మొబైల్ ఫోన్ నుంచి అదిరిపోయే వీడియో తీయాలనుందా...

స్మార్ట్ ఫోన్ రూపంలో శక్తిమంతమైన కెమెరా నేడు అందుబాటులోకి వచ్చింది. దీంతో వేడుకలు, పిల్లల ఆటపాటలు, బయటకు వెళితే అరుదైన దృశ్యాలను వీడియో తీసే అలవాటు పెరుగుతోంది. అయితే, చాలా మందికి వీడియోలను నాణ్యంగా, మెరుగ్గా తీయడం ఎలాగన్నది తెలియదు. మరి అద్భుతంగా వీడియోలను షూట్ చేయాలంటే తెలుసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి...


ఎఫ్ పీఎస్
representational imageస్మార్ట్ ఫోన్లు పూర్తి స్థాయి కెమెరా గ్యాడ్జెట్స్ కాకపోయినప్పటికీ, ప్రీమియం ఫోన్లలో దాదాపు చాలా ఆప్షన్స్ ఉంటున్నాయి. భిన్న రకాల రిజల్యూషన్, ఫ్రేమ్ రేట్స్ తో వస్తున్నాయి. 1080 @ 30 ఫ్రేమ్స్ ఇది స్టాండర్డ్ రిజల్యూషన్, ఫ్రేమ్ రేట్ కాంబినేషన్. ప్రతీ సెకనుకు చూపించే ఫ్రేమ్స్ (ఎఫ్ పీఎస్) ఎక్కువగా ఉంటాయి. 1080 @ 24 ఫ్రేమ్స్, 1080 @ 60 ఫ్రేమ్స్ అన్నవి ప్రతీ సెకనుకు కెమెరా బంధించే దృశ్యాలు. 60 ఎఫ్ పీఎస్ లేదా అంతకంటే ఎక్కువ ఎఫ్ పీఎస్ తో (120 లేదా 240 ఎఫ్ పీఎస్) తీసే వీడియో స్లో మోషన్ తో (నిదానంగా) ఉంటుంది. 120 ఎఫ్ పీఎస్ అన్నది సాధారణ వేగం కంటే ఐదు రెట్లు తక్కువ. అలాగే, 240 ఎఫ్ పీఎస్ అయితే 10 రెట్లు నిదానంగా ఉంటుంది. కెమెరా సెట్టింగ్స్ కు వెళ్లి అక్కడ స్పీడ్ ను తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు.

4కే వీడియో
representational imageప్రీమియం స్మార్ట్ ఫోన్లలో 4కే వీడియో తీసే ఆప్షన్ కూడా ఉంటోంది. ఇందుకోసం సెట్టింగ్స్ కు వెళితే ఈ ఆప్షన్ ఉన్నదీ, లేనిదీ తెలుస్తుంది. 3840x2160 రిజల్యూషన్ తో షూట్ చేసుకోవచ్చు. అయితే, చాలా మంది 4కే వీడియో ఆప్షన్ ఎంచుకోరు. ఎందుకంటే ఈ స్థాయి అధిక రిజల్యూషన్ వీడియోలను చూపించే స్క్రీన్లు తక్కువే. అయితే, 4కేలో షూట్ చేస్తున్నారంటే అవి భవిష్యత్తు ఆధారిత వీడియోలను తీస్తున్నట్టు. సమీప భవిష్యత్తులో అన్ని రకాల స్క్రీన్లు ఈ వీడియోలను చూపించే సామర్థ్యాన్ని కలిగి ఉండొచ్చు. 4కే లో తీసే వీడియోలో వివరాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే, సాధారణ వీడియోల కంటే ఎన్నో రెట్లు అధికంగా స్టోరేజీ స్పేస్ తీసుకుంటాయి.

4కే అంటే...?
representational imageవీడియో రిజల్యూషన్ సూచిక. ఇది అధిక రిజల్యూషన్. అంటే ఎక్కువ పిక్సల్స్ ఉంటాయి. పిక్సల్స్ ఎక్కువగా ఉంటే చిత్రాలు స్పష్టంగా ఉంటాయి. హెచ్ డీ వీడియో రిజల్యూషన్ 1080 పిక్సల్స్ తో ఉంటుంది. 4కే దానికి నాలుగు రెట్లు అధికం. ప్రస్తుతానికి ఇదే అధిక రిజల్యూషన్. ప్రీమియం ఫోన్లలో ఈ ఆప్షన్ ఉంటోంది.

ఇమేజ్ స్టెబిలైజేషన్
representational imageఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేష్ ఫీచర్ లేటెస్ట్ ఫోన్లలో చాలా వాటిలో ఉంటోంది. ఫోన్లోని గైరోస్కోప్, యాసిలరోమీటర్ ఇచ్చే సమాచారం ఆధారంగా కెమెరా ఆప్టికల్స్ ఫోన్ కదలికలను పసిగడుతుంది. దీంతో వీడియో తీస్తున్న సమయంలో చేయి కదిలినా, నడుస్తూ, కదులుతూ ఉన్న సమయంలో వీడియో తీస్తుంటే ఆ ప్రభావాన్ని వీడియోపై పడనీయకుండా ఇమేజ్ కదలికలను ఫోన్ నియంత్రిస్తుంది.

డిజిటల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనే ఆప్షన్ కూడా ఉంటుుంది. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మాదిరిగానే ఫోన్ షేకింగ్ ను గుర్తించి నిలకడగా ఉండేలా చూస్తుంది. అయితే, డిజిటల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లో వీడియోను కదలకుండా ఉండాలంటే ఇమేజ్ నాణ్యతను త్యాగం చేయాల్సి వస్తుంది. ఈ తేడా తెలుసుకోవాలంటే ఒకే ఇమేజ్ ను డిజిటల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఆన్ చేసి, ఆన్ చేయకుండా తీయాలి. వీడియో తీసే సమయంలో రెండు చేతులతో ఫోన్ ను పట్టుకుని బాడీకి దగ్గరగా ఉంచుకోవడం ద్వారా షేకింగ్ ను చాలా వరకు దూరం చేయవచ్చు. అలాగే, ఫోన్ తో షేకింగ్ లేకుండా నిలకడైన వీడియో తీసేందుకు ట్రైపాడ్, క్లాంప్, స్టెబిలైజర్ రింగ్స్ వంటి పరికరాలను వాడొచ్చు.

లెన్స్
లెన్స్ ఎంత శుభ్రంగా ఉన్నాయనేది సాధాణంగా పట్టించుకోరు. లెన్స్ ను వీడియో తీయడానికి ముందు క్లీన్ చేసుకోవాలి. వీడియో క్లారిటీకి ఇది కీలకం.

జూమ్
representational imageచాలా ఫోన్లలో ఉంటున్నది డిజిటల్ జూమ్. ఇది ఎందుకూ ఉపయోగం లేని ఫీచర్. దీనివల్ల వీడియో నాణ్యత దారుణంగా వస్తుంది. దీని కంటే కూడా దగ్గర్నుంచి వీడియో తీసుకోవడం నయమన్నది నిపుణుల సలహా. ఎందుకంటే డిజిటల్ జూమ్ అంటే కనిపిస్తున్న దృశ్యాన్ని పెద్దది చేయడం. దాంతో రిజల్యూషన్ చెదిరిపోతుంది. కెమెరా లెన్స్ ఆప్టికల్ జూమ్ విధానంలో ఫోన్ కు, సబ్జెక్ట్ కు మధ్య దూరాన్ని తగ్గిస్తుంది. దీంతో క్లారిటీ దెబ్బతినదు.

ఫ్లాష్
representational imageవీడియోలోని వ్యక్తుల చర్మం పసుపురంగులో ఉండడం, ఎరుపురంగుతో కూడిన కళ్ల ఛాయలు, బ్యాక్ గ్రౌండ్ నలుపుతో ఉండడం గమనించే ఉంటారు. ఇవి ఫ్లాష్ కారణంగా వచ్చినవే. కొన్ని స్మార్ట్ ఫోన్లలో ఫ్లాష్ కోసం ఏర్పాటు చేసే ఎల్ ఈడీ లైట్లు చాలా బ్రైట్ గా ఉంటున్నాయి. ఇవి కొన్ని సందర్భాల్లో కలర్ టెంపరేచర్ ను మార్చేస్తాయి. ఫ్లాష్ కు బదులు ఇతర లైటింగ్ ను ఉపయోగించుకోవడం నయం.

సరైన వెలుగు అన్నది కెమెరాపై చాలా ప్రభావమే చూపిస్తుంది. ఎందుకంటే స్మార్ట్ ఫోన్ కెమెరాలలో ఇమేజ్ సెన్సార్లు, లెన్స్ లు చిన్నవిగానే ఉంటాయి. కనుక సరిపడా వెలుగు స్మార్ట్ ఫోన్ వీడియోలైనా, ఫొటోలకైనా ప్రాణవాయువు వంటిది. అందుకే వీడియో తీసే సమయంలో సరిపడా వెలుగు ఉండేలా చూసుకోవాలి. దీంతో వీడియో ఫుటేజీలో షేడ్స్ లేకుండా ఉంటుంది. అలాగే, లైటింగ్ వచ్చే సోర్సెస్ వైపు కెమెరా డైరెక్షన్ ఉంచరాదు.

దగ్గరగా, హారిజాంటల్ గా...
representational imageసబ్జెక్ట్ (వీడియో తీయాలనుకుంటున్న అంశం)కు దగ్గరగా వెళ్లి వీడియో తీయడం వల్ల చిత్రాల నాణ్యత మెరుగ్గా వస్తుంది. డిజిటల్ నాయిస్ తక్కువగా ఉంటుంది. ఫోన్ చక్కగా ఫోకస్ చేయడానికి వీలుంటుంది. అలాగే, ఆడియో క్యాప్చరింగ్ కూడా మెరుగ్గా ఉంటుంది.

ఇక వీడియోను ఫోన్ ను అడ్డంగా (హారిజాంటల్) పట్టుకుని తీయాలి. నిలువుగా తీయడం వల్ల వీడియో చూసేందుకు సౌకర్యంగా ఉండదు. సబ్జెక్ట్ వైడ్ గా ఉండదు. ఇతర స్క్రీన్లలో వీడియో ప్లే చేసినప్పుడు చూసేందుకు అనువుగా ఉండాలంటే అది హారిజాంటల్ మోడ్ లో ఉండేలా చూసుకోవాలి. యూట్యూబ్ లో ఏ వీడియోను గమనించినా అది హారిజాంటల్ గానే ఉంటుంది. మీరు తీసే వీడియోలు వాటితో ఇమిడిపోవాలంటే హారిజాంటల్ గా తీయడమే సరైనది.  

స్లో మోషన్ మోడ్
representational imageప్రీమియం ఫోన్లలో 4కేతోపాటు స్లో మోషన్ వీడియో ఆప్షన్ కూడా ఉంటోంది. కొన్ని రకాల సీన్లకు ఇది బాగుంటుంది. అయితే, స్లో మోషన్ వీడియోలకు వెలుగు తగినంత తప్పనిసరి. వీడియోస్లో మోషన్ లో ఉందంటే ఎఫ్ పీఎస్ అధికంగా ఉంటుంది. అధిక ఎఫ్ పీఎస్ వల్ల ఇమేజ్ రిజల్యూషన్ తక్కువ అవుతుందన్నవిషయం గుర్తు పెట్టుకోవాలి.

ఆడియో
వీడియోలో భాగంగా ఆడియో రికార్డింగ్  స్పష్టంగా ఉండేలా చూసుకోవాలి. ఫోన్లలో ఇన్ బిల్ట్ గా ఉండే మైక్రో ఫోన్ వాయిన్ సు బాగా గ్రహించలేకపోతే ఫోన్ ను వాయిస్ కు దగ్గరగా ఉండేలా చూసుకోవాలి. లేదా విడిగా ఎక్స్ టర్నల్ ప్రొఫెషనల్ మైక్రోఫోన్ వాడుకోవడం మంచిది.

వీడియో కంప్రెస్ అవకుండా...
వీడియోను టెక్స్ట్ ద్వారా పంపాలనుకుంటే చాలా వరకు స్మార్ట్ ఫోన్లు ఫైల్ సైజ్ ను కంప్రెస్ చేస్తాయి. దీంతో క్వాలిటీ తగ్గిపోతుంది. కనుక కెమెరా సెట్టింగ్స్ లో వీడియోను అధిక క్వాలిటీకే సెట్ చేసుకోవాలి. దాంతో ఫైల్ కంప్రెస్ అవకుండా ఉంటుంది. దీనివల్ల వీడియో ఫైల్ అధిక స్పేస్ తీసుకుంటుంది. కావాలనుకుంటే తర్వాత ఎడిట్ చేసుకోవచ్చు.


More Articles