ప్రవాస భారతీయులకు స్వదేశంలో బ్యాంకు ఖాతాలు... వాటి వివరాలు!
ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐ) స్వదేశంలో బ్యాంకు ఖాతా తెరిచే విషయంలో ఎన్నో సందేహాలు వస్తుంటాయి. అందుబాటులో ఉన్న రకరకాల ఖాతాల్లో ఏవి అనువైనవి, ఏవి ఎలా పనిచేస్తాయన్న విషయం తెలిస్తేనే గానీ ఆ గందరగోళానికి పుల్ స్టాప్ పడదు.
నాన్ రెసిడెంట్ ఎక్స్ టర్నల్ అకౌంట్ NRE
విదేశాల్లో ఆర్జించిన ఆదాయాన్ని స్వదేశానికి పంపుకోవాలనుకునే వారికి ఈ ఖాతా ఉపయోగకరంగా ఉంటుంది. ఒక ఏడాదిలో ఎంత మొత్తమైనా పంపుకోవచ్చు. ఇద్దరు ఎన్ఆర్ఐలు కలసి ఉమ్మడిగానూ ఖాతా తెరవచ్చు. విదేశీ కరెన్సీ రూపంలోనే జమ చేసుకుని భారతీయ కరెన్సీ రూపంలోనే డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి రాదు. ఈ ఖాతా నుంచి ఎన్ఆర్ఓ ఖాతాకు నగదు బదిలీ చేసుకోవచ్చు. బ్యాంకు ఖాతాలోని అసలు, వడ్డీ ఆదాయం మొత్తాన్ని కావాలంటే వెనక్కి తీసుకోవచ్చు. ఈ ఖాతా దారు విదేశాల్లో రుణాలు తీసుకోవచ్చు. భారత్ కు వచ్చినప్పుడు విదేశీ కరెన్సీని కూడా ఈ ఖాతాలో జమ చేసుకోవచ్చు.
ఈ ఖాతాలో నగదును ఒకసారి డిపాజిట్ చేస్తే ఆటోమేటిక్ గా భారత రూపాయిల్లోకి మారిపోతుంది. కనుక విదేశాల్లో తిరిగి తీసుకోవాల్సి వచ్చినప్పుడు నగదు మారకపు రేట్లలో తేడాల వల్ల కొంత నష్టపోవాల్సి ఉండడమే ఇందులోని ప్రతికూలత.
నాన్ రెసిడెంట్ ఆర్డినరీ రూపీ అకౌంట్ NRO
ఈ ఖాతాను వ్యక్తిగతంగాను, భారత్ లోని మరొక వ్యక్తితో కలసి ఉమ్మడిగాను ప్రారంభించవచ్చు. ఇన్ఫోసిస్ లో పనిచేసే సుబ్రహ్మణ్యానికి అమెరికాలో ప్రముఖ కంపెనీలో ఉద్యోగ అవకాశం లభించింది. ఎగిరి గంతేసి రెండు రోజుల్లోనే అమెరికా విమానం ఎక్కేశాడు. సుబ్రహ్మణ్యానికి హైదరాబాద్ మాదాపూర్ ఎస్ బీఐ శాఖలో ఖాతా ఉంది. ఇకపై అతడి ఖాతాను ఎన్ఆర్ఓ ఖాతాగా పరిగణిస్తారనమాట.
భారత్ లో ఏదేనీ ఆదాయ వనరులున్నవారు అంటే సొంత ఇంటికి వచ్చే అద్దెలు, వడ్డీలు, పెన్షన్ ఇలా ఏ రూపంలోనైనా స్వదేశంలో ఆదాయం ఉన్నవారికి ఈ ఖాతా ఉపయోగంగా ఉంటుంది. ఆ ఆదాయాన్ని ఈ ఖాతాలో జమ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎన్ఆర్ఈ ఖాతాల్లో భారతీయ కరెన్సీ డిపాజిట్ కు అవకాశం లేదు. ఈ ఖాతా ద్వారా డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. విదేశీ, భారత కరెన్సీ రెండు రూపాల్లోనూ జమ చేసుకోవచ్చు. భారత కరెన్సీ రూపంలోనే తీసుకోవాలి. ఈ ఖాతా నుంచి ఎన్ఆర్ఈ ఖాతాకు నగదు బదిలీకి అవకాశం లేదు. ఈ ఖాతా నుంచి విదేశాలకు అసలు, వడ్డీ ఆదాయం పూర్తిగా తరలించుకుపోవడానికి కూడా కుదరదు. ఒక ఏడాదిలో పది లక్షల డాలర్ల వరకే బదిలీకి అవకాశం ఉంది.
మార్చుకోకుంటే జరిమానా
ఎన్ఆర్ఈ, ఎన్ఆర్ఓ ఖాతాలను సేవింగ్స్, కరెంట్, రికరింగ్, ఫిక్స్ డ్ డిపాజిట్ ఖాతాల రూపంలో ప్రారంభించవచ్చు. కనీస నగదు నిల్వ ఉంచాలి. విదేశాల్లో ఉంటూ భారతీయ పౌరుడి హోదాలో బ్యాంకు ఖాతాను కొనసాగించడం నేరం. అందుకే ఉద్యోగ రీత్యా, లేదా స్థిర నివాసం కోసం విదేశాలకు వెళితే వెంటనే స్వదేశంలోని బ్యాంకు ఖాతాను ఎన్ఆర్ఓ ఖాతాగా మార్చుకోవాలి. లేదా ఖాతా మూసివేసుకోవడం నయం. లేదంటే భారీగా జరిమానాలు విధిస్తారు. 180 రోజులకు మించి విదేశాల్లో ఉండే వారికి ఈ నిబంధనలు వర్తిస్తాయి.
ఫారిన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ బ్యాంకు అకౌంట్ FCNR B
విదేశాల్లో ఉన్న భారతీయులు ఆ దేశ కరెన్సీ రూపంలోనే భారత్ లో డిపాజిట్ చేసి వడ్డీ గడించేందుకు ఈ ఖాతా ఉపయోగపడుతుంది. విదేశాల్లోని బ్యాంకు ఖాతా నుంచి నేరుగా ఎఫ్ సీఎన్ఆర్ ఖాతాకు నగదు బదిలీ చేసుకుని డిపాజిట్ చేసుకోవచ్చు. లేదా భారత్ వచ్చినప్పుడు విదేశీ కరెన్సీని డిపాజిట్ చేయవచ్చు. ఎన్ఆర్ఈ ఖాతాలో ఉన్న నగదును ట్రాన్స్ ఫర్ చేయవచ్చు. కనీసం ఏడాది నుంచి ఐదేళ్ల వరకు కాల పరిమితితో ఈ ఖాతాను ప్రారంభించుకోవచ్చు. డిపాజిట్ మొత్తాన్ని విదేశీ కరెన్సీ రూపంలోనే వెనక్కి తీసుకోవచ్చు. కరెన్సీ మారకపు రేట్లలో తేడా కారణంగా నష్టపోకుండా ఉండేందుకు విదేశీ కరెన్సీ రూపంలోనే డిపాజిట్ చేసుకోవడానికి ఈ ఖాతా వీలు కల్పిస్తుంది. ఈ ఖాతాలకు సంబంధించి రిజర్వ్ బ్యాంకు గైడ్ లైన్స్, తరచూ అడిగే సందేహాలకు సమాధానాల కోసం కింది వెబ్ లింకులు చూడవచ్చు.
https://rbi.org.in/SCRIPTs/BS_ViewMasCirculardetails.aspx?id=9885#
https://www.rbi.org.in/scripts/FAQView.aspx?Id=52