సిలికాన్ వ్యాలీలో మెరిసిన భారత ఆణిముత్యం...సబీర్ భాటియా!

ఈ-మెయిల్... ఎస్ఎంఎస్ హవాతో కాస్త జోరు తగ్గింది కాని.., నేటికీ ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఇదే కీలక సమాచార సాధనం. ఈ-మెయిల్ తెలిసిన వారికి హాట్ మెయిల్ చిరపరిచితమే. అత్యధిక సంఖ్యలో నెటిజన్లు వినియోగిస్తున్న సమాచార సాధనం అదే. జీమెయిల్ వచ్చిన తర్వాత రెండో స్థానానికి పడిపోయింది కాని, నేటికీ తన హవాను చాటుతూనే ఉంది. దీని సృష్టికర్త భరత మాత ముద్దుబిడ్డ సబీర్ భాటియా. ప్రపంచ సాఫ్ట్ వేర్ రంగానికి తలమానికంగా నిలిచిన సిలికాన్ వ్యాలీలో అప్పటిదాకా సత్తా చాటిన భారతీయుడు లేరు. సబీర్ భాటియా ఆ ఘనతను సాధించడంతో పాటు సిలికాన్ వ్యాలీ మొత్తాన్నే ఆశ్చర్యానికి గురి చేశారు. రెండేళ్ల వయసున్న కంపెనీని అపర కుబేరుడి అభ్యర్థనతో మైక్రోసాఫ్ట్ కు విక్రయించేసి రాత్రికి రాత్రి తను కుబేరుడైపోయారు. అప్పటికి అతడి వయసు నిండా ముప్పై కూడా దాటలేదు. 19 ఏళ్లకే అమెరికాలో అడుగుపెట్టిన భాటియా, ఆ తర్వాత పదేళ్లకే అమెరికాకు భారత మేధస్సు సత్తా రుచి చూపారు.

3 లక్షల డాలర్లతో హాట్ మెయిల్ ప్రారంభం

ఆపిల్ కంప్యూటర్స్ లో సహోద్యోగి, మిత్రుడు జాక్ స్మిత్ తో కలిసి సబీర్ భాటియా 1996 జూలై 4న హాట్ మెయిల్ ను ప్రారంభించారు. ఇందుకోసం మిత్రులిద్దరూ కేవలం 3 లక్షల డాలర్లను పెట్టుబడిగా పెట్టారు. ఆరంభంతోనే హాట్ మెయిల్ భాటియాను ఒక్కసారిగా ఆకాశానికెత్తేసింది. అసలు అంత స్వల్ప వ్యవధిలో హాట్ మెయిల్ అంత ప్రాచుర్యం పొందుతుందని భాటియా కూడా అనుకోలేదు. ప్రారంభించిన రెండేళ్లలోనే 50 మిలియన్ల నెటిజన్లను రిజిష్టర్ చేసుకుంది. దీంతో సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ దృష్టిని ఆకర్షించింది. ఊహించని వేగంతో దూసుకెళుతున్న హాట్ మెయిల్ ను చేజిక్కించుకునేందుకు మైక్రోసాఫ్ట్ రంగంలోకి దిగింది. అయితే ప్రారంభించి అప్పటికి రెండేళ్లే అవుతున్న క్రమంలో హాట్ మెయిల్ ను వదులుకునేందుకు భాటియా అంత త్వరగా ఒప్పుకోలేదు. అయితే హాట్ మెయిల్ టేకోవర్ కోసం భారీ మొత్తాన్ని ఆఫర్ చేసిన బిల్ గేట్స్, భాటియాను కూడా మైక్రోసాఫ్ట్ లోకి ఆహ్వానించారు.

ఉద్యోగం అంటే.. భాటియాకు నచ్చదు!

నిజమే. వేరే ఎవరో స్థాపించిన కంపెనీలో ఉద్యోగిగా, వేల మందిలో ఒకడిగా ఉండేందుకు భాటియా ఇష్టపడలేదు. ఈ నైజమే భాటియాను ఏడాది తిరక్కముందే మైక్రోసాఫ్ట్ నుంచి వెలుపలికి వచ్చేలా చేసింది. హాట్ మెయిల్ ప్రారంభానికి ముందు కూడా భాటియా ఈ తరహా వ్యవహార సరళినే అవలంభించారు. స్టాన్ ఫోర్డ్ వర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ లో మాస్టర్ డిగ్రీని పూర్తి చేసిన తర్వాత ఆపిల్ కంప్యూటర్స్ లో హార్డ్ వేర్ ఇంజినీర్ గా భాటియా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. అక్కడే జాక్ స్మిత్ తో స్నేహం కుదిరింది. అక్కడ ఎంతోకాలం కుదురుకోలేకపోయారు. అంతే, అక్కడి నుంచి బయటకు వచ్చేసి మరో కంపెనీ ఫైర్ పవర్ సిస్టమ్స్ ఇంక్  లో ఉద్యోగంలో చేరారు. అక్కడ పనిచేస్తున్న సమయంలోనే వెబ్ బ్రౌజర్ ద్వారా ఇంటర్నెట్ లోని ఏ తరహా సాఫ్ట్ వేర్ లోకి అయినా వెళ్లగలిగే తన నైపుణ్యాన్ని అవగతం చేసుకున్నారు. అంతే, హాట్ మెయిల్ ఏర్పాటుకు సంబంధించిన ప్రణాళికలు అతడి మదిలో రూపొందాయి.

400 మిలియన్ డాలర్లకు హాట్ మెయిల్ విక్రయం

అది 1998 నాటి మాట. అప్పటికి ఈ-మెయిల్ ప్రొవైడర్లలో హాట్ మెయిల్ ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంది. హాట్ మెయిల్ ను వినియోగిస్తున్న నెటిజన్ల సంఖ్య 50 మిలియన్లకు పైగానే ఉంది. రోజురోజుకు హాట్ మెయిల్ యూజర్ల సంఖ్య కూడా శరవేగంగా పెరుగుతూ పోతోంది. ఈ వృద్ధిని బిల్ గేట్స్ బాగానే అంచనా వేశారు. వెంటనే భాటియా ముందు టేకోవర్ ప్రతిపాదన పెట్టారు. 3 లక్షల డాలర్లతో పెట్టిన హాట్ మెయిల్ కు 400 మిలియన్ డాలర్లను ఇస్తానంటూ భారీ ఆఫర్ ను ప్రకటించారు. అంతేకాక భాటియా మిత్రులను కూడా మైక్రోసాఫ్ట్ లోకి ఆహ్వానించారు. భారీ ఆపర్ తలుపుతట్టడంతో అన్యమనస్కంగానే భాటియా... బిల్ గేట్స్ ప్రతిపాదనకు సరేనన్నారు. అంతే, భాటియా చేతిలో రూపుదిద్దుకున్న హాట్ మెయిల్ మైక్రోసాఫ్ట్ పరమైపోయింది. భాటియా మైక్రోసాఫ్ట్ ఉద్యోగిగా మారిపోయారు. దీనిని జీర్ణించుకోలేకే ఏడాది కూడా గడవకముందే 1999లో మైక్రోసాఫ్ట్ నుంచి భాటియా బయటకు వచ్చేశారు.

భాటియా విద్యాభ్యాసం విభిన్నం!

పుణే, బెంగళూరుల్లో ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యాభ్యాసం ముగించిన సబీర్ భాటియా, 1988లో ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లారు. రాజస్థాన్ లోని ప్రతిష్టాత్మక బిట్స్ పిలానీలో విద్యనభ్యసిస్తున్న క్రమంలోనే అమెరికాలోని కాలిఫోర్నియా వర్సిటీలో సీటు సాధించారు. అది కూడా బదిలీ పద్ధతిన విదేశీ విద్యాభ్యాసం అవకాశాన్ని చేజిక్కించుకున్నారు. 1988లో ఇలా విదేశాలకు బదిలీ పద్ధతిన విద్యాభ్యాసం కోసం ప్రపంచంలో దరఖాస్తు చేసుకున్నది ఒక్క భాటియానే కావడం గమనార్హం. అంటే విద్యార్ధి దశలోనే భాటియా విభిన్న శైలి ఆలోచనలతో అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. ఆ తర్వాత అమెరికాలోనే తిష్ట వేసిన భాటియా ప్రతిష్టాత్మక స్టాన్ ఫోర్డ్ వర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. తదనంతరం పీహెచ్ డీలోనూ చేరిన భాటియా, దానిని మాత్రం మధ్యలోనే వదిలేశారు. విద్యాభ్యాసానికి ఫుల్ స్టాప్ పెట్టిన భాటియా వెనువెంటనే సిలికాన్ వ్యాలీ చేరి ఆపిల్ కంప్యూటర్స్ లో ఇంజినీర్ గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు.

తండ్రి సైనికుడు...తల్లి బ్యాంకు ఉద్యోగి

సాఫ్ట్ వేర్ రంగంలో విశ్వ విఖ్యాతి గాంచిన సబీర్ భాటియా 1968 డిసెంబర్ 30న ఛండీఘడ్ లో జన్మించారు. భాటియా తండ్రి మాజీ సైనికాధికారి. 10 ఏళ్ల పాటు భారత సైన్యంలో కెప్టెన్ ర్యాంకులో సేవలందించిన తర్వాత రిటైరయ్యారు. ఆ తర్వాత పలు ప్రభుత్వ రంగ సంస్థల్లో మేనేజర్ స్థాయిలో విధులు నిర్వర్తించారు. భాటియా తల్లి తన కెరీర్ మొత్తాన్ని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కొనసాగించారు. భారత సైనిక నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన కారణంగా, భాటియాలో అతినీతి పట్ల ఏహ్యాభావం ఏర్పడింది. భారత్ లో కంపెనీ పెట్టాలంటే పెట్టుబడి కంటే... ప్రభుత్వం, రాజకీయ నేతలకే అధిక మొత్తాలను ముడుపులుగా ముట్టజెప్పాల్సి వచ్చేదని భాటియా తన మిత్రులతో చెబుతూ ఉంటారు. 

హాట్ మెయిల్ తర్వాతా... పారిశ్రామిక వేత్తగానే!

హట్ మెయిల్ ను బిల్ గేట్స్ కు విక్రయించిన తర్వాత సబీర్ భాటియా, ఉద్యోగిగా ఉండలేకపోయారు. అతికష్టం మీద ఏడాది పాటు మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగిగా కొనసాగినా, అక్కడ ఇమడలేకపోయారు. అంతే, కాలు బయటపెట్టిన భాటియా మళ్లీ తన బుర్రకు పదును పెట్టారు. మేధావుల కలయికతో ప్రపంచంలోనే అతిపెద్ద నెట్ వర్క్ ఆవిష్కరణ కోసం ‘‘ఆర్జూ.కామ్’’ను ప్రారంభించారు. అయితే ఈ ప్రయత్నం భాటియాకు కలిసి రాలేదు. డాట్ కామ్ బుడగ పేలడం కూడా భాటియా యత్నాన్ని విఫలం చేసిందనే చెప్పాలి. 1999లో ప్రారంభించిన ఈ సైట్ ను కొంత కాలం పాటు నిలిపేసినా, తిరిగి 2006లో ట్రావెల్ పోర్టల్ గా మార్చి తిరిగి అదే పేరుతో ప్రారంభించారు. ఇదే క్రమంలో జాక్స్టర్ పేరిట ఉచిత ఎస్ఎంఎస్ లంటూ భాటియా చేసిన యత్నం కూడా బెడిసికొట్టింది. తాజాగా ఆయన ఈ-మెయిల్ ఆధారిత సాఫ్ట్ వేర్ రంగంలో కార్యకలాపాలు సాగిస్తున్న సీసీజెన్ లో పెట్టుబడులు పెట్టారు.


More Articles