బ్యాంకుల్లో ఎన్ని రకాల ఖాతాలు…. ఒకరికి ఎన్ని ఉండచ్చు?

బ్యాంకుల్లో సేవింగ్స్, కరెంట్, డిపాజిట్ ఖాతాలు ఇలా చాలానే ఉన్నాయి. ప్రతీ వ్యక్తి తన అవసరాల మేరకు ఎన్ని ఖాతాలైనా కలిగి ఉండవచ్చు. కానీ ఈ ఖాతాల నిర్వహణకు సంబంధించిన నిబంధనలు వేర్వేరుగా ఉంటాయి. ఏ ఖాతా ఎలా పనిచేస్తుందో తెలుసుకుంటే తమకు ఏ ఖాతా అనువైనదో తెలుస్తుంది. అలాగే ఓ వ్యక్తికి వాస్తవంగా ఎన్ని ఖాతాలుంటే ప్రయోజనం…అన్నది కూడా తెలుసుకుందాం.

సేవింగ్స్ అకౌంట్

వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబం, స్వచ్చంద సంస్థలు మాత్రమే సేవింగ్స్ ఖాతా తెరిచేందుకు అనుమతి ఉంది. వ్యక్తిగతంగానూ లేదా మరొకరి భాగస్వామ్యంతోనూ కలసి ఖాతా తెరవచ్చు. స్వయంగా నిర్వహించేందుకు... లేదా తమ తరఫున మరొకరు నిర్వహించేందుకు పవర్ ఆఫ్ ఆటార్నీ ఇవ్వడానికి కూడా అనుమతి ఉంది. కనీస నగదు నిల్వను అన్ని వేళలా ఉంచాలి. ఆ మొత్తంపై వివిధ బ్యాంకులు 4 నుంచి 6 శాతం వరకు వడ్డీ చెల్లిస్తున్నాయి. ఖాతాతోపాటు ఏటీఎం కమ్ డెబిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాకింగ్, చెక్ బుక్ సదుపాయాలను బ్యాంకులు అందిస్తున్నాయి. అలాగే, ఖాతాతోపాటు బీమా, లాకర్ సౌకర్యాలను కూడా పొందవచ్చు. కనీస నిల్వ మొత్తాన్ని ఉంచడంలో విఫలమైతే బ్యాంకులు 30 రూపాయలు మొదలుకొని 750 రూపాయల వరకు జరిమానా విధిస్తున్నాయి.  ఎక్కువ మొత్తంలో నగదు నిల్వ ఉంచే కస్టమర్ల కోసం సేవింగ్స్ ఖాతాలనే భిన్న రకాల సౌకర్యాలతో రకరకాల పేర్లతోనూ బ్యాంకులు అందిస్తున్నాయి. ఈ ఖాతాదారులకు కోరినన్ని చెక్ బుక్ లు, ఉచిత డీడీలు, ఉచిత ఫోన్, ఇంటర్నెట్ బ్యాకింగ్, ఇంటి ముంగిటకే బ్యాకింగ్ ఇతరత్రా సదుపాయాలు కల్పిస్తున్నాయి. సేవింగ్స్ ఖాతాలను ఆటో స్వీప్, శాలరీ ఇలా వివిధ పేర్లతో బ్యాంకులు అందిస్తున్నాయి.

తాత్కాలిక అవసరాలకు మాత్రమే

సేవింగ్స్ ఖాతాల్లో తాత్కాలిక అవసరాల కోసమే నగదు ఉంచుకోవాలి. ఎక్కువ నగదు ఉంచుకోవడం సరైనది కాదు. ఎందుకంటే సేవింగ్స్ ఖాతాల్లోని నగదు నిల్వలపై వడ్డీ రేటు చాలా తక్కువగా ఉంది. ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తీసివేయగా మిగిలేది స్వల్పమే. అందుకే ఒక నెల రోజుల అవసరాలకు మించి నగదు ఉంచుకోవద్దు. 

ఆటో స్వీప్ అకౌంట్

సేవింగ్స్ ఖాతా ప్రయోజనాలతోపాటు నగదు నిల్వలను అధికంగా ఉంచుకునేవారు ఆటో స్వీప్ ఖాతాకు మారడం మంచిది. ఎందుకంటే కనీస నగదు నిల్వకు మించి ఉన్న మొత్తాన్ని బ్యాంకులు డిపాజిట్ గా మార్చి వాటిపై డిపాజిట్ వడ్డీని చెల్లిస్తాయి. దాంతో సేవింగ్స్ ఖాతా కంటే ఎక్కువ ప్రతిఫలాన్ని అందుకోవచ్చు. ఉదాహరణకు కనీస నిల్వ 10వేలుగా ఉంటే... ఖాతాలో నగదు 20వేలు ఉందనుకోండి. అప్పుడు అదనంగా ఉన్న 10వేల రూపాయలను బ్యాంకులు డిపాజిట్ గా మళ్లిస్తాయి. కొన్ని బ్యాంకులు మినిమమ్ బ్యాలన్స్ 10వేల పైన అదనంగా వెయ్యి రూపాయలు ఉన్నా దాన్ని ఒక డిపాజిట్ చొప్పున పరిగణిస్తుండగా... కొన్ని కనీసం 5వేలు, మరికొన్ని కనీసం 10వేల మొత్తాన్ని డిపాజిట్ కింద తీసుకుంటున్నాయి. 

అయితే, ఇందులోనూ బ్యాంకులను బట్టి నిబంధనలు వేర్వేరుగా ఉన్నాయి. కొన్ని కనీసం ఏడాది కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటుండగా కొన్ని ఒక్క రోజుకు కూడా వడ్డీ చెల్లిస్తున్నాయి. కొన్ని బ్యాంకులు నిర్ణీత కాలపరిమితి కంటే ముందే డిపాజిట్ లోని నగదును ఉపసంహరించుకుంటే సాధారణ సేవింగ్స్ బ్యాంకు ఖాతా వడ్డీ రేటునే అందిస్తున్నాయి. కొన్ని జరిమానా కూడా విధిస్తున్నాయి. కనుక ఆటో స్వీప్ ఖాతాకు మారే ముందు నిబంధనలు తెలుసుకోవాలి. 

వేతన ఖాతాలు

వేతన ఖాతాలు అంటే బ్యాంకులకు ఎంతో ఇష్టం. ఎందుకంటే ఖాతాల్లో నెల నెలా వేతనాలు జమ అవుతుంటాయి. ఎక్కువ మంది ఆ నగదును వెంటనే ఉపసంహరించుకోకుండా చాలా రోజులు అట్టే పెడతారు. అవసరాలకు కావాల్సినంతే ఉపసంహరించుకుంటారు. బ్యాంకులకు ఇదే ప్రయోజనం. నిజానికి వేతన ఖాతాల్లో కనీస నగదు నిల్వలు ఉంచాల్సిన పనిలేదు. జీరో బ్యాలన్స్ ఖాతాలు అవి. వేతన ఖాతాలను ఎవరికివారు వ్యక్తిగతంగా తీసుకునేందుకు అవకాశం లేదు. కంపెనీలు, సంస్థలే బ్యాంకులతో ఒప్పందం చేసుకుని తమ ఖాతాదారుల పేరిట ఖాతాలను తెరుస్తుంటాయి. ఈ ఖాతాలకు బోలెడన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతీ బ్యాంకు కూడా వేతన ఖాతాల్లోనే ప్రీమియం, ప్రయారిటీ, శాలరీ, శాలరీ ప్లస్, ప్లాటినం ఇలా రకరకాల పేర్లతో వివిధ అదనపు ప్రయోజనాలతో అందిస్తున్నాయి. 

ఉదాహరణకు ప్రైవేటు రంగంలో ప్రముఖ బ్యాంకు హెచ్ డీఎఫ్ సీ రెగ్యులర్ శాలరీ అకౌంట్, క్లాసిక్ శాలరీ అకౌంట్, ప్రీమియం శాలరీ అకౌంట్ ఇలా పలు రకాలను అందిస్తోంది. ఇవన్నీ జీరో బ్యాలన్స్ ఖాతాలే. డెబిట్ కార్డుతో షాపింగ్ చేస్తే ప్రతి వంద రూపాయలకు ఒక రూపాయిని వెనక్కి ఇస్తుంది. ఉచిత వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజీ, కుటుంబ సభ్యుల్లో ఒకరికి జీరో బ్యాలన్స్ ఖాతాను ఆఫర్ చేస్తోంది. స్వంత ఏటీఎంలు, ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో ఉచిత నగదు లావాదేవీలు, ఏటీఎంల నుంచి ఒక రోజులో 50 వేల నుంచి 75 వేల వరకు నగదు ఉపసంహరణ (ప్రభుత్వ బ్యాంకుల్లో అయితే ఇది 30వేల రూపాయలే ఉంది), షాపింగ్ అయితే ఒక రోజులో డెబిట్ కార్డు ద్వారా 1.75 లక్షల రూపాయల వరకు ఖర్చు చేసుకునే వెసులుబాటు ఉంది. ఈ సదుపాయాలు, నిబంధనలు మారుతూ ఉంటాయి. పూర్తి వివరాలకు http://www.hdfcbank.com/ లింక్ చూడవచ్చు. యెస్ బ్యాంకు కూడా స్మార్ట్ శాలరీ అడ్వాంటేజ్, స్మార్ట్ శాలరీ ఎక్స్ క్లూజివ్, స్మార్ట్ శాలరీ ప్లాటినం ఖాతాలను అందిస్తోంది. వీటి ప్రయోజనాలు తెలుసుకోవాలంటే https://www.yesbank.in/ లింక్ చూడవచ్చు. సాధారణంగా జీరో బ్యాలన్స్, ఉచిత ఏటీఎం, డెబిట్ కార్డు (వార్షిక చార్జీలు లేకుండా), మల్టి సిటీ చెక్, ఓవర్ డ్రాప్ట్ (అంటే అవసరమైన సందర్భాల్లో నెల వేతనానికి  ఒకటి నుంచి ఐదు రెట్ల వరకు నగదును డ్రా చేసుకోవచ్చు), నెలనెలా ఈ మెయిల్ కు ఖాతా స్టేట్ మెంట్, ఉచిత ఎస్ఎంఎస్ అలర్ట్స్, ఇంటికే వచ్చి చెక్ తీసుకోవడం, చెక్, డీడీ ఇవ్వడం ఇలా ఎన్నో సౌకర్యాలను బ్యాంకులు ఆఫర్ చేస్తున్నాయి. 

కరెంట్ ఖాతా

వ్యాపారస్తులు, రోజువారీ నగదు లావాదేవీలు నిర్వహించే వారికి కరెంటు ఖాతాలు అనువుగా ఉంటాయి. నగదు డిపాజిట్, ఉపసంహరణకు పరిమితి ఉండదు. ఎంత మొత్తమైనా డిపాజిట్ చేయడంతోపాటు డ్రా చేసుకోవచ్చు. చెక్ బుక్ ల విషయంలో కొన్ని బ్యాంకులు ఇన్ని మాత్రమే ఉచితం అంటూ ఆ పై తీసుకునే వాటికి చార్జీ విధిస్తున్నాయి. వీటిలో ఉన్న మరో ప్రయోజనం రోజువారీ లావాదేవీలు, ఆయా ఖాతాదారుడి చరిత్ర ఆధారంగా బ్యాంకులు ఓడీ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. అంటే ఖాతాలో బ్యాలన్స్ కు మించి అదనంగా డ్రా చేసుకోవచ్చు. ఈ ఖాతాల్లో 5 వేల నుంచి 25వేల రూపాయల వరకు నగదు నిల్వలు ఉంచడం తప్పనిసరి. దీనిపై బ్యాంకులు వడ్డీ చెల్లించవు.

ఓడీ అన్ డిపాజిట్

బ్యాంకులో మీకు ఓ 20వేల డిపాజిట్ ఉందనుకోండి. ఆ డిపాజిట్ పత్రాన్ని బీరువాలో భద్రంగా ఉంచారు. ఇంట్లో ఏదో అత్యవసర సందర్భం ఎదురై నగదు అవసరం ఏర్పడింది. ఎక్కడా అప్పు పుట్టలేదు. అప్పుడు బీరువాలో దాచి ఉంచిన డిపాజిట్ పత్రం ఎంతో ఉపయోగపడుతుంది. దాన్ని తీసుకుని జారీ చేసిన బ్యాంకు శాఖకు వెళ్లి ఓడీ అకౌండ్ ఓపెన్ చేసుకుంటే… 20వేల డిపాజిట్ పత్రాన్ని హామీగా ఉంచుకుని అందులో 75 నుంచి 90 శాతం వరకు రుణమిస్తారు. అంటే 15 వేల నుంచి 18 వేల రూపాయల వరకు రుణం లభిస్తుంది. రుణంపై వడ్డీ డిపాజిట్ పై చెల్లిస్తున్న వడ్డీకి అదనంగా ఒకటి లేదా రెండు శాతం విధిస్తారు. మళ్లీ చేతికి డబ్బులు అందిన వెంటనే తీసుకెళ్లి ఓడీ ఖాతాలో జమ చేసుకోవచ్చు. మళ్లీ అవసరమైనప్పుడు ఓడీ తీసుకోవచ్చు. ఒకవేళ తీసుకుని చెల్లించలేకపోతే నిర్ణీత కాల వ్యవధి తర్వాత డిపాజిట్ ను రద్ధు చేసి రుణం కింద జమ చేసుకుంటారు. ఓడీ ఖాతాలకు కూడా చెక్ బుక్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు పొందవచ్చు. అవసరం ఉంటే డిపాజిట్ రద్దు చేసుకుంటే సరిపోతుంది కదా అన్న సందేహం రావచ్చు. నిజమే. కానీ డిపాజిట్ రద్దు చేసుకుంటే పొదుపు ఖర్చయిపోతుంది. దానికి బదులు దానిపై రుణం తీసుకుంటే తిరిగి చెల్లించాలని గుర్తుంటుంది. ఏవో విధంగా తిరిగి దాన్ని చెల్లించేలా చూస్తారు. 

జాయింట్ అకౌంట్స్

ఐదర్ ఆర్ సర్వైవర్: ఉమ్మడి ఖాతాలలో చాలా రకాలు ఉన్నాయి. అందులో ఇదొకటి. ఇది సాధారణ జాయింట్ అకౌంట్. ఇద్దరు వ్యక్తులు దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. ఇద్దరూ వేర్వేరు నామినీలను సూచించవచ్చు. ఎవరైనా మరణిస్తే నామినీకి చెల్లించాల్సినది చెల్లిస్తారు. ఇద్దరిలో మిగిలిన వ్యక్తి ఖాతాను కొనసాగించుకోవచ్చు. 

ఎనీవన్ ఆర్ సర్వైవర్: పై ఖాతా వలే ఇది కూడా. కాకపోతే ఇక్కడ ఇద్దరికంటే ఎక్కువ మంది ఖాతాను ఆపరేట్ చేయవచ్చు. భార్య, తల్లీ తండ్రి కూడా తన ఖాతాను ఆపరేట్ చేసుకోవాలంటే ఈ ఖాతా తీసుకోవచ్చు. ఖాతాదారుల్లో ఒకరు మరణించినా మిగిలిన వారు అదే ఖాతాను నిక్షేపంగా కొనసాగించుకోవచ్చు. 

ఫార్మర్ ఆర్ సర్వైవర్: ఈ ఖాతాలో మొదటి ఖాతాదారుడు మాత్రమే ఖాతాను నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటుంది. మొదటి ఖాతాదారుడు మరణించిన సందర్భాల్లోనే రెండో ఖాతాదారుడు ఖాతాను కొనసాగించుకోవచ్చు. 

లేటర్ లేదా సర్వైవర్: ఈ ఖాతాను ఉమ్మడి ఖాతాదారుల్లో రెండో ఖాతాదారుడు మాత్రమే నిర్వహించడానికి అనుమతి ఉంటుంది. రెండో ఖాతాదారుడు మరణించిన సందర్భాల్లోనే మొదటి ఖాతాదారుడు ఆపరేట్ చేయడానికి అవకాశం వస్తుంది. 

జాయింట్లీ: ఏ లావాదేవీ అయినా ఈ ఖాతాలో ఇద్దరు ఖాతాదారుల సమ్మతి ఉండాలి. ఇద్దరిలో ఒకరు మరణిస్తే రెండో వారు ఖాతా కొనసాగించడానికి అవకాశం ఉండదు. నగదు నిల్వలు ఉంటే మిగిలిన ఖాతాదారుడికి చెల్లించేస్తారు. 

జాయింట్లీ ఆర్ సర్వైవర్: ఇందులో ఇద్దరు ఖాతాదారులు కలసి ఖాతాను నిర్వహించుకోవచ్చు. ఒకరు మరణిస్తే రెండో వ్యక్తి తన పేరు మీదకు మార్చుకోవచ్చు. జాయింట్ అకౌంట్లలో ఉమ్మడి ఖాతాదారుల్లో ఒకరిని తొలగించడం, మరొకరిని యాడ్ చేసుకోవడానికి వీలుంటుంది. కాకపోతే అందుకు ఉమ్మడి ఖాతాదారులు అంగీకరించాలి. 

మైనర్ ఖాతాలు

బ్యాంకుల్లో మైనర్ల పేరిట కూడా పలు రకాల ఖాతాలు నిర్వహించుకోవచ్చు. పదేళ్లు నిండే వరకు తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకుడు ఖాతా ఆపరేట్ చేయడానికి అనుమతి ఉంటుంది. పదేళ్లు దాటిన వారు స్వతంత్రంగా ఖాతా నిర్వహించుకోవచ్చు. కానీ లావాదేవీల విషయంలో పరిమితులు ఉన్నాయి. 18 ఏళ్లు వచ్చిన తర్వాత ఆ ఖాతాను తాను కొనసాగిస్తానని మైనారిటీ తీరిన వ్యక్తి స్పష్టం చేసే వరకూ అందులో లావాదేవీలను అనుమతించరు. 

సీనియర్ సిటిజన్స్ అకౌంట్స్

సేవింగ్స్, ఇతర ఖాతాల నిబంధనలు వృద్ధులకు కూడా సమానమే. కాకపోతే డిపాజిట్లపై వీరికి 0.5 శాతం నుంచి 0.75 శాతం వరకు అదనంగా వడ్డీ చెల్లిస్తున్నాయి బ్యాంకులు. దీనికి తోడు సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ ఖాతాను కేంద్ర ప్రభుత్వం తాజాగా బ్యాంకుల్లోనూ ఓపెన్ చేసుకునేందుకు అనుమతించింది. 

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (పెద్దల పొదుపు పథకం)

ఇది డిపాజిట్ పథకం. ఇప్పటి వరకు పోస్టాఫీసుల్లోనే అందుబాటులో ఉంది. 2016-17 కేంద్ర బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రి ఈ సదుపాయాన్ని బ్యాంకులకు కూడా విస్తరించారు. ఈ పథకం కింద డిపాజిట్ పై 8.4శాతం వడ్డీని ప్రతి మూడు నెలలకు చెల్లిస్తారు. దీనికి  ఆదాయపన్ను పూర్తిగా మినహాయింపు ఉంది. 60 ఏళ్లు నిండిన వారు అర్హులు. ముందస్తు పదవీ విరమణ చేస్తే 55 ఏళ్లకు కూడా ఇందులో చేరవచ్చు. జీవిత భాగస్వామితో కలసి ప్రారంభించవచ్చు. కాకపోతే మొదటి ఖాతాదారుడు సీనియర్ సిటిజన్ అయి ఉంటే చాలు. కనీసం వెయ్యి రూపాయలు గరిష్ఠం 15 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. హిందూ అవిభాజ్య కుటుంబం, ఎన్ఆర్ఐలకు ఈ పథకంలో చేరేందుకు అవకాశం లేదు. పథకం గడువు ఐదేళ్లు. తర్వాత మూడేళ్లు పొడిగించుకోవచ్చు. 

రికరింగ్ డిపాజిట్

నెలనెలా క్రమం తప్పకుండా కనీస మొత్తాన్ని పొదుపు చేసుకుంటూ దానిపై వడ్డీ గడించే ఖాతా ఇది. అన్ని బ్యాంకులు, పోస్టాఫీసులు అందిస్తున్నాయి. పోస్టాఫీసు కంటే బ్యాంకుల్లో ఆర్డీ ఖాతాలే అదనపు ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. 100 రూపాయల నుంచి కూడా నెల నెలా ఆర్డీలో పొదుపు చేసుకోవచ్చు. కనీస మొత్తం అనేది బ్యాంకులను బట్టి మారుతూ ఉంటుంది. ఆరు నెలల నుంచి పదేళ్ల వరకు గడువు ఎంపిక చేసుకోవచ్చు. బ్యాంకుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీయే ఆర్డీకి కూడా వర్తిస్తుంది. ఐదేళ్లకు ఆర్డీ ఓపెన్ చేస్తే డిపాజిట్లపై ఐదేళ్ల కాలానికి బ్యాంకులు ఆఫర్ చేస్తున్న వడ్డీ రేటే ఆర్డీ ఖాతాకు కూడా అమలవుతుంది. అధిక శాతం బ్యాంకులు మూడు నెలలకోసారి వడ్డీని లెక్కించి (క్వార్టర్లీ కాంపౌండెడ్) అసలుకు కలుపుతున్నాయి. సీనియర్ సిటిజన్లు అరశాతం ఎక్కువ వడ్డీని పొందవచ్చు. 

గడవుకు ముందుగా నగదు ఉపసంహరణకు అవకాశం కల్పించినా... కొంత మొత్తాన్ని కోత కోసుకుంటాయి బ్యాంకులు. అయితే, కొన్ని బ్యాంకులు ఆర్డీ ఖాతాలో జమైన మొత్తంపై ఏడాది తర్వాత నుంచి ఓడీ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. ఉదాహరణకు ఒక ఏడాదిలో 24 వేలు జమ అయితే, దానిపై 80 నుంచి 90 శాతం అంటే సుమారు 20వేల రూపాయలను అత్యవసరాలలో డ్రా చేసుకోవచ్చు. దీన్ని తిరిగి చెల్లించాలి. వడ్డీ రేటు డిపాజిట్ రేటుపై అదనంగా ఒకటి నుంచి రెండు శాతం ఉంటుంది. వ్యక్తులు, మైనర్ల పేరిట ఆర్డీ ఖాతాలు తెరుచుకోవచ్చు. ప్రవాస భారతీయులు కూడా వీటిని తెరవచ్చు. కొన్ని బ్యాంకులు వడ్డీ ఆదాయంపై టీడీఎస్ ను అమలు చేస్తుండగా... కొన్ని టీడీఎస్ నుంచి మినహాయింపు ఇస్తున్నాయి. అంటే బ్యాంకులు వడ్డీలోంచి టీడీఎస్ ను మినహాయించవు. వ్యక్తులు వారి వారి ఆదాయంలో దీన్ని చూపించి పన్ను వర్తించే ఆదాయం ఉంటే కట్టాల్సి ఉంటుంది. 

ఫ్లెక్సీ రికరింగ్ డిపాజిట్ 

పేరులో ఉన్నట్టే సాధారణ ఆర్డీ ఖాతాకు అదనపు సౌకర్యాలతో కూడినదే ఫ్లెక్సీ ఆర్డీ ఖాతా. ఉదాహరణకు ఓ వెయ్యి రూపాయల మొత్తంతో పదేళ్ల కాలానికి ఫ్లెక్సీ ఆర్డీ ఓపెన్ చేస్తే నెలనెలా నిర్ణీత తేదీలోపే వెయ్యి రూపాయలు డిపాజిట్ చేస్తూ వెళ్లాలి. ఎప్పుడైనా అదనంగా మీ దగ్గర నగదు ఉన్నా... బోనస్ వచ్చినా ఆ మొత్తాన్ని ఫ్లెక్సీ ఆర్డీలో జమ చేసుకోవచ్చు. జమ చేసే రోజున ఉన్న వడ్డీ రేటు ఆ మొత్తానికి అమలవుతుంది. అసలు వెయ్యి రూపాయలకు వడ్డీ రేటు మాత్రం ఖాతా తెరచిన రోజు ఉన్నరేటే అమలవుతుంది. కొన్ని బ్యాంకులు గడువుకు ముందే ఫ్లెక్సీ ఆర్డీ ఖాతాలను క్లోజ్ చేసినా పెనాల్టీ విధించడం లేదు. పోటీకొద్దీ బ్యాంకులు ఇలా కొన్ని ఆఫర్లు ఇస్తున్నాయి. 

ఒకటి లేదా రెండు

సాధారణంగా రెండు బ్యాంకు ఖాతాలకు మించి ఉంటే ఉపయోగం లేదని నిపుణులు చెబుతుంటారు. ఖాతాలు ఎక్కువైనకొద్దీ వాటి లావాదేవీలను పరిశీలించుకునే సమయం ఉండదు. అన్నింటికీ డెబిట్ కార్డులు, వాటిపై వార్షిక చార్జీల భారం ఉంటుంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్ వర్డులు, యూజర్ నేమ్స్ ఇవన్నీ గుర్తించుకోవడం కూడా తలనొప్పే. జీరో బ్యాలన్స్ అయితే ఫర్వాలేదు, అలా కాకుండా అన్నీ మినిమమ్ బ్యాలన్స్ ఉంచాల్సిన ఖాతాలు అయితే వడ్డీ దండగే కదా. దీనికంటే వేతనానికి ఒకటి. నగదు చెల్లింపులన్నింటికీ ఒక ఖాతా ఉండడం సౌకర్యమని నిపుణుల సూచన. శాలరీ పడిన వెంటనే ఆ మొత్తాన్ని వేరే ఖాతాకు మార్చి ఖర్చులన్నీ దాన్నుంచి చేయడం వల్ల లావాదేవీలపై స్పష్టత ఉంటుంది. ఆదాయపన్ను శాఖ కళ్లు గప్పేందుకు చాలా ఖాతాలు నిర్వహించడం ప్రస్తుత రోజుల్లో తెలివైన నిర్ణయం కాదు. ఎందుకంటే అన్నిబ్యాంకులు ఖాతాదారుల నుంచి పాన్ నంబర్ తీసుకుంటున్నాయి. ఒక పాన్ నంబర్ తో ఎక్కడ ఏమున్నా ఐటీ వాళ్లు సులువుగా తెలుసుకోగలరు. 

బ్యాంకులు ప్రవాస భారతీయుల కోసం కూడా పలు రకాల ఖాతాలను అందిస్తున్నాయి.  ఎన్ఆర్ఐ ఖాతాల గురించి ఇక్కడే మరో ప్రత్యేక ఆర్టికల్ లో తెలుసుకుందాం. 

Read : ప్రవాస భారతీయులకు బ్యాంకు ఖాతాలు


More Articles