కూరగాయలు, పండ్లను ఎలా తీసుకోవాలి...? బరువు తగ్గేందుకు ఏ విధంగా వాడాలి?

పండ్లు, కూరగాయల నుంచి రసం తీసుకుని తాగే అలవాటు చాలా మందిలో కనిపిస్తుంది. అయితే, పండ్లు, కూరగాయల్లో వేటిలో ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలున్నది తెలిసింది తక్కువ మందికే. అందుకే, దీని ద్వారా ఆ విషయాలు తెలుసుకుందాం.
ద్రవ పదార్థాలు (రసాలు) అన్నవి మన శరీరానికి ఎంతో అవసరం. ఇవి శరీరంలో పేరుకుని పోయిన వ్యర్థాలను బయటకు పంపిస్తాయి. జీర్ణవ్యవస్థకు కాస్తంత విరామాన్ని ఇస్తాయి. పేగులను శుభ్రం చేసేందుకు ఇవి అవసరం. పండ్ల రసాలైనా, కూరగాయల రసాలైనా మన శరీరానికి శక్తినిచ్చేవే. ఓ గ్లాసుడు ఆరెంజ్ జ్యూస్ తో విటమిన్-సి కావాల్సినంత లభిస్తుంది. అలాగే, కీరదోస, పాలకూర జ్యూస్ మనలోని వ్యర్థాలను పోగొట్టి, తాజాదనం అందిస్తాయి. యాపిల్, బీట్ రూట్, క్యారట్ జ్యూస్ కలిపి తాగితే బరువు తగ్గుతారు.
90/10

తాజా పండ్లలో, కూరగాయల్లో తగినన్ని పోషకాలుంటాయి. అయితే, పోషక ప్రయోజనాలు కాస్తంత కూరగాయల్లోనే ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతుంటారు. ఇందుకు రెండు కారణాలున్నాయి. పండ్ల రసాల్లో మంచి పోషకాలతోపాటు చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. కనుక ఒకేసారి పండ్లను ఎక్కువ మొత్తంలో తీసుకోవడం అన్నది సాధ్యపడదు. కాకపోతే పండ్ల రసం రూపంలో తీసుకోవచ్చు. అదే కూరగాయల్లో అయితే చక్కెరల శాతం చాలా తక్కువ. పండ్లతో పోల్చి చూస్తే కేలరీలు కూడా తక్కువే. పోషకాలు మాత్రం పుష్కలంగా లభిస్తాయి.
కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి...

జర్నల్ అపెటైట్ లో ప్రచురితమైన పరిశోధనా కథనం మేరకు... పరిశోధకులు పండ్లను వివిధ రూపాల్లో ఇచ్చి చూశారు. యాపిల్ జ్యూస్, యాపిల్ సాస్, యాపిల్ పండు రూపంలో తినిపించి చూడగా, జ్యూస్ తాగిన వారిలో కడుపు నిండిన, ఆకలి తీరిన భావన కలగలేదు. అదే పండు రూపంలో నేరుగా తిన్న వారిలో కడుపు నిండినట్టు భావన కలిగింది. పండ్లు, కూరగాయలు రెండింటిలోనూ ఆల్కాలిన్ ఉంటుంది. అందులోనూ ఆప్రికాట్స్, కాంటలోప్ మినహా కూరగాయల్లో ఆల్కలైజింగ్ ఎక్కువ. . శరీర ద్రవాల్లో ఆల్కాలిన్ ఉండడం చాలా అవసరం. కూరగాయల్లోని ఆల్కాలిన్ మన శరీరంలో పీహెచ్ ను సమతుల్యం చేస్తుంది. సరైన ఆరోగ్యానికి ఈ పీహెచ్ బ్యాలన్స్ ఎంతో అవసరం.
జ్యూస్ రూపంలో వద్దు

అలాగే, జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారని, తేలిగ్గా జీర్ణమవుతుందన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. నిజానికి నేరుగా తినడం కంటే జ్యూస్ రూపంలో తీసుకోవడం ఆరోగ్యకరమని శాస్త్రీయ పరిశోధనలు ఇంత వరకు నిర్ధారించలేదు. ఒకవేళ పండు, కూరగాయలను నేరుగా తినలేని పరిస్థితుల్లో మాత్రమే జ్యూస్ తీసుకోవడం మినహా మరో ఆప్షన్ లేదు. అయితే, ఇలాంటప్పుడు జ్యూస్ చేసుకున్న తర్వాత పండులో తినదగిన భాగాలను కూడా తింటే ఫైబర్ ఎంతో కొంత అందుతుంది. జ్యూస్ చేసుకున్న వెంటనే తాగేయాలి. లేదంటే నిమిషాల వ్యవధిలోనే బ్యాక్టీరియా ఫామ్ అయిపోతుంది. జ్యూస్ లో అధిక చక్కెరలు ఉంటాయి గనుక బరువు పెరిగే అవకాశం ఉంటుంది.