తత్కాల్ టికెట్ వేగంగా బుక్ చేసుకోండి... డబ్బులు తర్వాత చెల్లించండి... బుకింగ్ ఇలా...

రైల్వే శాఖ తత్కాల్ టికెట్ల బుకింగ్ లో జరుగుతున్న జాప్యాన్ని నివారించి మరింత వేగంగా ఆ టికెట్లను దక్కించుకునేందుకు ఓ చక్కని వెసులుబాటును తీసుకొచ్చింది. ‘ముందు టికెట్లను బుక్ చేసుకోండి... డబ్బులు తర్వాత చెల్లించండి’ అన్నదే ఆ అవకాశం.


ఏసీ తత్కాల్ టికెట్ల బుకింగ్ ఉదయం 10 గంటలకు, స్లీపర్ తరగతి తత్కాల్ టికెట్ల బుకింగ్ 11 గంటల నుంచి ప్రారంభం అవుతుందన్న సంగతి తెలిసిందే. అయితే, ఆ సమయంలో ఐఆర్సీటీసీ సైట్ లోకి లాగిన్ అయినప్పటికీ తత్కాల్ టికెట్ల బుకింగ్ కోసం టికెట్లను సెలక్ట్ చేసుకుని, పేర్లు ఇతర వివరాలు ఇచ్చి, పేమెంట్ కు వెళ్లి, అది చెల్లింపయ్యే సరికి ఉన్న రిజర్వేషన్లు కాస్తా ఖాళీ అయిపోతున్నాయి. తక్కువ సీట్లు అందుబాటులో ఉండడం, అదే సమయంలో ఎక్కువ మంది వాటిని సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తుండడం... ఈ ట్రాఫిక్ తో డబ్బులు చెల్లింపునకు చాలా సమయం తీసుకుంటోంది. దీంతో ఆ లోపే టికెట్లు అమ్ముడుపోతున్నాయి. కానీ, ఐఆర్సీటీసీ తీసుకొచ్చిన తాజా ఫీచర్ తో ఈ విధమైన ఇబ్బందులకు కాలం చెల్లనుంది.

representational image
బుకింగ్ ఎలా?
తత్కాల్ టికెట్లను ఇంతకుముందు ఎలా బుక్ చేసుకున్నారో, ఇకపైనా అలాగే సేమ్ టు సేమ్ చేసుకోవచ్చు. ఏమీ మార్పు లేదు. ముందుగా ప్రయాణ తేదీ, రైలు, తత్కాల్ ఆప్షన్లను సెలక్ట్ చేసుకున్న అనంతరం తర్వాతి పేజీలో పేరు, వయసు తదితర వివరాలు ఇవ్వాలి. అనంతరం పేమెంట్ పేజీకి వెళుతుంది. అక్కడ ఎడమ చేతివైపు ఉండే ఆప్షన్లలో ‘పే ఆన్ డెలివరీ/పే లేటర్’ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఎంచుకుంటే బుకింగ్ ప్రక్రియ వేగంగా చేసుకోవచ్చు.

representational image
పే ఆన్ డెలివరీ/పే లేటర్ ఆప్షన్ సెలక్ట్ చేసుకున్న తర్వాత ‘పే ఆన్ డెలివరీ’ (పవర్డ్ బై ఆండ్యూరిల్ టెక్నాలజీస్) అని ఒక ఆప్షన్, ‘ఈపే లేటర్’ (పవర్డ్ బై అర్థశాస్త్ర ఫిన్ టెక్ ప్రైవేటు లిమిటెడ్) పేరుతో మరో ఆప్షన్ దర్శనమిస్తుంది. వీటిలో పే ఆన్ డెలివరీ ఆప్షన్ ఎంచుకుంటే మీ ఇంటికే తత్కాల్ టికెట్ తీసుకొచ్చి ఇస్తారు. అప్పటికప్పుడే నగదు లేదా కార్డు ద్వారా చెల్లించాలి. అలా కాకుండా ముందు టికెట్ బుక్ చేసుకుని తర్వాత డబ్బులు చెల్లించాలనుకుంటే ఈపే లేటర్ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి.

representational image
పే ఆన్ డెలివరీ ఆప్షన్ ఎంచుకుంటే మేక్ పేమెంట్ ఆప్షన్ ను ఓకే చేయాలి. అప్పుడు తర్వాత పేజీకి వెళుతుంది. చిన్న విండోలో నిబంధనలు దర్శనమిస్తాయి. అవన్నీ చదివి అర్థం చేసుకుని ఓకే చెబితే తర్వాత పేజీలో ప్రొఫైల్ డిటైల్స్, అడ్రస్ డిటైల్స్ ఉంటాయి. ఏ చిరునామాకు డెలివరీ చేయాలన్నది అడ్రస్ డిటైల్స్ లో ఇవ్వాలి. ప్రొఫైల్ డిటైల్స్ లో ఫోన్ నంబర్, మెయిల్ ఐడీ, పేర్ల వివరాలు ఇవ్వాలి. ఈ వివరాలు ఒక్కసారి ఇస్తే సరిపోతుంది. ఆ తర్వాత నుంచి ఈ తరహా బుకింగ్ సమయంలో మొదటి సారి ఇచ్చిన వివరాలు తీసుకుంటుంది.

టికెట్ బుక్ అయిన వెంటనే పీఎన్ఆర్ వివరాలతో ఈ టికెట్ ఎస్ఎంఎస్, ఈమెయిల్ కు వచ్చేస్తుంది. ఫిజికల్ కాపీని ఇంటికే పంపిస్తారు. అప్పుడు డబ్బులు చెల్లించాలి. చెల్లించేందుకు నిరాకరిస్తే క్యాన్సిలేషన్ చార్జీలు వసూలు చేస్తారు. విఫలమైతే అకౌంట్ డీ యాక్టివేట్, చట్టపరమైన చర్యలకు బాధ్యులవుతారు. ఒకవేళ ప్రయాణం రానున్న 24 గంటల్లోపు ఉంటే ఈ మెయిల్ కు వచ్చే పేమెంట్ లింక్ ద్వారా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ లోపు డెలివరీ సాధ్యం కాదు గనుక. ఇంటికే వచ్చి డబ్బులు తీసుకోవడం అన్నది బుకింగ్ తర్వాత 24 నుంచి 72 గంటల్లోపు ఉంటుంది. ప్రయాణ తేదీలోపు డబ్బులు చెల్లించకపోతే టికెట్ రద్దవుతుంది. క్యాన్సిలేషన్ చార్జీలు చెల్లించాలి. రిఫండ్ అమౌంట్ వచ్చేదుంటే బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు.

representational image
ఈ పే లేటర్ ఆప్షన్ లో టికెట్లను అప్పటికప్పుడు బుక్ చేసుకోవచ్చు. డబ్బులను తర్వాత 14 రోజుల్లోపు చెల్లించాలి. ఇందుకు గాను మొత్తం టికెట్ విలువలో 3.5 శాతం చార్జీని అదనంగా వసూలు చేస్తారు. ఈ సదుపాయాన్ని అర్థశాస్త్ర ఫిన్ టెక్ అనే సంస్థ సహకారంతో ఐఆర్సీటీసీ అందిస్తోంది. బుకింగ్ తర్వాత ఈ మెయిల్ కు  పేమెంట్ లింక్ వస్తుంది. ఆ లింక్ ద్వారా 14 రోజుల్లోపల డబ్బులు చెల్లించొచ్చు. డబ్బులు చెల్లించడంలో విఫలమైతే ఆ నగదు మొత్తంపై 36 శాతం వార్షిక వడ్డీ ప్రకారం వసూలు చేస్తారు. ఐఆర్సీటీసీ ఖాతాను కూడా డీయాక్టివేట్ చేసేస్తారు.


More Articles