సామాన్యులను 'అంబారీ' ఎక్కించిన అంబానీ... భారత పారిశ్రామిక దిగ్గజం!

అభివృద్ధికి పరిమితులు తనకు తెలియవంటారు ఆయన. అనడమే కాదు, దానిని చేతల్లో చూపించారు. ఇంతై...  ఇంతింతై, వటుడింతై అన్నట్లు... ఓ చిన్న అడుగుతో మొదలెట్టి మహా సామ్రాజ్యాన్నే సృష్టించేసి మరీ చూపించారు. భారత పారిశ్రామిక రంగంలో సరికొత్త అధ్యాయానికి నాంది పలికారు. పరిశ్రమల నిర్వహణలో ఏమాత్రం జోక్యం చేసుకోకుండానే లాభాలు స్వీకరించే సౌలభ్యాన్ని సామాన్యుల ముంగిట్లోకి తెచ్చారు. తద్వారా సామాన్యులను సైతం భారత పారిశ్రామిక రంగంలోకి అమాంతం ఎత్తుకొచ్చి పడేశారు. తత్ఫలితంగా అప్పటిదాకా నెమ్మదిగా నడక సాగిస్తున్న భారత పారిశ్రామిక రంగం ఉరుకులు పరుగులు పెట్టింది. ఈ పరుగులో తాను పెరుగుతూ, ఇతరులకూ ఆ భాగ్యం కల్పించారు. అందుకేనేమో, ఆయన సంస్థ ఏటా నిర్వహించే వాటాదారుల సమావేశాలకు పెద్ద, పెద్ద స్టేడియాలు కూడా సరిపోవడం లేదు. ప్రస్తుతం ఆయన లేరు కాని, ఆయన నిర్మించిన సామ్రాజ్యం మాత్రం... ఆయన మాదిరిగానే ’వృద్ధి‘లో తనకు పరిమితులు లేవని చాటిచెబుతోంది. ఆయనే ధీరూభాయి అంబానీ కాగా, ఆయన కలలుగన్న రీతిన ముందుకు సాగుతున్న కంపెనీ ‘రిలయన్స్’ అని చెప్పాల్సిన అవసరం రాదేమో. ఎందుకంటే ఆ సంస్థ పన్నుల రూపేణా చెల్లిస్తున్న మొత్తం, కేంద్రం  పన్నుల ఆధారిత ఆదాయంలో 5 శాతం మరి! 

నాలుగ్గోడల మధ్య నేర్చుకునేదేంటి...?

అందరి పిల్లల్లాగే పాఠశాలకు వెళ్లిన పదిహేనేళ్ల ధీరజ్ లాల్ హీరాచంద్ అంబానీకి నాలుగ్గోడల మధ్య కూర్చుని నేర్చుకునేదేమిటని ఒకటే సంశయం. అందుకేనేమో, ఖాళీ సమయాల్లో ఉల్లి, బంగాళదుంప తదితరాలను విక్రయించి, పెట్టుబడి పోను మిగిలిన సొమ్మును, అదేనండి, ఆదాయాన్ని తల్లి జమనాబెన్ చేతిలో పెట్టేవాడట. ఐదుగురు సంతానంతో ఇంటిని నెట్టుకురాలేక సతమతమవుతూ బడిపంతులుగా కాలం వెళ్లదీస్తున్న తండ్రి హీరాచంద్ గోర్ ధన్ దాస్ అంబానీకి చేదోడువాదోడుగా ఉండేందుకు ఆ బుడతడు నాలుగ్గోడల మధ్య నేర్చుకునేదానికి ఫుల్ స్టాఫ్ పెట్టేయాల్సి వచ్చింది.

అప్పటికే రాసిన పదో తరగతి పరీక్షల్లో అసలు పాసయ్యానా? లేదా? అన్న విషయం కూడా తెలియకముందే నౌక ఎక్కేశాడు. సుదూర తీరానికి వెళ్లిన తర్వాత పాసయ్యానని తెలిస్తే, ఏం లాభం? ఎటూ వచ్చేశాను కదా, ఇక లాగించేద్దాం అన్న భావనతో పనిలో కుదిరిపోయాడు. తీరా పదేళ్లు కూడా అక్కడ పనిచేయకుండానే విశేష అనుభవం గడించి స్వదేశం వచ్చిన ధీరజ్ లాల్ సొంతంగా వ్యాపారం ప్రారంభించి ధీరూభాయి అంబానీగా వినుతికెక్కారు. వేల కోట్ల రూపాయల విలువ చేసే వ్యాపార సామ్రాజ్యాన్ని వారసులకు అందించి నిష్క్రమించారు. అంతేమొత్తంలో తన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన సామాన్య ప్రజలకు అందించి చిరస్మరణీయుడిగా మిగిలిపోయారు.

అడుగడుగునా అవాంతరాలే!

గుజరాత్ లోని జూనాఘడ్ పరిసరాల్లోని ఛోర్వాద్ లో 1932, డిసెంబర్ 28న గుజరాతీ కుటుంబంలో ధీరూభాయి అంబానీ జన్మించారు. అయిష్టంగానే పదో తరగతి వరకు పాఠశాల విద్య కొనసాగించిన ఆయన, ఆ తర్వాత కుటుంబ పరిస్థితులు సహకరించకపోవడంతో, ఉద్యోగం నిమిత్తం యెమెన్ రేవు పట్టణం ఎడెన్ కు తరలివెళ్లారు. అతి స్వల్ప కాలంలోనే ‘ఏ. బీస్ అండ్ కో’ కార్యకలాపాలను పూర్తిగా అవగతం చేసుకున్నారు. కంపెనీలోని దాదాపు అన్ని విభాగాల్లోనూ పనిచేసిన అంబానీ, ఆ తర్వాత 1954లో కోకిలాబెన్ ను పెళ్లి చేసుకునేందుకు స్వదేశానికి వచ్చారు. తిరిగి ఉద్యోగం కోసం వెళ్లిన అంబానీని ఏ. బీస్ అండ్ కో మరింత కష్టసాధ్యమైన పనికి బదిలీ చేసింది. మూడేళ్ల పాటు అక్కడే విధులు నిర్వర్తించిన అంబానీ, ఇక ఎంతకాలమని ఎదుగూబొదుగూ లేని ఉద్యోగం చేయాలంటూ... ఉన్నపళంగా స్వదేశం వచ్చేశారు. ఓపక్క ఏం చేయాలి? అన్న మీమాంస. మరోపక్క ఏదో ఒకటి చేయకపోతానా? అన్న ఆత్మ విశ్వాసం. చివరికి సోదరుడితో కలిసి చిన్న వ్యాపారం చేసేందుకు రిలయన్స్ కమర్షియల్ కార్పోరేషన్ ను 1957లో ప్రారంభించారు. అయితే సోదరుడితో పొడచూపిన విభేదాలు, 1965లో దాని నుంచి బయటకు వచ్చేలా చేశాయి.

President Pranab Mukherjee presents the Padma Vibhushan Award to Kokilaben D. Ambani, wife of Dhirubhai Hirachand Ambani (Posthumous) -late industrialist and founder of the Reliance empire Dhirubhai Ambaniఒంటరి పోరులో విజేతగా నిలిచి...!

ఈసారి ఒంటరిగానే రిలయన్స్ గ్రూపును ప్రారంభించిన అంబానీ, మరిన్ని సవాళ్లను ఎదుర్కొన్నారు. ‘విమల్’ పేరిట ప్రత్యేక బ్రాండ్ ను అంబానీ రూపొందించారు. ఈ దెబ్బకు కుదేలైన బడా పారిశ్రామిక వేత్తల  కడుపు మండింది. వారంతా కలిసి అంబానీని ఎదగనీయకుండా పలు పన్నాగాలు పన్నారు. వారితో తన సోదరుడు కూడా చేయి కలపడాన్ని జీర్ణించుకోలేని అంబానీ, మరింత దీటుగా ముందుకెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. అంబానీని ఎదగనీయకుండా అడ్డుకున్న వారిలో బాంబే డెయింగ్ యజమాని నస్లీ వాడియా కూడా ఉన్నారు. అయితే ఎక్కడ కూడా రాజీలేని పోరు సాగించిన అంబానీ, దశలవారీగా అందరినీ దాటేసుకుంటూ ముందుకెళ్లిపోయారు. ఈ తరహా భీకర పోరే అంబానీని గుండెపోటు బారిన పడేలా చేశాయేమోనని పరిశ్రమ వర్గాలు చర్చించుకుంటూ ఉంటాయి. ఇక ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘పద్మ’ అవార్డుల్లో ధీరూభాయి అంబానీకి పద్మ విభూషణ్ అవార్డు దక్కింది. 2016, మార్చి 28న రాష్ట్రపతి భవన్ లో అంబానీ సతీమణి కోకిలాబెన్ ఆ అవార్డును రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుంచి అందుకున్నారు.

మూడు పువ్వులు...ఆరు కాయలు

ఓ వైపు వ్యాపార ప్రత్యర్థులతో పోరు కొనసాగిస్తూనే అందివచ్చిన ప్రతి అవకాశాన్ని అంబానీ ఒడిసిపట్టుకున్నారు. రియలన్స్ గ్రూపు ప్రారంభమై ఐదేళ్లు గడిచేలోగా 1970 నాటికి ఆ సంస్థ ఆస్తులు రూ.10 లక్షలకు చేరుకోగా... మరో దశాబ్దం గడిచేసరికి 1980 దశకంలో కంపెనీ విలువ రూ.100 కోట్లను తాకేసింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో వస్త్ర తయారీని నిర్వహిస్తూనే, ఇతర రంగాల వైపు దృష్టి సారించారు. ఈ క్రమంలో చిన్ననాటి ఉద్యోగంలో నేర్చుకున్న మెళకువలను తిరగదోడిన అంబానీ... పెట్రో కెమికల్స్ రంగంలో శరవేగంగా దూసుకెళ్లారు. అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ అద్భుతాలు నమోదు చేస్తూ పోయారు. 2002, జూలై 6న ఆయన మరణించే నాటికి రిలయన్స్ మొత్తం విలువ 6.10 బిలియన్ డాలర్లు. రిలయన్స్ ను ఈ స్థితికి చేర్చే క్రమంలో అంబానీ... పెట్రో కెమికల్స్, సమాచార, ఇంధన రంగాల్లో అడుగుపెట్టారు. పది పైసలకే సామాన్యుడికి ఫోన్ చేసుకునే వెసులుబాటు కల్పించాలన్న అంబానీ ఆశయమే, రిలయన్స్ మొబైల్ సేవల ప్రాంభానికి కారణమైంది. అప్పటిదాకా ఈ రంగంలో ఉన్న భారీ రేట్లు క్రమంగా పడిపోయి, ప్రస్తుతం ఒక్క పైసాకు కూడా ఫోన్ చేసుకునే సౌలభ్యం సామాన్యుడి ముందు వాలిపోయింది.

ప్రతి అడుగులో ప్రత్యేక ముద్ర

వేసిన ప్రతి అడుగులో అంబానీ తన ప్రత్యేకతను చాటారు. అహ్మదాబాద్ సమీపంలోని నరోడాలో విమల్ వస్త్ర తయారీ యూనిట్ ను 1975లో ప్రపంచ బ్యాంకుకు చెందిన సాంకేతిక నిపుణుల ప్రతినిధి బృందం సందర్శించింది. ఈ సందర్భంగా అభివృద్ధి చెందిన దేశాల్లోని ప్రమాణాల కన్నా మెరుగైన ప్రమాణాలతో ప్లాంట్ ను ఏర్పాటు చేశారంటూ అంబానీని కీర్తించింది. భారత పారిశ్రామిక రంగంలో అంబానీ పెను మార్పులకు శ్రీకారం చుట్టారు. తన కంపెనీల్లో పెట్టుబడులు పెడితే కంపెనీలో వాటాలిస్తానని చెబుతూ, గుజరాత్ గ్రామీణ ప్రాంతాలను చుట్టిన ఆయన అందులో విజయం సాధించడంతో పాటు సామాన్యులకు పారిశ్రామిక ఫలాలు అందేలా సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో రిలయన్స్ వాటాదారుల సంఖ్య దినదినాభివృద్ధి చెందింది. దీంతో వాటాదారుల వార్షిక సమావేశాలు నిర్వహిచేందుకు ముంబైలోని పెద్ద స్టేడియాలను అద్దెకు తీసుకోవాల్సి వచ్చింది. ఈ సంస్కృతి ఇప్పటికీ కొనసాగుతోంది. అంబానీ తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం నేపథ్యంలో దేశంలోని పరిశ్రమల్లో సామాన్యుల వాటాలు పెరుగుతూ వచ్చాయి. పరిశ్రమలు ఆర్జిస్తున్న లాభాలను సామాన్య ప్రజానీకం కూడా రుచిచూస్తోంది. ఇందుకేనేమో, మొన్నటికి మొన్న అంబానీ చిన్న కొడుకు అనిల్ అంబానీ పబ్లిక్ ఆపర్ కు వెళితే, ఊహించని రీతిలో మదుపరులు స్పందించారు. ఆశించిన దాని కంటే కొన్ని వేల రెట్లలోఆ ఇష్యూకు పెట్టుబడులు బారులు తీరాయి.  

 President Pranab Mukherjee with Union Home Minister Rajnath Singh, Kokilaben D. Ambani, Reliance Industries chairman Mukesh Ambani, Reliance Foundation chairperson Nita Ambani and Reliance ADAG chairman Anil Ambani with wife Tina Ambani at a Civil Investiture Ceremony, at Rashtrapati Bhavan, in New Delhi on March 28, 2016. తనను మించిన రీతిలో వారసులను తీర్చిదిద్దిన ఘనుడు

అంబానీ నలుగురు సంతానంలో ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు. కుమార్తెలను పక్కనబెడితే ఇద్దరు కుమారులను అంబానీ తనను మించిన మేధావులుగా మలచారు. తాను జీవించి ఉన్నంత కాలం ఉమ్మడిగానే కుటుంబాన్ని కొనసాగించారు. కొడుకుల మధ్య ఏమాత్రం పొరపొచ్చాలు రానివ్వని రీతిలో వ్యవహారాలు చక్కబెట్టారు. పెద్ద కొడుకు ముఖేష్ ను కెమికల్ ఇంజినీరింగ్ లో నిష్ణాతుడిని చేశారు. రిలయన్స్ కు కేంద్ర బిందువుగా ఉన్న జామ్ నగర్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ముఖేష్, కేవలం ఏడాదిన్నరలో పూర్తి చేయించాడని పారిశ్రామిక వర్గాలు చెబుతాయి. ఇక చిన్న కొడుకు అనిల్ వ్యూహ రచనలో తండ్రిని తలదన్నేలా వ్యవహరిస్తారని భారత పారిశ్రామిక వేత్తలు కాస్త గర్వంగానే చెప్పుకుంటారు. తండ్రి మరణం తర్వాత తండ్రి నిర్మించిన రిలయన్స్ ను అన్నకు వదిలేసిన అనిల్, సొంతంగా అనిల్ దీరూభాయి అంబానీ గ్రూప్ ను ఏర్పాటు చేసి శరవేగంగా దూసుకుపోతున్నారు. అన్నదమ్ములిద్దరూ భారత సంపన్న దిగ్గజాల జాబితాలోనే కాక ప్రపంచ దిగ్గజాల జాబితాలోనూ చోటు దక్కించుకున్నారు.


More Articles