ముందుచూపే ఆయన విజయం... దేశీయ ఐటీ రంగంలో నాడార్ ముద్ర!

ఆర్థిక మాంద్యం... బడా పారిశ్రామిక వేత్తలనే ఊపిరి సలపనివ్వలేదు. ఇక ఐటీ రంగాన్ని ఓ కుదుపు కుదిపేసింది. ఐటీ ఉద్యోగులనూ రోడ్డు పాల్జేసింది. అయితే నాడార్ ను మాత్రం కనీసం తాకను కూడా తాకలేకపోయింది. అందరిలా కాకుండా కాస్త భిన్నంగా వెళ్లే ఆయన శైలే, ఆయనకు శ్రీరామ రక్షలా నిలిచింది. అవును మరి, అందరిలా ‘వినియోగదారుల తర్వాతే మాకు ఎవరైనా’ అనే కోవకు చెందిన వారు కాదు నాడార్. ‘ఫస్ట్ సిబ్బంది, తరువాతే వినియోగదారుడు’ అంటూ విభిన్నంగా ముందుకెళ్లిన తత్వమే  ఆయనను మాంద్యం బారిన పడకుండా కాపాడింది. మరి ఆయన కంపెనీలకు వినియోగదారులు అక్కర్లేదా? అంటే, సదరు జాబితాలో నోకియా, హెచ్ పీ తరహా కంపెనీలెన్నో. కష్టపడి పనిచేసే సిబ్బంది లేకపోతే, ఎదిగేదెలాగంటారు తమిళ నాడుకు చెందిన శివ్ నాడార్. నిజమే మరి.., సిబ్బంది కృషి లేకుండా ఎదిగిన కంపెనీలు దాదాపుగా ఉండవేమో. ఈ సూత్రం ఆధారంగానే దేశీయ స్థాయిని దాటి విశ్వ విపణిలో అద్భుతాలు నమోదు చేసిన ఆయన, ప్రస్తుతం తన దాతృత్వ గుణానికి పదును పెడుతున్నారు. 

అందరిలాగే...ఉద్యోగిగా మొదలై...!

తమిళ నాడు రాష్ట్రం ట్యూటికోరిన్ జిల్లా, మూలైపోజీ గ్రామంలో శివ సుబ్రహ్మణ్యం, వమ సుందరీ దేవీ దంపతులకు 1945లో జన్మించిన శివ్ నాడార్, మధురైలోని అమెరికన్ కాలేజీలో కళాశాల విద్య పూర్తి చేశారు. అనంతరం ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ లో పీఎస్ జీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజినీరింగ్ పట్టా సాధించారు. అనంతరం అందరిలాగే ఆయన ఉద్యోగ వేట మొదలెట్టి, 1967లో పుణే కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న వాల్ చంద్ గ్రూపు కంపెనీ ‘కూపర్ ఇంజినీరింగ్’ లో ఉద్యోగిగా చేరారు. ఇక్కడున్న సమయంలోనే ఆయన మదిలో సొంతంగా కంపెనీ ప్రారంభించాలనే యోచన మొగ్గ తొడిగింది. ఈ యోచనకు సహోద్యోగులుగానే కాక, స్నేహితులూ అయిన అజయ్ చౌధరి, అర్జున్ మల్హోత్రా, సుభాష్ అరోరా, యోగేశ్ వైద్య, డీఎస్ పూరిల సహకారం కూడా తోడైంది. ఇంకేముంది, అందరూ కూపర్ ఇంజినీరింగ్ నుంచి బయటకు వచ్చేశారు. చిన్న కంపెనీతో మొదలుపెట్టి, ఉన్నత శిఖరాల వైపు దూసుకెళ్లారు. 

క్యాలిక్యులేటర్ తయారీతో ప్రయాణం ప్రారంభం
తొలుత ఆరుగురు మిత్రులు  కలిసి ‘మైక్రోకాంప్’ అనే సంస్థను నెలకొల్పి ‘టెలివిస్టా’ పేరిట టెలీ డిజిటల్ క్యాలిక్యులేటర్ ను ఆవిష్కరించారు. ఆ తర్వాత 1976లో ఆరుగురు మిత్రులు తమ వద్దనున్న రూ.1,87,000లతో హెచ్ సీఎల్ ను నెలకొల్పారు. అదే సమయంలో నాటి పరిశ్రమల శాఖ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ ప్రవేశపెట్టిన పారిశ్రామిక విధానాలతో విసుగెత్తిన ఐబీఎం భారత్ ను వదిలివెళ్లిపోయింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న నాడర్ మిత్ర బృందం, ఏ ఒక్క చిన్న అవకాశాన్ని వదులుకోకుండా ముందుకెళ్లింది. ఐబీఎం నిష్క్రమణ నేపథ్యంలో నాడార్ కంపెనీ రూపొందించిన మైక్రో కంప్యూటర్ కు అసలు పోటీనే లేకుండా పోయింది. అంతేకాక అప్పుడప్పుడే మొదలైన సాంకేతిక విప్లవం, హెచ్ సీఎల్ లాభాల బాటలో శరవేగంగా పరుగెత్తేందుకు దోహదపడింది. ఈ వేగానికి ఏమాత్రం బ్రేకులు వేయరాదని నిర్ణయించిన నాడార్, కంపెనీ ప్రారంభమైన నాలుగేళ్లకే దాని పరిధిని దేశం దాటించేశారు. 

పెట్టుబడిదారుడిగానూ క్లిక్!
హెచ్ సీఎల్ మైక్రో కంప్యూటర్ ఇచ్చిన బూస్ట్ తో తొలుత సింగపూర్ లో కాలుమోపిన నాడార్, ఫార్ ఈస్ట్ కంప్యూటర్స్ పేరిట హార్డ్ వేర్ ను విక్రయించే సంస్థను నెలకొల్పారు. అదే సమయంలో మరో ముగ్గురితో కలిసి ఎన్ఐఐటీ (నిట్)కూ పునాది వేశారు. సంస్థ యాజమాన్యాన్ని తీసుకోని నాడార్, కేవలం అందులో పెట్టుబడిదారుడిగానే కొనసాగారు. అయితే సదరు కంపెనీలో 2003 దాకా మెజార్టీ వాటా నాడార్ దే కావడం గమనార్హం. కంప్యూటర్ విద్యా బోధనలోని భారీ అవకాశాలను చేజిక్కించుకునేందుకే ఆయన నిట్ ఏర్పాటుకు నడుం బిగించారు. ఆయన అంచనాల మేరకు నిట్, తారస్థాయికి చేరుకున్న సాఫ్ట్ వేర్ ట్రైనింగ్ సంస్థగా ఖ్యాతిగాంచింది. ఇందులో చేరాలని ఆశపడని విద్యార్థి లేడంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. 1984లో పర్సనల్ కంప్యూటర్ సొల్యూషన్స్ విభాగంలో బిజీబీ, యునిక్స్ ఫ్లాట్ ఫామ్ లను అభివృద్ధి చేశారు. ఆఫ్ లైన్ సొల్యూషన్ విభాగంలో సేవలందించే క్రమంలో మొదలైన హెచ్ సీఎల్, 1987 నాటికి ఆ రంగంలో భారత్ లోనే తొలి స్థానంలో నిలవడంతో పాటు రూ.100 కోట్ల ఆదాయంతో ఒక్కసారిగా నాడార్ పేరును మారుమోగేలా చేసింది. 

విశ్వ విపణిలోకి మరింత దూకుడుగా...!
భారత ఐటీ రంగంలో శిఖరాగ్రానికి చేరుకున్న నాడార్, విశ్వ వాణిజ్య రంగంలో మరింత దూకుడును పెంచారు. భారత్ లో విజయంతో రెట్టించిన ఉత్సాహంతో అడుగేసిన ఆయన, విశ్వ వాణిజ్య రంగాన్ని దృష్టిలో పెట్టుకుని 1989లో హెచ్ సీఎల్ అమెరికాను నెలకొల్పారు. అయితే ఈ దూకుడు ఆయనను వెనక్కు తగ్గేలా చేసింది. ప్రపంచ ఐటీ రంగంలోని అవకాశాలపై నాడార్ అంచనాలు తల్లకిందులయ్యాయి. హెచ్ సీఎల్ లాభాలను తెచ్చిపెట్టకపోవడంతో పాటు నాడార్ గ్రాఫ్ ను కిందకు లాగేసింది. దీంతో అప్పటికే ఆ రంగంలో విశేష అనుభవం సాధించిన సంస్థలతో జతకట్టక తప్పలేదు. ఈ నేపథ్యంలో హ్యూలెట్ ప్యాకార్డ్ (హెచ్ పీ) తో కలిసి సంయుక్తంగా హెచ్ సీఎల్ హెచ్ పీ లిమిటెడ్ స్థాపనకు దారితీసింది. 1990 దశకం మధ్యలో నోకియా, ఎరిక్సన్ ల ఉత్పత్తులకు ప్రచారం కల్పించేందుకు ఆ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నారు.

 ఇలా  ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టకుండా ముందుకెళ్లిన నాడార్, 1995 నాటికి హెచ్ సీఎల్ ఛత్రం కింద 40 అనుబంధ సంస్థలను ఏర్పాటు చేయగలిగారు. హార్డ్ వేర్, ఐటీ ఆధారిత సేవల రంగంపైనా దృష్టి సారించిన ఆయన హెచ్ సీఎల్ కన్సల్టింగ్ పేరిట మరో సంస్థను నిర్మించారు. అంతకుముందు హెచ్ పీతో కలిసి ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ హెచ్ సీఎల్ కన్సల్టింగ్ లో విలీనమైపోయింది. దీంతో హెచ్ పీతో వ్యాపార బంధాన్ని ముగించినట్లైంది. ఆ తర్వాత 1996లో దీనినే హెచ్ సీఎల్ టెక్నాలజీస్ గా మార్చారు. 1998లో మొత్తం సంస్థలన్నింటినీ కలిపిన నాడార్, హెచ్ సీఎల్ టెక్నాలజీస్, హెచ్ సీఎల్ ఇన్ ఫో సిస్టమ్స్, హెచ్ సీఎల్ కామ్నెట్, హెచ్ సీఎల్ పెరాట్, నిట్ ల పేరుతో ఐదు విభాగాలుగా విభజించి ముందుకు సాగారు.

పబ్లిక్ ఇష్యూలతో సంచలనాలు
1999లో పబ్లిక్ ఇష్యూకెళ్లిన హెచ్ సీఎల్ సంచలనాలను నమోదు చేసింది. పబ్లిక్ ఇష్యూతో ఒక్కసారిగా రెండో అతిపెద్ద ఐటీ కంపెనీగా అవతరించింది. అప్పుడప్పుడే ఇంటర్నెట్ వినియోగం పెరుగుతున్న దశలో 2000లో తన పోటీదారులను వెనక్కి నెట్టేసిన నాడార్ సులువుగా ముందుకెళ్లిపోయారు. పబ్లిక్ ఇష్యూలో భారీ ఆదరణ కూడగట్టిన నాడార్, 2001లో ఇతర కంపెనీలను చేజిక్కించుకునేందుకు యత్నాలు మొదలుపెట్టారు.

ఈ క్రమంలో డచ్చీ సాఫ్ట్ వేర్ ను కొనుగోలు చేసిన ఆయన, ఆ తర్వాత అపోలో కాంట్రాక్ట్ ను చేజిక్కించుకుని ఫైనాన్సియల్ సర్వీస్ మార్కెట్ లోకి అడుగు పెట్టారు. 2005 వరకు ఈ తరహా యత్నాలను కొనసాగించారు. ఇదే క్రమంలో ఐదు విభాగాలుగా ఉన్న తన కంపెనీని, కొనుగోలు చేసిన కంపెనీలతో కలిపేసి రెండు విభాగాలుగా వర్గీకరించారు. అవే హెచ్ సీఎల్ టెక్నాలజీస్, హెచ్ సీఎల్ ఇన్ ఫో సిస్టమ్స్. 2007లో వినీత్ నాయర్ ను హెచ్ సీఎల్ సీఈఓగా నియమించిన నాడార్, తాను మాత్రం కంపెనీ చైర్మన్ పదవికి పరిమితమయ్యారు. అయితే అందులో ఇప్పటికీ నాడారే అతిపెద్ద షేర్ హోల్డర్ గా కొనసాగుతున్నారు. దేశీయ ఐటీ పరిశ్రమకు సరికొత్త జవసత్వాలు నింపిన కారణంగా భారత ప్రభుత్వం ఆయనను 2008లో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. 

సేవా కార్యక్రమాల్లోనూ ముందంజ
మూడు దశాబ్దాలుగా దేశీయంగానే కాక అంతర్జాతీయంగానూ వ్యాపార విస్తరణలో అలుపెరగకుండా పరుగులు తీసిన నాడార్, ప్రస్తుతం సామాజిక సేవా కార్యక్రమాల వైపు దృష్టి సారించారు. సంపాదన మొదలైన నాటి నుంచే, తాను సంపాదించిన దానిలో నుంచి 10 శాతాన్ని సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తూ వచ్చిన ఆయన, రానున్న ఐదేళ్లలో ఏకంగా రూ.4 వేల కోట్లను సేవా కార్యక్రమాలకు వెచ్చించనున్నారు. అంతేకాదు, తన కంపెనీలో తనకున్న వాటాలో నుంచి 2 శాతం వాటాను విక్రయించగా అందిన రూ.585 కోట్లను సేవా కార్యక్రమాలకే మళ్లించారు. అంతకుముందే విద్యపై తనకున్న మమకారం నేపథ్యంలో తండ్రి పేరుతో 1996లో శ్రీ సుబ్రహ్మణ్య నాడార్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ పేరిట కళాశాలను ఏర్పాటు చేశారు.

 ఈ మధ్యనే శివ నాడార్ ఫౌండేషన్ పేరిట ఓ సంస్థను నెలకొల్పి, పేదలకు విద్యాదానం చేసేందుకు నడుం బిగించారు. ఇందులో భాగంగా ఉత్తర ప్రదేశ్ లోని బులంద్ షహర్ వద్ద 20 ఎకరాల విస్తీర్ణంలో ‘విద్యా జ్ఞాన్’ పేరిట ఓ పాఠశాలను 2008లో ఏర్పాటు చేశారు. ఇందులో ప్రవేశం పొందిన విద్యార్థులకు ఒక్క పైసా తీసుకోకుండానే ఉత్తమ విద్యను అందిస్తున్నారు. ఇలాంటి మరో పాఠశాలను లక్నో సమీపంలోనూ ఏర్పాటు చేస్తున్నారు. మరో రెండు పాఠశాలలు కూడా భవిష్యత్తులో ఏర్పాటు కానున్నాయి. శివ్ నాడార్ వర్సిటీ పేరిట రూపొందించనున్న విద్యాలయంలో ఒకే ఏడాది  8,000 మంది విద్యార్థులు వివిధ కోర్సులను అభ్యసించేందుకు తగిన ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. సేవా కార్యక్రమాలన్నింటిలో విద్యాదానం మిన్నదని చెప్పే నాడార్, ఆ దిశగా స్థిర చిత్తంతో ప్రయాణిస్తున్నారు.


More Articles