ఆయన ప్రస్థానం ఒక విజయ గ్రంథం... గ్రంధి మల్లికార్జునరావు

గ్రంధి మల్లికార్జునరావు.. క్లుప్తంగా జీఎంఆర్...ఈ పేరు చాలా మందికి సుపరిచితమే. అనతికాలంలోనే అసమాన్యరీతిలో భారీ వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించేశారు. ఒక్క రంగమనేమిటీ, పలు రంగాలను స్పృశించారు. మౌలిక సదుపాయాల కల్పనకే మొగ్గుచూపారు. దేశంలోనే అత్యంత వేగంగా దూసుకెళుతున్న కంపెనీని ఆవిష్కరించారు. బిలియనీర్ గా అవతరించారు. వేలాది మందికి ఉపాధి చూపారు. లక్షలాది మందికి చేయూతనందిస్తున్నారు. ఇంత ఎత్తుకు ఎదిగినా... సిబ్బంది, కుటుంబ సభ్యుల సహకారంతోనే పైకెదిగానంటూ వినమ్రంగా సెలవిచ్చే జీఎంఆర్.. జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ కార్యకలాపాలను విశ్వవ్యాప్తం చేసేశారు.

‘పది’తో సమస్య... పనితో పరిష్కారం 

తెలుగు ప్రజల మదిలో పదో తరగతి గట్టెక్కితే...ఫరవా లేదు, బాగానే చదివేస్తాడంటూ గూడుకట్టుకున్న భావనను అప్పటికి ఆ పదహారేళ్ల మల్లికార్జున రావు గ్రహించలేకపోయాడేమో. అందుకే ఆయన పదో తరగతి పరీక్ష తప్పినట్లుగా ఉంది. అయితే ఫెయిలైన అతడిని, తండ్రి బడి మాన్పించేశారు. తాను చేస్తున్న బంగారం వ్యాపారంలో సాయంగా ఉండమన్న తండ్రి ఆజ్ఞతో రెండేళ్ల పాటు విద్యకు దూరంగానే ఉన్నాడు. చదువుకుంటానన్న కోరికను తల్లికి చెప్పి, ఎలాగోలా మళ్లీ బడిబాట పట్టాడు. ఈసారి కాస్త గట్టిగానే చదువుపై దృష్టిపెట్టిన అతడు ఆంధ్రా యూనివర్సిటీలో మెకానికల్ విభాగంలో ఇంజినీరింగ్ పట్టా సాధించాడు. ఆపై ఓ రెండు ఉద్యోగాలు చేసి, ఏకంగా సొంతంగా కంపెనీనే ప్రారంభించిన అతడు, ఆపై వెనుదిరిగి చూడలేదు. 1950 జూలై 14న శ్రీకాకుళం జిల్లా రాజాంలో పుట్టిన మల్లికార్జున రావు... జీఎంఆర్ గా బెంగళూరును తన నివాసంగా మార్చుకుని తన ప్రత్యర్థులకు అందనంత వేగంగా వ్యాపార విపణిలో దూసుకుపోతున్నారు.

జ్యూట్ మిల్లుతో మొదలుపెట్టి...

తండ్రి మరణం తర్వాత శ్రీకాకుళంలోని బంగారం, జ్యూట్ వ్యాపారాన్ని వదులుకుని మల్లికార్జున రావు రాజమండ్రిలోని ఏపీ పేపర్ మిల్లు ఉద్యోగంలో చేరారు. అనంతరం వంశధార ప్రాజెక్టులో భాగంగా ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గా గవర్నమెంట్ ఉద్యోగంలో చేరారు. రాజమండ్రిలో ఉండగానే, జ్యూట్ వ్యాపారంలో మార్వాడీల నైపుణ్యతను, వివిధ వర్గాల వారు చేసే గిమ్మిక్కులను తొందరగానే ఔపోసన పట్టారు. వంశధార ప్రాజెక్టు విధుల్లో భాగంగా నిర్మాణ రంగంలోని మెళకువలను నేర్చుకున్న మల్లికార్జున రావు 1978లో సొంతంగా ‘కాటన్ ఇయర్ బడ్స్’ ఫ్యాక్టరీని నెలకొల్పారు. ఈ నేపథ్యంలోనే షావాలెస్ భాగస్వామ్యంతో నెలకొల్పిన బ్రూవరీని, ఆ తర్వాత లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు అమ్మేశారు. దానితో పాటుగా స్వల్ప మోతాదులో చేపట్టిన ఇన్స్యూరెన్స్ వ్యాపారాన్ని రహేజాలకు విక్రయించారు.

ఒక్క ’అవకాశం’ జీవితాన్నే మార్చేసింది

అలా కాలం నడుస్తున్న క్రమంలో ఓ భారీ కాంట్రాక్టు మల్లికార్జునరావును జీఎంఆర్ గా మార్చేసింది. వ్యాపార దిగ్గజాలు కూడా ఈర్ష్య పడే స్థాయికి ఎదిగేలా చేసింది. అదే, 1991లో ఆయన చేతికందిన హైదరాబాద్ విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించిన కాంట్రాక్టు. అప్పటికే మౌలిక సదుపాయాల రంగంలో ఆరితేరిన ఎల్ అండ్ టీ వంటి కంపెనీలు బిడ్లు వేసినా, ఆ టెండర్ ను జీఎంఆర్ చేజిక్కించుకున్నారు. కాంట్రాక్టైతే దక్కింది, మరి విమానాశ్రయ నిర్మాణంలో తనకు ఏమాత్రం అనుభవం లేదే, మరేం చేయాలన్న సంశయంలో నుంచి జీఎంఆర్, తన ఆలోచనల వేగం పెంచడమే కాక, వాటిని అంతే వేగంగా అమలు చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఈ రంగంలో అనుభవం గడించిన వారిని సంప్రదించిన జీఎంఆర్... జర్మనీ, మలేసియా, సింగపూర్ తదితర దేశాల నిపుణుల సలహాలు తీసుకున్నారు. తన సిబ్బందికి వారి చేత పాఠాలు చెప్పించారు. ఇంకేం, హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. దీంతో ఒక్కసారిగా జీఎంఆర్ పేరు భారత్ లోనే కాక ఇతర దేశాల వాణిజ్య వర్గాల్లో మారుమోగింది. అంతేకాదు, ఆయన జీఎంఆర్ గ్రూప్ షేర్ విలువను అమాంతం పెరిగిపోయింది.

అంచెలంచెలుగా ఎదిగిన జీఎంఆర్ గ్రూప్

1978లో ఓ చిన్న ఫ్యాక్టరీతో మొదలైన జీఎంఆర్ గ్రూప్ అంచెలంచెలుగా ఎదిగింది. విమానాశ్రయాల నిర్మాణంతో పాటు విద్యుత్ రంగంలోనూ కాలుమోపింది. ప్రస్తుతం హైదరాబాద్, ఢిల్లీ విమానాశ్రయాలతో పాటు టర్కీ, మాల్దీవ్స్ దేశాల్లో కూడా విమానాశ్రయాలను నిర్మించింది. విద్యుత్ రంగంలోకి కాలిడిన అనతి కాలంలోనే దేశవ్యాప్తంగా 13 విద్యుత్ ప్రాజెక్టులను చేపట్టింది. ఇందులో మూడు కేంద్రాలు ఇప్పటికే ఉత్పత్తిని ప్రారంభించగా, మిగిలినవి వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. వీటితో పాటు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లలో ఒక్కో ప్రాజెక్టు చొప్పున సౌర విద్యుదుత్పత్తి కేంద్రాలను నెలకొల్పింది. జాతీయ రహదారుల నిర్మాణంలో భాగంగా ఇప్పటికే జీఎంఆర్ గ్రూప్, ఆరు ప్రాజెక్టులను పూర్తి చేసింది. మౌలిక సదుపాయాల రంగంలో భాగంగా జీఎంఆర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, భారత్ తో పాటు  నేపాల్ లోనూ పలు ప్రాజెక్టులు చేపట్టింది. జీఎంఆర్, దేశంలో అత్యంత వేగంగా దూసుకెళుతున్న సంస్థగా ఖ్యాతిగాంచింది. మరోవైపు జీఎంఆర్, ఫోర్బ్స్ ప్రకటించిన ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో పలు అవార్డులతో పాటు పలు వర్సిటీల నుంచి గౌరవ డాక్టరేట్లను కూడా అందుకున్నారు. ఇక పేరు ప్రఖ్యాతులతో పాటు ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్న జీఎంఆర్... తెలుగు నేల కుబేరుడిగానూ ఖ్యాతి గాంచారు.

సామాజికాభివృద్ధికీ సముచిత స్థానం

ఓ వైపు జెట్ స్పీడ్ తో జీఎంఆర్ గ్రూపును పరుగులు పెట్టిస్తున్న జీఎంఆర్, సామాజిక అభివృద్ధి కార్యక్రమాలనూ ముమ్మరం చేశారు. జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ను ఏర్పాటు చేసి, భారీ నిధులతో సంక్షేమ కార్యక్రమాలకు తెరలేపారు. ఈ కార్యక్రమాలు జీఎంఆర్ గ్రూప్ ప్రాజెక్టు పనులు జరిగే ప్రాంతాల్లోనే కేంద్రీకృతమైనప్పటికీ... రాష్ట్రం, దేశం దాటి విశ్వవ్యాప్తమయ్యాయి. ఈ ఫౌండేషన్ కింద విద్య, ఆరోగ్యం, పౌష్టికాహారం, పారిశుద్ధ్యం, స్వావలంభన, జీవనోపాధి, సమాజ అభివృద్ధి తదితర విభాగాల్లో విశ్వవ్యాప్తంగా 22 ప్రదేశాల్లో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. భారత్ లో తన సొంత ఆంధ్రప్రదేశ్ తో పాటు మరో పది రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాలు అమలవుతున్నాయి. ఈ కార్యక్రమాల కోసం జీఎంఆర్ పెద్ద ఎత్తున నిధులను కేటాయిస్తోంది.

కుటుంబం లాగే సిబ్బంది కూడా.

జీఎంఆర్ ఫిలాసఫీ ప్రకారం, కుటుంబాన్ని నడిపినట్లుగానే కంపెనీని నడపాలట. ఇదే సిద్ధాంతం ప్రకారం ముందుకెళుతున్న జీఎంఆర్, సిబ్బందిని కూడా కుటుంబ సభ్యుల్లాగే పరిగణిస్తారని పారిశ్రామిక వర్గాలు చర్చించుకుంటున్నాయి. కుటుంబాన్ని సమర్ధవంతంగా నడపగలిగితే, కార్పోరేట్ సంస్థను కూడా విజయవంతంగా నడపడం అంత కష్టమైన పనేమీ కాదని జీఎంఆర్ తన మిత్రులతో గట్టిగానే చెప్పేస్తారు. తాను సాధించిన విజయంలో తన కుటుంబ సభ్యుల పాత్ర ఎంత ఉందో, సిబ్బంది పాత్ర కూడా అంతే ఉందని చెప్పే ఆయన, సిబ్బంది సహకారం లేకుండా ఏ కంపెనీ కూడా ముందడుగు వేయలేదన్న విశ్వాసాన్ని ప్రగాఢంగా నమ్ముతారు. అందుకే జీఎంఆర్ గ్రూపు దేశంలోని ఏ ఒక్క కంపెనీ అందుకోలేనంత వేగంతో దూసుకెళుతోంది.

ఆస్తి మొత్తం ఫౌండేషన్ కే...

జీఎంఆర్, మూడు సిద్ధాంతాల ప్రకారం పనిచేస్తారని ఆయన కంపెనీల్లో పనిచేస్తున్న సిబ్బంది నిత్యం చెప్పుకుంటారు. అందులో వ్యాపార నిర్మాణం మొదటిదైతే, వ్యవస్థ నిర్మాణం రెండోదిగా చెబుతారు. ఇక మూడోదిగా కుటుంబ సమర్ధ నిర్వహణ. ఇప్పటిదాకా ఈ మూడింటిని లక్ష్యంగా పెట్టుకుని పనిచేసిన ఆయన తాజాగా నాలుగో సిద్ధాంతాన్ని అమలులోకి తీసుకొచ్చారని వల్లె వేస్తున్నారు. ఆ నాలుగోదే, సమాజం నుంచి తీసుకున్న దానిని తిరిగి సమాజానికి ఇవ్వడం! దీనిపై ప్రస్తుతం కాస్త ఎక్కువగా దృష్టి సారించిన జీఎంఆర్, తన తదనంతరం తన వ్యక్తిగత ఆస్తి మొత్తం, వరలక్ష్మి ఫౌండేషన్ కు చెందేలా 2011, మార్చిలోనే వీలునామా కూడా రాసేశారు. 


More Articles