వాట్సాప్ ను వ్యాపార అవసరాలకు వినియోగించుకోవచ్చా...?

వాట్సాప్ సరదా, కాలక్షేపానికి పరిమితం కాదు. ఇదో అతిపెద్ద సమాచార వారధి. వినోదానికే కాకుండా మనసుపెట్టి ఆలోచిస్తే వాట్సాప్ తో బోలెడు ఉపయోగాలున్నాయి. ఎన్నో అవసరాలకు ఇది ఉపయోగపడుతుంది. ఉపాధి, వ్యాపారానికి కూడా ఇది చుక్కాని వంటిదే.

వ్యాపార అవసరాలు కమ్యూనికేషన్ సాధనం అయినందున వాట్సాప్ వ్యాపార వృద్ధికీ చక్కగా ఉపయోగపడుతోంది. సేల్స్ టీమ్ నిర్వహణకు, వారితో  నిరంతరం సంప్రదింపులకు దీన్ని వాడుకోవచ్చు. ఒక గ్రూపు పరిధిలో 250 మందికి చోటు ఉంటుంది గనుక ఓ కంపెనీలో సేల్స్ మేనేజర్ స్థాయిలో ఓ గ్రూపును ఏర్పాటు చేసుకోవచ్చు. మెయిల్స్ తో పోలిస్తే వాట్సాప్ సాయంతో చాలా వేగంగా, సులభంగా అవతలివారిని కనెక్ట్ కావొచ్చు.

representational imageకస్టమర్ తో సంప్రదింపులకు, సర్వీస్ కు కూడా వాట్సాప్ ఓ చక్కని సాధనం. నేరుగా ఫోన్ కాల్స్ చేసి మాట్లాడడం సమయం తీసుకునే ప్రక్రియ కనుక కస్టమర్లు సేవ, వస్తువులకు సంబంధించి వాట్సాప్ లో సులభంగా ఫిర్యాదు చేయవచ్చు. కంప్లయింట్ స్టేటస్ గురించి తెలుసుకోవచ్చు. అయితే, భారీ సంఖ్యలో కస్టమర్ల నుంచి ఫిర్యాదులు, విచారణలు వస్తే వాట్సాప్ వేదికగా సమాధానం ఇవ్వడం కష్టమేనంటున్నారు నిపుణులు. అటువంటప్పుడు కస్టమర్ల నుంచి ఫిర్యాదు స్వీకరించేందుకు వాట్సాప్ ను ఉపయోగించుకుంటూనే, ఆ తర్వాత వాటికి మెయిల్స్ ద్వారా సమాధానం ఇచ్చుకోవచ్చు. మార్కెటింగ్, ప్రమోషన్ కు కూడా వాట్సాప్ ఉపయోగపడుతుందంటున్నారు. కోల్గేట్ కంపెనీ తన టూస్ పేస్ట్ కు ప్రచారం కల్పించుకునేందుకు ఇటీవల వాట్సాప్ ను వాడుకుంది. టూత్ పేస్ట్ ప్యాక్ పై ఉన్న వాట్సాప్ నంబర్ కు కస్టమర్లు నవ్వుతూ ఉన్న సెల్ఫీ ఫొటోలను తీసి పంపించాలని కోరింది. బ్రాండ్ అంబాసిడర్ సోనమ్ కపూర్ చేతుల మీదుగా స్టైలిస్ట్ గా రూపొందే అవకాశాన్ని గెలుచుకోవచ్చని ప్రకటించింది. కస్టమర్ల నుంచి ఫీడ్ బ్యాక్ కోసమూ దీన్ని వాడుకోవచ్చు. ఉత్పత్తుల గురించి సమాచారాన్ని తెలియజేసేందుకు వీలుగా వాటిపై వాట్సాప్ నంబర్ ఇస్తే కస్టమర్ల అభిప్రాయాలు నేరుగా తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది.

భిన్న రకాలుగా...
* ముంబైకి చెందిన రష్ అనే సంస్థ వాట్సాప్ నుంచి కేక్, పుష్పాల కోసం ఆర్డర్లను స్వీకరిస్తోంది.  
* నేడు చాలా వేదికలు వాట్సాప్ నుంచి ఫుడ్ కోసం ఆర్డర్లు స్వీకరిస్తున్నాయి. ఉదాహరణకు ఓ రెస్టారెంట్ కు సంబంధించిన మెనూను వాట్సాప్ లో పెడితే, మెనూ చూసి అందులో నంబర్ ను చెబితే చాలు. ఆ నంబర్ పై ఉన్న ఐటమ్ ను ఇంటికే డెలివరీ చేస్తారు.
* వైద్యుల అపాయింట్ మెంట్ బుకింగ్ ను వాట్సాప్ వేదికగా చేసుకునేందుకు కొన్ని చోట్ల అవకాశం ఉంది. అలాగే సాధారణ ఆరోగ్య సమస్యలపై వైద్యుల సూచనలు, సలహాలను కూడా వాట్సాప్ వేదికగా పొందే అవకాశం ఉంది.
* ఫార్మసీ స్టోర్స్ కు సంబంధించిన వాట్సాప్ నంబర్ కు ప్రిస్క్రిప్షన్ పంపితే చాలు. అన్ని మందులను ప్యాక్ చేసి ఇంటికే పంపించేస్తారు.  
* ఢిల్లీ పోలీసులు వాట్సాప్ నంబర్ తో ఓ హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేశారు. ప్రారంభం రోజున 23,000 ఫిర్యాదులు వచ్చిపడ్డాయి.

ఆమె వ్యాపారానికి చక్కని తోడ్పాటు
నీతా అడప్పా ప్రకృతి హెర్బల్స్ పేరుతో హెర్బల్ ఉత్పత్తుల విక్రయాల కోసం, ప్రచారం, కస్టమర్ల సేవల కోసం వాట్సాప్ గ్రూపులను ప్రారంభించింది. విసుగు అనుకోకుండా వచ్చిన ప్రతీ సందేశానికి సమాధానమిస్తుంది. దీంతో ఆమె ఉత్పత్తులకు, సేవలకు చక్కని గుర్తింపు లభించింది. దీంతో ఆమె వ్యాపారం మరింత విస్తరించింది. దీనివల్ల కస్టమర్లతో సన్నిహిత సంబంధాలకు అవకాశం ఉంటుందని నిపుణుల అభిప్రాయం.

representational imageవాట్సాప్ ట్యూషన్స్
వాట్సాప్ ను చిన్న ఆన్ లైన్ పాఠశాలగానూ ఉపయోగించుకోవచ్చు. టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు ఒక  గ్రూపులోకి రావచ్చు. టీచర్లు పాఠశాల ముగిసిన తర్వాత కూడా విద్యార్థులతో విద్యకు సంబంధించి ట్యూషన్స్ ను వాట్సాప్ లో చెప్పుకోవచ్చు. విద్యార్థుల సందేహాలకు సమాధానాలు, వారికి అసైన్ మెంట్స్, పాఠాలకు సంబంధించిన ఆడియో, వీడియోలు క్లిప్పులు పంపడం, గ్రాఫిక్స్, చార్టులు పంపడం చేసుకోవచ్చు. విద్యార్థులకు వాట్సాప్ యాక్సెస్ ఇవ్వడం అంతగా మంచిది కాదు గనుక వారి తల్లిదండ్రుల ద్వారా అనుసంధానం కావచ్చు.  

వ్యాపారుల కోసం ప్రత్యేక యాప్
వాట్సాప్ వ్యాపారుల కోసం త్వరలోనే ప్రత్యేకంగా ఓ యాప్ రానుంది. చిన్న వ్యాపారులు ప్రస్తుత యాప్ కు భిన్నమైన వర్షన్ ను డౌన్ లోడ్ చేసుకుని మరింత మంది కస్టమర్లకు వాట్సాప్ వేదికగా సేవలు అందించొచ్చు. ప్రస్తుతం సాధారణ గ్రూపులో గరిష్టంగా 250కి మించి ఉండేందుకు అవకాశం లేదు. కానీ వ్యాపారుల కోసం రానున్న యాప్ లో సభ్యుల సంఖ్య మరింత ఎక్కువే ఉండనుంది. ప్రస్తుతం ఇది టెస్టింగ్ దశలో ఉంది.


More Articles