లెర్నర్స్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేది ఇలా..?
లైసెన్స్ లేకుండా మోటారు వాహనాలు నడుపుతూ పట్టుబడితే ఒక రోజు జైలుకు పంపడం ఇటీవల కాలంలో చూస్తున్నాం. భారీ జరిమానాలు కూడా విధిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు తీవ్రతరం అవుతుండడంతో రవాణా, ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలకు దిగుతున్నారు. లైసెన్స్ ఉంటే తనిఖీల సమయంలో బెదిరిపోవాల్సిన పని ఉండదు. అందుకే ప్రతి ఒక్కరూ లైసెన్స్ తీసుకోవడం చాలా అవసరం. ఈ ప్రక్రియ చాలా సింపుల్.
16 ఏళ్లు నిండాలి...
మోటారు వాహనాల చట్టం 1988 ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి మోటారు వాహనాన్ని నడపరాదు. 16 ఏళ్లు నిండిన వారు లైసెన్స్ తీసుకుని 50సీసీ వరకు ఇంజన్ సామర్థ్యం గల మోటారు ద్విచక్ర వాహనాలను నడపవచ్చు. అయితే, లెర్నర్స్ లైసెన్స్ దరఖాస్తుపై తల్లిదండ్రులు లేదా గార్డియన్ సంతకం చేయాల్సి ఉంటుంది. 18 ఏళ్లు నిండిన తర్వాత 50సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం గల ద్విచక్ర మోటారు వాహనాలను నడపడానికి అనుమతిస్తారు. రవాణా వాహనాలు నడిపేందుకు లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే 20 ఏళ్లు నిండి ఉండాలి.
పర్మినెంట్ లైసెన్స్ కు ముందు లెర్నర్స్ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం రవాణా శాఖ కార్యాలయంలో కంప్యూటర్ పరీక్ష కు హాజరై పాస్ కావాలి. పరీక్షకు ముందు అప్లికేషన్ ఫామ్2ను పూర్తి చేసి నిర్ణీత రుసుములు (దరఖాస్తు రుసుము, యూజర్ చార్జీలు) చెల్లించి దానికి నివాస ధ్రువీకరణ పత్రం, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం, మెడికల్ సర్టిఫికెట్, మూడు పాస్ పోర్ట్ సైజు ఫొటోలు, శారీరకంగా ఫిట్ గా ఉన్నామని తెలియజేసే ఫామ్ 1 సమర్పించాల్సి ఉంటుంది. రవాణేతర వాహనాలు కాకుండా వ్యక్తిగతంగా వినియోగించే మోటారు వాహనాల డ్రైవింగ్ లైసెన్స్ కోసం 50 ఏళ్ల వయసు దాటిన వారు తప్పనిసరిగా మెడికల్ సర్టిఫికెట్ (ఫామ్ 1ఏ) సమర్పించాల్సి ఉంటుంది. అదే రవాణా వాహన లైసెన్స్ అయితే వయసుతో సంబంధం లేకుండా అందరూ మెడికల్ సర్టిఫికెట్ సమర్పించడం తప్పనిసరి.
చిరునామా ధ్రువీకరణ కోసం...
నివాస ధ్రువీకరణలుగా రేషన్ కార్డు, ఓటర్ ఐడీ, విద్యుత్/టెలిఫోన్ బిల్లు, పాస్ పోర్ట్, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ, ఇంటి పన్ను రశీదు సమర్పించవచ్చు. వీటిలో ఏవీ లేకుంటే ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ లేదా ఫస్ట్ క్లాస్ జుడీషియల్ మేజిస్ట్రేట్ అటెస్ట్ చేసిన అఫిడవిట్ లేదా నోటరీలను సమర్పించవచ్చు. అలాగే పుట్టిన తేదీ రుజువు కింద ఎస్ఎస్ సీ సర్టిఫికెట్, పాస్ పోర్ట్, బర్త్ సర్టిఫికెట్, సివిల్ సర్జన్ హోదాలో ఉన్న వైద్యాధికారి జారీ చేసిన వయసు ధ్రువీకరణ పత్రాల్లో ఒకదాన్ని ఇవ్వాల్సి ఉంటుంది.
ఆరు నెలల గడువు
లెర్నర్స్ లైసెన్స్ ఆరు నెలల వరకు చెల్లుబాటులో ఉంటుంది. ఈ గడువులోపు పర్మినెంట్ లైసెన్స్ తీసుకోవాలి. లేకపోతే మరో ఆరు నెలల కాలానికి లెర్నర్స్ లైసెన్స్ ను రెన్యువల్ చేసుకుని ఆ గడువులోపు పర్మినెంట్ లైసెన్స్ తీసుకోవచ్చు. మొదటి సారి జారీ చేసిన లెర్నర్స్ లైసెన్స్ ఆరు నెలల గడువు ముగిసిన తర్వాతే మరో ఆరు నెలల కాలానికి దాన్ని మంజూరు చేస్తారు. లెర్నర్స్ లైసెన్స్ జారీ చేసిన ఒక నెల తర్వాతే పర్మినెంట్ లైసెస్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఆ లోపు అవకాశం ఉండదు. రవాణా వాహనం నడిపేందుకు లెర్నర్స్ లైసెన్స్ తీసుకునేవారు కనీసం 8వ తరగతి అయినా పాస్ అయి, ఏడాది డ్రైవింగ్ అనుభవం కలిగి ఉండాలి.
దరఖాస్తు ఎలా…?
లెర్నర్ లైసెన్స్ కోసం ఆన్ లైన్ లోనే దరఖాస్తు చేసుకుని పరీక్ష కోసం స్లాట్ బుక్ చేసుకోవచ్చు. నిర్ణీత తేదీ, సమయానికి గంట ముందుగా అన్ని ధ్రువీకరణ పత్రాలతో రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. ఆన్ లైన్ లో స్లాట్ బుకింగ్ కోసం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వాసులు అయితే https://aptransport.in/ సైట్ లోకి లాగిన్ అయ్యి అన్ని వివరాలు నమోదు చేసి సబ్ మిట్ చేయాలి. అనంతరం పేమెంట్ ఆప్షన్ కనిపిస్తుంది. వెంటనే పేమెంట్ చేస్తే కోరుకున్న తేదీ, సమయానికి స్లాట్ బుక్ అవుతుంది. తెలంగాణ రాష్ట్ర వాసులు అయితే https://aptransport.in/వెబ్ సైట్ లోకి లాగిన్ అయ్యి పైన చెప్పుకున్న విధంగానే వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.
ఇలా కాకుండా నేరుగా రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లి కూడా లెర్నర్స్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, వారంలో అన్ని రోజులూ కాకుండా రవాణా శాఖ కార్యాలయాలు కేవలం కొన్ని రోజులు మాత్రమే ఈ అవకాశం కల్పిస్తున్నాయి. పైగా ఆ రోజుల్లో రద్దీ కూడా ఉంటుంది. కనుక ఆన్ లైన్ లో స్లాట్ బుక్ చేసుకుని పరీక్షకు వెళ్లడం అన్నది అవస్థలను తప్పిస్తుంది. ఆన్ లైన్ లో బుక్ చేసుకోవడం తెలియని వారు మీసేవా/ఈ సేవా కేంద్రానికి వెళ్లి కూడా దరఖాస్తు చేసుకునే సదుపాయం ఉంది. కంప్యూటర్ పరీక్ష పాసైన తర్వాత అదే రోజు లెర్నర్స్ లైసెన్స్ జారీ చేస్తారు.
లెర్నర్స్ లైసెన్స్ కంప్యూటర్ పరీక్ష వివరాలు
ట్రాఫిక్ సింబల్స్, డ్రైవింగ్ నిబంధనలపై 20 ప్రశ్నలకు పరీక్ష ఉంటుంది. ప్రతీ ప్రశ్నకు ఉన్న నాలుగు ఆప్షన్లలో సరైన దాన్ని టిక్ చేయాలి. పాస్ కావడానికి కనీసం 12 మార్కులు అవసరం. పరీక్షకు పది నిమిషాల సమయం ఉంటుంది. తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఒక దాన్ని ఎంపిక చేసుకోవచ్చు. పరీక్షలో 12 మార్కుల కంటే తక్కువ వస్తే ఫెయిలైనట్టే. అలాంటి వారు వారం రోజుల తర్వాత తిరిగి మరోసారి పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇలా వారం తర్వాత చొప్పున మూడు సార్లకు మాత్రమే అవకాశం. మూడు సార్లు కూడా ఫెయిల్ అయితే తిరిగి 60 రోజుల వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లేదు. పరీక్షకు సంబంధించి ఓ ప్రశ్న, దానికి జవాబు చూద్దాం.
* వాహనాన్ని నడిపే సమయంలో మూడు పనుల్ని మళ్లీ మళ్లీ చేస్తుండాల్సి వస్తుంది. ఆ పనులను చేసే వరుస క్రమం ఏది? 1. ఆలోచించడం, పనిచేయడం, మరియు గమనించడం 2. పనిచేయడం, ఆలోచించడం మరియు గమనించడం 3. గమనించడం, ఆలోచించడం మరియు పనిచేయడం 4. గమనించడం, పనిచేయడం మరియు ఆలోచించడం. వీటిలో సరైన జవాబు నంబర్ 3... గమనించడం, ఆలోచించడం మరియు పనిచేయడం. ఇలాంటి ప్రశ్నలతోపాటు ట్రాఫిక్ సింబల్స్ ఉంటాయి. ఉదాహరణకు పక్కనున్న చిత్రాన్ని ఇచ్చి ఇది దేనికి సంకేతం అని అడుగుతారు. నో ఎంట్రీ (ప్రవేశం లేదు) అనే జవాబును ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. కంప్యూటర్ పరీక్షకు సంసిద్ధం కావడానికి, ఈ కింది లింక్స్ ను ఓపెన్ చేయండి.
http://www.aptransport.org/html/pdf/road-signs-telugu.pdf
http://www.aptransport.org/html/pdf/rules-of-road-regulations-telugu.pdf
http://www.aptransport.org/html/pdf/general-driving-principles-telugu.pdf
పై లింకుల్లోని డాక్యుమెంట్లలో సమాచారాన్ని చదువుకోవడం ద్వారా పరీక్ష సులభంగా పాస్ కావచ్చు. ప్రిపేర్ అయిన వారు http://www.transport.telangana.gov.in/ రవాణా శాఖ వెబ్ సైట్ లోకి వెళ్లి మాక్ టెస్ట్ కూడా రాసుకోవచ్చు.
లైసెన్స్ లు, ఇతర సేవలకు సంబంధించి ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయాల్లోని హెల్ప్ డెస్క్ ల నుంచి పొందవచ్చు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయాల ఫోన్ నంబర్ల వివరాలకు http://www.transport.telangana.gov.in ఈ లింక్ ను ఓపెన్ చేయగలరు. అలాగే, ఆంధ్రప్రదేశ్ లోని ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయాల ఫోన్ నంబర్ల కోసం http://www.aptransport.org/ లింక్ ను ఓపెన్ చేయగలరు. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి దరఖాస్తు విధానం, నిబంధనలన్నీ ఒకే విధంగా ఉన్నాయి. అందుకే ఇక్కడ ఇరు రాష్ట్రాలకు సంబంధించిన యూఆర్ఎల్స్ ఇచ్చాము.
ఇరు రాష్ట్రాల రవాణా శాఖ అధికారిక వెబ్ సైట్ చిరునామాలు...
http://www.transport.telangana.gov.in/