ఆధార్ కార్డు ఎందుకు... ఫోన్లో ఎంఆధార్ యాప్ వేసుకుంటే పోదూ...

ఆధార్ కార్డును గుర్తింపు కోసమో, మరో అవసరం కోసమో వెంట తీసుకెళ్లాల్సిన ఇబ్బందులు ఇక అక్కర్లేదు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎంఆధార్ పేరుతో ఒక యాప్ ను తీసుకొచ్చింది. ఈ యాప్ ను స్మార్ట్ ఫోన్లో డౌన్ లోడ్ చేసుకుంటే మీ దగ్గర ఆధార్ కార్డు ఉన్నట్టే. దీని వినియోగం, ఇతర ఉపయోగాలేంటన్నది చూద్దాం.

ఆధార్ డేటాబేస్ లో మీకు సంబంధించి కాంటాక్టు నంబర్ ఏదైతే ఉందో... అదే నంబర్ ను వినియోగిస్తున్న స్మార్ట్ ఫోన్లోకి మాత్రమే ఎంఆధార్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం గూగుల్ ప్లే స్టోర్ కు వెళ్లి mAadhaar అని సెర్చ్ చేస్తే యాప్ కనిపిస్తుంది. దాన్ని ఇన్ స్టాల్ చేసుకోవాలి. ఇన్ స్టాల్ చేసుకున్న తర్వాత మొదటి స్టెప్ లోనే పాస్ వర్డ్ అడుగుతుంది. అందులో 8 నుంచి 12 క్యారక్టర్లతో పాస్ వర్డ్ ను సెట్ చేసుకోవాలి. ఇందులో కనీసం ఒక నంబర్, ఒక అల్ఫాబెట్, ఒక స్పెషల్ క్యారక్టర్ ఉండాలి.యాప్ ను యాక్సెస్ చేసుకునే సమయంలో ఓటీపీ వస్తే దాన్ని యాడ్ చేయక్కర్లేదు. యాప్ స్వయంగా తీసుకుంటుంది. ఈ యాప్ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ డేటా బేస్ తో కనెక్ట్ అయి ఉంటే మీ ఆధార్ వివరాలు యాప్ లో కనిపిస్తాయి. కనుక ఇంటర్నెట్ ఉండాలి. ఆఫ్ లైన్ లో యాప్ పనిచేయదు. ఈ యాప్ ను ఒక మొబైల్ లోనే వాడుకోగలరు. ఒకవేళ మీరు మీ సిమ్ (ఆధార్ తో లింకైన మొబైల్ నంబర్)ను తీసి వేరొక మొబైల్ లో వేసుకుని వాడుతున్నారనుకోండి. అక్కడ ఎంఆధార్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని యాక్సెస్ చేసుకోవచ్చు. అలా చేసుకున్న వెంటనే అంతకుముందు మొబైల్ లో ఉన్న ఎంఆధార్ ప్రొఫైల్ డీయాక్టివేట్ అయిపోతుంది.

representational imageఒకవేళ మీ కుటుంబ సభ్యుల్లో ఇతరుల ఆధార్ నంబర్ కు కాంటాక్టు నంబర్ గా మీ  మీ మొబైల్ నంబర్ ఇచ్చి ఉన్నారనుకోండి. అప్పుడు వారి ఆధార్ ప్రొఫైల్ ను మీ స్మార్ట్ ఫోన్లో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఒక యూజర్ తన మొబైల్ లో మూడు ప్రొఫైల్స్ వరకే యాడ్ చేసుకోగలరు. ఏవైనా సందేహాలు ఉంటే సహకారం కోసం  maadhaar@uidai.net.in సంప్రదించొచ్చు.

ఇలా ప్రొఫైల్ యాడ్ చేసే ముందు మొబైల్ నంబర్ కు వచ్చే ఓటీపీ ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే ఆధార్ తీసుకునే సమయంలో ఇచ్చిన మొబైల్ నంబర్ ను వాడుతూ ఉండడం అవసరం. ముందుగా పాస్ వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత పేజీలో ఆధార్ కార్డు వివరాల్ని పొందుపరచాల్సి ఉంటుంది. దీన్నే ప్రొఫైల్ అంటారు. లేదంటే ఆధార్ కార్డుపై ఉండే క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే వివరాల్ని యాప్ తీసేసుకుంటుంది. అప్పుడు వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. ఈ వెరిఫికేషన్ కోడ్ ను ఆధార్ యాప్ దానంతట అదే తీసుకుంటుంది. ఇక ఆ తర్వాత ఎప్పుడు ఎంఆధార్ యాప్ ను వినియోగించుకోవాలన్నా ముందుగా పాస్ వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. కనుక ఫోన్ పోయినప్పటికీ కంగారు పడాల్సిన పనిలేదు.

ఉపయోగాలు...
ఆధార్ ఫిజికల్ కార్డు గానీ, జిరాక్స్ కాపీలు గానీ వెంట తీసుకెళ్లక్కర్లేదు. ఇదే యాప్ లో ఆధార్ బయోమెట్రిక్ యాక్సెస్ ఇవ్వడానికి వీలుగా లాక్, అన్ లాక్ చేసుకునే సదుపాయమూ ఉంది. యూజర్లు తమ ప్రొఫైల్ వివరాలను అప్ డేట్ చేసుకోవాలంటే సులభంగా ఈ యాప్ నుంచే రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. సంబంధిత రిక్వెస్ట్ ను యూనిక్ ఐడెంటిఫికేషన్ సిబ్బంది సమీక్షించి, ఆమోదించిన తర్వాత ప్రొఫైల్ వివరాలు అప్ డేట్ అవుతాయి. ఆధార్ వివరాలు బయటకు చెప్పకుండా ఎంఆధార్ యాప్ నుంచి క్యూ ఆర్ కోడ్ ను, పాస్ వర్డ్ తో ప్రొటెక్ట్ చేసిన ఈ కేవైసీ డేటాను షేర్ చేసుకోవచ్చు. దీంతో ఏ సర్వీసు ప్రొవైడర్ అయినా యాప్ సాయంతో సంబంధిత వ్యక్తి ఆధార్ వివరాలను పొందడానికి అవకాశం ఉంటుంది. యూజర్లు ఎస్ఎంఎస్ ఆధారిత ఓటీపీ కాకుండా తాత్కాలిక వన్ టైమ్ పాస్ వర్డ్ ను యాప్ ద్వారా పొందే ఫీచర్ కూడా ఉంది.


More Articles