పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలా? ... ఇదిగో పద్ధతి!

పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్స్ వస్తే ఒక వ్యక్తి మోటారు వాహనాలు నడిపేందుకు అర్హత సాధించినట్టే. లెర్నర్స్ లైసెన్స్ అనేది మోటారు వాహనం నేర్చుకునేందుకు అనుమతి మాత్రమే. కనుక లెర్నర్స్ లైసెన్స్ తీసుకున్న ప్రతి ఒక్కరూ నెల రోజుల తర్వాత నుంచి ఆరు నెలలలోపు పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్స్ కు దరఖాస్తు చేసుకుని నిర్ణీత పరీక్ష పాసవ్వాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియ గురించి తెలుసుకుందాం. 

డ్రైవింగ్ లైసెన్స్ (డీఎల్) లో వాణిజ్య, వాణిజ్యేతర అని రెండు రకాలు ఉంటాయి. వ్యక్తిగత వాహనాలను నడిపేందుకు మాత్రమే తీసుకునేది నాన్ కమర్షియల్ డీఎల్, వాణిజ్య వాహనాలు నడిపేందుకు తీసుకునేది కమర్షియల్ డీఎల్. పర్మినెంట్ కమర్షియల్ డీఎల్ తీసుకోవాలంటే అప్పటికే సాధారణ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుని రెండు సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం కలిగి ఉండాలి. 20 ఏళ్లు నిండిన వారికి మాత్రమే దీన్ని జారీ చేస్తారు. 

నాన్ కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ కు లెర్నర్స్ లైసెన్స్ తీసుకుని 30 రోజులు దాటి ఉండాలి. వయసు 18 ఏళ్లు నిండి ఉండాలి. నాన్ కమర్షియల్ లైసెన్స్ లను 20 ఏళ్ల కాల పరిమితితో జారీ చేస్తారు. జారీ చేసిన తర్వాత 20 ఏళ్లు లేదా కార్డు దారుడి వయసు 50 ఏళ్ల వరకు అమల్లో ఉంటుంది. ఉదాహరణకు 20 ఏళ్ల వ్యక్తి లైసెన్స్ తీసుకుంటే 40 ఏళ్లు వచ్చే వరకు అమల్లో ఉంటుంది. అదే 35 ఏళ్ల వ్యక్తి తీసుకుంటే 15 ఏళ్ల పాటే అమల్లో ఉంటుంది. ఆ తర్వాత ప్రతి ఐదేళ్లకోసారి రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి. కమర్షియల్ లైసెన్స్ ను మూడేళ్ల కాల పరిమితితో జారీ చేస్తారు. 

ఆన్ లైన్… ఆఫ్ లైన్

రవాణా శాఖ కార్యాలయానికి నేరుగా వెళ్లి పర్మినెంట్ డీఎల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా ఆన్ లైన్ లో ముందుగా మీకంటూ ఫలానా తేదీన ఫలానా సమయాన్ని బుక్ చేసుకుని... ఆ సమయానికి వెళ్లి పరీక్షలో పాల్గొనవచ్చు. 

https://aptransport.in/apcfstonline/ 

https://aptransport.in/tgcfstonline/ ఏపీ అభ్యర్థులు అయితే, మొదటి లింక్ ద్వారా...  తెలంగాణ అభ్యర్థులు అయితే రెండో లింక్ ద్వారా రవాణా శాఖ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. పేజీ పైభాగంలో ఎడమచేతి వైపు లైసెన్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేస్తే డ్రైవింగ్ టెస్ట్ స్లాట్ అవైలబిలిటీ, డ్రైవింగ్ టెస్ట్ స్లాట్ బుకింగ్ అనే ఆప్షన్లు కనిపిస్తాయి. ముందుగా స్లాట్ అవైలబిలిటీలోకి వెళ్లి చూస్తే ఏ తేదీల్లో స్లాట్లు అందుబాటులో ఉన్నాయో తెలుస్తుంది. ఆ తర్వాత స్లాట్ బుకింగ్ లోకి వెళ్లి ఒక తేదీని ఎంపిక చేసుకుని వివరాలను నమోదు చేయడం ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత దాన్ని ప్రింట్ తీసి పెట్టుకోవాలి. నిర్ణీత తేదీ, సమయానికి గంట ముందుగా రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లేటపుడు అన్ని రకాల పత్రాలను తీసుకెళ్లాలి. 

వీటిని తీసుకెళ్లడం మర్చిపోవద్దు

అప్లికేషన్ ఫామ్ నంబర్ 4 తోపాటు పుట్టిన తేదీ, నివాస, గుర్తింపు ధ్రువీకరణ పత్రాలు, లెర్నర్స్ లైసెన్స్, ఇటీవల దిగిన 4 పాస్ పోర్ట్ సైజు ఫొటోలు తీసుకెళ్లాలి. కమర్షియల్ లైసెన్స్ కోసం అయితే అప్పటికే ఉన్న లైసెన్స్ కార్డు,  ఏదేనీ గుర్తింపు పొందిన డ్రైవింగ్ స్కూల్ జారీ చేసిన ఫామ్ నంబర్ 5 ట్రెయినింగ్ సర్టిఫికెట్, మెడికల్ సర్టిఫికెట్లను జత చేయాల్సి ఉంటుంది.  వాహనం తోపాటు ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సహా అన్ని రకాల పత్రాలను వెంట తీసుకెళ్లాలి.  అంతేకాదు ద్విచక్ర వాహనదారులు అయితే హెల్మెట్, నాలుగు చక్రాల వాహనాలు అయితే సీటు బెల్టు పెట్టుకోవడం తప్పనిసరి.  

రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లిన తర్వాత ముందుగా ఫీజు చెల్లించాలి. ఆ తర్వాత కౌంటర్లో నిర్ణీత పత్రాలను సిబ్బంది తనిఖీ చేస్తారు. బయో మెట్రిక్ విధానంలో వేలి ముద్రలు, ఫొటోను తీసుకుని చేతికి ఓ బ్యాండ్ వేస్తారు. ఆ తర్వాత మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ డ్రైవింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. డ్రైవింగ్ టెస్ట్ లో ఫెయిల్ అయితే వారం రోజుల తర్వాత మరోసారి పరీక్షకు హాజరు కావచ్చు. 

పరీక్షా విధానం… 

ద్విచక్ర వాహనదారులు తమ వాహనంపై బయల్దేరి 8 ఆకారంలో ఉన్న రోడ్డులో ఒక రౌండ్ వేయాల్సి ఉంటుంది. ప్రారంభమైన దగ్గర నుంచి తిరిగి అక్కడికి చేరుకునే వరకు కాలు కింద మోపరాదు. నిర్ణీత సమయంలోపు ఈ డ్రైవింగ్ ను పూర్తి చేయాల్సి ఉంటుంది. అదే లైట్ మోటారు వెహికల్స్ (కారు) లైసెన్స్ కోసం డ్రైవింగ్ టెస్ట్ లో భాగంగా... 8 ఆకారంలో ఉన్న రోడ్డులో వాహనాన్ని సమర్థవంతంగా డ్రైవ్ చేయగలగాలి. ఎత్తు వాలులో ఉన్న రోడ్డులో వాహనం వెనక్కి రాకుండా (జారకుండా) ముందుకు నడపాలి. అదే విధంగా 8 ఆకారంలో ఉన్న రోడ్డులో కారును వెనక్కి (రివర్స్ డైరెక్షన్) నడపాల్సి ఉంటుంది,.

లైసెన్స్ కార్డు పోతే...?

ఒరిజినల్ లైసెన్స్ పొగొట్టుకున్నా...  లైసెన్స్ దారుడి రూపురేఖల్లో మార్పులు వచ్చి కొత్త ఫొటోతో అప్ డేట్ చేసుకోదలిచినా లేక కార్డు దెబ్బతిన్నా కొత్త లైసెన్స్ కార్డు తీసుకోవచ్చు. ఇందుకోసం రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లి సంబంధిత కౌంటర్ లో ఎల్ఎల్డీ ఫామ్ సమర్పించాలి. దానితోపాటు నివాస, ఫొటో ధ్రువీకరణ పత్రాలను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. వెంట ఒక పాస్ పోర్ట్ సైజు ఫొటో కూడా తీసుకెళ్లాలి. దెబ్బతిన్న కార్డును మార్చుకోవాలనుకునే వారు పాత కార్డును సమర్పించాల్సి ఉంటుంది. నిర్ణీత ఫీజు చెల్లించిన తర్వాత వేరొక కౌంటర్ లో సిబ్బంది వేలి ముద్రలు, ఫొటో తీసుకుంటారు. 

రెన్యువల్ కు... 

లైసెన్స్ కాల పరిమితి ముగుస్తున్న క్రమంలో దాన్ని రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందు కోసం రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లి ఫామ్ 9 సమర్పించాలి. అలాగే శారీరక సామర్థ్యాన్ని తెలియజేస్తూ ఫామ్ 1, 50 ఏళ్లు దాటిన వారు, వాణిజ్య వాహనాల లైసెన్స్ దారులు ఫామ్ 1ఏ(మెడికల్ సర్టిఫికెట్), ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ కార్డు, రెండు పాస్ పోర్ట్ సైజు ఫొటోలను కౌంటర్ లో సమర్పించాల్సి ఉంటుంది. నిర్ణీత ఫీజు కూడా చెల్లించాలి. వేరొక కౌంటర్ లో తాజాగా డిజిటల్ ఫొటో తీసుకుంటారు. కార్డు గడువు తీరి పోయిన 5 ఏళ్ల తర్వాత దరఖాస్తు చేసుకుంటే మాత్రం తిరిగి మళ్లీ డ్రైవింగ్ టెస్ట్ లో పాసవ్వాలి. 

లెర్నర్స్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేది ఇలా..?


More Articles