చైనా సొగసు చూడతరమా....?

పొరుగున ఉన్న చైనాలో ప్రకృతిపరంగా సహజ అందాలకు కొదువే లేదు. పర్యాటకులకు ఈ దేశం పెద్దపీట వేస్తోంది. ప్లాన్ చేసుకుంటే తగిన బడ్జెట్ లోనే చైనా అందాలను పలకరించి రావచ్చు. ఏటా ఆరు కోట్ల మంది విదేశీయులు చైనాలో పర్యటిస్తున్నారంటే చూడతగ్గ విశేషాలు ఎన్ని ఉన్నాయో ఆలోచించండి. 

టికెట్ ధరలు

హైదరాబాద్ నుంచి హాంగ్ కాంగ్ కు విమానంలో వెళ్లేందుకు రెండు నెలల ముందుగా బుక్ చేసుకుంటే 10 వేల రూపాయల ప్రారంభం నుంచి టికెట్ ధరలు ఉన్నాయి. నెల రోజుల ముందు అయితే, 13వేల రూపాయల పైన చార్జీ ఉంది. ప్రయాణం 10 గంటలకు పైనే ఉంటుంది. హైదరాబాద్ నుంచి బీజింగ్ కు విమాన టికెట్ ధరలు 18,000 రూపాయల నుంచి ఉన్నాయి. చెన్నై టు హాంగ్ కాంగ్ రూ.12,000 రూపాయలు, బెంగళూరు నుంచి అయితే 16,000 స్థాయిలో టికెట్ ధరలు ఉన్నాయి. నెల రోజుల ముందుగా అయితే చెన్నై నుంచి బీజింగ్ కు రూ.23,000, బెంగళూరు నుంచి బీజింగ్ కు రూ.30,000 టికెట్ చార్జీలు ఉన్నాయి.  representational image

ఇంగ్లిష్ బోర్డులు కనిపించవు!

చైనాలో స్థానికంగా పర్యటించేందుకు చక్కటి రవాణా వసతులు ఉన్నాయి. ఆర్థిక స్థాయినిబట్టి విమానాలు లేదంటే రైల్, బస్ సర్వీసులను వినియోగించుకోవచ్చు. బీజింగ్ నుంచి హాంగ్ కాంగ్ కు బుల్లెట్ రైల్లో 73 అమెరికా డాలర్ల చార్జీతో వెళ్లవచ్చు. బీజింగ్ నుంచి షాంఘైకి 88 డాలర్ల చార్జీ ఉంది. అలాగే, హాంగ్ కాంగ్ నుంచి షాంఘైకి 64 డాలర్లు. హాంగ్ కాంగ్ నుంచి గువాంగ్జు కు టికెట్ ధర 29 డాలర్లు. చైనా పెద్ద భూభాగంతో కూడిన దేశం కనుక వాయవ్య, నైరుతి, సెంట్రల్ చైనా ప్రాంతాలకు విమానాల కంటే తక్కువ వ్యయానికి బుల్లెట్ రైళ్లలో వెళ్లవచ్చు. బీజింగ్ నుంచి షాంఘైకి ఐదు నుంచి ఆరు గంటల సమయం పడుతుంది. చైనా రైల్వే స్టేషన్లలో ఇంగ్లిష్ బోర్డులు తక్కువగా కనిపిస్తాయి. అక్కడి సిబ్బంది కూడా ఇంగ్లిష్ మాట్లాడరు. చైనాలో బస్సుల్లో దూర ప్రయాణం భద్రతా కోణంలో అంత సురక్షితం కాదు.  చార్జీలు తక్కువే అయినా చోరీలు, ఇతరత్రా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. రైళ్లు, టికెట్ ధరల వివరాలకు http://www.seat61.com/China.htm#.Vt5myn197Dc వెబ్ సైట్ ను సందర్శించవచ్చు. 

బస, ఆహార వసతులు

బీజింగ్ లో హోటల్స్ లో ఉండేందుకు ఒకరోజుకు గాను చార్జీ ప్రారంభ ధర 500 రూపాయలు. హాంగ్ కాంగ్ లో ఈ ధర వెయ్యి రూపాయలుగా ఉంది. ప్రయత్నిస్తే ఇంతకంటే కొంచెం తక్కువకు కూడా దొరకవచ్చు. వివరాలకు https://in.hotels.com వెబ్ సైట్ ను చూస్తే అవగాహన వస్తుంది. ఆహారం విషయానికొస్తే 20 యువాన్ల నంచి 250 యువాన్ల వరకు చెల్లించుకోవాలి. ఒక యువాన్ భారత కరెన్సీలో పది రూపాయలతో సమానం. శాకాహార, మాంసాహార వంటకాలను బట్టి ధరల్లో మార్పులు ఉంటాయి. శాకాహారం కంటే మాంసాహార హోటల్స్ ఎక్కువగా కనిపిస్తాయి. షెంజెన్ లోని బాలీవుడ్ కేఫ్ దక్షిణాది వంటలకు, ‘1947’ ఉత్తరాది వంటలకు ప్రసిద్ధి. అలాగే, ఇండియన్ ఇన్ రెస్టారెంట్, తాజ్ మహల్ కూడా ప్రముఖమైనవే. 

representational image

ట్యాక్సీ సేవలు అన్ని ప్రాంతాల్లోనూ అందుబాటులో ఉన్నాయి. చైనాలో పర్యాటకులు తక్కువ దూరాలకు ట్యాక్సీలను వినియోగించుకోవడం సౌలభ్యంగా ఉంటుంది. బీజింగ్ లో ట్యాక్సీ ప్రారంభ ధర పది యువాన్ లు. మూడు కిలోమీటర్ల వరకు ఈ ధరే వర్తిస్తుంది. ఆ తర్వాత ప్రతి కిలోమీటర్ కు రెండు యువాన్ల చొప్పున చార్జీ వసూలు చేస్తారు. పదిహేను కిలోమీటర్లు మించితే ప్రారంభ ధర 10 యువాన్లతోపాటు ప్రతి కిలోమీటర్ కు మూడు యువాన్ల చార్జీ ఉంటుంది. 

టూర్ ప్యాకేజీలు... 

షాంఘై దాని చుట్టు పక్కల ప్రాంతాలను బుల్లెట్ రైళ్ల ద్వారా చూసి వచ్చేందుకు ఐదో రోజుల టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. దీనికి 820 అమెరికన్ డాలర్ల వ్యయం అవుతుంది. రాను పోను రవాణా, హోటల్లో బస, బ్రేక్ ఫాస్ట్, సైట్ సీయింగ్ ఉచితం. షాంఘై నుంచి హాంగ్జూ, రెండో రోజు షుజూ, మూడో రోజు షుజూ చుట్టుపక్కల ప్రాంతాల సందర్శన, నాలుగోరోజు నాన్జాంగ్, ఐదోరోజు షాంఘై తిరుగు ప్రయాణం.  

చైనాలో ఉన్న ప్రముఖ అద్భుత ప్రదేశాలను చుట్టివచ్చే 11 రోజుల పర్యటన ప్యాకేజీ కూడా ఉంది. దీనిలో భాగంగా బీజింగ్, గ్జియాన్, గులిన్/యాంగ్షూ, షాంఘై పర్యటన ఉంటుంది. పర్యాటకులకు అన్ని రకాల సదుపాయాలు కల్పించి తీసుకెళ్లేందుకు 1399 డాలర్లు చార్జ్ చేస్తారు. వివరాలకు http://www.chinahighlights.com/tour/cht-63/ వెబ్ సైట్ చూడవచ్చు. చైనాలో నదీ జల రవాణా కూడా అందుబాటులో ఉంది. అన్నింటిలోకి యాంగ్జే నది క్రూయిజ్ బోట్ టూర్ కు మంచి ఆదరణ ఉంది. షాంఘై నుంచి చోంగింగ్ వరకు క్రూయిజ్ బోట్ సర్వీస్ లో ప్రయాణించడం మరచిపోలేని అనుభూతినిస్తుంది. 

ఎన్నో అద్భుతాలు... 

ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన్ గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను చూడడం ఓ గొప్ప అనుభూతి. చైనా రక్షణ కోసం పూర్వ కాలంలో నిర్మించిన ఈ కట్టడం పశ్చిమం నుంచి తూర్పు వైపు వరకు సుమారు 5 వేల కిలోమీటర్ల పొడవునా ఉంటుంది. ఇందులో రాజధాని బీజింగ్ కు సమీపంలో ఉన్న వాల్ భాగం విదేశీ పర్యాటకులు చూసేందుకు అనువైనది. 

representational image

భూమిలో రెండు వేల సంవత్సరాలకు పైగా దాగి ఉన్న టెర్రకోట ఆర్మీ (మట్టితో రూపొందిన సైనికులు) ప్రాంతం 1974లో షాంగ్జి ప్రావిన్స్ లోని లింటాంగ్ జిల్లాలో వెలుగు చూసింది. క్రీస్తు పూర్వం 210 కాలానికి సంబంధించి చైనా మొదటి చక్రవర్తి కిన్ షి హువాంగ్ సైన్యానికి చెందిన 8వేల మంది సోల్జర్లు, 130 రథాలు, 520 గుర్రాలు, 150 అశ్వకదళ గుర్రాల శిల్పాలు ఇక్కడ ఉన్నాయి. అయితే వీటిలో చాలా వరకు శిధిలమయ్యాయి. సైనికేతర వ్యక్తుల శిల్పాలను కూడా ఇక్కడ కనుగొన్నారు. 

బీజింగ్ లో తప్పక చూడాల్సినది ఫర్ బిడెన్ సిటీ. ఇక్కడి ప్యాలస్ ప్రపంచంలోని ఐదు అత్యంత ప్రాముఖ్యత కలిగిన రాజప్రాసాదాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. మింగ్, ఖింగ్ రాజులకు ఇది 560 సంవత్సరాల పాటు రాజప్రాసాదంగా ఓ వెలుగు వెలిగింది. ప్రస్తుతం దీన్ని ప్యాలస్ మ్యూజియంగా సందర్శకులకు అందుబాటులో ఉంచారు.  

representational image

గులిన్ లోని లీ నది తీరంలోని పచ్చదనం అందాలు కళాకారులు, ప్రకృతి ప్రియుల మనసు దోచేస్తాయి. గులిన్, యాంగ్షూల మధ్య 83 కిలోమీటర్ల మేర ఉన్న ఈ నది తీరం వెంట కొండలు, పచ్చటి వనాలు, చిన్నగ్రామలు ఉంటాయి. తూర్పు చైనాలోని షాంఘై, హాంగ్షూ సమీపంలోని యెల్లో మౌంటెన్స్ ను కూడా తప్పక చూడాలి. అసాధారణ రూపంలోని కొండలు... వీటిని ఆనుకుని మేఘాలు వెళుతుండడం... దేవదారు వృక్షాలు, సూర్యోదయ వీక్షణ ఇక్కడి ప్రత్యేకతలు. 

గెయింట్ పాండాలు చైనాలోని అన్ని జూపార్కులలో కనిపిస్తాయి. అయితే వీటికి హోమ్ టౌన్ గా చెంగ్డు ప్రాంతాన్ని చెబుతారు. ఇక్కడ ఎక్కువ సంఖ్యలో గెయింట్ పాండాలను సంరక్షిస్తున్నారు.  టిబెటన్ల చరిత్ర, సంస్కృతికి నిదర్శనంగా పోటాల ప్యాలస్ పర్యాటకులను ఆకట్టుకుంటోంది. హాంగ్ కాంగ్ లోని విక్టోరియా హార్బర్ నింగిని తాకేట్టు ఉండే ఎత్తయిన నిర్మాణాలతో చూడ్డానికి అద్భుతంగా కనిపిస్తుంది. భూలోక స్వర్గంగా హాంగ్జూని చైనీయులు చెప్పుకుంటుంటారు. మూడు వైపులా కొండలు, పక్కనే సరస్సుతో సందర్శకుల మనసును కట్టిపడేస్తుంది. 

representational image

కైలాస మానస సరోవరం… పార్వతీ సమేతుడైన ఈశ్వరుడు నివసించేది ఇక్కడేనన్నది ఓ నమ్మకం. హిందువులకు అత్యంత పవిత్రమైన ప్రదేశం. హిమాలయ పర్వతాల్లో 15060 అడుగుల ఎత్తులో ఉంటుంది మానస సరోవరం. అత్యంత శీతల వాతావరణంతో కూడిన ఈ ప్రదేశానికి చేరుకోవాలంటే శారీరకంగా ఆరోగ్యవంతులైన వారికే సాధ్యం. ఏటా భారత ప్రభుత్వం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఈ యాత్ర నిర్వహిస్తుంటుంది. పాస్ పోర్ట్ కలిగి ఉండాలి. లిపు లేక్ పాస్ (ఉత్తరాఖండ్), నాథులా పాస్ (సిక్కిం) అనే రెండు యాత్రా మార్గాలు ఉన్నాయి. యాత్రకు 23 నుంచి 25 రోజులు, వ్యయం రూ.1.7లక్షల వరకు ఉంటుంది. 


More Articles