రూపాయి ప్రయాణం ఎప్పుడు మొదలైంది...?
మన దేశ కరెన్సీ రూపాయి. అధిక విలువ కలిగిన నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంతో మరోసారి తక్కువ విలువ కలిగిన నోట్లు అమూల్యంగా మారిపోయాయి. మన రూపాయి ప్రయాణం గురించి తెలుసుకుంటే ఎంతో ఆసక్తిగా అనిపిస్తుంది. వేలాది సంవత్సరాల చరిత్ర రూపాయి సొంతం. ఒక విధంగా ప్రపంచంలో అత్యంత పురాతన చరిత్ర కలిగిన కరెన్సీల్లో మన రూపాయి కూడా ఒకటి...
చరిత్రలో క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుంచే రూపాయి జాడలు ఉన్నాయి. మౌర్యుల కాలంలో అర్థ శాస్త్రాన్ని రాసిన చాణక్యుడు (క్రీస్తుపూర్వం 340-290) వెండి కాయిన్లను రూప్యరౌప్య, బంగారు కాయిన్లను సువర్ణరూప్య, రాగి కాయిన్లను తామ్రరూప్యగా పేర్కొన్నారు. 6వ శతాబ్ధంలో (1540-1545) అఫ్ఘాన్ చక్రవర్తి సుల్తాన్ షేర్ షా సూరి తన ఐదేళ్ల పాలనా కాలంలో వెండి రూపియాను జారీ చేయగా ఆ తర్వాత మొఘల్ పాలకులు దీన్ని అనుసరించారు. ఇదే ఆ తర్వాత రూపాయిగా మారింది. సంస్కృతంలో రూప్య అంటే రూపం. రౌప్య అంటే వెండి అని అర్థం. సుల్తాన్ షేర్ షా సూరి జారీ చేసిన వెండి కాయిన్ 11.53 గ్రాముల బరువు ఉండేది. కానీ రూపాయి పేపర్ నోట్లను మాత్రం తొలిగా బ్యాంక్ ఆఫ్ హిందుస్తాన్ 1770-1832 మధ్య, ద జనరల్ బ్యాంక్ ఆఫ్ బెంగాల్ అండ్ బిహార్ 1773-75 మధ్య, బెంగాల్ బ్యాంకు 1784-91 మధ్య విడుదల చేశాయి.
1938లో రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా తొలిసారిగా రూ.1,000, రూ.10,000 నోట్లను విడుదల చేసింది. 1946 జనవరిలో డీమోనటైజేషన్ ప్రకటించేంత వరకు అవి చలామణిలో ఉన్నాయి. 1954లో రూ.1,000, రూ.5,000, రూ.10,000 నోట్లను ఆచరణలోకి తీసుకొచ్చారు. వీటిని 1978లో రద్దు చేశారు. 2000 సంవత్సరంలో కొత్తగా వెయ్యి రూపాయల నోటు చలామణిలోకి వచ్చింది. అంతకంటే ముందు 1987 నుంచీ రూ.500 నోటు చలామణిలో ఉంది.
కాయిన్ల చలామణి మన దేశంలో క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుంచీ ఉందని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. పేపర్ మనీ అనేది 18వ శతాబ్దం చివర్లో అమల్లోకి వచ్చింది. 1935లో ఆర్బీఐ అధికారికంగా ఏర్పడగా మొట్ట మొదటగా రూ.5 నోటును విడుదల చేసింది. స్వతంత్ర భారతంలో తొలిగా ముద్రణకు నోచుకున్న నోటు రూపాయి నోటే. 1, 2, 3, 5, 10, 20, 25 పైసల కాయిన్లు 2011 జూన్ 30వరకు చలామణిలో ఉండగా ఆ తర్వాత రద్దయిపోయాయి.
వెండి కాయిన్లతో తగ్గిన విలువ
భారత్ లో రూపీ తొలిగా వెండి కాయిన్ రూపంలో ఉండేది. అప్పట్లో ఆర్థికంగా బలమైన దేశాల కరెన్సీ బంగారు కాయిన్ల రూపంలో ఉండేది. అమెరికా, యూరోప్ దేశాల్లో పెద్ద ఎత్తున వెండి నిల్వలు బయటపడడంతో బంగారంతో పోలిస్తే వెండి విలువ తగ్గిపోయింది. దీంతో రూపాయి కాయిన్ విలువ కూడా తగ్గింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో 1825లో భారత్ లోని బ్రిటిష్ కాలనీల్లో పాలకులు స్టెర్లింగ్ ను అమల్లోకి తెచ్చారు. అయితే, వెండి రూపాయి బ్రిటిషర్ల పాలనలోనూ భారత కరెన్సీగానే కొనసాగింది. నిజానికి 1873లో ప్రపంచంలో వెండికి కొరత ఏర్పడింది. దీంతో కొన్ని దేశాలు బంగారు కాయిన్లకు మళ్లాయి. కానీ భారత్ మాత్రం తన వెండి రూపాయినే కొనసాగించింది.1835లో మోనో మెటాలిక్ సిల్వర్ తో చేసిన రూపాయి కాయిన్లను అమల్లోకి తెచ్చారు.
1857లో భారత్ లో సిపాయి తిరుగుబాటు జరిగిన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం భారత పాలనను పూర్తిగా తన అధీనంలోకి తీసుకుంది. బంగారు కాయిన్లను సిడ్నీలోని మింట్ లో తయారు చేయించింది. 1864లో బ్రిటిష్ బంగారు కాయిన్లను (ఇంపీరియల్ కాయిన్) అమల్లోకి తేవాలని ప్రయత్నించినా సాకారం కాలేదు. దాంతో అవి వాల్ట్ లలోనే ఉండిపోయాయి.
1959 వరకూ హైదరాబాద్ రూపాయి
1845లో డానిష్ ఇండియన్ రూపీ, 1954లో ఫ్రెంచ్ ఇండియన్ రూపీ, 1961లో పోర్చుగీసు ఇండియన్ ఎస్కుడో స్థానంలో భారత రూపాయిని ప్రవేశపెట్డడం జరిగింది. 1947లో స్వాంతంత్ర్యానంతరం రాచరిక పాలనలోని ప్రాంతాలను భారత యూనియన్ లో విలీనం చేస్తూ అంతకుముందు ఆయా ప్రాంతాల్లో అమల్లో ఉన్న కరెన్సీ స్థానంలో రూపాయిని అమల్లోకి తెచ్చారు. కానీ హైదరాబాద్ రూపాయి మాత్రం 1959 వరకు అమల్లో ఉంది. ఈ ప్రాంతం ఆలస్యంగా భారత్ లో విలీనం కావడమే ఇందుకు కారణం.
రూపాయి పలు భాగాలు
ఒక రూపాయికి వంద పైసలు అని తెలిసిందే. బ్రిటిష్ పాలనలో రూపాయి పలు ఉప విలువలతోనూ ఉండేది. ఒక రూపాయి అంటే 16 అణాలని అర్థం. ఇదే తర్వాత 100 నయా పైసలుగా మారింది. అర్ధ రూపాయి అంటే 8 అణాలు. ఒక పావలా నాలుగు అణాలకు సమానం. ఒక బేడా రెండు అణాలుగా ఉండేది. ఒక పరకా అర అణాతో సమానం. ఒక కాణి అణాలో పావు వంతు.
స్వాతంత్ర్యానంతరం భారత్ నుంచి పాకిస్తాన్ విడివడిన విషయం తెలిసిందే. దీంతో పాకిస్తాన్ రూపీ అక్కడ అమల్లోకి వచ్చింది. అయినప్పటికీ ప్రారంభంలో కొంత కాలం భారత కాయిన్లపైనే పాకిస్తాన్ ముద్ర వేసి ఉపయోగించారు. గతంలో ఒమన్, దుబాయి, కువైట్, బహ్రెయిన్, ఖతార్, కెన్యా, ఉగాండా, సిచెల్లెస్, మారిషస్ తదితర దేశాల్లో రూాపాయే అధికారిక కరెన్సీగా చలామణిలో ఉండేది. 1959లో రిజర్వ్ బ్యాంకు చట్టానికి సవరణ ద్వారా భారత ప్రభుత్వం గల్ఫ్ రూపీని ప్రవేశపెట్టింది. దీన్నే పర్షియన్ గల్ఫ్ రూపీ అంటారు. విదేశీ మారక నిల్వలపై ఒత్తిడిని తగ్గించడానికి ఈ చర్యను చేపట్టింది. అయితే, 1966 జూన్ 6న రూపాయి విలువను తగ్గించడంతో ఒమన్, ఖతార్, ట్రుషియల్ స్టేట్స్ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) గల్ఫ్ రూపీ స్థానంలో తమ కరెన్సీలకు మళ్లాయి. కువైట్, బహ్రెయిన్ 1961లోనే దినార్ లను తమ కరెన్సీలుగా చేసుకున్నాయి.
కరెన్సీ నోట్ల విడుదల
బ్యాంకు ఆఫ్ బెంగాల్ తొలినాళ్లలో నోట్లను ప్రింట్ చేయించింది. ఒకవైపే ముద్రణతో రూ.100, రూ.250, రూ.500 విలువతో ఇవి ఉండేవి. బ్రిటిష్ ఇండియా 1861లో రూ.10, రూ.20, రూ.50, రూ.100, రూ.1,000 నోట్లను విడుదల చేసింది. 1867లో రూ.500, రూ.10,000 నోట్లు కూడా వచ్చి చేరాయి. అయితే, 1935, ఏప్రిల్ 1 నుంచి రిజ్వర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆచరణలోకి వచ్చింది. 1938లో తొలిసారిగా రూ.5 నోటు విడుదల చేసింది. ఆ తర్వాత అదే సంవత్సరంలో వరుసగా రూ.10, రూ.100, రూ.1000, రూ.10,000 నోట్లను కూడా తీసుకొచ్చింది. వీటిపై అప్పటి గవర్నర్ జేమ్స్ టైలర్ సంతకం చేశారు. 1940 ఆగస్టులో రూపాయి నోటును తిరిగి ప్రవేశపెట్టారు.
స్వాతంత్ర్యానంతరం భారత ప్రభుత్వం కొత్త డిజైన్ తో రూపాయి నోటును 1949లో తీసుకొచ్చింది. కింగ్స్ చిత్రం స్థానంలో మహాత్మాగాంధీ బొమ్మను ముద్రించింది. 1970ల్లో రూ.20, రూ.50 నోట్లను తీసుకొచ్చారు. 1987లో రూ.500 నోటు, 2000 సంవత్సరంలో రూ.1,000 నోటు చలామణిలోకి వచ్చింది. 1995లో రూ.1, రూ.2 నోటును ఉపసంహరించారు. రూ.2 అంత కంటే ఎక్కువ విలువ కలిగిన నోట్లను ముద్రించే అధికారం ఆర్ బీఐకి ఉంది. కానీ, రూపాయి ముద్రణ మాత్రం కేంద్ర ప్రభుత్వం అధీనంలోనే ఉంది. అలాగే, అన్ని డినామినేషన్ల కాయిన్ల ముద్రణాధికారం కూడా కేంద్రానిదే.