PPF / EPF / VPF ... వీటిలో ఏది లాభదాయకం?

కష్టపడి సంపాదించిన మొత్తంలో కొంత మొత్తాన్ని పొదుపు చేసి... భవిష్యత్ కు భరోసా కల్పించుకునేందుకు ఇవి ఉపయోగపడతాయి. ఈ మూడు ఇంచు మించు ఒకే రకమైన ప్రయోజనాలు, భద్రతతో కూడినవి. పెట్టుబడులు, ప్రయోజనాల పరంగా వీటి మధ్య ఉన్న విభిన్నతను చూద్దాం. 

PPF ప్రజా భవిష్య నిధి పథకం

పౌరులు ఎవరైనా ఈ పథకంలో చేరి పొదుపు చేసుకోవచ్చు. కాల వ్యవధి 15 ఏళ్లు. ఆ తర్వాత మరో ఐదేళ్లు పొడిగించుకోవచ్చు. పొడిగించిన కాలంలో జమ చేసినా, చేయకపోయిన ఫర్వాలేదు. జమ చేసినా లేదా అప్పటి వరకూ ఉన్న మొత్తంపైనా వడ్డీ లభిస్తుంది. 2017 ఏప్రిల్ 1 నుంచి వడ్డీ రేటు 7.9 శాతంగా ఉంది. ఏడాదిలో కనిష్టంగా 500 వరకు, గరిష్టంగా 1.5 లక్షల వరకు పొదుపు చేసుకోవచ్చు. గడువులోపు ఖాతాను పూర్తిగా మూసివేసేందుకు అవకాశం లేదు. కానీ, ఆరవ ఏట చివర్లో అంటే ఏడవ ఏడాదిలోకి ప్రవేశించిన వెంటనే కొంత మొత్తం వెనక్కి తీసుకోవచ్చు. అది ఎలా అంటే అప్పటి వరకూ పీపీఎఫ్ ఖాతాలో ఉన్న బ్యాలన్స్ నుంచి కాకుండా...  నాలుగో ఏడాది చివరి నాటికి ఉన్న బ్యాలన్స్ మొత్తం నుంచి 50 శాతం ఉపసంహరించుకోవడానికి మాత్రమే అనుమతిస్తారు. ఇక ఆ తర్వాత నుంచి ఏడాదికోసారి అవసరాలను బట్టి కొంత మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. పెట్టే పెట్టుబడులకు, గడువు తీరిన తర్వాత అందుకునే రాబడులకు పూర్తిగా పన్ను మినహాయింపు ఉంది. ఈపీఎఫ్, వీపీఎఫ్ రెండూ వ్యవస్థీకృత రంగంలోని వారికి పరిమితం. పీపీఎఫ్ అందరికీ అందుబాటులో ఉన్న పథకం. 

పీపీఎఫ్ తో ప్రయోజనాలు...

పీపీఎఫ్ ఖాతాను సంపాదించడం మొదలు పెట్టిన తొలి నాళ్లలోనే ప్రారంభించడం ద్వారా ఎక్కువ ప్రతిఫలాన్ని అందుకోవచ్చు. కుటుంబ అవసరాలు పెరిగి డబ్బులు అవసరం అయ్యాయనుకోండి. ఆరో ఏడాది వరకు ఆగాల్సిందే. అందుకే ముందే ప్రారంభిస్తే అవసరంలో ఆదుకుంటుంది. నెల నెలా క్రమం తప్పకుండా పీపీఎఫ్ లో జమ చేస్తేనే ఎక్కువ నిధి సమకూరుతుంది. అందుకే అవకాశం ఉన్నంత మేర, అదనంగా చేతికి అందే మొత్తాన్ని పీపీఎఫ్ లోకి మళ్లించడం ప్రయోజనకరం. ప్రతి నెలా 5వతేదీ లోపే పీపీఎఫ్ లో జమ చేయాలి. ఆ తర్వాత జమ చేస్తే ఆ మొత్తంపై ఆ నెలలో వడ్డీ రాదు. 5వ తేదీన ఖాతాలో ఉన్న బ్యాలన్స్ పైనే వడ్డీ లభిస్తుంది. పీపీఎఫ్ పై తక్కువ వడ్డీకే రుణం పొందవచ్చు. పీపీఎఫ్ వడ్డీ రేటు కంటే రుణంపై వడ్డీ రేటు కేవలం రెండు శాతమే అదనం. కనుక పర్సనల్ లోన్ కంటే పీపీఎప్ పై లోన్ తీసుకోవడమే నయం. 

EPF ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్

ఉద్యోగుల భవిష్యనిధి పథకం. వ్యవస్థీకృత రంగలో పనిచేసే ( ప్రైవేటు రంగ కంపెనీల్లో పనిచేసేవారు) వారి పదవీ విరమణ, భవిష్యత్ అవసరాల కోసం ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇందులో ప్రస్తుత వడ్డీ రేటు 8.65 శాతంగా ఉంది. ఉద్యోగి మూలవేతనం+డీఏ కలపగా వచ్చిన మొత్తంలోంచి 12 శాతాన్ని ఉద్యోగి వేతనం నుంచి సంబంధిత కంపెనీ ప్రతి నెలా మినహాయించి ఈపీఎఫ్ కు జమ చేస్తుంది. అదే విధంగా సంబంధిత కంపెనీ కూడా ఉద్యోగి తరఫున అంతే మొత్తాన్ని (12%) ఉద్యోగి భవిష్య నిధి ఖాతాకు జమ చేస్తుంది. ఉద్యోగి పదవీ విరమణ లేదా సదరు కంపెనీలో ఉద్యోగానికి రాజీనామా చేసేవరకు ఇది అమల్లో ఉంటుంది. కంపెనీ వాటాగా అందే మొత్తంలో కొంత భవిష్య నిధికి, మరికొంత మొత్తాన్ని పెన్షన్ ఫండ్ కు ఈపీఎఫ్ మళ్లిస్తుంది. దీంతో పదేళ్ల సర్వీసు ఉండి పదవీ విరమణ వయసుకు వచ్చిన వారికి నెలనెలా కొంత మొత్తాన్ని పెన్షన్ రూపంలో అందిస్తుంది. కంపెనీ మారినప్పుడు ఉద్యోగి ఈపీఎఫ్ ఖాతాను అదే నంబర్ తో కొత్త కంపెనీలోనూ కొనసాగించుకోవచ్చు. లేదా ఒక కంపెనీలో ఉద్యోగం నుంచి బయటకు వచ్చి మరో ఉద్యోగం లేకుండా  రెండు నెలల పాటు ఖాళీగా ఉంటే ఈపీఎఫ్ ఖాతాను క్లోజ్ చేసుకుని అందులో ఉన్న మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. ఇందులో పెట్టుబడులు, రాబడులకు పన్ను మినహాయింపు పూర్తిగా కలదు. అయితే, ఓ కంపెనీలో కనీసం ఐదేళ్లు కూడా పనిచేయకుండా ఉద్యోగం మానేసి ఆ లోపే భవిష్యనిధి ఖాతాలోని నగదును వెనక్కి తీసుకోదలిస్తే పన్ను వర్తిస్తుంది. 

VPF వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్

ఈపీఎఫ్ చందాదారులకు మాత్రమే అందుబాటులో ఉన్న అవకాశం ఇది. వీపీఎఫ్ అనేది ప్రత్యేక పథకం కాదు. ఈపీఎఫ్ చందాదారులు తమ వేతనం నుంచి అదనంగా మరికొంత మొత్తాన్ని పొదుపు చేసుకోవాలని అనుకుంటే అందుకు వీపీఎఫ్ వీలు కల్పిస్తుంది. ఉద్యోగి తన మూలవేతనం+డీఏకు సమాన స్థాయి వరకు వీపీఎఫ్ లో పొదుపు చేసుకోవచ్చు. ఇందులో పెట్టుబడులపై ఈపీఎఫ్ వడ్డీ రేటే అప్లయ్ అవుతుంది. ఈపీఎఫ్ పథకానికి వర్తించే పన్ను మినహాయింపులు, నిబంధనలు కూడా దీనికి వర్తిస్తాయి. వీపీఎఫ్ రూపంలో పెట్టే పెట్టుబడులు ఈపీఎఫ్ ఖాతాలోనే జమ అవుతాయి.  

వేతన జీవులు అయితే పీపీఎఫ్ లో కంటే వీపీఎఫ్ లోనే జమ చేసుకోవడం ప్రయోజనం. ఎందుకంటే వీపీఎఫ్ ఎక్కువ వడ్డీని ఆఫర్ చేస్తోంది. అయితే, ఇక్కడ ఓ విషయాన్ని గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఉద్యోగి తన వాటాగా ఈపీఎఫ్ లో జమచేసిన  నిధి నుంచి పదవీ విరమణ సమయంలో ఉపసంహరించుకునే మొత్తంలో 60 శాతంపై పన్ను విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా వచ్చిన వ్యతిరేకతతో దాన్ని వెంటనే పక్కన పెట్టింది. ఒకవేళ భవిష్యత్తులో ఇలాంటి నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చినట్టయితే వీపీఎఫ్ లో పెట్టుబడులపై పన్ను పోటు పడుతుంది. 

వీపీఎఫ్ ద్వారా నెలనెలా నిర్ణీత మొత్తాన్ని సేవ్ చేసుకోవాలనుకునే ఉద్యోగులు తమ కంపెనీ హెచ్ఆర్ విభాగంలో తెలియజేయాల్సి ఉంటుంది. ఈపీఎఫ్, వీపీఎఫ్ రెండింటిలోనూ ఉద్యోగం మానేసి ఖాళీగా ఉంటే మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. వివాహాలు, ఇళ్ల కొనుగోలు, తీవ్ర వ్యాధుల బారిన పడినప్పుడు కొంత మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. అలాగే ముఖ్య అవసరాలకు రుణాన్ని కూడా పొందే సదుపాయం ఉంది. అధిక వడ్డీ రేటు ఉన్న దృష్ట్యా పీపీఎఫ్, వీపీఎఫ్ ఎక్కువ ప్రయోజనకరం. కానీ ఈ రెండు ఉద్యోగులకే పరిమితం. వృత్తులతో ఉన్నవారు, స్వయం ఉపాధితో జీవించే వారు, కార్మిక శాఖ వద్ద నమోదు కానీ చిన్న కంపెనీల్లో పని చేసేవారికి పీపీఎఫ్ ఒక్కటే అందుబాటులో ఉన్న ఆకర్షణీయమైన ఆప్షన్.  


More Articles