స్వల్ప పెట్టుబడితో సంపన్నులు అవుదామని ఉందా…?

సంపన్నులు కావాలని అందరికీ ఉంటుంది. కానీ అది కొందరికే సాధ్యమవుతుంది. ఎంత సంపాదించారన్నది ముఖ్యం కాదు. ఎంత పొదుపు మదుపు చేశామన్నదే కీలకం. అందులోనూ ఎంతకాలం మదుపు కొనసాగితే సంపద సృష్టి సాధ్యమవుతుంది. అదెలా…?

సంపద సృష్టికి తెలివైన నిర్ణయాలే కాదు ఓపిక కూడా ముఖ్యమే. దీర్ఘకాలం పాటు మదుపు చేస్తూ వెళితేనే సంపద సృష్టి సాధ్యమవుతుంది. మదుపు విషయంలో సుమారు 5 ఏళ్లు లేదా అంతకన్నా ఎక్కువ కాలాన్ని దీర్ఘకాలంగా చెబుతారు. దీర్ఘకాలిక అవసరాలకు, సంపద సృష్టికి అందుబాటులో ఉన్న అవకాశాలను చూద్దాం... 

ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్)

representational imageఇది 15 ఏళ్ల పాటు కొనసాగే పెట్టుబడి పథకం. ఇందులో పెట్టుబడి సురక్షితంగా ఉంటుంది. ఎలాంటి రిస్క్ లేనిది. ప్రభుత్వం నిర్వహించే పథకం. దీర్ఘకాలంలో మధ్యకాలిక రిటర్న్ లను ఆశించవచ్చు. పెట్టే పెట్టుబడికి గానీ, కాల వ్యవధి తీరిన తర్వాత వచ్చే రిటర్నులపై గానీ ఎలాంటి పన్ను లేదు. కాకపోతే ఇందులో పెట్టుబడులను పూర్తిగా వెనక్కి తీసుకునేందుకు అవకాశం లేదు. ఆరో ఏడాది చివర్లో కొంత మొత్తాన్ని మాత్రమే తీసుకునేందుకు అనుమతిస్తారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పీపీఎఫ్ పై 8.7 వడ్డీ ఆఫర్ చేస్తోంది. కావాలంటే 15 ఏళ్ల తర్వాత మరో ఐదేళ్లు పొడిగించుకోవచ్చు. పోస్టాఫీసులు, అన్ని బ్యాంకుల్లోనూ పీపీఎఫ్ సౌకర్యం ఉంది. 

మ్యూచువల్ ఫండ్స్

మ్యూచువల్ ఫండ్స్ స్కీములు దీర్ఘకాలంలో మంచి ఫలితాలను ఇస్తాయి. పెట్టుబడి పెట్టేవారి రిస్క్ స్థాయిని బట్టి వచ్చే రాబడులు కూడా ఆధారపడి ఉంటాయని తెలుసుకోవాలి. అందుకే మ్యూచువల్ ఫండ్ సంస్థలు రిస్క్ ను పరిగణనలోకి తీసుకుని వివిధ రకాల పథకాలను నిర్వహిస్తున్నాయి. ఎక్కువ రిస్క్ తీసుకోగలిగిన వారు ప్యూర్ ఈక్వీటీ స్కీములు, మధ్యస్థంగా రిస్క్ భరించేట్లయితే బ్యాలన్స్ ఫండ్స్, రిస్క్ వద్దనుకుంటే డెట్ ఫండ్స్ ను పరిశీలించవచ్చు. పూర్తిగా ఈక్వీటీ పథకాల్లో పెట్టుబడులకు 12 శాతం పైనే రాబడులను ఆశించవచ్చు. రిస్క్ ఉన్న చోటే రాబడీ ఉంటుందన్న నియమాన్ని గుర్తు పెట్టుకోవాలి. బ్యాలన్స్ ఫండ్స్ లో సగటున 10 నుంచి 12 శాతం రాబడికి అవకాశం ఉంటుంది. డెట్ ఫండ్స్ అయితే 8 నుంచి 9 శాతం రాబడి ఆశించవచ్చు. 

సిప్

నెలనెలా క్రమానుగత విధానంలో (సిప్) మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల కొనుగోలు ధర సగటున తక్కువగా ఉండి అధిక రాబడికి అవకాశం ఉంటుంది. స్టాక్ మార్కెట్లు ఎప్పుడూ ఒకే డైరెక్షన్ లో వెళ్లవన్న సంగతి తెలిసిందే. ఆటు పోట్లు సహజం. సిప్ విధానంలో అయితే మార్కెట్ ఎక్కువలో ఉన్నప్పుడు, తగ్గినప్పుడు పెట్టుబడి కొనసాగుతుంది కనుక సగటున రిస్క్ తగ్గి ఎక్కువ లాభాలు అందుకోవడానికి అవకాశం ఉంటుంది. నెలనెలా పెట్టుబడి పెట్టలేని వారు త్రైమాసికానికి ఓ సారైనా పెట్టుబడి పెట్టవచ్చు. సిప్ పద్ధతి ఈక్విటీ స్కీమ్స్ కు సురక్షిత విధానం.  

representational image

స్టాక్ మార్కెట్లో నేరుగా పెట్టుబడులు

స్టాక్స్ మంచి చెడులను, మార్కెట్ పరిస్థితులను విశ్లేషించగల సామర్థ్యం ఉంటే నేరుగా స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా మ్యూచువల్ ఫండ్స్ కంటే ఎక్కువ రాబడులను అందుకోవచ్చు. అయితే, స్టాక్ మార్కెట్ ఆకర్షణలో పడి ట్రేడింగ్, వార్తల ఆధారంగా స్వల్ప కాలిక పెట్టుబడుల వైపు వెళ్లకుండా నియంత్రించుకోవాలి. అప్పుడే లాభాలు కళ్లజూస్తారు.

ఐపీవోలు

స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ కు వచ్చే కంపెనీలు ఎంచుకునే మార్గం ఐపీవోలు. ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ లో  మంచి కంపెనీల షేర్లకు దరఖాస్తు చేసుకోవడం ద్వారా కళ్లు చెదిరే లాభాలు పిండుకోవచ్చు. కొన్ని షేర్లు లిస్టింగ్ రోజే రెట్టింపు అయిన సందర్భాలూ ఉన్నాయి. కాకపోతే మంచి కంపెనీలనే ఎంచుకోవాలి. నేడు ప్రతి ఐపీవో గురించి మార్కెట్లో, ఆన్ లైన్లో సమగ్రమైన సమాచారం లభిస్తోంది. నిపుణులు ఐపీవో విశ్లేషణలు కూడా అందిస్తున్నారు. వాటిని పరిశీలించడం ద్వారా ఐపీవోలకు వచ్చే కంపెనీల చరిత్ర, అమ్మకాలు, లాభాలు, రేటింగ్ సంస్థలు ఏ రేటింగ్ ఇచ్చాయి? తదితర సమాచారాన్ని తెలుసుకోవడం ద్వారా పెట్టుబడిపై అవగాహనకు రావచ్చు. 

రియల్ ఎస్టేట్

భూమిని నమ్ముకున్నోడు ఎన్నడూ ఆగమైపోడు అన్న ఒక నమ్మకం చాలా మందిలో కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకూ భూమిపై పెట్టుబడి పెట్టిన వారు నష్టపోయిన దాఖలాలు చాలా చాలా తక్కువ. 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో భూమికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. కనుక సురక్షితమైన పెట్టుబడి విధానమే కాకుండా తగినంత రాబడిని కూడా ఇచ్చేది రియల్ ఎస్టేట్. ప్లాట్, ఫ్లాట్, నివాస భవనం, వాణిజ్య భవనం ఇలా ఏదైనా ఎవరికి వారు వారి ఆదాయ స్థాయినిబట్టి కొనుగోలు చేయవచ్చు. కొనుగోలుకు అవసరమైన మొత్తం దగ్గరుంటే సరి లేదంటే రుణం తీసుకుని కొనుగోలు చేయవచ్చు. నెలనెలా వాయిదాలు చెల్లించడం ద్వారా దీర్ఘకాలంలో రుణం తీరిపోతుంది. కొనుగోలు చేసిన ఆస్తి విలువ కూడా బాగా పెరుగుతుంది. 

యులిప్స్ 

యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పథకాలు పదేళ్లు అంతకంటే ఎక్కువ కాల వ్యవధికి తీసుకునేవారికి మోస్తరు రాబడులను ఇస్తాయి. బీమా నియంత్రణ ప్రాధికార సంస్థ ఏజెంట్ల కమిషన్ తగ్గించడంతో యులిప్స్ పై ఇప్పుడు చార్జీలు తగ్గిపోయాయి. పైగా నిర్ణీత కాలం పాటు వెనక్కి తీసుకునే అవకాశం లేకపోవడం వల్ల వీటిలో ఎనిమిది శాతం వరకు రాబడులను ఆశించవచ్చు. పైగా పెట్టుబడులకు, రాబడులకు ఆదాయపన్ను మినహాయింపు కూడా ఉంది.

representational image

బంగారంలో పెట్టుబడి

సురక్షితమైన పెట్టుబడి సాధనాల్లో బంగారం కూడా ఒకటి. ద్రవ్యోల్బణాన్ని కాచుకుని మరీ పెట్టుబడి విలువను కాపాడే సాధనం. బంగారంపై రాబడి ఎంత వస్తుందో ప్రస్తుతం చెప్పడం కష్టసాధ్యమే. అయితే, దీర్ఘకాలంలో మాత్రం ఫిక్స్ డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ స్థాయిలో రాబడి ఉంటుందని అంచనా వేయవచ్చు. పెట్టుబడి కోసమే అయితే కేంద్ర ప్రభుత్వం ఆఫర్ చేస్తున్న బంగారం బాండ్లను పరిశీలించవచ్చు. వీటిపై ప్రభుత్వం 2.75 వడ్డీ రేటును వార్షిక ప్రాతిపదికన ప్రతీ ఆరు నెలలకు చెల్లిస్తుంది. గడువు తీరిన తర్వాత ఆ రోజు మార్కెట్లో ఉన్న బంగారం విలువ ఆధారంగా అసలు చెల్లిస్తారు. ఉదాహరణకు గ్రాము 2500 రూపాయల చొప్పున రెండు గ్రాముల బాండ్ ను రూ.5వేలు వెచ్చించి కొనుగోలు చేస్తే... గడువు తీరిన తర్వాత బంగారం గ్రాము 3వేల రూపాయలు ఉందనుకుంటే రెండు గ్రాములుకు ఆరు వేల రూపాయలు చెల్లిస్తారు. మధ్యలో వచ్చే వడ్డీ అదనం. 

కంపెనీల ఫిక్స్ డ్ డిపాజిట్లు

కంపెనీలు తమ పెట్టుబడులు, రుణాల అవసరాల కోసం ఫిక్స్ డ్ డిపాజిట్లు జారీ చేస్తుంటాయి. ఇవి ఎంత శాతం భద్రమో తెలియజేస్తూ రేటింగ్ సంస్థలు రేటింగ్ లు ఇస్తుంటాయి. వాటిని పరిశీలించి పెట్టుబడి పెట్టడం ద్వారా బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీని పొందవచ్చు. ప్రస్తుతం బ్యాంకులు మూడేళ్ల కాలానికి 8 శాతానికి మించి వడ్డీ ఇవ్వడం లేదు. కంపెనీల ఫిక్స్ డిపాజిట్లలో ఇంతకంటే ఎక్కువే ఆశించవచ్చు. 

పోస్టాఫీస్ పొదుపు పథకాలు

నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్లు, కిసాన్ వికాసపత్ర, నెలవారీ ఆదాయ పథకం, రికరింగ్ డిపాజిట్ తదితర పథకాలను తపాలా శాఖ అందిస్తోంది. వీటిలో పెట్టుబడులకు పూర్తి భద్రత ఉంటుంది. రాబడి ఇంచుమించుగా బ్యాంకుల స్థాయిలోనే ఉంటుంది.  


More Articles