డెరివేటివ్ మార్కెట్లు... ఫ్యూచర్స్, ఆప్షన్స్ అంటే ఏంటి?

షేర్ మార్కెట్ గురించి తెలిసినంత మందికి డెరివేటివ్స్ గురించి తెలియదు. కానీ, ఇన్వెస్టర్లకు ఈ మార్కెట్ పట్ల కూడా అవగాహన ఉంటే మంచిది. నష్ట భయాన్ని తగ్గించుకునేందుకు ఈ మార్కెట్లు వాహకంగా ఉపయోగపడతాయి. వీటి గురించి వివరంగా తెలుసుకుందాం.


డెరివేటివ్స్ చాలా సాధనాల్లో  
స్టాక్ మార్కెట్లలో స్పాట్, ఫ్యూచర్స్ రెండూ ప్రధాన అంగాలు. షేర్లలో నేరుగా క్రయ విక్రయాలు జరిపితే దాన్ని స్పాట్ గాను, అలా కాకుండా షేర్లు లేకుండా ఎలక్ట్రానిక్ రూపంలో వాటిలో భవిష్యత్తు తేదీతో కూడిన కాంట్రాక్టుల్లో ట్రేడింగ్ చేసుకోవడానికి వీలు కల్పించేవే డెరివేటివ్ (ఫ్యూచర్స్) మార్కెట్. డెరివేటివ్స్ అన్నవి ఇన్వెస్టర్ల మధ్య జరిగే ఆర్థిక కాంట్రాక్టులు. కమోడిటీలు, కరెన్సీలు, వడ్డీ రేట్ల ఫ్యూచర్స్ కూడా ఉన్నాయి. వ్యాపారులు రిస్క్ ను తగ్గించుకునేందుకు డెరివేటివ్స్ మార్కెట్ ను తీసుకురావడం జరిగింది. భవిష్యత్తులో సంబంధిత వస్తువు లేదా స్టాక్ ధర ఎంత మేర ఉండొచ్చన్న అంచనా ఆధారంగా క్రయ విక్రయాలకు డెరివేటివ్స్ మార్కెట్ వీలు కల్పిస్తుంది. డెరివేటివ్స్ లో స్టాక్ డెరివేటివ్స్, ఇండెక్స్ (సూచీలు) డెరివేటివ్స్ ఉన్నాయి. స్టాక్స్ లోనూ స్టాక్ ఫ్యూచర్స్, స్టాక్ ఆప్షన్స్ అని రెండు రకాలున్నాయి. వీటిని దేశంలోని రెండు ప్రధాన స్టాక్ ఎక్సేంజ్ లు అయిన ఎన్ఎస్ఈ, బీఎస్ఈ ఆఫర్ చేస్తున్నాయి.
 
representational imageరిలయన్స్ షేరు స్పాట్ మార్కెట్లో రూ.1,500 ఉందనుకోండి. రూ.1,50,000 పెట్టుబడితో 100 షేర్లను కొనుగోలు చేసుకోవచ్చు. రూ.1,500 పెట్టి ఒక్క షేరు అయినా సొంతం చేసుకోవచ్చు. ఈ షేర్లను తర్వాత ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు లాభం లేదా నష్టానికి అమ్ముకోవచ్చు. అలాగే, డెరివేటివ్స్ లోనూ రిలయన్స్ షేర్లు కొనుగోలు చేసుకోవచ్చు. కాకపోతే స్పాట్ లో మాదిరిగా ఒకటి, పది షేర్లు కొనుక్కునేందుకు అవకాశం ఉండదు. కనీసం 500 షేర్లను కొనాల్సి ఉంటుంది. దీన్ని ఒక లాట్ గా పేర్కొంటారు. ఎన్ని లాట్లనయినా కొనడం, అమ్మడం చేసుకోవచ్చు. ఒక లాట్ కు మార్జిన్ మనీ రూ.95,000 చెల్లించాల్సి ఉంటుంది. కేవలం ఇంట్రాడేలోనే కాంట్రాక్టు కొనుగోలు, అమ్మకం పూర్తి చేసేట్టు అయితే 38,000 చెల్లిస్తే సరిపోతుంది. వాస్తవానికి ఇవే 500 షేర్లను స్పాట్ లో కొనుగోలు చేయాలంటే రూ.7,50,000 కావాలి. కానీ, ఫ్యూచర్స్ లో అయితే రూ.95,000 సరిపోతుంది. తక్కువ ధరకే ఎక్కువ ఎక్స్ పోజర్ కు డెరివేటివ్స్ మార్కెట్లో అవకాశం ఉంటుంది.

ఈక్విటీ మార్కెట్లో మీ దగ్గర రిలయన్స్ షేర్లు ఉంటేనే అమ్ముకునేందుకు అవకాశం ఉంటుంది. ఒకవేళ లేకపోయినా కూడా అమ్ముకోవచ్చు. అది కేవలం ఇంట్రాడేలోనే లావాదేవీని స్క్వేర్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది. అంటే షేర్లు లేకుండా విక్రయిస్తే, మార్కెట్ ముగిసేలోపు అన్ని షేర్లను తిరిగి కొనాల్సిఉంటుంది. కానీ, డెరివేటివ్స్ అలా కాదు. మీ దగ్గర షేర్లు లేకుండానే అమ్మకం, కొనుగోలు చేసుకోవచ్చు. కొనుగోలును లాంగ్ పొజిషన్ గా, విక్రయాన్ని షార్ట్ పొజిషన్ గా చెబుతారు. ఉదాహరణకు రిలయన్స్ షేరు వచ్చే మూడు నెలల్లో తగ్గుతుందన్న అంచనా ఉంటే, మార్జిన్ మనీ చెల్లించి ఫ్యూచర్స్ లో ప్రస్తుత నెలతోపాటు తర్వాతి రెండు నెలల కాంట్రాక్టుల్లో విక్రయించొచ్చు. ఆ కాంట్రాక్టు కాల వ్యవధి ముగిసేలోపు ధర పడిపోతే లాభం, పెరిగితే నష్టం వస్తుంది. కాల వ్యవధి ముగిసే వరకూ ఆగకుండా మీరు ఆశించిన లక్ష్యం నెరవేరగానే కాంట్రాక్టును క్లోజ్ చేసుకోవచ్చు. లేదా ఊహించిన దానికి భిన్నంగా దాని ధర కొనసాగుతుంటే నష్టాన్ని పరిమితం  చేసుకునేందుకు కూడా దాన్నుంచి బయటపడొచ్చు. లేదంటే హెడ్జ్ చేసుకోవచ్చు. హెడ్జింగ్ అంటే ఒక పొజిషన్ కు ఆపోజిట్ పొజిషన్ ను కొనుగోలు చేయడం. స్టాక్ ఫ్యూచర్ కొన్నారనుకోండి. దాని ధర పడిపోతుంటే పుట్ ఆప్షన్ కొనడం చేస్తారు. దీనివల్ల స్టాక్ పెరిగితే స్టాక్ ఫ్యూచర్ పై లాభం వస్తుంది. తగ్గితే పుట్ ఆప్షన్ పై లాభం వస్తుంది. మరో రూపంలో స్టాక్ ప్యూచర్ లో లాంగ్ పొజిషన్ ఉంటే, ధర పడిపోతుంటే రివర్స్ లో కాల్ ఆప్షన్ విక్రయించొచ్చు.

representational imageధరలపై ఎన్నో అంశాలు
ఫ్యూచర్స్ లో స్పాట్ కన్నా ధర కొంచెం ఎక్కువ, తక్కువలు ఉండొచ్చు. డిమాండ్ ను బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. కాల వ్యవధి కూడా ప్రభావం చూపిస్తుంది. ఉదాహరణకు నిఫ్టీ స్పాట్ 9,800 ఉందనుకుంటే అది జూలై నెల ఫ్యూచర్స్ లో 9,830 ఉండొచ్చు. లేదంటే 9,800 కంటే తక్కువే ఉండొచ్చు. మార్కెట్లో అప్ ట్రెండ్, బుల్లిష్ ట్రెండ్ ఉన్నప్పుడు ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు స్పాట్ కంటే తక్కువ ధరకే ఫ్యూచర్స్ లో ఉంటుంది. ప్రతీ నెలారంభంలో డెరివేటివ్స్ కాంట్రాక్టుల ధరలు స్పాట్ తో పోలిస్తే ప్రీమియంలో ట్రేడవుతుంటాయి. ఇంట్రాడే (అదే రోజు) లేదా రానున్న రోజుల్లో ధర తగ్గుతుందనుకున్న వారు ఫ్యూచర్స్ లో లాంగ్ కాంట్రాక్టు కొనుగోలు చేస్తారు. రేటు పడిపోతుందనుకునేవారు కాంట్రాక్టును విక్రయిస్తారు. దీన్ని షార్ట్ అంటారు.

నెలలో చివరి గురువారం
ఓ నెల కాంట్రాక్టులు ఆ నెల చివరి గురువారంతో గడువు తీరిపోతాయి. జూలై కాంట్రాక్టులు ఆ నెల చివరి గురువారం, ఆగస్టు కాంట్రాక్టులు ఆ నెల చివరి గురువారం ఇలా అన్నమాట. ఈ గడువు తర్వాత ఆ కాంట్రాక్టులు మనుగడలో ఉండవు. కనుక చివరి రోజు మార్కెట్లు ముగిసే సమయానికి కాంట్రాక్టులను క్లోజ్ చేసుకోవాలి. ఉదాహరణకు లాంగ్ కాంట్రాక్టు ఉన్న వారు దాన్ని విక్రయించాలి. షార్ట్ చేసిన వారు రివర్స్ లో కాంట్రాక్టును కొనుగోలు చేస్తే లావాదేవీ స్క్వేర్ ఆఫ్ అయిపోతుంది. ఈ పనిని ఇన్వెస్టర్లు చేయకపోతే బ్రోకరేజీ సంస్థలు చివరి రోజు చివరి అర గంటలో ఆ పనిచేస్తాయి.

మార్జిన్ మనీ
పైన చెప్పుకున్నట్టు రిలయన్స్ 500 షేర్ల లాట్ ను ఇంట్రాడేలో అదే రోజు కొని విక్రయించడం, లేదా విక్రయించి, కొనేట్టు అయితే రూ.38,000 మార్జిన్ మనీ చెల్లించడం ద్వారా ఆ లావాదేవీలు చేసుకోవచ్చు. రూ. 95,000 చెల్లించి లాంగ్ కాంట్రాక్టు తీసుకోవడం లేదా షార్ట్ చేసుకోవచ్చు. రూ.1,500 ధర వద్ద రిలయన్స్ 500 షేర్ల కాంట్రాక్టును తీసుకుంటే, దాని ధర ఎంత పెరిగితే అంత మేర లాభం వస్తుంది. తగ్గితే అంత మేర నష్టం వస్తుంది. ఈ నష్టాన్నే రిస్క్ అంటారు. రిస్క్ ను దృష్టిలో ఉంచుకునే మార్జిన్ మనీని స్టాక్ ఎక్సేంజ్ లు నిర్వహిస్తుంటాయి. ఉదాహరణకు రూ.1,500 ధర వద్ద రిలయన్స్ లాట్ కొనుగోలు చేస్తే ఆ తర్వాత అది ఓ రూ.100 రూపాయలు పడిపోయిందనుకోండి. 500 షేర్లు ఒక లాట్ గనుక రూ.50,000 నష్టం. మార్జిన్ మనీ 95,000లో రూ.50,000 పోను ఇంకా రూ.45,000 మిగిలి ఉంటుంది. ధర తగ్గుతుంటే ఆ మేరకు మార్జిన్ మనీని సర్దుబాటు చేయాలి. అలాగే ఓ లాట్ ను షార్ట్ చేశారు. షార్ట్ చేయడం అంటే అమ్మడం. ఆ తర్వాత రిలయన్స్ షేరు ధర 100 పెరిగితే రూ.50,000 నష్టం వస్తుంది. అప్పుడు కూడా ఆ మేరకు తగ్గిన మార్జిన్ మనీని సర్దాల్సి ఉంటుంది.

representational imageకాల్ ఈక్విటీ, పుట్ ఈక్విటీ
వీటినే కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ అంటారు. ఇవి అచ్చం లాంగ్, షార్ట్ పొజిషన్ల మాదిరే ఉంటాయి. ధర పెరుగుతుందనుకుంటే కాల్ ఆప్షన్, తగ్గుతుందనుకుంటే పుట్ ఆప్షన్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు రిలయన్స్ స్పాట్ లో రూ.1,500 ధర ఉంది. ఇప్పుడు 1,500కు రూ.1,520, రూ.1,540 ఇలా 1,720 వరకు కాల్ ఆప్షన్లు ఉంటాయి. పుట్ ఆప్షన్లు అయితే, గరిష్టంగా 1,700 నుంచి ప్రతీ 20 పాయింట్ల తేడాతో దిగువ స్థాయిలో 1,100 వరకు ఉంటాయి. స్పాట్ ధరకు సమీపంలోని 50, 100 పాయింట్లు అటూ ఇటూగా ఉన్న డెరివేటివ్ కాంట్రాక్టులు చురుగ్గా ట్రేడవుతుంటాయి.

స్పాట్ లో రిలయన్స్ రూ.1,500 ఉన్నప్పుడు డెరివేటివ్స్ లో ఇదే ధరపై కాల్ ఆప్షన్ కొనాలనుకోండి. అప్పుడు కాల్ ఆప్షన్ 1,500, స్టయిక్ దర రూ.46 ఉందనుకుంటే ఇంటూ 500 లాట్ గనుక అప్పుడు  23,000 చెల్లిస్తే సరిపోతుంది. ఆ తర్వాత గడువు తీరే లోపు లేదా కాంట్రాక్టును విక్రయించే వరకు అదనంగా నగదు చెల్లించాల్సిన పనిలేదు. పుట్ ఆప్షన్ కూడా ఇంతే, కొనుగోలుకు మార్కెట్ ధర ఇంటూ లాట్ సైజ్ తో లెక్కించగా వచ్చే మొత్తాన్ని చెల్లిస్తే సరిపోతుంది. ఇలా కాకుండా పుట్ ఆప్షన్ లేదా కాల్ ఆప్షన్ ను మీ దగ్గర లేకుండా విక్రయించాలంటే మాత్రం లాంగ్, షార్ట్ పొజిషన్లకు ఉన్నంత మార్జిన్ మనీని చెల్లించాల్సి ఉంటుంది.

డెరివేటివ్స్ వల్ల లాభమేంటి?
తక్కువ మార్జిన్ మనీతో ఎక్కువ ఎక్స్ పోజర్ తీసుకోవచ్చు. పైన చెప్పుకున్నట్టు రిలయన్స్ 500 షేర్లను ఈక్విటీలో కొనాలంటే రూ.7.50,000 కావాలి. కానీ, ఇన్ని షేర్లను ఫ్యూచర్స్ లో కేవలం 95,000 మార్జిన్ మనీకే సొంతం చేసుకోవచ్చు. కాకపోతే ఇవి కేవలం స్టాక్ ధర గమనం ఆధారంగా పొందే లాభ, నష్టాలకే పరిమితం. ఫిజికల్ షేర్లు అయితే కంపెనీ నుంచి డివిడెండ్లు, బోనస్, రైట్స్ ఇలా వచ్చే ప్రయోజనాలు డెరివేటివ్స్ లో ఉండవు.

representational imageనష్టాల రిస్క్ తగ్గించుకునేందుకు హెడ్జ్ చేసుకునే అవకాశాన్ని డెరివేటివ్స్ మార్కెట్లు కల్పిస్తాయి. ఎలా అంటే ఉదాహరణకు రిలయన్స్ ఇండస్ట్రీస్ 500 షేర్లను రూ.1,500 ధరకు రూ.7,50,000 పెట్టి కొన్నారు. ఏడాది తర్వాత విక్రయించాలన్నది మీ ఉద్దేశం. అప్పటికి మంచి రేటు వస్తుందని ఊహిస్తున్నారు. అదే సమయంలో మార్కెట్లు పడిపోతే ఎలా? అన్న సందేహం రావచ్చు. అటువంటప్పుడు రిస్క్ ను తగ్గించుకునేందుకు హెడ్జ్ చేసుకోవచ్చు. ఎలా అంటే రిలయన్స్ షేర్ల ధర రూ.1,500 కంటే పడిపోతే నష్టం వస్తుంది. అది మీరు కొన్న ధర కనుక. ఇప్పడు పడిపోతే మీ పెట్టుబడి విలువ తరిగిపోకుండా ఉండేందుకు 1,500 ధరకు పుట్ ఆప్షన్ కొనాలి. ఈ ధర కంటే ఎంత పడిపోతే ఆ మేరకు 500 షేర్ల లాట్ ధర ఆధారంగా లాభం వస్తుంది.

ఎలా అంటే జూలై నెలలో డెరివేటివ్స్ ముగింపు చివరి గురువారం నాటికి రిలయన్స్ షేరు 1,400 వద్దకు చేరిందనుకుందాం. అప్పుడు ఒక్కో షేరుపై రూ.100 విలువ తరిగిపోయింది. కానీ, పుట్ ఆప్షన్ కొన్నారు గనుక ఈ మేరకు పెట్టుబడి విలువ తగ్గలేదనే అనుకోవాలి. జూలై నెల రూ.1,500 పుట్ ఆప్షన్ సుమారు 15 రూపాయలు. 500 లాట్ పై మీ పెట్టుబడి 7,500. అంటే కేవలం రూ.7,500లకే 7,50,000  పెట్టుబడి విలువను కాపాడుకున్నారన్నమాట. ఈ విధంగా ఇన్వెస్ట్ మెంట్ హెడ్జింగ్ కు ఈ సాధనాలు ఉపకరిస్తాయి.ఇది కేవలం ఒక ఉదాహరణే. ఇలా కాకుండా మీ దగ్గర 500 షేర్లున్నాయి. ధర పడిపోతే పెట్టుబడి విలువ తగ్గకూడదనుకుంటున్నారు. అదే సమయంలో షేర్లను ఇప్పట్లో అమ్మే ఉద్దేశం లేదు. అప్పుడు ఫ్యూచర్స్ లో కాల్ ఆప్షన్ లేదా లాంగ్ పొజిషన్ ను షార్ట్ చేసినా హెడ్జింగే అవుతుంది. కాకపోతే మార్జిన్ మనీ కింద 95,000 వరకు అదనంగా పెట్టుబడి సమకూర్చుకోవాలి. కాల్ ఆప్షన్ లేదా లాంగ్ అన్నవి ధర పెరిగితే లాభాన్నిస్తాయని తెలుసు. అదే సమయంలో మార్కెట్లు పడిపోతూ వీటి ధర తగ్గుతుందనుకుంటే షార్ట్ చేసుకోవచ్చు.  

ఒక మార్కెట్లో తక్కువ ధరకు కొని, అధికంగా ఉన్న మార్కెట్లో విక్రయించుకునే ఆర్బిట్రేషన్ కూ డెరివేటివ్స్ లో అవకాశం ఉంది. ఒక్కోసారి డెరివేటివ్స్ మార్కెట్లోని ధరతో పోల్చుకుంటే స్పాట్ మార్కెట్లో ధర తక్కువ లేదా ఎక్కువగా కోట్ అవొచ్చు. దీన్ని ఆర్బిట్రేటర్లు ఒక అవకాశంగా తీసుకుంటారు. తక్కువ ధర ఉన్న మార్కెట్లో కొని ఎక్కువ ధర ఉన్న మార్కెట్లో విక్రయిస్తుంటారు. రిస్క్ చాలా తక్కువ ఉన్న ట్రేడింగ్ ఇది. ఇక సాధారణ ఇన్వెస్టర్ల నుంచి హై నెట్ వర్త్ ఇన్వెస్టర్ల వరకు కేవలం లాభార్జన ధ్యేయంతో డెరివేటివ్స్ లో ట్రేడింగ్ చేసే వర్గం కూడా ఉంది. వీరు ఇంట్రాడే, ఓవర్ నైట్ ట్రేడింగ్ లో లాభాలను ఆర్జించేందుకు ప్రయత్నిస్తుంటారు.


More Articles