స్టాక్ మార్కెట్లో నేరుగా ప్రవేశించేది ఎలా...? ఇన్వెస్ట్ చేసే విధానం... షేర్ల ఎంపిక తీరు

మన స్టాక్ మార్కెట్లు ఏటేటా మంచి పనితీరుతో కొత్త శిఖరాల వైపు అడుగులు వేస్తున్నాయి. ఏడాది క్రితం చూసిన షేరు ఇప్పుడు రెట్టింపవడం, రెండు మూడు రెట్లు పెరిగిపోతున్న నిదర్శనాలు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. వీటిని గమనిస్తే నేరుగా స్టాక్స్ లో పెట్టుబడులు పెట్టాలన్న ఆసక్తి, ఉత్సాహం కలగడం సహజం. దేశ ఈక్విటీ మార్కెట్ల పరుగు పందెంలో తామూ పాలు పంచుకోవాలని కొందరిలో ఆసక్తి మెండుగా ఉంటుంది. ఇందుకు ఏం చేయాలన్నది ఇక్కడ తెలుసుకోవచ్చు.


స్టాక్ మార్కెట్, ఈక్విటీ మార్కెట్, షేరు మార్కెట్ అన్నీ ఒక్కటే. ఓ కంపెనీలో వాటా కలిగి ఉండడాన్ని షేర్ అంటారు. కంపెనీ మూలధనం (ఈక్విటీ)లో వాటా గనుక, ఆ వాటాలు ట్రేడవుతాయి గనుక ఈక్విటీ మార్కెట్ అని కాల్ చేస్తారు. స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అయిన కంపెనీల్లో ప్రతీ వాటా ఒక షేరుగా ట్రేడవుతుంది. ఈ షేరునే స్టాక్ అని కాల్ చేస్తారు. స్టాక్ మార్కెట్ పరిభాషలో ఈక్విటీని క్యాష్ విభాగంగా పేర్కొంటారు. కేవలం పెట్టుబడి పెట్టాలనుకునేవారే కాదు, స్టాక్ మార్కెట్ గురించి ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ దాని గురించి తెలుసుకుంటే మంచి అవకాశాలు వచ్చినప్పుడు వాటిని సొంతం చేసుకోవచ్చు. ఈక్విటీ కాకుండా డెరివేటివ్స్ (ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్) మార్కెట్ కూడా ఉంది దాని గురించి వేరుగా తెలుసుకుందాం.

బ్రోకరేజీ సంస్థ
స్టాక్స్ కొనుగోలు, అమ్మకాల కోసం స్టాక్స్ ఎక్సేంజ్ ల తరఫున అధీకృత సంస్థలు ఆ సేవలు అందిస్తుంటాయి. వీటిని బ్రోకరేజీ సంస్థలుగా చెబుతారు. వ్యక్తులు, సంస్థలు, ఆన్ లైన్ ఏజెన్సీలు ఎవరైనా గానీ నిబంధనల మేరకు సెబీ వద్ద దరఖాస్తు చేసుకుని బ్రోకరేజీ సేవల లైసెన్స్ పొందొచ్చు. లేదా సెబీ వద్ద లైసెన్స్ పొందిన బ్రోకర్లకు సబ్ బ్రోకర్లుగా వ్యవహరించొచ్చు. స్టాక్స్ లో పెట్టుబడులు పెట్టాలంటే వీరిని సంప్రదించాల్సి ఉంటుంది. ట్రేడింగ్ ఖాతా, డీమ్యాట్ ఖాతా తెరవాల్సి ఉంటుంది. స్టాక్స్ లో కొనుగోలు అమ్మకాలను ట్రేడింగ్ గా పేర్కొంటారు. ఇందుకు వీలు కల్పించేదే ట్రేడింగ్ ఖాతా. ఇలా కొనుగోలు చేసిన షేర్లు కంపెనీ వద్దే ఉంచేందుకు అవకాశం లేదు. వాటిని తీసేసుకోవాలి. మరి వీటిని ఎక్కడ దాచి ఉంచాలి? ఇందుకోసమే డీమ్యాట్ ఖాతా. కొన్న షేర్లన్నీ డీమ్యాట్ ఖాతాకు వెళ్లి భద్రంగా ఉంటాయి. తిరిగి అమ్మినప్పుడు ఆ షేర్లు డీమ్యాట్ ఖాతా నుంచి వెళ్లిపోతాయి.

డీమ్యాట్ ఖాతాలు
డీమ్యాట్ ఖాతాలు బ్రోకరేజీ సంస్థల నిర్వహణలో ఉండవు. వీటిని నిర్వహించడానికి దేశంలో సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ (సీడీఎస్ఎల్), నేషనల్ సేక్యూరిటీ డిపాజిటీ సర్వీసెస్ (ఎన్ఎస్ డీఎల్) అంటూ రెండు సంస్థలు ఉన్నాయి. వీటినే డిపాజిటరీ సర్వీసెస్ అంటారు. వీరి తరఫున ఇన్వెస్టర్లకు సేవలు అందించే వారు డిపాజిటరీ పార్టిసిపెంట్లు (డీపీ). బ్రోకరేజీ సంస్థల వద్ద ఖాతాలున్నవారు స్టాక్స్ కొంటే అవి వారికి సంబంధించి డీమ్యాట్ ఖాతాలో జమ అవుతాయి. విక్రయించినప్పుడు డెబిట్ అవుతాయి. సీడీఎస్ఎల్, ఎన్ఎస్ డీఎల్ నుంచి ఈ మేరకు లావాదేవీలు నిర్వహించేందుకు బ్రోకరేజీ సంస్థలు ఒప్పందం చేసుకుంటాయి.

ఖాతా తెరిచేందుకు ఏమి కావాలి?
బ్యాంకు ఖాతా, చెక్కు బుక్కు, పాన్ నంబర్, ఆధార్ కార్డు, పాస్ పోర్ట్ సైజు ఫొటోలు అవసరం. వీటిలో ఏవి లేకపోయినా ఖాతా తెరిచేందుకు అవకాశం లేదు. ఆరు నెలల బ్యాంకు ఖాతా స్టేట్ మెంట్, ఒక క్యాన్సిల్డ్ చెక్ ఇవ్వడాన్ని తప్పనిసరి చేశారు. వీటిలో ఏవైనా లేకపోతే వాటిని సమకూర్చుకున్న తర్వాత ఖాతాలు తెరవాల్సి ఉంటుంది.

representational imageకొనుగోళ్లు, అమ్మకాలు
ఒక్కసారి ఈ ఖాతాలు తెరిచిన తర్వాత షేర్లలో నేరుగా కొనుగోళ్లు, అమ్మకాలు చేసుకోవచ్చు. బ్రోకరేజీ సంస్థ ప్రతినిధికి కాల్ చేసి చెబితే ఆర్డర్లు ప్లేస్ చేస్తారు. లేదా ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్, కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ సాయంతో స్వయంగా చేసుకోవచ్చు. ఎన్ఎస్ఈ, బీఎస్ఈ అనే రెండు ప్రధాన స్టాక్ ఎక్సేంజ్ లు దేశంలో ఉన్నాయి. ఎన్ఎస్ఈలో సుమారు 2,000, బీఎస్ఈలో 5,200 కంపెనీలు లిస్ట్ అయి ఉన్నాయి. వీటిలో ఏ కంపెనీ షేర్లయినా కొనుగోలుకు, అమ్మకానికి అవకాశం ఉంది.  అయితే, వీటిలో కొన్ని రెండు స్టాక్ ఎక్సేంజ్ లలోనూ లిస్ట్ అయి ఉన్నవి కాగా, కొన్ని ప్రత్యేకంగా ఒక స్టాక్ ఎక్సేంజ్ లోనే లిస్ట్ అయి ఉన్నాయి. బ్రోకరేజీ సంస్థలు ఈ స్టాక్ ఎక్సేంజ్ సర్వర్లతో అనుసంధానమై ఉన్న ట్రేడింగ్ ఫ్లాట్ ఫామ్ (సాఫ్ట్ వేర్) లను ఏర్పాటు చేసుకుంటాయి. ఇన్వెస్టర్లు షేర్ల కొనుగోళ్లు, విక్రయాలు చేసుకునేందుకు వీలుగా బ్రోకరేజీ సంస్థలు యాప్, వెబ్ టెర్మినళ్లను అందుబాటులో ఉంచుతాయి.

ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో రెండింటిలోనూ లిస్ట్ అయి ట్రేడ్ అవుతున్న స్టాక్స్ లో రెండింటి మధ్య ధరల్లో స్వల్ప వ్యత్యాసం ఉంటుంది. అది సుమారు ఓ అర్ధరూపాయి, రూపాయి అటూ ఇటూగా ఉండొచ్చు. అందుకే రెండు స్టాక్ ఎక్సేంజ్ లలో రేట్లను గమనించి తక్కువ ధర ఉన్న ఎక్సేంజ్ లో కొనుగోలు చేసుకోవడం, విక్రయించే సమయంలో ఎక్కువ ధర కోట్ అవుతున్న ఎక్సేంజ్ ను ఎంచుకోవడం ఉత్తమం. కాకపోతే ప్రతీ క్షణానికి రేట్లు మారిపోతుంటాయన్న విషయాన్ని గమనించాలి. స్టాక్ ఎక్సేంజ్ లలో వేల కంపెనీలున్నప్పటికీ అన్నింటిలోనూ చురుగ్గా లావాదేవీలు జరగవు. కొన్ని అరుదుగానే ట్రేడవుతుంటాయి. దాదాపు చాలా బ్రోకరేజీ సంస్థలకు ఎన్ఎస్ఈ, బీఎస్ఈల్లో సభ్యత్వం ఉంది. ఏ స్టాక్ ఎక్సేంజ్ లో కొనుగోలు, అమ్మకాలు జరిపినా చార్జీలు, ఫీజులు ఒకే విధంగా ఉంటాయి.

representational imageలిస్టెడ్ కంపెనీలు
స్టాక్ ఎక్సేంజ్ లో లిస్ట్ అయి తమ వాటాలు ట్రేడ్ అవ్వాలని కోరుకునే కంపెనీలు అందుకోసం ఆయా స్టాక్ ఎక్సేంజ్ ల నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. ఇందుకు లిస్టింగ్ ఫీజు చెల్లించాలి. ప్రతీ స్టాక్ ఎక్సేంజ్ కు వేర్వేరుగా ఫీజు ఉంటుంది. లిస్ట్ అయ్యేందుకు సెబీ ఆమోదం ముందుగా పొందాలి. లిస్ట్ అయ్యేందుకు ఐపీవో ఒక మార్గం. అప్పటికే లిస్ట్ అయి ఉన్న కంపెనీ తన కంపెనీలోని కొంత వ్యాపారాన్ని వేరే కంపెనీగా వేరు చేసి లిస్ట్ చేసేందుకూ అవకాశం ఉంది. అలాగే, దేశంలోని ప్రాంతీయ స్టాక్ ఎక్సేంజ్ అంటూ కొన్ని రాష్ట్రాలకు పరిమితమైనవి ఉన్నాయి. వాటిలో ఇప్పటికే లిస్ట్ అయి ఉన్నవి సెబీ, స్టాక్ ఎక్సేంజ్ ల అనుమతితో బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో నేరుగా లిస్ట్ కావొచ్చు.  

ప్రైమరీ, సెకండరీ మార్కెట్
ఓ కంపెనీ మొదటి సారి స్టాక్స్ ను విక్రయించేట్టు అయితే దాన్ని ప్రైమరీ మార్కెట్ చానల్ ద్వారానే చేయాల్సి ఉంటుంది. ఐపీవో ప్రైమరీ మార్కెట్ లో భాగమే. ఒకసారి ఇలా జారీ చేసిన షేర్లు స్టాక్ ఎక్సేంజ్ లలో లిస్ట్ అయితే... అప్పుడు స్టాక్ ఎక్సేంజ్ లు సెకండరీ మార్కెట్ అవుతాయి.

బ్రోకరేజీ చార్జీలు, ఎక్సేంజ్, ఇతర చార్జీలు
ఏదేనీ షేరును కొని అదే రోజు విక్రయిస్తే ఇంట్రాడే ట్రేడింగ్ అవుతుంది. కొనుగోలు చేసి వాటిని అదే రోజు విక్రయించకపోతే దాన్ని డెలివరీగా పరిగణిస్తారు. ఇంట్రాడే, డెలివరీ ఈ రెండు విధానాల్లో బ్రోకరేజీ చార్జీలు, పన్నులు వేర్వేరుగా ఉంటాయి. బ్రోకరేజీ సంస్థలు ఇంట్రాడే ట్రేడింగ్ అయితే కొనుగోలు లేదా అమ్మకం విలువపై 0.01 నుంచి 0.05 శాతం వరకు బ్రోకరేజీ వసూలు చేస్తాయి. డెలివరీ అయితే 0.1 శాతం నుంచి 0.5 శాతం వసూలు చేస్తుంటాయి. ఫ్లాట్ గా ఒక ట్రేడ్ పై 10 నుంచి 20 రూపాయలు వసూలు చేసేవీ ఉన్నాయి. ఇక జెరోదా బ్రోకరేజీ సంస్థ అయితే, డెలివరీపై బ్రోకరేజీ చార్జీలు తీసుకోవడం లేదు. సంస్థను బట్టి బ్రోకరేజీ చార్జీల్లో వ్యత్యాసం ఉంటుంది.

ఈ బ్రోకరేజీ చార్జీలకు అదనంగా స్టాక్ ఎక్సేంజ్ చార్జీలు, సెబీ చార్జీలు, ప్రభుత్వానికి వెళ్లే స్టాంప్ డ్యూటీ చార్జీలు, సేవా చార్జీలు కూడా ఉంటాయి. లావాదేవీ విలువపై డెలివరీ అయితే 0.1 శాతం సెక్యూరిటీల లావాదేవీ పన్నుగా చెల్లించాలి. అంటే మీరు చేసిన లావాదేవీ రూ.1,00,000 ఉంటే దీనిపై 0.1 శాతం కింద రూ.100ను సెక్యూరిటీ లావాదేవీల పన్నుగా చెల్లించాలి. ఇది పూర్తిగా కేంద్ర సర్కారుకు వెళుతుంది. టర్నోవర్ ట్యాక్స్ 0.0035 శాతంగా ఉంది. అంటే రూ.లక్షకు రూ.3.50 పన్ను. సెబీ టర్నోవర్ ఫీజు 0.0015 శాతం, స్టాంప్ డ్యూటీ డెలివరీపై 0.01 శాతం. ఇంట్రాడే అయితే 0.002 శాతంగా ఉంది. ఇక స్టాక్ ఎక్సేంజ్ చార్జీలు, ఐజీఎస్టీ అనేవి చాలా నామమాత్రంగా ఉంటాయి. శాతం వారీగా చార్జీలు చెల్లించడం కంటే ఫ్లాట్ గా ఒక్కో ట్రేడ్ కు రూ.10, రూ.20 చొప్పున తీసుకునే బ్రోకరేజీ సంస్థల వల్ల వ్యయాలు తగ్గుతాయి.

representational imageడీమ్యాట్ చార్జీలు
బ్రోకరేజీ సంస్థలు ట్రేడింగ్ ఖాతాపై ఎటువంటి చార్జీలు వసూలు చేయడం లేదు. కొన్న షేర్లను భద్రంగా ఉంచే డీమ్యాట్ ఖాతా లావాదేవీలపై మాత్రం చార్జీలు ఉంటాయి. ఎందుకంటే బ్రోకరేజీ సంస్థలు డీమ్యాట్ ఖాతాల నిర్వహణదారులైన సీడీఎస్ఎల్, ఎన్ఎస్ డీఎల్ కు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. కనుక డీమ్యాట్ ఖాతాపై ఏటా నిర్వహణ చార్జీలంటూ వసూలు చేస్తుంటాయి. ఇవి రూ.100 నుంచి రూ.750 వరకు సంస్థను బట్టి ఆధారపడి ఉంటాయి. ఒకటి రెండు సంస్థలు మాత్రం వార్షిక చార్జీలను తీసుకోవడం లేదు. ఇక డీమ్యాట్ ఖాతాలో షేర్ల జమలపై చార్జీలు లేవు. కానీ, విక్రయించినప్పుడు ఆయా షేర్లు డీమ్యాట్ ఖాతా నుంచి డెబిట్ చేసి కొన్న వారికి అందించాల్సి ఉంటుంది. ఇలా ప్రతీ డెబిట్ లావాదేవీపై చార్జీ రూ.15 నుంచి రూ.25 వరకు ఉంటుంది. కొన్ని అయితే ఇంకా ఎక్కువే వసూలు చేస్తున్నాయి.

అదనపు చార్జీలు
ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతా ప్రారంభ సమయంలో ఓపెనింగ్ చార్జీలంటూ బ్రోకరేజీ సంస్థలు వసూలు చేస్తుంటాయి. ఇవి రూ.100 నుంచి రూ.750 వరకు ఉంటాయి. కొన్ని ఏ విధమైన చార్జీలు లేకుండానే ఈ అవకాశం ఇస్తున్నాయి. కాకపోతే ఖాతా తెరిచి దాన్ని వాడకుండా వదిలేస్తే దానికంటూ ఓ ఫీజు, కనీస బ్యాలన్స్ ఉంచనందుకు ఫీజు అంటూ వసూలు చేసే సంస్థలు కూడా ఉన్నాయి.

ఏ షేర్లను కొనాలి?
ఒక్క షేరు నుంచి ఎన్ని షేర్లయినా కొనుగోలు చేయవచ్చు. కొనుగోలు విలువకు తగ్గ బ్యాలన్స్ ముందుగా అందుబాటులో ఉంచుకోవాలి. ఏ షేర్లను ఎంచుకోవాలి, ఏ ధరలో కొనాలి, ఏ ధరలో విక్రయించాలి... ఈ విషయాలు తెలియడం చాలా ముఖ్యం. లాభాలు పొందడానికి ఇవి కనీస ప్రాథమిక సూత్రాలు. ఇవి తెలియకపోతే నష్టపోవాల్సి ఉంటుంది.

representational imageషేర్ల ఎంపికకు చూడాల్సిన అంశాలు
ప్రతీ కంపెనీకి ఈక్విటీ క్యాపిటల్ అంటూ ఉంటుంది. ఉదాహరణకు హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు జారీ ఈక్విటీ 512.51 కోట్లు. 2,57,38,83,317 కోట్ల జారీ షేర్లున్నాయి. షేరు ముఖ విలువ రూ.2. సాధారణంగా షేరు ముఖ విలువ రూపాయి, రెండు రూపాయిలు, ఐదు రూపాయలు, పది రూపాయలు ఉంటుంది. ఇతర ముఖ విలువలతో ఉన్నవీ కొన్ని ఉన్నాయి. మొత్తం ఈక్విటీని షేరు ముఖ విలువతో లెక్కిస్తే ఎన్ని షేర్లు ఉన్నదీ తెలుస్తుంది. కంపెనీ వద్ద నగదు నిల్వలు, ఆస్తుల విలువ(అప్పులు పోను)ను షేరు వారీగా లెక్కించి చూపించేదే పుస్తక విలువ. పుస్తక విలువ ఒక ప్రామాణిక అంశం. ఉదాహరణకు ఓ షేరు పుస్తక విలువ రూ.50 ఉందనుకోండి. ఆ షేరు ధర మార్కెట్లో రూ.50 కోట్ అవుతుంటే అది అధిక విలువ దగ్గర లేదని అర్థం. అంటే వాస్తవిక విలువకే లభిస్తోంది. పుస్తక విలువ కంటే ఇంకా తక్కువకు లభిస్తుంటే అది చౌక. కంపెనీకి వృద్ధి అవకాశాలు బలంగా ఉంటే పుస్తక విలువకు కనీసం రెండు మూడు రెట్లు ఎక్కువలో ఉన్నప్పటికీ దాన్ని అధిక విలువగా మార్కెట్ వర్గాలు పరిగణించవు. ఆస్తుల విలువ పెరుగుతున్న కొద్దీ పుస్తక విలువ కూడా పెరుగుతుంది. రుణ భారం పెరిగిపోతుంటే పుస్తక విలువ తగ్గిపోతుంది.

పీఈ రేషియో
అలాగే, కంపెనీ అమ్మకాలు, నికర లాభాలు కూడా ఓ షేరు విలువను అంచనా వేయడానికి పరిగణనలోకి తీసుకుంటారు. నికర లాభాన్ని మొత్తం షేర్లతో భాగించి చూస్తే అప్పుడు షేరు వారీ ఆర్జన వస్తుంది. షేరు వారీ ఆర్జనకు (ఈపీఎస్) 5 రెట్ల నుంచి 100 రెట్ల వరకు షేర్ల ధరలు ట్రేడవుతుంటాయి. ఓ కంపెనీ షేరు ధరను, షేరు వారీ ఆర్జనతో లెక్కిస్తే వచ్చే దాన్ని పీఈ రేషియోగా చెబుతారు. సగటున 10 పీఈ స్థాయిలో ఉంటే దాన్ని సమంజసమైన ధరగా చూడొచ్చు. రంగాల వారీ పీఈ వేర్వేరుగా ఉంటుంది. ఓ వ్యాపారంలో ఒక్క కంపెనీయే మోనోపలీగా ఉందనుకోండి. అప్పుడు దాని పీఈ చాలా అధిక స్థాయిలో ఉంటుంది.

డివిడెండ్ ఈల్డింగ్
కంపెనీలు తమ లాభాల్లో  కొంత మేరకు షేరు వారీగా డివిడెండ్ రూపంలో వాటాదారులకు పంపిణీ చేస్తుంటాయి. కొన్ని 40-50 శాతం లాభాన్ని డివిడెండ్ కింద అందిస్తాయి. వీటిని రాబడుల పరంగా మంచి షేర్లుగా చెబుతారు.

ఆపరేటింగ్ మార్జిన్
కంపెనీ వ్యాపార నిర్వహణలో లాభాల శాతం ఇది. అంటే ఓ కంపెనీ 10 కోట్ల టర్నోవర్ చేసిందనుకోండి. అందులోంచి ముడి పదార్థాలు, ఉద్యోగుల వేతనాలు వంటివి తీసేయగా పన్ను చెల్లింపులకు ముందస్తు లాభం శాతం ఇది. ఆపరేటింగ్ మార్జిన్ ఏటేటా పెరుగుతూ ఉంటే కంపెనీ తన వ్యాపారంలో బలోపేతం అవుతుందని భావించొచ్చు.

యాజమాన్యం
యాజమాన్యం సామర్థ్యాలు, నిజాయతీ, నైపుణ్యాలు ఇవన్నీ కూడా ఓ కంపెనీ ఎదుగుదలలో కీలకం. కంపెనీ మేనేజ్ మెంట్ లో భాగంగా ఉన్న వారు సంబంధిత రంగంలో నిపుణులై ఉంటే ఇంకా మంచిది. మంచి వ్యాపారమైనప్పటికీ చెత్త మేనేజ్ మెంట్ నిర్వహణలో ఉన్న కంపెనీ కంటే, చెత్త వ్యాపారం అయినా మంచి మేనేజ్ మెంట్ లో ఉన్న కంపెనీయే మేలని నిపుణులు అంటుంటారు.

ఇతర అంశాలు
కంపెనీ మిగులు నిధులను నూతన వ్యాపార అవకాశాల కోసం వినియోగిస్తుంటే ఎదుగుదలకు అది మంచి సంకేతమే. మిగులు నిల్వలకు తోడు, కొంత మేర రుణాలు తీసుకుని వృద్ధికి అవకాశం ఉన్న కంపెనీలను కొనుగోలు చేస్తున్నా శుభ శకునమే. ఇతర కంపెనీలు, విదేశీ సంస్థలతో భాగస్వామ్యాలు, సంయుక్త సంస్థలను ఏర్పాటు చేయడం వంటి నిర్ణయాలు, ఇలా ఎన్నో అంశాలను మెరుగైన స్టాక్స్ ఎంపికలో భాగంగా చూస్తుంటారు.

representational imageరిస్క్
సగటు ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం నేడు చాలా సులభమైన ప్రక్రియ. కానీ, పెట్టుబడి అంటే కష్టపడి సంపాదించిన ధనాన్ని తీసుకెళ్లి నమ్మి పెట్టడం. ప్రతిఫలంతోపాటు, అసలు కూడా తిరిగి రావాలి. కానీ, ఏదో ఓ కంపెనీ షేరును ఎంచుకుని ఇన్వెస్ట్ చేస్తే పెట్టిన పెట్టుబడి కూడా కోల్పోవచ్చు. కంపెనీ యాజమాన్యం ఒక్క తప్పుడు నిర్ణయం దాని భవిష్యత్తు తారుమారు చేసేస్తుంది. దేశంలో లిక్కర్  (ఆల్కహాల్ ) మార్కెట్లో మెజారిటీ వాటా కలిగిన మెక్ డొవెల్ (యునైటెడ్ స్పిరిట్స్) కంపెనీ, యునైటెడ్ బ్రువరీస్ తదితర కంపెనీల మాజీ అధిపతి విజయ్ మాల్యా పరిస్థితి తెలిసిందే. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ పేరుతో విమానయాన రంగంలోకి అడుగుపెట్టి, భారీగా రుణాలు తీసుకుని చేసిన వ్యాపారంతో నిండా మునిగిపోయారు. దీంతో అప్పులు ఎగ్గొట్టి, లిక్కర్ కంపెనీల్లోని వాటాలను అమ్మేసుకుని విదేశాల్లో తలదాచుకుంటున్నారు. డెక్కన్ క్రానికల్ దక్షిణాదిన ప్రముఖ ఇంగ్లిష్ దినపత్రిక. మరెన్నో మీడియా సంస్థలు బ్రహ్మాండంగా నడుస్తుంటే తీసుకున్న రుణాలు తీర్చలేక ఈ కంపెనీ డీలిస్ట్ కూడా అయిపోయింది.

ఇక జాతీయ, అంతర్జాతీయ అంశాలు, ఆర్థిక వ్యవస్థల పనితీరు, కంపెనీల పనితీరు ఇలా ఎన్నో అంశాలు స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులపై ప్రభావం చూపిస్తాయి. 2008 నాటి అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభాలు ఎదురైతే మార్కెట్లు భారీగా పతనం కూడా అవుతాయి. ఈ తరహా ప్రతికూల పరిస్థితుల్లో పెట్టిన పెట్టుబడిలో సగం విలువ తరిగిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే ఎంపిక చేసుకునే స్టాక్ ఆచితూచి ఉండాలి. పైన చెప్పుకున్న అంశాలన్నింటినీ చూసి స్టాక్ ఎంపిక చేసుకుంటే తిరిగి మార్కెట్లు మళ్లీ వృద్ధి బాట పట్టినప్పుడు క్వాలిటీ స్టాక్స్ తప్పకుండా పెరుగుతాయి. రాబడులనూ ఇస్తాయని చారిత్రక గణాంకాలు చెబుతున్నాయి. తప్పుడు స్టాక్ ఎంచుకుంటే ఈ తరహా పతనాల్లో పెట్టుబడి ఖాళీ అయిపోతుంది. ఇక స్టాక్ మార్కెట్లో స్వల్ప కాలం, మధ్య కాలం, దీర్ఘకాలం కింద పెట్టుబడులను వర్గీకరిస్తారు. స్వల్ప కాలం అంటే ఓ మూడు నుంచి ఆరు నెలల వరకు. మధ్య కాలం అంటే ఏడాది నుంచి మూడేళ్లు. దీర్ఘకాలం అంటే మూడేళ్లు ఆపైన. స్వల్ప, మధ్య కాలానికి పెట్టేవారు ఎక్కువగా రిస్క్ ను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

పన్నులు
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులను ఏడాది కాలం పాటు ఉంచుకుని ఆ తర్వాత విక్రయిస్తే ఎంత లాభం వచ్చినా రూపాయి కూడా పన్ను చెల్లించక్కర్లేదు. ఏడాది లోపు విక్రయిస్తే మాత్రం వచ్చిన లాభంపై 15 శాతాన్ని స్వల్పకాలిక మూలధన లాభాల పన్నుగా చెల్లించాల్సి ఉంటుంది.

నోట్: స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ మెంట్ పై అవగాహన కోసం రూపొందించిన ఆర్టికల్ మాత్రమే ఇది. వ్యక్తిగతంగా అన్ని వివరాలు విచారించిన తర్వాతే ఓ నిర్ణయం తీసుకోవడం సముచితం.


More Articles