అంజిరెడ్డి...అవకాశాలనే సృష్టించుకున్నారు!

అవును... అంజిరెడ్డి అవకాశాలను సృష్టించుకున్నారు. అంజిరెడ్డి ప్రస్థానాన్ని అవలోకించిన వారికెవరికైనా ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది. అవకాశాలు వాకిట ముందున్నా, అందుకోలేని వారు ఎందరో! కొందరికైతే... అవకాశాల కోసం ఎదురుచూసేందుకే కాలం సరిపోతుంది. అందివచ్చిన అవకాశాలను చేజిక్కించుకునేవారు కొందరే ఉంటారు. అయితే, అంజిరెడ్డి ఈ మూడింటిలో ఏ వర్గానికీ చెందరు. ఎందుకంటే ఆయనే... తన కోసం అవకాశాలను సృష్టించుకున్నారు. ఆమాత్రం లేనిదే... అప్పటిదాకా దిగుమతులే ఆధారమైన భారత ముడి ఔషధి రంగం, ఎగుమతులు చేసే స్థాయికి ఎలా చేరుతుంది? ఆమాత్రం లేనిదే... సంపన్నులకే లభ్యమయ్యే ఖరీదైన మాత్రలు పూరి గుడిసెల్లోకి ఎలా వస్తాయి? ఆందుకే అంజిరెడ్డి... భారత ఔషథ తయారీ రంగ మూలస్తంభాల్లో కీలక స్తంభమే. 

భారత ఫార్మా రంగానికి పటిష్ట పునాది

1980 దశకం నాటికి దేశంలో ముడి ఔషధ రంగం (బల్క్ డ్రగ్ ఇండస్ట్రీ) విదేశాల నుంచి వచ్చే దిగుమతుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉండేది. అంటే, దిగుమతులు అందితేనే ఉత్పత్తి... లేదంటే లేదు. అయితే ఎప్పుడైతే అంజిరెడ్డి... ఉద్యోగాన్ని మానేసి ఉత్పత్తి రంగంలోకి అడుగు పెట్టారో, ఆ తర్వాత పదేళ్లలోనే పరిస్థితి తారుమారైపోయింది. 1990 దశకం నాటికి దేశీయ ఔషధ రంగం ఎలాంటి దిగుమతులు అవసరం లేనిదిగా ఎదిగింది. మరో ఐదారేళ్లకు ఏకంగా ముడి ఔషధాలను విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరింది. కేవలం 15 ఏళ్ల వ్యవధిలో భారత ముడి ఔషధ రంగం దాదాపు సమూల ప్రక్షాళనకు గురైనట్లే కదా. దీనికంతటికీ కారణం అంజిరెడ్డేనని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. వ్యాధి తీవ్రతను బట్టి ఔషధం రేటు పెరుగుతూ పోతుంది. చికిత్స విలువ పెరిగిన కొద్దీ, ఔషధాల రేటూ పెరగక తప్పదు. మరి సామాన్యుడి పరిస్థితి ఏమిటి? అదే యోచన అంజిరెడ్డిని ‘జనరిక్స్’ బాట పట్టించింది. ఒక్క భారత్ లోనే ఏమిటి, విశ్వవ్యాప్తంగా నేడు జనరిక్స్ నామస్మరణ చేయని దేశం లేదు మరి. అతి తక్కువ ధరకు దొరికే అమూల్యమైన ఔషధమే జనరిక్స్... అన్న నానుడికి శ్రీకారం చుట్టింది మన అంజిరెడ్డే. జనరిక్స్ విజయంతో భారత ఫార్మా రంగం దశదిశలే మారిపోయాయి. 

తండ్రి చేసే మూలికా గుళికల తయారీనే ప్రేరణ

గుంటూరు జిల్లాలోని తాడేపల్లిలో 1939, జనవరి 2న జన్మించిన కల్లం అంజిరెడ్డి... ప్రాధమిక విద్యాభ్యాసమంతా సొంతూరులోనే ముగిసింది. ఈ క్రమంలోనే తన తండ్రి మూలికలతో మాత్రలను చేస్తున్న వైనం అంజిరెడ్డిని విపరీతంగా ఆకట్టుకుంది. అంతేకాక ఆ మూలికా మాత్రలతో ఉపశమనం పొందిన పేదలు... తన తండ్రి పట్ల చూపే ఆరాధనా భావం కూడా అంజిరెడ్డిని విశేషంగానే ప్రభావితం చేసింది. పెద్దైన తర్వాత తాను కూడా మందుబిళ్లలే తయారు చేయాలన్న తలంపు చిన్నప్పుడే ఆయన మనసులో నాటుకుపోయింది. 

ఆ తలంపు విద్యాభ్యాసంతో పాటే అంజిరెడ్డిలో పెరుగుతూ పోయింది. అందుకేనేమో... డిగ్రీ, పీహెచ్ డీ తదితర ఉన్నత చదువుల్లో ఆయన ఫార్మా రంగానికి సంబంధించిన అంశాలనే ప్రాతిపదికగా తీసుకుని విద్యాభ్యాసంలో ఒక్కో మెట్టూ ఎక్కుతూ వెళ్లారు. ప్రాధమిక విద్యాభ్యాసం తర్వాత డిగ్రీ కోసం గుంటూరు ఏసీ కళాశాలకు వెళ్లారు. తదనంతరం ఫార్మా రంగంపై పట్టు సాధించే దిశగా అడుగులు వేసిన అంజిరెడ్డి... కేవలం ఆ చదువు కోసం యూనివర్సిటీ ఆఫ్ బాంబే తలుపుతట్టారు. అక్కడ బీఎస్సీ-టెక్నాలజీ కింద ‘ఫార్మాస్యూటికల్ సైన్స్ అండ్ ఫైన్ కెమికల్స్’ ప్రధానాంశంగా కోర్సు పూర్తి చేశారు. ఫుణేలోని నేషనల్ కెమికల్ ల్యాబోరేటరీలో పీహెచ్ డీ చేసి, ఫార్మా రంగంలో మెళకువలను ఔపోసన పట్టారు. 

ఐడీపీఎల్ లో ఉద్యోగ జీవితం... 

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఔషధాల తయారీలో కీలక భూమిక పోషిస్తున్న ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్(ఐడీపీఎల్) కు హైదరాబాద్ లో అప్పుడప్పుడే ఓ తయారీ కేంద్రం అందుబాటులోకి వచ్చింది. అప్పటికే ఫార్మా రంగంలో పీహెచ్ డీ వరకు విద్యనభ్యసించిన అంజిరెడ్డికి ఐడీపీఎల్ లో సులువుగానే కొలువు దొరికింది. అయితే అంజిరెడ్డి ఆలోచనలు ప్రయాణిస్తున్న వేగంతో ఐడీపీఎల్ పరుగులు పెట్టడం లేదు. దీంతో కొంత అయిష్టతతోనే బయటకు వచ్చిన అంజిరెడ్డి... కొందరు మిత్రులతో కలిసి రెండు ప్రయత్నాలు చేశారు. అవి కూడా అంజిరెడ్డి వేగాన్ని అందుకోలేకపోయాయి. ఇక లాభం లేదనుకున్న అంజిరెడ్డి... 1984లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ కు శ్రీకారం చుట్టారు. ‘అక్కడేదో తమకు అడ్డంకిగా ఉందని ఇతరులు భావించే ఆ పనిని చేపట్టడమంటే’నే తనకిష్టమని చెప్పుకునే అంజిరెడ్డి... అదే ఒరవడిలో అప్పటిదాకా భారత్ లో ఎవరికీ సాధ్యం కాని మిథైల్ డోపాను ఉత్పత్తి చేసి చూపారు. ఈ ఉత్పత్తే కంపెనీ సుదీర్ఘ చరిత్రకు నాంది పలికింది. అప్పటికి సమస్యల్లో చిక్కుకున్న  కెమినార్ డ్రగ్స్ ను చేపట్టిన అంజిరెడ్డి... నేరుగా రష్యా మార్కెట్ లో అడుగుపెట్టారు. ఈ అడుగు ఆయనను తార స్థాయికి తీసుకెళ్లింది. 

కొత్త ఔషధాల ఆవిష్కరణ దిశగా...  

అప్పటిదాకా మార్కెట్ లో ఉన్న ఔషధాలను తగినంత మేర ఉత్పత్తి చేయడమే గగనమనుకుంటున్న తరుణంలో అంజిరెడ్డి... కొత్త ఔషధాలకు రూపకల్పన చేసే సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. కొత్త ఔషధాలతో భారత మార్కెట్ తో పాటు అంతర్జాతీయ మార్కెట్ ను కూడా కైవసం చేసుకునే అవకాశాలున్నాయన్న ముందుచూపుతోనే ఆయన ఈ సాహసం వైపు మొగ్గు చూపారు. దీంతో 1993లో ఔషధాల ఆవిష్కరణ కోసం రీసర్చ్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. ఇప్పటికీ ఆ విభాగం రెడ్డీస్ ల్యాబ్ కు గుండెకాయ లాంటిదే. ‘ఔషధాల ఆవిష్కరణ సర్వోత్తమమైనది. మనిషి జీవితాన్ని మెరుగుపరిచేదిగానే కాక ఆయుష్షును కూడా పెంచే ఈ యత్నం, దైవ సంకల్పంతో సమానమే’ అని చెప్పే అంజిరెడ్డి, ఈ ప్రక్రియను నిరంతరం కొనసాగేలా రెడ్డీస్ లో ఏర్పాట్లు చేశారు. 

ఔషధం ప్రజల కోసం... ధనార్జన కోసం కాదు!

ఔషధ తయారీని ప్రజల శ్రేయస్సు కోసమని చెప్పిన అంజిరెడ్డి, దానిని పూర్తిగా లాభాపేక్ష లేకుండా చేపట్టాలన్నదే తన లక్ష్యంగా చెప్పేవారు. ఈ లక్ష్యంతో చేపట్టే ప్రయోగాలు... వాటంతటవే లాభాలను తీసుకొచ్చిపెడతాయని, ఆ తర్వాత ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరం ఉండదని ఆయన పలు సందర్భాల్లో చెప్పారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఔషధ తయారీ రంగంలో కొత్త ఆవిష్కరణల కోసం ‘ఇన్ స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్’ను హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. ఔషధ తయారీలో కొత్త ఆవిష్కరణల కోసం అంజిరెడ్డి చేసిన అవిశ్రాంత కృషి, భారత ఫార్మా రంగానికి మార్గదర్శిగా నిలిచింది.

 అంజిరెడ్డి అనుభవాల ఆధారంగా నేడు ఈ రంగంలో పెద్ద సంఖ్యలో భారత ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ఘనమైన విజయాలను సాధిస్తున్నారు.  ఈ క్రమంలో ఆయన కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం... పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరించడమే కాక పరిశ్రమలు, వాణిజ్య అంశాలపై ప్రధాని సలహా మండలిలో సభ్యుడిగానూ నియమించింది. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ పదవి కూడా ఆయనను వరించింది. క్షయవ్యాధి ఔషధాన్నిఅభివృద్ధి చేసేందుకు ఉద్దేశించిన అంతర్జాతీయ సంస్థ ‘ప్రపంచ పోషకాహార లోప నివారణ మండలి’ డైరెక్టర్ గానూ అంజిరెడ్డి పనిచేశారు. 

సామాజిక స్పృహతో ‘నాంది’కి శ్రీకారం

ఫార్మా రంగంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కార్పోరేట్ సోషల్ రెస్పాన్సబిలిటీ(సీఎస్ఆర్) కింద పలు కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టిన అంజిరెడ్డి... తొలుత 1998లో ‘నాందీ ఫౌండేషన్’ కు అంకురార్పణ చేశారు. ‘చిన్న సహాయంతో నేనీ స్థాయికి ఎదిగాను, మరి నాకు అవకాశం చిక్కినప్పుడు ఎవరైతే సాయం చేశారో వారికి తిరిగి కొంతైనా ఇవ్వాలిగా’అనే భావనతో ఆయన సామాజిక సేవా కార్యక్రమాలు ఉండేవి. పాఠశాల విద్యార్థులకు రక్షిత మంచినీరు, మధ్యాహ్న భోజనం, బాలల హక్కుల పరిరక్షణ, జీవనోపాధి కల్పన తదితర కార్యక్రమాలు చేపట్టే నాందీ ఫౌండేషన్... అనతి కాలంలోనే దేశంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సేవా సంస్థగా వినుతికెక్కింది. మాతా శిశు సంరక్షణపై దృష్టి సారించిన అంజిరెడ్డి... అందుకోసం ‘నైస్ ఫౌండేషన్’ ను ఏర్పాటు చేశారు. యువతలోని నైపుణ్యాలను వెలికితీసే సదుద్దేశంతో ‘డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్’ కూ బీజం వేశారు. కనీస అవసరాలకు కూడా నోచుకోని చిన్న పిల్లలు, యువతను చేరేదీసే ఈ సంస్థ... వివిధ విభిన్న కార్యక్రమాలతో వారికి జీవనోపాధిని చూపడమే కాక వారిలోని నైపుణ్యాలను వెలికితీసేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. 

‘రెడ్డి’ గతించినా... ‘రాజ్యం’ విరాజిల్లుతూనే ఉంది 

కాలేయ సంబంధిత కేన్సర్ సోకిన అంజిరెడ్డి... 2013, మార్చి 15న హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. నిత్యం అవకాశాలను సృష్టించుకుంటూ కొంగొత్త ప్రయోగాలు చేస్తూ ఆయన సాగించిన నిరంతర సాధనను... ప్రస్తుతం డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ఏమాత్రం అంతరాయం లేకుండానే నిర్విఘ్నంగా సాగిస్తూనే ఉంది. కుమారుడు సతీశ్ రెడ్డి, కూతురు భర్త జీవీ ప్రసాద్ లు అంజిరెడ్డి ఆశయాలు, ఆలోచనలకు నిత్యం పదును పెడుతూనే ఉన్నారు. సరికొత్త ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ఎప్పుడైనా, ఏదైనా కార్యక్రమంలో పాల్గొనే సందర్భంలో అంజిరెడ్డి చెప్పే మాటేంటో తెలుసా?... ‘భవిష్యత్తు.. అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉండే వారిది కాదు. వాటిని సృష్టించుకునే వారిదే’... ఇదే మాటను ఆయన నిత్యం వల్లెవేసేవారు. తాను ఆచరించిన సిద్ధాంతం కూడా అదే కదా మరి.  

‘యాన్ అన్ ఫినిష్డ్ అజెండా’లో అంజిరెడ్డి సొంత అనుభవాలు

తన సుదీర్ఘ, సాహసోపేత ప్రస్థానాన్ని అంజిరెడ్డి ఓ గ్రంథంలో నిక్షిప్తం చేశారు. ‘యాన్ అన్ ఫినిష్డ్ అజెండా’ పేరిట రిలీజైన ఈ పుస్తకంలో అంజిరెడ్డి తన ప్రతి అడుగునూ ఉన్నదున్నట్టుగా వివరించారని పలు ప్రముఖ పత్రికలు పేర్కొన్నాయి. జీవిత చరిత్రను రాసిన అంజిరెడ్డి... అందులోనూ భారత ఫార్మా రంగంలో నమోదైన పరిణామాలను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. అందుకేనేమో... ఆ పుస్తకం ఒక్క అంజిరెడ్డి జీవిత చరిత్ర మాత్రమే కాదని, భారత ఫార్మా రంగానికి సంబంధించి మొత్తం వివరాలు అందులో ఉన్నాయని ప్రముఖ ఆంగ్ల పత్రిక ‘ఔట్ లుక్’ పేర్కొంది. భారత ఫార్మా రంగానికి చెందిన విషయాన్ని తెలుసుకోవాలనుకునే వారు ‘యాన్ అన్ ఫినిష్డ్ అజెండా’ పుస్తకాన్ని తప్పక చదివి తీరాల్సిందేనని ఆ పత్రిక ఓ ఆసక్తికర కథనాన్ని రాసింది.


More Articles