మీ కంప్యూటర్ లో ఈ సాఫ్ట్ వేర్లు ఉన్నాయా?
మన నిత్యావసరాల్లో కంప్యూటర్ ఓ భాగంగా మారిపోయింది. చేసే ఉద్యోగం దగ్గరి నుంచి ఇంటికి సంబంధించి సరుకుల కొనుగోలు, బిల్లుల చెల్లింపుల దాకా అంతా కంప్యూటర్ ద్వారా చేయగలుగుతున్నాం. అయితే కంప్యూటర్ లో వివిధ పనులు చేసేందుకు వివిధ రకాలైన సాఫ్ట్ వేర్లు అవసరం. వాటిలో కొన్ని కొనుగోలు చేయాల్సి ఉండగా.. చాలా వరకు ఉచితంగా లభిస్తుంటాయి.
సాధారణంగా పెద్ద సంస్థలు తయారు చేసిన సాఫ్ట్ వేర్లు బాగా పనిచేసినా.. వాటిని వినియోగించుకోవాలంటే డబ్బు చెల్లించాల్సిందే. కానీ, కొన్ని ఉచిత సాఫ్ట్ వేర్లు కూడా అత్యుత్తమ పనితీరును చూపుతాయి. ఇక కొన్ని చిన్న చిన్న సాఫ్ట్ వేర్లతో కంప్యూటర్ వినియోగం మరింత సౌకర్యవంతంగా మారుతుంది. ఇలాంటి సాఫ్ట్ వేర్ల పరిమాణం చాలా తక్కువగా ఉండడమే కాదు.. వేగంగా కూడా పనిచేస్తాయి. ఇలాంటి కొన్ని ముఖ్యమైన ఉచిత సాఫ్ట్ వేర్లు ఏమిటో, వాటితో ఉపయోగాలేమిటో తెలుసుకుందాం...
రెకువా (Recuva)
కంప్యూటర్ లో మనం ఒక్కోసారి పొరపాటున అవసరమైన ఫైల్స్ ను కూడా డిలీట్ చేస్తుంటాం. కొన్ని సార్లు డిలీట్ చేశాక ఫైల్స్ తిరిగి అవసరం పడుతుండొచ్చు. ఇలాంటి సమయాల్లో డేటాను తిరిగి పొందేందుకు ‘రెకువా’ సాఫ్ట్ వేర్ ఉపయోగపడుతుంది. ఇలాంటి డేటా రికవరీ సాఫ్ట్ వేర్లు ఎన్నో అందుబాటులో ఉన్నా.. రెకువా మరింత సమర్థవంతంగా పనిచేయడంతోపాటు, పలు అదనపు సౌకర్యాలూ ఉన్నాయి. దీనిద్వారా కంప్యూటర్ హార్డ్ డిస్క్ తోపాటు పెన్ డ్రైవ్ లు, మెమరీ కార్డుల నుంచి డేటాను రికవరీ చేయవచ్చు. పాడైపోయిన హార్డ్ డిస్కులు, పెన్ డ్రైవ్ లు, మెమరీకార్డుల నుంచి కూడా డేటాను తిరిగి పొందేందుకు వీలుండడం ఈ సాఫ్ట్ వేర్ ప్రత్యేకత.
- టెస్ట్ డిస్క్ (TestDisk) సాఫ్ట్ వేర్ కూడా డిలీటైన ఫైల్స్ ను తిరిగి పొందడానికి ఉపయోగపడుతుంది. అంతేకాదు ఏదైనా డిస్క్ పార్టిషన్ ను సంపూర్ణంగా బూట్ డేటాతో సహా రికవరీ చేయగలగడం దీని ప్రత్యేకత.
ఎరేజర్ (Eraser)
పోగొట్టుకున్న, డిలీట్ అయిన ఫైల్స్ ను రికవరీ చేయడానికి పూర్తి వ్యతిరేకంగా పనిచేసే సాఫ్ట్ వేర్ ‘ఎరేజర్’. అంటే మనం డిలీట్ చేసిన ఫైల్స్ ను తిరిగి ఏ రకంగానూ రికవరీ చేయడానికి వీల్లేని విధంగా పూర్తిగా తొలగిస్తుంది (వైపింగ్). మన పెన్ డ్రైవ్ లు, మెమరీ కార్డులు, ఎక్స్ టర్నల్ హార్డ్ డిస్కులను ఎవరికైనా ఇచ్చినప్పుడు.. మనకు సంబంధించిన వ్యక్తిగత, రహస్య డేటాను పూర్తిగా తొలగించేందుకు ఈ ఎరేజర్ సాఫ్ట్ వేర్ ఉపయోగపడుతుంది. దీనిద్వారా నిర్ణీత సమయాల్లో మనకు కావాల్సిన డిస్క్, లేదా పార్టిషన్ లేదా ఏదైనా ఫోల్డర్లను ఆటోమేటిగ్గా వైప్ చేసేందుకు కూడా దీనిలో వీలుంటుంది. రీసైకిల్ బిన్ ను కూడా నిర్ణీత సమయాల్లో పూర్తిగా క్లీన్ చేసేలా ఆప్షన్ కూడా ఉంది.
సీ క్లీనర్ (CCleaner)
ఇది చాలా మందికి తెలిసిన సాఫ్ట్ వేర్. మన కంప్యూటర్ లో పేరుకుపోయే బ్యాకప్ ఫైల్స్, జంక్ ఫైల్స్, క్యాచీ, టెంపరరీ ఫైల్స్ వంటి అనవసరమైన వాటన్నింటినీ క్లీన్ చేయడం ద్వారా కంప్యూటర్ వేగాన్ని పెంచడానికి ఈ సాఫ్ట్ వేర్ తోడ్పడుతుంది. కంప్యూటర్ లో దీనిని ఇన్ స్టాల్ చేసుకుని.. అప్పుడప్పుడూ పూర్తి స్థాయిలో రన్ చేయడం ద్వారా కంప్యూటర్ వేగంగా పనిచేసేలా చేసుకోవచ్చు.
- క్లీనప్ అనే మరో అతి చిన్న, మెరుగైన సాఫ్ట్ వేర్ కూడా లభిస్తుంది. అత్యంత సులభమైన ఇంటర్ ఫేస్ తో ఉండే ఈ సాఫ్ట్ వేర్.. కంప్యూటర్ కు సంబంధించిన దాదాపు అన్ని క్లీనప్ ఆప్షన్లను కలిగి ఉంటుంది. వేగంగా కూడా పనిచేస్తుంది.
ఆస్లోజిక్ డూప్లికేట్ ఫైల్ ఫైండర్ (Auslogics Duplicate file finder)
మన ఫోన్ నుంచి గానీ, పెన్ డ్రైవ్ లు, మెమరీకార్డుల ద్వారా తరచూ కంప్యూటర్ లోకి డేటాను కాపీ చేసి పెట్టుకుంటూ ఉంటాం. అంతేగాకుండా ఇంటర్నెట్ నుంచి కూడా తరచూ ఆడియో, వీడియోలు, ఇతర ఫైల్స్ డౌన్ లోడ్ చేసుకుంటూ ఉంటాం. అందులో చాలా ఫైల్స్ రెండు, మూడు సార్లు కూడా కాపీ చేస్తుంటాం. ముఖ్యంగా ఫోన్ లోంచి ఫొటోల వంటివి కాపీ చేస్తున్నప్పుడు వేర్వేరు ఫోల్డర్లలో ఒకే ఫొటోలు చాలా సార్లు ఉంటుంటాయి. ఇలాంటి డూప్లికేట్ ఫైల్స్ ను వెతికి పట్టుకుని చూపించేందుకు ఆస్లోజిక్స్ డూప్లికేట్ పైల్ ఫైండర్ సాఫ్ట్ వేర్ తోడ్పడుతుంది. కేవలం ఏదో ఒక రకమైన ఫైల్స్ ను కూడా దీని ద్వారా స్కాన్ చేయవచ్చు. అలా దొరికిన డూప్లికేట్ ఫైల్స్ ను డిలీట్ చేయడం లేదా ఓ నిర్ణీత ఫోల్డర్ లోకి మార్చుకోవడం వంటివీ చేయొచ్చు.
గ్లేరీ యుటిలిటీస్ (Glary Utilities)
కంప్యూటర్ కు సంబంధించి దాదాపు 20 రకాల టూల్స్ ఉండే అద్భుతమైన సాఫ్ట్ వేర్ గ్లేరీ యుటిలిటీస్. కంప్యూటర్ బూట్ స్పీడ్, స్టార్టప్ ప్రోగ్రామ్స్ ను మార్చడం దగ్గరి నుంచి ఎర్రర్ మెసేజీలు కనబడకుండా చేసే వరకు ఎన్నో ఉపయోగకరమైన టూల్స్ ఈ సాఫ్ట్ వేర్ లో ఉన్నాయి. ప్రతి పీసీలో ఉండదగిన సాఫ్ట్ వేర్ ఇది.
టెరా కాపీ
కంప్యూటర్ లో ఫైళ్లను, ఫోల్డర్లను నేరుగానే కాపీ, పేస్ట్ చేయవచ్చు. కానీ దీనిని మరింత సులభతరంగా, వేగంగా చేసేందుకు తోడ్పడే సాఫ్ట్ వేర్ ‘టెరా కాపీ’. వేగంగా డేటాను కాపీ చేయడమే కాదు.. మధ్యలో ఎర్రర్స్ వచ్చి ఆగిపోవడం వంటి వాటి నుంచీ రికవర్ చేస్తుంది. ముఖ్యంగా సీడీలు, డీవీడీల నుంచి డేటా కాపీ చేసేందుకు టెరా కాపీ బాగా పనిచేస్తుంది. కాపీ చేసిన తర్వాత అసలు ఫైల్ ను డిలీట్ చేయడం, కాపీ అయిన తర్వాత ఒరిజినల్ ఫైల్ తో మరోసారి పూర్తిగా సరిపోల్చడం వంటి ఆప్షన్లూ దీనిలో ఉన్నాయి.
7జిప్ (7-Zip)
జిప్, రార్, 7జడ్ వంటి ఎన్నో రకాల కంప్రెస్డ్ ఫైళ్లను అన్ జిప్ చేసి ఓపెన్ చేయడానికి.. ఆయా రకాల కంప్రెస్డ్ ఫైల్స్ తయారు చేయడానికి ఉపయోగపడే అత్యుత్తమ ఉచిత సాఫ్ట్ వేర్ ‘7జిప్’. దీనిద్వారా రూపొందించుకున్న కంప్రెస్డ్ ఫైళ్లను ఎన్ క్రిప్ట్ చేసి.. పాస్ వర్డ్ పెట్టుకోవడానికీ అవకాశం ఉంటుంది.
ఫ్రీ ఓపెనర్ (Free Opener)
కంప్యూటర్ కు సంబంధించి ఆడియో, వీడియో, డాక్యుమెంట్లు సహా కొన్ని వందల రకాల ఫైళ్లు ఉంటాయి. వాటిని ఓపెన్ చేయాలంటే వాటికి సంబంధించిన సాఫ్ట్ వేర్ ఉండి తీరాల్సిందే. అంటే చాలా సాఫ్ట్ వేర్లు ఇన్ స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. అలాంటి సమస్య లేకుండా దాదాపు 350 రకాల ఫైళ్లను ఓపెన్ చేసి చూసేందుకు వీలు కల్పించే సాఫ్ట్ వేరే ‘ఫ్రీ ఓపెనర్’. దాదాపు అన్ని రకాల ఫొటో ఫార్మాట్లు, డాక్యుమెంట్ ఫార్మాట్లు, ఆడియో, వీడియోలను దీని ద్వారా ఓపెన్ చేసి చూసుకోవచ్చు.
వినాంప్ (Winamp)
మ్యూజిక్ ఎక్కువగా వినే వారికి అత్యంత సౌకర్యవంతమైన, చిన్న సాఫ్ట్ వేర్ వినాంప్. దీని ఇంటర్ఫేస్ చాలా సులువుగా ఉంటుంది. దాదాపు అన్ని రకాల ఆడియో ఫార్మాట్లను ఇది సపోర్ట్ చేస్తుంది. ఇందులోని గ్రాఫిక్ ఈక్వలైజర్ ద్వారా మ్యూజిక్ ను మనకు నచ్చిన టోన్, బేస్ లలో వినవచ్చు. అంతేకాదు ఎన్నో రకాల ప్రీసెట్ ఈక్వలైజర్ సెట్టింగులూ ఉంటాయి. వినాంప్ ద్వారా కొన్ని రకాల వీడియోలనూ ప్లే చేసుకోవచ్చు.
వీఎల్ సీ (VLC), కేఎం (KM) ప్లేయర్స్
కంప్యూటర్ లో వీడియోలు, సినిమాలను చూడడానికి అత్యుత్తమమైన ప్లేయర్లు వీఎల్ సీ మీడియా ప్లేయర్, కేఎం ప్లేయర్. వీడియోలను స్క్రీన్ కు తగినట్లుగా అమర్చుకోవడానికి, జూమ్ చేసి ప్లే చేసుకోవడానికి, అడ్డం-నిలువు ఓరియంటేషన్ మార్చుకోవడానికి వీటిల్లో ఆప్షన్లు ఉంటాయి. వీడియోలో బ్రైట్ నెస్, కలర్, సాచురేషన్, కాంట్రాస్ట్, షార్ప్ నెస్ వంటి వాటిని పెంచుకోవడానికి తగ్గించడానికి వీలుంటుంది. వీడియోకు ఆడియోకు మధ్య తేడా ఉన్నా సరిచేయడానికి ఆప్షన్లు ఉంటాయి. మొత్తంగా ఇవి కంప్యూటర్లకు మంచి మీడియా ప్లేయర్లుగా చెప్పవచ్చు.
వర్చువల్ రూటర్ (Virtual Router)
రూటర్ వంటివి లేనప్పుడు మన కంప్యూటర్, ల్యాప్ టాప్ లకు ల్యాండ్ లైన్ కేబుల్ ద్వారా వచ్చే ఇంటర్నెట్ ను... వైఫై హాట్ స్పాట్ క్రియేట్ చేయడం ద్వారా సెల్ ఫోన్లు, స్మార్ట్ టీవీల వంటి వైఫై ఎనేబుల్డ్ డివైజ్ లకు అందించడానికి వర్చువల్ రూటర్ సాఫ్ట్ వేర్ తోడ్పడుతుంది. వైఫై హాట్ స్పాట్ క్రియేట్ చేయడం, పాస్ వర్డ్ పెట్టుకోవడం, అనవసరమైన డివైజ్ లను బ్లాక్ చేయడం వంటి సదుపాయాలు దీనిలో ఉన్నాయి. సాధారణంగా ల్యాప్ టాప్ లలో ఇన్ బిల్ట్ గానే వైఫై డివైజ్ ఉంటుంది, పీసీలకు మాత్రం వైఫై డాంగిల్ ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
లిబర్ ఆఫీస్ (Libre Office)
మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సాఫ్ట్ వేర్ తో సమానంగా పనిచేయగల పూర్తి ఉచిత సాఫ్ట్ వేర్ ‘లిబర్ ఆఫీస్’. ఎంఎస్ ఆఫీస్ లో లభించే అన్ని సదుపాయాలూ దీనిలో లభిస్తాయి. దీని ద్వారా రూపొందించిన డాక్యుమెంట్లను ఎంఎస్ ఆఫీస్ ఫార్మాట్లలో కూడా సేవ్ చేసుకోవచ్చు. ఎంఎస్ ఆఫీస్ డాక్యుమెంట్లను దీనిలో ఓపెన్ చేసుకుని ఎడిట్ చేసుకోవచ్చు. డాక్యుమెంట్లను నేరుగా పీడీఎఫ్ ఫార్మాట్ లోనూ సేవ్ చేసుకోవచ్చు. అన్నింటికీ మించి యాక్టివేషన్, లైసెన్స్, డబ్బు చెల్లించడం వంటి గొడవలేమీ లేకుండా పూర్తి ఉచితంగా ఉపయోగించుకోగలం.
ఫాక్సిట్ రీడర్ (Foxit Reader)
పీడీఎఫ్ ఫైల్స్ ను ఓపెన్ చేసి చూడడానికి అత్యుత్తమమైన ఉచిత సాఫ్ట్ వేర్ ఇది. అంతేకాదు వివిధ డాక్యుమెంట్లను పీడీఎఫ్ గా మార్చుకోవడానికి కూడా ఫాక్సిట్ రీడర్ ఉపయోగపడుతుంది.
- సుమత్రా పీడీఎఫ్ (Sumatra PDF) అత్యుత్తమమైన పోర్టబుల్ పీడీఎఫ్ రీడర్ సాఫ్ట్ వేర్. చాలా చిన్నగా ఉండే ఈ సాఫ్ట్ వేర్ చాలా వేగంగా పీడీఎఫ్ ఫైళ్లను ఓపెన్ చేస్తుంది. యూజర్ ఫ్రెండ్లీగా చాలా సులభమైన ఇంటర్ఫేస్ తో ఉంటుంది. దీనిలో అసలు ఇన్ స్టలేషన్ అవసరం లేని వెర్షన్ కూడా అందుబాటులో ఉంది.
పీడీఎఫ్ క్రియేటర్ (PDF Creator)
ఒక రకంగా చెప్పాలంటే ప్రతి పీసీ, ల్యాప్ టాప్ లో ఉండాల్సిన సాఫ్ట్ వేర్ పీడీఎఫ్ క్రియేటర్. చాలా సులభమైన ఇంటర్ఫేస్ తో ఉండే ఈ సాఫ్ట్ వేర్ వేగంగా వివిధ డాక్యుమెంట్లను పీడీఎఫ్ ఫార్మాట్ లోకి మార్చగలదు. దీనిలోని అతి ముఖ్యమైన సౌలభ్యం ఏమిటంటే ఇది విడిగా ఓ సాఫ్ట్ వేర్ లా కాకుండా.. అన్ని రకాల సాఫ్ట్ వేర్లు, విండోస్ లలో పనిచేస్తుంది. ఎందుకంటే ఇది మన పీసీ/ల్యాప్ టాప్ లో ఒక ప్రింటర్ మాదిరిగా సెట్ అవుతుంది. మనం ఏ సాఫ్ట్ వేర్ లో ఉన్నా, ఏ డాక్యుమెంట్ ను అయినా ప్రింట్ (Ctrl+P) కమాండ్ ను ఎంచుకున్నప్పుడు అందులో ప్రింటర్లతో పాటు పీడీఎఫ్ క్రియేటర్ ఆప్షన్ కూడా వస్తుంది. దీనిని ఎంచుకుంటే ఎక్కడ సేవ్ చేయాలో అడుగుతుంది. సేవ్ బటన్ నొక్కితే చాలు పీడీఎఫ్ ఫార్మాట్ లో సేవ్ అయిపోతుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మనం క్రియేట్ చేయదల్చుకున్న పీడీఎఫ్ రిజల్యూషన్, కలర్ వంటివీ మార్చుకోవచ్చు. పీడీఎఫ్ తో పాటు పలు రకాల ఇమేజ్ ఫార్మాట్లలోనూ డాక్యుమెంట్లను సేవ్ చేసుకునేందుకు ఇందులో అవకాశం ఉంది.
పీడీఎఫ్ టు వర్డ్ కన్వర్టర్ (PDF to Word Converter)
పీడీఎఫ్ డాక్యుమెంట్లలో ఉండే సమాచారాన్ని మనం చదవగలమేగానీ మార్చలేం. అలా సమాచారాన్ని చేర్చాలన్నా, తొలగించాలన్నా పీడీఎఫ్ డాక్యుమెంట్లను వర్డ్ ఫార్మాట్ లోకి మార్చాలి. ఇందుకు పీడీఎఫ్ టు వర్డ్ కన్వర్టర్ సాఫ్ట్ వేర్ ఉపయోగపడుతుంది. పీడీఎఫ్ ఫైళ్లలోని టెక్ట్స్ ను మాత్రమే కాదు ఇమేజ్ లను కూడా దీని ద్వారా వేరు చేసుకోవచ్చు. ఒకేసారి వందల సంఖ్యలో పీడీఎఫ్ లను కూడా వర్డ్ డాక్యుమెంట్ ఫార్మాట్ లోకి మార్చుకోవచ్చు.
కామ్ స్టుడియో (Cam Studio)
మనం కంప్యూటర్ పై చేస్తున్నదంతా వీడియోగా రికార్డు కావాలంటే కామ్ స్టుడియో సాఫ్ట్ వేర్ ఉండాల్సిందే. ఉచితంగా లభించే ఈ సాఫ్ట్ వేర్ తో మనం కంప్యూటర్ పై ఏ వర్క్ చేస్తున్నా.. దానిని రికార్డు చేయవచ్చు. అదే సమయంలో మైక్రోఫోన్ ద్వారా వాటిని వివరిస్తూ ఆడియో కూడా రికార్డు చేయవచ్చు. వాయిస్ వద్దనుకుంటే అవసరమైనప్పుడల్లా క్యాప్షన్లు కూడా పెట్టుకోవచ్చు. కంప్యూటర్ కు సంబంధించిగానీ, ఇతర ఏవైనా అంశాల గురించిగానీ ట్యుటోరియళ్లు రూపొందించేందుకు ఈ సాఫ్ట్ వేర్ ఎంతగానో తోడ్పడుతుంది. దీని ద్వారా రూపొందించే వీడియోలను AVI లేదా ఫ్లాష్ (SWF) ఫార్మాట్లలో సేవ్ చేసుకోవచ్చు.
- కామ్ స్టుడియో తరహాలోనే ఐస్ క్రీమ్ స్క్రీన్ రికార్డర్ (Icecream Screan Recorder) సాఫ్ట్ వేర్లు పనిచేస్తుంది. దీనిని కూడా ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.
డిలైటర్ (DLighter)
ఇది చాలా చిన్న సాఫ్ట్ వేర్ అయినా కంప్యూటర్ పై ఎక్కువ సేపు పనిచేసేవారికి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. మన కంప్యూటర్/ల్యాప్ టాప్ స్క్రీన్ బ్రైట్ నెస్ ను ఎప్పుడైనా తగ్గించుకోవడానికి పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. యూజర్ ఇంటర్ఫేస్ చాలా సులువుగా ఉంటుంది. మినిమైజ్ చేసినప్పుడు మన టాస్క్ బార్ పైకి చేరుకుంటుంది. ఎప్పుడైనా టాస్క్ బార్ పై డిలైటర్ ఐకాన్ ను క్లిక్ చేసి, స్క్రీన్ బ్రైట్ నెస్ ను మార్చుకోవచ్చు.
వాల్యుమౌస్ (Volumouse)
అత్యంత సులభమైన ఇంటర్ఫేస్ తో ఉండే అతి చిన్న సాఫ్ట్ వేర్ ఇది. కంప్యూటర్ లో ఏ పని చేస్తున్నా కూడా ఏ అప్లికేషన్/ప్రోగ్రామ్ లో ఉన్నా కూడా కంప్యూటర్/ల్యాప్ టాప్ సౌండ్ ను మౌస్ సహాయంతో పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి ఇది తోడ్పడుతుంది. ఇందుకోసం ఏదైనా హాట్ కీతో సంయుక్తంగా మౌస్ కుడి బటన్ ను కలిపి సెట్ చేసుకోవచ్చు. హాట్ కీ, మౌస్ కుడి బటన్ ను ప్రెస్ చేయడం ద్వారా వాల్యుమౌస్ ఓపెన్ అవుతుంది. జస్ట్ మన మౌస్ వీల్ ను స్క్రోల్ చేయడం ద్వారాగానీ లేదా ప్రోగ్రామ్ లోని బార్ ను కిందికి పైకి డ్రాగ్ చేయడం ద్వారాగానీ సౌండ్ ను పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు.
విజ్ మౌస్ (WizMouse)
సాధారణంగా ఇలాంటి సాఫ్ట్ వేర్ మనకు అవసరమని భావించం. కానీ దీనిని ఇన్ స్టాల్ చేసుకున్న తర్వాత ఈ సాఫ్ట్ వేర్ లేకుండా ఉండలేం. ముఖ్యంగా కంప్యూటర్ లో ఒకే సారి రెండు మూడు విండోలు ఓపెన్ చేసుకుని పనిచేసే వారికి ఇది అత్యంత ప్రయోజనకరమైన సాఫ్ట్ వేర్. ఇంతకూ దీని ప్రత్యేకత ఏమిటంటే.. కంప్యూటర్/ల్యాప్ టాప్ లోని ఏ విండోలో అయినా ఏ అప్లికేషన్ లో అయినా పైకి కిందకు మూవ్ చేయడానికి మౌస్ వీల్ పనిచేస్తుంది. సాధారణంగా రెండు మూడు విండోలు ఓపెన్ చేసుకుని.. ఒకదానిలో పనిచేస్తున్నప్పుడు మరో విండోలో డేటాను చూడాలంటే దానిపై క్లిక్ చేయాలి, తర్వాత మౌస్ వీల్ తిప్పాలి. అదే విజ్ మౌస్ ప్రొగ్రామ్ ఇన్ స్టాల్ చేసుకుంటే... యాక్టివ్ విండోలోనే కాదు ఇనాక్టివ్ విండోలపైకి కేవలం మౌస్ కర్సర్ ను తీసుకెళ్లి, మౌస్ వీల్ తిప్పితే చాలు. విండోలు మూవ్ అవుతాయి. మరో ప్రధాన సౌకర్యం ఏమిటంటే పలు అప్లికేషన్లు, సాఫ్ట్ వేర్లలో మౌస్ వీల్ సపోర్ట్ ఉండదు. తప్పనిసరిగా బార్స్ ను డ్రాగ్ చేయాల్సిందే. అలాంటి వాటిలో కూడా విజ్ మౌస్ పనిచేస్తుంది మరి. ఈ సాఫ్ట్ వేర్ కూడా చాలా చిన్నది. సులభమైన యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది.