్టి రాయాలి. రాయమన్నారు కదా అని ఏదేదో రాసి రిక్రూటర్ మొహాన పడేస్తే జాబ్ వస్తుందా...? జాబ్ ఏదైనా, రెజ్యుమే మాత్రం ఒక్కటే అన్నది చాలా మంది ఫాలో అయ్యే విధానం. కానీ రెజ్యుమేలో ఉండే కంటెంట్ అప్లయ్ చేస్తున్న జాబ్ కు సరిపోలుతుందా? అనేది గమనించుకోవాలి. కోరుకుంటున్న జాబ్ కు తగిన విధంగా అందులో మార్పులు, చేర్పులు జరుగుతుండాలి. అప్పుడే అది సూటబుల్ రెజ్యుమే అవుతుంది. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఉద్యోగాలకు రెజ్యుమే పంపుతున్న సందర్భంలో  ఫలానా జాబ్ రోల్స్ ఏంటి?, ఆ సంస్థ ఆశిస్తున్నది ఏంటి? ఇలాంటి సమాచారాన్ని పరిశీలించాలి. 

కీవర్డ్స్ ఉండాలిrepresentational image

రెజ్యుమేలో కీ వర్డ్స్ ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే రిక్రూటర్లు లేదా ఎంప్లాయర్లు అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్ అనే ఓ సాఫ్ట్ వేర్ ను ఉపయోగించి జాబ్స్ కు తగిన రెజ్యుమేలను స్క్రీన్ చేస్తుంటారు. కనుక ఆ ట్రాకింగ్ లో మన రెజ్యుమే కూడా రిక్రూటర్ల గాలానికి చిక్కాలి. అందుకే  వర్డ్స్ తప్పక ఉండాలి. ఏ జాబ్ కు అయితే రెజ్యుమే పంపుతున్నామో ఆ జాబ్ పేరుతో గూగుల్ లో కీ వర్డ్స్ కోసం సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. రెజ్యుమేలోని కీ వర్డ్స్ అభ్యర్థికి సంబంధించి ముఖ్యమైన సమాచారాన్ని తెలియజేస్తాయి. కీవర్డ్స్ ఆధారంగా సంబంధిత ఉద్యోగానికి తగిన అర్హతలు ఉన్న అభ్యర్థుల రెజ్యుమేలను సాఫ్ట్ వేర్ గుర్తిస్తుంది. ఆ తర్వాత అవి రిక్రూటర్ టేబుల్ పైకి చేరతాయి. 

ఉదాహరణకు హెచ్ఆర్ విభాగానికి సంబంధించి రెజ్యుమే కంటెంట్ లో బెనిఫిట్స్ అండ్ కాంపన్సేషన్, హెచ్ఆర్ పాలసీ డెవలప్ మెంట్ అండ్ ఎగ్జిక్యూషన్, పే రోల్ అడ్మినిస్ట్రేషన్, పర్ ఫార్మెన్స్ మేనేజ్ మెంట్, జాబ్ అనలైసిస్/డెవలప్ మెంట్, రిస్క్ మేనేజ్ మెంట్, ట్రైనింగ్ అండ్ డెవలప్ మెంట్, హ్యూమన్ రీసోర్స్ అడ్మినిస్ట్రేషన్, మెర్జర్ అండ్ ఆక్విజిషన్ ఇలాంటి పదాలన్నీ కీ వర్డ్స్ గా పరిగణిస్తారు. సేల్స్ జాబ్ కు సంబంధించి అయితే మార్కెటింగ్, అనాలసిస్, రీసెర్చ్, డిస్ ప్లే పదాలు కీవర్డ్స్. 

రెజ్యుమేలో ఏమి ఉండాలి..?

మొదట కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ పేరు, చిరునామా, ఈ మెయిల్, ఫోన్ నంబర్, లింకెడిన్ ప్రొఫైల్ ఉంటే దాన్ని పేర్కొనాలి. ఇది చాలా రెజ్యుమేలలో పాటించే విధానం. కానీ, రెజ్యుమే ఇలానే ఉండాలి అన్న రూల్ ఏమీ లేదు. రివర్స్ క్రానలాజికల్, ఫంక్షనల్, కాంబినేషన్ అనే మూడు రూపాల్లో రెజ్యుమేలను రాస్తుంటారు. ప్రొఫెషనల్ ఎక్స్ పీరియన్స్ ఉన్న వారు రివర్స్ క్రానలాజికల్ రెజ్యుమే విధానంలో రాస్తుంటారు. అంటే ప్రారంభంలో పేరు, చిరునామా తర్వాత ప్రొఫెషనల్ ప్రొఫైల్, ప్రొఫెషనల్ ఎక్స్ పీరియన్స్, ఎడ్యుకేషన్, అడిషనల్ స్కిల్స్ ఈ ఆర్డర్ లో రాస్తారు. అదే ఫంక్షనల్ ఫార్మాట్ రెజ్యుమే విధానంలో స్కిల్స్, సామర్థ్యాలను ఎక్కువగా ఫోకస్ చేయడం ఉంటుంది. పేరు, చిరునామా తర్వాత ఇంట్రడక్షన్/సమ్మరీ, స్కిల్స్, పని అనుభవం, ఎడ్యుకేషన్ ఇలా ఫంక్షనల్ రెజ్యుమే ఉంటుంది. కాంబినేషన్ అన్నది రెండింటి కలయికలా ఉంటుంది.  

ఇంట్రడక్షన్/సమ్మరీ

రెజ్యుమేలో పేరు చిరునామా,representational image కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ తర్వాత వచ్చే ఇంట్రడక్షన్/సమ్మరీ అత్యంత కీలకమైన పార్ట్. అభ్యర్థి తాను ఏంటో చెప్పేది, ఉద్యోగానికి తాను ఏ విధంగా అర్హుడినో, సరైన పోటీదారుడినో తెలియజేసేది ఇక్కడే. అప్పుడే విద్య పూర్తి చేసుకుని ఉద్యోగ అన్వేషణ మొదలుపెట్టిన అభ్యర్థి నుంచి అప్పటికే పని అనుభవం సంపాదించిన వారి వరకు ప్రతీ ఒక్కరూ వారి గురించి క్లియర్ గా చెప్పుకోవాలి. ఇంట్రడక్షన్ సూటిగా సుత్తి లేకుండా చురకత్తిలా ఉండాలి. 

మీరు మార్కెటింగ్ మేనేజర్ అయితే ఒక ఉత్పత్తిని కస్టమర్ కు విక్రయించేందుకు అది ఎలా పనిచేస్తుంది, అందులో ఉన్న ఫీచర్స్ గురించి ఎంతో గొప్పగా వివరిస్తారు కదా. రెజ్యుమే కూడా అచ్చం అలానే ఉండాలి. ఇక్కడ రెజ్యుమే మార్కెటింగ్ మేనేజర్ అయితే సమ్మరీ విభాగంలో ఉత్పత్తి గురించి చెప్పాల్సిందే మీ గురించే. మీకే ఎందుకు ఉద్యోగం ఇవ్వాలి? మీకు ఆ ఉద్యోగం ఇవ్వడం వల్ల కంపెనీకి ఒనగూరే లాభం ఏంటి? తదితర అంశాలను చెప్పగలిగితే బెటర్. రిక్రూటర్లు ఇంట్రడక్షన్ మాత్రమే చూసి తేల్చేయగలరు. అభ్యర్థి అప్పటి వరకు ఏం చేశాడు, ఇకపై ఏం చేయాలనుకుంటున్నాడో వారికి సింపుల్ గా తెలియాలి. 

తాజాగా స్టడీస్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణ ప్రారంభించిన వారు అయితే వారి విద్యార్హతలు, ప్రతిష్ఠాత్మక కాలేజీల్లో చదివితే వాటి వివరాలు, సాధించిన గ్రేడ్లు, మెడల్స్ గురించి హైలైట్ చేయాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ నాయకత్వ లక్షణాలు ఇలా మీకున్న ప్రత్యేకతలను ప్రముఖంగా పేర్కొనాలి.   

ప్రొఫెషనల్ ఎక్స్ పీరియన్స్ 

అప్పటి వరకు సంపాదించిన వృత్తి పరమైన అనుభవం, వివిధ రంగాల్లో పని చేసి ఉంటే ఆ అనుభవం, గతంలో చేసిన పని, దాని తాలూకూ సవాళ్లు, సాధించిన విజయాలు పేర్కొనాలి. అలా అని చాటభారతంలా ఉండకూడదు. 

ఎడ్యుకేషన్

ఉన్నత విద్యార్హతలు, ఇతర విద్యార్హతల వివరాలు ఈ విభాగంలో ఇవ్వాలి. పీహెచ్ డీ చేసి ఉంటే తొలుత పీహెచ్ డీ, తర్వాత పీజీ, తర్వాత డిగ్రీ విద్యార్హతలను ఆర్డర్ లో పేర్కొనాలి. అలాగే, పూర్తి చేసిన విద్యా సంవత్సరాలను కూడా పేర్కొనడం మంచిది. టాప్ గ్రేడ్స్ లో పాస్ అయి ఉంటే ఆ వివరాలు, అవార్డులు, గోల్డ్ మెడల్స్ వంటివి తెలియజేయాలి. కంప్యూటర్, టెక్నికల్ కోర్సులు, ఇతర ప్రొఫెషనల్ కోర్సులు చేసి ఉన్నా వాటిని కూడా తెలియజేయాలి. ప్రత్యేక నైపుణ్యాలు, సామర్థ్యాలు ఉంటే వాటిని వివరించాలి. 

ఉదాహరణకు ఐటీ జాబ్ కోసం అన్వేషిస్తుంటే ప్రత్యేక నైపుణ్యాలను కంపెనీలు చూస్తుంటాయి. అందుకే సాఫ్ట్ వేర్ ప్రొగ్రామ్స్ కోర్సులు చేసి ఉంటే వాటి వివరాలు, ప్రాజెక్టులు చేసి ఉంటే ఆ సమాచారం తెలియజేయాలి. ఇంత చదివినా తిరిగి రెజ్యుమే రాయాలంటే ఆందోళన చెందే వారు ఆన్ లైన్ లో రెజ్యుమే ఫార్మాట్ లను పరిశీలించవచ్చు. ఒకటికి మించిన ఫార్మాట్ లను పరిశీలించడం ద్వారా ఇంట్రడక్షన్ రాసే విధానంపై అవగాహనకు రావచ్చు. 

టిప్స్

representational imageఫ్రెషర్ అయితే ఒక్క పేజీ రెజ్యుమే సరిపోతుంది. ఎక్స్ పీరియన్స్ డ్ అయితే రెండు నుంచి మూడు పేజీల్లోనే పూర్తవ్వాలి. ప్రింటెడ్ రెజ్యుమే కోసం సెరిఫ్ ఫాంట్స్ చూసేందుకు బాగుంటాయి. అదే సాఫ్ట్ కాపీ అయితే శాన్ సెరిఫ్ ఫాంట్స్ తగినవి. టైమ్స్ న్యూ రోమన్, జార్జియా, బుక్ మాన్ ఓల్డ్ స్టైల్, సెంచురీ గోతిక్ సెరిఫ్ ఫాంట్స్ కిందకు వస్తాయి. శాన్ సెరిఫ్ ఫాంట్స్ అయితే ఏరియల్, కాలిబ్రి, హెల్ వెతికా, తహోమా మొదలైనవి. రెజ్యుమే అంతటా ఒకటే ఫాంట్ వాడాలి. ఫాంట్ సైజు (అక్షరాల పరిమాణం) విషయానికొస్తే పేరును 24 ఫాంట్ సైజులో, హెడర్స్ 12 సైజులో, టెక్ట్స్ 10 ఫాంట్ సైజులో సరిపోతుంది. ఒక్క పేజీలోనే అన్నీ ఇరికించేయాలనుకుని ఫాంట్ సైజు తగ్గించొద్దు. 

ప్రతీ విభాగం తర్వాత లైన్స్ ఇవ్వడం వల్ల చదివేందుకు సౌకర్యంగా ఉంటుంది. అలాగే ప్రతీ సెక్షన్ తర్వాత ఒక లైన్ స్పేస్ ఇస్తే చూడముచ్చటగా ఉంటుంది. నేమ్, అడ్రస్, సమ్మరీ, ఎక్స్ పీరియన్స్ ఇలా ప్రతీ సెక్షన్ ను విభజించినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. పేజీలో ఇరువైపులా ఒక అంగుళం మార్జిన్ ఉండడం నయం. చివరిలో రెజ్యుమేలో ఎర్రర్స్ ఉన్నాయేమో గమనించుకోవాలి. తప్పు కనబడిందా రెజ్యుమే డిలీట్ బాక్స్ లోకి వెళ్లినట్టే. అందుకే పై నుంచి కింది వరకు అక్షర, వాక్య నిర్మాణ, సమాచార దోషాలు ఉన్నాయేమో చెక్ చేసుకుని సరి చేసుకోవాలి. 

తప్పనిసరిగా గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే రెజ్యుమేలోని అన్ని సెక్షన్లలో సమాచారం సరళంగా సంక్షిప్తంగా ఉండాలి. లెంథీగా ఉంటే చూసేవారికి విసుగు తెప్పించవచ్చు. రెజ్యుమే జాబ్ సాధనలో ఎంత కీలక పాత్ర పోషిస్తుందో ఈ పాటికే అర్థమై ఉంటుంది. అందుకే ఇంత చదివినా రాయలేకపోతే వేరే వారి రెజ్యుమేని కాపీ కొట్టకుండా నౌకరి, టైమ్స్ జాబ్స్, మాన్ స్టర్ తదితర జాబ్ సైట్లకు కొంత రుసుము చెల్లిస్తే చక్కటి రెజ్యుమేను రెడీ చేసి ఇస్తాయి. రెజ్యుమే శాంపిల్స్ ను ఈ లింక్ లో చూడవచ్చు. http://www.vault.com/resumes/sample


More Articles