పీపీఎఫ్ ఇప్పటికీ ఆకర్షణీయమే!

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్)పై వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం 7.9 శాతానికి తగ్గించడంతో పొదుపు కోసం ఆ పథకాన్ని నమ్ముకున్న వారందరూ ఒక్కసారిగా కంగుతిన్నారు. 15 ఏళ్ల సుదీర్ఘ కాల వ్యవధితో వేతన జీవులు పన్ను నుంచి తప్పించుకుని అధిక రాబడులను అందుకునేందుకు ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉన్నది. 2017 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన తాజా వడ్డీ రేటు ప్రకారం చూస్తే... పీపీఎఫ్ లో ఇకపై పెట్టుబడులు లాభదాయకమేనా?, అసలు ఈ పథకంలో కొనసాగాలా లేక వైదొలగాలా? అన్న సందేహం చాలా మందిలో వచ్చేసింది. 

ప్రజా భవిష్య నిధి కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పథకం కనుక ఇందులో రాబడులకు నూరు శాతం హామీ ఉంటుంది. పథకం వ్యవధి 15 ఏళ్లు. కావాలంటే ఆ తర్వాత మరో ఐదేళ్లు పొడిగించుకోవచ్చు. రేపటి అవసరాల కోసం నిధిని సమకూర్చునేందుకు ఈ పథకం చక్కనిది. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వారి ఉన్నత విద్య కోసం, పిల్లల వివాహాల కోసం, భవిష్యత్తులో ఇల్లు కొనుక్కోవాలని అనుకునేవారు, పదవీ విరమణ అనంతరం జీవన అవసరాల కోసం నిధిని పోగేసుకోవడానికి ఈ పథకం అనువుగా ఉంటుందని చెప్పవచ్చు. 

ఎన్నో ప్రయోజనాలు...

ఈ పథకానికి ఉన్న పన్ను ప్రయోజనాలు, వడ్డీ రేటును బట్టి చూస్తే ఇతర పథకాల కంటే పీపీఎఫ్ ఇప్పటికీ ఆకర్షణీయమేనని నిపుణుల అభిప్రాయం. ఇందులో ప్రస్తుత వడ్డీ రేటు 7.9 శాతం. ప్రస్తుతం ద్రవ్యోల్బణం 4 శాతంగా ఉంది. 7.9 శాతం వడ్డీ రేటు నుంచి ద్రవ్యోల్బణం శాతాన్ని మినహాయిస్తే నాలుగు శాతం లాభం కనిపిస్తోంది. అదే బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ రేట్లు 7 శాతంగానే ఉంది. పన్ను తర్వాత ఆదాయం చూస్తే బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ 6 శాతం లోపే ఉంటుంది. ద్రవ్యోల్బణాన్ని కూడా తీసివేస్తే మిగిలేది పీపీఎఫ్ తో పోల్చుకుంటే స్వల్పమే.

దీర్ధకాలానికి చక్కని సాధనం...

ఎలా చూసుకున్న దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని రాబడిని ఇచ్చే సంప్రదాయ పథకాల్లో పీపీఎఫ్ ఒకటని నిపుణులు అంటున్నారు. పీపీఎఫ్ లో పెట్టే పెట్టుబడులకు, గడువు తీరిన తర్వాత వచ్చే రాబడులకు పూర్తిగా పన్ను మినహాయింపు ఉండడం ఆకర్షణీయం. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్ గా భావించే వారికి ఇటువంటి సంప్రదాయ పథకాలు మంచి ప్రత్యామ్నాయాలుగా నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే, స్టాక్ మార్కెట్లో నేరుగా, మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో సైతం పెట్టుబడులు పెట్టేవారు కూడా రిస్క్ ను తగ్గించుకునేందుకు, పెట్టుబడులను బ్యాలన్స్ చేసుకునేందుకు పీపీఎఫ్ వంటి పథకాలను పరిశీలించవచ్చని చెబుతున్నారు. 

PPF / EPF / VPF ... వీటిలో ఏది లాభదాయకం?


More Articles