రుణం చిటికెలో కావాలా.. అయితే సిబిల్ స్కోర్ చూడండి!
అప్పు చేసి పప్పు కూడు తినరా ఓ నరుడా... అన్న ఓ సినిమా పాట గుర్తుండే ఉంటుంది. కొంత మంది ఇంటి అవసరాలన్నింటినీ తీర్చుకునేందుకు నానా తిప్పలు పడుతుంటారు. మరికొందరేమో చిటికెలో అప్పు చేసేసి ఆనందంగా జీవిస్తుంటారు. అయితే ఈ చిటికెలో అప్పు అనేది అందరికీ సాధ్యం కాదు.
సిబిల్ స్కోరు
చేతిలో క్రెడిట్ కార్డు ఉంటే చాలు ఒకరిని అభ్యర్థించాల్సిన అగత్యం ఉండదు. అయితే, ఈ క్రెడిట్ కార్డు తీసుకోవాలన్నా, వ్యక్తిగత రుణం అయినా, వాహన, ఇంటి రుణం ఏదైనా కానీయండి. బ్యాంకులకు సిబిల్ స్కోర్ ప్రామాణికం. సిబిల్ స్కోర్ 750 కంటే ఎక్కువుంటే కావాల్సినంత రుణం సునాయాసంగా వచ్చేస్తుంది. అందుకే రుణం చిటికెలో రావాలంటే సిబిల్ స్కోర్ 900కు గాను 750 పైన ఉండాలి. అంత స్కోరు కావాలీ అంటే కొన్ని చిట్కాలు పాటించాలి మరి.
క్రెడిట్ కార్డు
చేబదులు కాకుండా బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి ఇప్పటి వరకూ అప్పు తీసుకున్న దాఖలాలు లేకుంటే క్రెడిట్ కార్డుతో ప్రస్థానం ప్రారంభించవచ్చు. అలా అని ఏదో ఒక బ్యాంకు క్రెడిట్ కార్డు తీసుకునేరు... వార్షిక రుసుములు, వడ్డీ చార్జీలు, వడ్డీ లేని వ్యవధి ఇలాంటివన్నీ పరిశీలించి అనువైనది తీసుకోవాలి. అలాగే క్రెడిట్ కార్డ్ ఉంది కదా అని ఇష్టారీతిన వాడేయకండి. కొద్ది కొద్ది మొత్తాల్లో మాత్రమే రుణాన్ని వాడుకుంటూ నిర్ణీత గడువులోపు వాయిదాలు చెల్లిస్తూ... తీసుకున్న రుణం మొత్తాన్ని కచ్చితమైన కాల వ్యవధిలోపు ముగించేయాలి. కనిపించిన ప్రతిదీ క్రెడిట్ కార్డుతో కొనేస్తానంటే కష్టాల్లో పడినట్టే. అప్పుడు తిరిగి చెల్లించడం కష్టమై సిబిల్ స్కోరు పడిపోతుంది. క్రెడిట్ కార్డు రుణమే కాదు ఏ రుణమైనా గడువు లోపు వాయిదాలు చెల్లించడం చాలా ముఖ్యం.
మిక్స్ డ్ గా ఉండాలి
క్రెడిట్ కార్డు ఒక్కటే కాదు. రుణాలు ఎప్పుడూ మిక్స్ డ్ గా ఉంటే స్కోర్ కు బలం పెరుగుతుంది. వాహన రుణం, వ్యక్తిగత రుణం, గృహోపకరణాలకు రుణం... ఇలా అన్నమాట. అయితే, అన్ని రుణాలనూ ఒకేసారి తీసుకునే పొరపాటు చేయరాదు. ఒకదాని తర్వాత ఒకటి ప్లాన్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఏకకాలంలో పలు రుణాలకు దరఖాస్తు చేసుకుంటే... బ్యాంకులు సిబిల్ స్కోర్ కు క్యూ కడతాయి. రిక్వెస్టులు ఎక్కువైతే.. సిబిల్ స్కోరు పై ప్రభావం పడుతుంది.
రిపోర్ట్ ను చూడాలి
సిబిల్ స్కోరు, రిపోర్ట్ ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి. ఎందుకంటే అందులో వ్యక్తిగత సమాచారం, ఇతర వివరాలేమైనా తప్పుగా ఉంటే రుణం అవసరమైన సమయంలో ఇబ్బందులు ఎదురవ్వచ్చు. కనుక ఏడాదిలో ఒకటి రెండు సార్లయినా సిబిల్ రిపోర్ట్ ను పరిశీలించుకోవాలి. సిబిల్ స్కోరు ఎంత? అనే విషయాన్ని ఎవరికి వారు ఆన్ లైన్ ద్వారా తెలుసుకోవచ్చు. ఏడాదికోసారి ఉచితమే. అంతకు మించి కావాలంటే నిర్ణీత చార్జీ చెల్లించాల్సి ఉంటుంది.
రుణం కావాలంటే సిబిల్ రిపోర్ట్‌లో తప్పులుండకూడదు... ఉంటే సరిచేసుకోండి ఇలా...!