బడ్జెట్టులోనే నాణ్యమైన విద్యకు కెనడా!

కెనడాలో చదవాలనే అభిలాష కలిగిన భారతీయ విద్యార్థుల సంఖ్య తక్కువేమీ కాదు. ప్రపంచ స్థాయి నాణ్యమైన విద్యను మద్యస్థాయి బడ్జెట్ లోనే పొందడానికి ఇక్కడ అవకాశం ఉంది. నివాసానికి అత్యంత అనువైన దేశాలలో కెనడా కూడా ఒకటని ఐక్యరాజ్యసమితే ప్రకటించింది.

చక్కని వెసులుబాటు

ముందుగా కెనడాలో గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుంచి కోర్సులో ప్రవేశం కల్పిస్తున్నట్టుగా లెటర్ ను తీసుకోవాల్సి ఉంటుంది. అనంతరం ఆ దేశంలో చదువుకునేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి పొందాలి. తర్వాత విద్యార్థి వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఆరు నెలలు, అంతకంటే తక్కువ కాల వ్యవధిగల కోర్సుల విషయానికొస్తే అడ్మిషన్ అనంతరం నేరుగా వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కెనడాలో గ్రాడ్యుయేట్, మాస్టర్స్ తదితర పూర్తి స్థాయి కోర్సుల్లో చేరిన వారు క్యాంపస్ లోపల, బయట కూడా పార్ట్ టైమ్ ఉద్యోగం చేసుకునేందుకు అనుమతి ఉంటుంది. అంతేకాదు, శాశ్వత నివాస హోదా పొందవచ్చు. 

వీటిని చూస్తారు...

కెనడా యూనివర్సిటీల్లో బ్యాచిలర్స్ డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ పొందడానికి నిర్ణీత అర్హతలు ఉండాలి. ఇంటర్ లో కనీసం 70 శాతం మార్కులైనా అవసరం. చేస్తున్న కోర్సు ఉండాల్సిన అర్హతల వివరాలకు http://www.infozee.com/canada/eligibility.htm వెబ్ సైట్ ను చూసి తెలుసుకోవచ్చు. అడ్మిషన్ అనంతరం వీసాకు దరఖాచేస్తు చేసుకోవాలి. ట్యూషన్ ఫీజులు, నివాస ఖర్చులు, కోర్సు అనంతరం స్వదేశం తిరిగి వెళ్లేందుకు వీలుగా తగినంత నగదు ఉందని వీసా దరఖాస్తు సమయంలో ఆధారాలు చూపాల్సి ఉంటుంది. కెనడా చట్టాలకు కట్టుబడి ఉంటానని హామీ ఇవ్వాలి. ఎలాంటి నేర చరిత్ర లేదని పోలీసుల ధ్రువీకరణ కూడా సమర్పించాలి. ఆరోగ్యం మంచిగానే ఉందని వైద్య పరీక్షల్లో నిర్ధారణ కావాలి. అన్ని విద్యార్హతల పత్రాలు, టోఫెల్, శాట్, జీఆర్ఈ, జీమ్యాట్ పరీక్షలలో స్కోర్స్ ను వీసా జారీ సమయంలో ఇమిగ్రేషన్ అధికారి పరిశీలిస్తారు. స్వల్ప కాలిక కోర్సు కాకుండా పూర్తి స్థాయి అకడమిక్ కో్ర్సుల విద్యార్థులు చదువుకుంటూ క్యాంపస్ లో, క్యాంపస్ వెలుపల వారానికి 20 గంటలపాటు ఉద్యోగం చేసుకునేందుకు అనుమతి ఉంటుంది. సెలవుల్లో పరిమితి లేకుండా పనిచేసుకోవచ్చు. 

కెనడాలో విద్యా వ్యయం

బ్యాచిలర్స్ డిగ్రీ కోర్సుల ట్యూషన్ ఫీజు ఏడాదికి సుమారు 10,730 అమెరికన్ డాలర్లుగా ఉంది. ఆర్ట్స్, హ్యుమానిటీ కోర్సుల ఫీజులు కొంచెం తక్కువ. ఇంజనీరింగ్ కు 17 వేల అమెరికన్ డాలర్లు,  మెడిసిన్, ఫార్మసీ డిగ్రీ కోసం అయితే ఏటా 22వేల అమెరికన్ డాలర్లు చెల్లించుకోవాలి. పీజీ కోర్సుల ట్యూషన్ ఫీజులు ఇంకా ఎక్కువే ఉంటాయి. ఎంబీయే అయితే 32వేల అమెరికన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.

నివాస వ్యయం...

కెనడాలో ఆహారం, ఇతర ఖర్చులకు నెలకు సరాసరి 450 నుంచి 600 అమెరికన్ డాలర్ల వ్యయం అవుతుంది. నివాస వసతి ఖర్చు అదనం. అన్నీ కలుపుకుని చూస్తే ఏటా 8 వేల నుంచి 12 వేల అమెరికన్ డాలర్ల వరకు వ్యయం అవుతుంది. ఆఫ్ క్యాంపస్, ఆన్ క్యాంపస్ లో ఉండే అవకాశం చూసుకుంటే ఖర్చు సగానికి పైగా తగ్గుతుంది.

ప్రముఖ విద్యా సంస్థలు...

మెక్ గిల్ యూనివర్సిటీ ప్రపంచంలో 24వ స్థానంలో ఉంది. 150 దేశాలకు చెందిన విద్యార్థులు మెడికల్, డాక్టరేట్ కోర్సులకు ఈ యూనివర్సిటీకే తొలి ప్రాధాన్యం ఇస్తారు. 1821లో దీన్ని ఏర్పాటు చేశారు. యూనివర్సిటీ ఆఫ్ టొరంటో, యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా, యూనివర్సిటీ ఆఫ్ అల్బర్టా,  యూనివర్సిటీ ఆఫ్ మాంట్రియల్, మెక్ మాస్టర్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ వాటర్లూ, వెస్టర్న్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ కాల్గరీ, క్వీన్స్ యూనివర్సిటీలను కెనడాలోని టాప్ టెన్ గా పేర్కొంటారు.

సిమన్ ప్రేసర్ యూనివర్సిటీ, డల్హౌసీ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ ఒట్టావా, యూనివర్సిటీ ఆఫ్ విక్టోరియా, లావల్ యూనివర్సిటీ, కాంకార్డియా యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ క్యుబెక్, యార్కట్ యూనివర్సిటీ, కార్లెటన్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ మానిటోబా ప్రముఖమైనవి.

కెనడాలో విద్య, స్కాలర్ షిప్ లు, యూనివర్సిటీలు, అసోసియేషన్లు, స్టడీ పర్మిట్లు, తదితర వివరాల కోసం అధికారిక వెబ్ సైట్లు చాలా ఉన్నాయి. www.educationau-incanada.ca, www.scholarships-bourses.gc.ca, www.ican.net.in, www.univcan.ca, www.accc.ca, www.india.gc.ca, www.cic.gc.ca, http://www.vfsglobal.ca/canada/india/, www.immigrationdirect.ca ఈ వెబ్ సైట్లను ఆశ్రయించడం ద్వారా పూర్తి సమాచారం పొందవచ్చు. 


More Articles