మన పోస్టాఫీసులో ఎన్నో సేవలు
పోస్టాఫీసు సేవల్లో సాధారణ పౌరులకు తెలియని సేవలు చాలానే ఉన్నాయి. వీటి గురించి తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. అలాంటివి ఏమున్నాయో తెలుసుకుందాం...
ఈ- పోస్ట్
ఎలాంటి పత్రాలను అయినా స్కాన్ చేసి మెయిల్ చేయడం నేడు నిమిషాల్లో పూర్తయ్యే పని. వాటిని నిమిషం వ్యవధిలోనే అవతలి వైపు వారు చూసుకోవడమే కాకుండా కావాలంటే ప్రింట్ కూడా తీసుకోవచ్చు. మరి ఇంటర్నెట్ సదుపాయం లేని మారుమూల గ్రామాల్లో ఉన్నవారికి పత్రాలు పంపించాలంటే… రిజిస్టర్ పోస్ట్, స్పీడ్ పోస్ట్ సేవలను వినియోగించుకుని రోజుల తరబడి వేచి ఉండాలా..? అవసరం లేదు. ఈ- పోస్ట్ సేవ అందుబాటులో ఉంది. దీని ద్వారా కావాల్సిన పత్రాలను ఎక్కడో ఓ కుగ్రామంలో ఉన్నవారికైనా వెంటనే పంపుకోవచ్చు. ఏ4 సైజ్ పేజీని ప్రింట్ రూపంలో అందించేందుకు పది రూపాయలను తపాలా విభాగం చార్జ్ చేస్తోంది. ఏ పోస్టాఫీసుకు అయినా వెళ్లి పంపాలనుకున్న పత్రాలను ఇస్తే సిబ్బందే స్కాన్ చేసి దాన్ని అందించాల్సిన చిరునామాకు సమీపంలోని పోస్టాఫీసుకు మెయిల్ చేస్తారు. అక్కడి సిబ్బంది దాన్ని ప్రింట్ తీసి చిరునామాదారుడికి అందిస్తారు.
మీడియా పోస్ట్
పోస్ట్ కార్డులు, ఇన్ ల్యాండ్ లెటర్లు, ఏయిరోగ్రామ్స్, పోస్టల్ స్టేషనరీ పై కార్పొరేట్ కంపెనీలు తమ లోగోలను ముద్రించుకోవడం ద్వారా ప్రచారం పొందేందుకు మీడియా పోస్ట్ వీలు కల్పిస్తుంది. ఏటా 300 కోట్ల అన్ రిజిస్టర్డ్ మెయిల్స్ ను తపాలా విభాగం క్యారీ చేస్తోంది. అలా పోస్ట్ కార్డులు, ఇన్ ల్యాండ్ లెటర్ల వంటి వాటి ద్వారా కంపెనీలు తక్కువ వ్యయానికి బోలెడంత ప్రచారాన్ని పొందవచ్చు.
గ్రీటింగ్ పోస్ట్
పుట్టినరోజు, నూతన సంవత్సరం, దీపావళి ఇలా ప్రతీ సందర్భంలోనూ శుభాకాంక్షలు చెప్పుకోవడం ఒక సంప్రదాయంగా మారింది. ఫోన్ కాల్ ద్వారా చెప్పడం కంటే కార్డు రూపంలో గ్రీటింగ్స్ చెప్పడం ఎక్కువ రోజుల పాటు గుర్తించుకునేలా చేస్తుంది. తపాలా విభాగం వివిధ సందర్భాలకు తగిన విధంగా గ్రీటింగ్ కార్డులను అందిస్తోంది. చిన్న సైజు వాటికి 14 రూపాయలు, ఐదు రూపాయల పోస్టేజీ... అదే కొంచెం పెద్ద సైజు కార్డులైతే 17 రూపాయలతోపాటు ఐదు రూపాయల పోస్టేజీ చార్జీ చెల్లించాల్సి ఉంటుంది.
లాజిస్టిక్స్ పోస్ట్
సరుకు రవాణాకు ఉద్దేశించినది ఇది. ట్రక్ లోడ్ నుంచి సాధారణ పార్సిల్ వరకు ఎంత మొత్తంలోనైనా సరుకులను ఈ సర్వీస్ ద్వారా పంపుకునేందుకు వీలుంది. బరువు, పరిమాణం, దూరాన్నిబట్టి చార్జీ ఉంటుంది.
బిల్ మెయిల్ సర్వీస్
నెలనెలా బిల్స్ లేదా ఫైనాన్షియల్ స్టేట్ మెంట్లు పంపిణీ చేయాలనుకున్న సంస్థలు ఈ సర్వీస్ ను వినియోగించుకోవచ్చు. కనీసం ఐదు వేల ఆర్టికల్స్ లేదా బిల్స్ ను మెయిల్ చేయాల్సి ఉంటుంది. 50 గ్రాముల వరకు కేవలం ఒక్కోదానికి మూడు రూపాయల చార్జీతోనే పంపుకోవచ్చు. అదనంగా ప్రతి 50 గ్రాములకు రెండు రూపాయల చార్జీ ఉంటుంది.
డైరెక్ట్ పోస్ట్
వ్యాపార సంస్థలు, కంపెనీలు తమ ఉత్పత్తులు, సేవల గురించి ప్రచారం చేసుకోవడానికి తలాలా శాఖ డైరెక్ట్ పోస్ట్ సర్వీసు ప్రవేశపెట్టింది. లెటర్లు, కార్డులు, కరపత్రాలు, శాంపిళ్లు మొదలైన వాటిని వీటి కింద పంపిణీ చేస్తారు. స్థానికంగా పంపిణీకి గాను ఒక్కోదానికి 1.50 రూపాయలు, ఇంటర్ సిటీ మధ్య 2 రూపాయల చార్జీ ఉంటుంది. 20 గ్రాముల బరువు వరకే ఈ చార్జీ. ఆ తర్వాత ప్రతీ 20 గ్రాములకు రూపాయి అదనపు చార్జీ చెల్లించాలి. కనీసం వెయ్యి పీసులను డైరెక్ట్ పోస్ట్ ద్వారా పంపాల్సి ఉంటుంది. ఆర్టికల్ ఏ3 సైజ్ కు మించకుండా ఉండాలి. ఏ ప్రాంతంలో ఎన్ని పంపిణీ చేయాలో ముందుగా తెలియజేస్తే దాని ప్రకారం డెలివరీ చేస్తారు.
రిటైల్ పోస్ట్ఇతర కంపెనీలు ఉత్పత్తులు, సేవలను పోస్ట్ ద్వారా వినియోగదారుల ఇంటి ముంగిటకు పంపిణీ చేయడం దీని ఉద్దేశం. విద్యుత్ బిల్లుల వసూళ్లు, పన్నుల వసూళ్లు, ఇతర బిల్లులు, ప్రభుత్వ ఫీజులు వసూలు చేస్తారు. రైల్వే రిజర్వేషన్ టికెట్లు విక్రయించడం, రాఖీలు, లడ్డూ ప్రసాదాలు విక్రయించడం, భద్రాద్రి రామయ్య కల్యాణం తలంబ్రాలు విక్రయం వంటి పనులు కూడా ఈ సర్వీస్ ద్వారానే జరుగుతుంటాయి.
పోస్టల్ రేట్లు...
- పోస్ట్ కార్డుల్లో మేఘ్ దూత్, సింగిల్, రిప్లయ్, ప్రింటెడ్, కాంపిటిషన్ పోస్ట్ కార్డు రకాలు ఉన్నాయి. సాధారణ మేఘ్ దూత్ కార్డు 25 పైసలు కాగా, సింగిల్ 50 పైసలు, రిప్లయ్ 1 రూపాయి, ప్రింటెడ్ కార్డు ( కార్డుపై ముద్రించిన సమాచారం లేదా ఫొటోలు) 6 రూపాయలు, కాంపిటిషన్ కార్డు (వివిధ పోటీల్లో ప్రవేశాలకు సంబంధించినది) 10 రూపాయల ధర ఉంది.
- ఇన్ లాండ్ లెటర్ దర 2.50రూపాయలు
- లెటర్.. ఎన్వలప్ కవర్ తో కూడిన లెటర్ 20 గ్రాముల వరకు 5 రూపాయలు. అలాగే ప్రతి 20 గ్రాముల అదనపు బరువుకు 5 రూపాయల చార్జీ. గరిష్ఠంగా 2 కిలోల బరువు వరకే లెటర్స్ ను అనుమతిస్తారు.
- బుక్ ప్యాకెట్స్, శాంపిల్స్ కు మొదటి 5 గ్రాముల బరువు వరకు 4 రూపాయలు. తర్వాత ప్రతి 50 గ్రాములకు అదనంగా 3 రూపాయలు చెల్లించాలి. ఇలా 5 కిలోల బరువు వరకు ప్యాకెట్స్ ను పంపుకోవచ్చు.
- ప్రింటెడ్ బుక్స్ తో కూడిన బుక్ ప్యాకెట్లు 100 గ్రాముల వరకు రూపాయి చార్జీ. ప్రతి అదనపు 100 గ్రాముల మొత్తానికి రూపాయి అదనపు చార్జీ ఉంటుంది.
- ప్రభుత్వ నమోదిత రిజిష్టర్డ్ న్యూస్ పేపర్ల పంపిణీకి ఒక్కోదానికి 50 గ్రాముల వరకు 25పైసలు, తదుపరి 50 గ్రాముల బరువుకు 50 పైసలు ఆ తర్వాత ప్రతి అదనపు 100 గ్రాముల బరువుకు గాను 20 పైసలు చార్జీ చెల్లించాలి.
- పార్సిళ్లు అయితే మొదటి 500 గ్రాముల బరువుకు 19 రూపాయలు, తర్వాత ప్రతి 500 గ్రాముల బరువుకు 16 రూపాయల చార్జీ ఉంటుంది.
- పంపుతున్న వాటికి ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటే 200 రూపాయల విలువకు గాను 10 రూపాయలు, ఆ తర్వాత ప్రతి 100 రూపాయల మొత్తానికి ఆరు రూపాయలు చెల్లించాలి.
- వీపీపీ అయితే 20 రూపాయల్లోపు విలువకు 2 రూపాయలు, 21 నుంచి 50 రూపాయల్లో విలువకు 3 రూపాయలు, ఈ మొత్తం దాటితే 3 రూపాయల చార్జీ ఉంటుంది.
ఎయిర్ మెయిల్ సర్వీస్
- విదేశాలకు లెటర్లు పంపుకోవాలంటే 20 గ్రాముల వరకు చార్జీ 20 రూపాయలు. ఆ తర్వాత ప్రతీ అదనపు 20 గ్రాములకు (500 గ్రాముల వరకు) 8 రూపాయల చొప్పున చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. 500 గ్రాములు దాటితే... తర్వాత ప్రతి 100 గ్రాముల బరువుకు 30 రూపాయల చొప్పున 2 కిలోగ్రాముల వరకు చార్జ్ చేస్తారు.
- చిన్న ప్యాకెట్లు అయితే100 గ్రాముల వరకు 40 రూపాయల చార్జీ. ఆ తర్వాత ప్రతి 100 గ్రాములకు 30 రూపాయల చొప్పున 2 కిలోల వరకు చార్జీ ఉంటుంది.
- ప్రింటెడ్ పేపర్లను పంపాలనుకుంటే 20 గ్రాముల వరకు 10 రూపాయలకే పంపుకోవచ్చు. ఆ తర్వాత పత్రి 20 గ్రాములకు 5 రూపాయల చొప్పున 500గ్రాముల వరకు చార్జీ వసూలు చేస్తారు. 500 గ్రాములు దాటితే 2 కిలోల వరకు ప్రతి 100 గ్రాములకు 20 రూపాయలలు చెల్లించాలి.
- పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ దేశాలకు పోస్ట్ కార్డ్ పంపేందుకు చార్జీ 8 రూపాయలు. మిగిలిన అన్ని దేశాలకు చార్జీ 12 రూపాయలు.