ఉన్నట్టుండి ఉద్యోగం ఊడితే... రక్షణ ఎలా..?
ఉద్యోగులకు ప్రతీ నెల 1వ తారీఖు పండుగ రోజువంటిది. ఆ రోజు వచ్చే జీతమే వారిని ఓ నెల పాటు నడిపించేది. వేతనం ఒకటి రెండు రోజులు ఆలస్యమైనా కొంత మంది తెగ ఆందోళన పడిపోతారు. మరి అలాంటి పరిస్థితుల్లో ఏకంగా ఉన్నట్టుండి ఉద్యోగమే ఊడితే...? పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. అందుకే అలాంటి సందర్భం ఎదురైతే రోడ్డున పడకుండా తగిన రక్షణ ఎలానో చూద్దాం.
అనుకోని ఘటన జరిగి కుటుంబానికి ఆధారమైన వ్యక్తి మరణిస్తే అతడిపై ఆధారపడిన వారంతా దిక్కుతోచని స్థితిలో పడిపోతారు. అందుకే అలాంటి పరిస్థితుల్లో ఆదుకునేందుకు జీవిత బీమా... అనారోగ్య సమస్యల నుంచి రక్షించుకునేందుకు ఆరోగ్య బీమా... వాహనం చోరీకి గురైతే, ప్రమాదాల్లో దెబ్బతింటే పరిహారం ఇచ్చేందుకు బీమా ఇలా ఎన్నో రకాల పాలసీలు ఉన్నట్టే... ఉద్యోగం పోతే ఆదుకునేందుకు సైతం బీమా పాలసీలు ఉన్నాయి. ఈ విషయం తెలిసిన వారు చాలా తక్కువ మంది.
ఉదాహరణకు రాయల్ సుందరం సేఫ్ లోన్ షీల్డ్ పేరుతో ఒక పాలసీ అందిస్తోంది. ఉద్యోగి ఒకవేళ తీవ్ర అనారోగ్యం బారిన పడినా... ప్రమాదంలో గాయపడడం వల్ల తాత్కాలికంగా గృహరుణం చెల్లించలేని పరిస్థితి ఎదురైనా ఆ బాధ్యతను రాయల్ సుందరం లైఫ్ షీల్డ్ పాలసీ తీసుకుంటుంది. మూడు నెలల పాటు గృహరుణం వాయిదాలను చెల్లిస్తుంది. అంతేకానీ ఉద్యోగం పోతే వేతనానికి తగ్గట్టుగా పరిహారం చెల్లించే డైరెక్ట్ పాలసీలు మన దగ్గరకు ఇంకా అందుబాటులోకి రాలేదు. సమీప భవిష్యత్తులోనే ఈ పాలసీలు అమల్లోకి వస్తాయంటున్నారు. ప్రస్తుతం గృహరుణం తీసుకునే వారికి, క్రిటికల్ ఇల్ నెస్ కవరేజీ పాలసీలు తీసుకునే వారికి కొంత అదనపు ప్రీమియం చెల్లిస్తే యాడాన్ కవరేజీ కింద ఈ జాబ్ లాస్ కవరేజీ పాలసీలను కంపెనీలు అందిస్తున్నాయి.
నిజానికి ఉద్యోగం కోల్పోతే మళ్లీ ఉద్యోగం లభించేందుకు కొంత సమయం పట్టవచ్చు. కొన్ని సందర్భాల్లో వెంటనే జాబ్ అవకాశం లభించవచ్చు. కొన్ని సందర్భాల్లో కొన్ని నెలలు పట్టవచ్చు. ఇలా ఎక్కువ కాలం పాటు ఉద్యోగం లేకుండా ఆదాయం ఆగిపోతే పెళ్లయి కుటుంబ బాధ్యతల్లో ఉన్న వారికి చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. కేవలం గృహరుణం వంటి వాటిని చెల్లించేవే కాకుండా వేతనానికి సమాన స్థాయిలో తిరిగి ఉద్యోగం లభించే వరకు పరిహారం చెల్లించే పాలసీలతోనే నిజమైన ప్రయోజనం ఉంటుందన్నది నిపుణుల అభిప్రాయం. ఇప్పటికే విదేశాల్లో ఈ తరహా పాలసీలు ఉన్నాయి. కచ్చితంగా మన దగ్గర కూడా ఇవి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.
పాలసీల వల్ల ఉపయోగం ఉందా...?
ప్రస్తుత పాలసీలు ఉద్యోగం కోల్పోతే పూర్తి రక్షణను అందించలేవని అర్థమవుతోంది. అయినప్పుటికీ గృహ రుణం తీసుకుని ఉన్నవారికి ఇవి తీసుకుంటే ఎంతో కొంత ఊరటే. ఉదాహరణకు ఐసీఐసీఐ లాంబార్డ్ సెక్యూర్ మైండ్ పేరుతో ఓ పాలసీ అందిస్తోంది. సిస్టమేటిక్ ఇన్వెస్ట్ మెంట్ విధానంలో మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టేవారి కోసం వీలుగా ఈ పాలసీని అందిస్తోంది. ఉదాహరణకు, నరసింహారావు నెలకు రూ.2,000 చొప్పున ఐదేళ్ల కాలం పాటు ఇన్వెస్ట్ చేసేందుకు సబ్ స్క్రయిబ్ చేసుకున్నాడని అనుకుందాం. అప్పుడు ఐదేళ్ల కాలానికి 1,20,000 వేలు ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ అని అర్థమవుతుంది. దీనిపై కవరేజీని ఐసీఐసీఐ లాంబార్డ్ సెక్యూర్ మైండ్ అందిస్తుంది. ఒకవేళ ఉద్యోగం కోల్పోతే కవరేజీలో 2 శాతం... అంటే 2,400 రూపాయలు చొప్పున మూడు నెలల పాటు ఇస్తుంది. గరిష్టంగా 6 శాతం 7,200 వరకు పొందడానికి అవకాశం ఉంది. ప్రీమియం కవరేజీలో ఒక శాతం వరకు ఉండవచ్చు. గరిష్టంగా 2 శాతం.
పరిమితులు
అయితే, అసమర్థత, పనితీరు సరిగా లేని కారణంగా, ఉద్యోగి అనైతిక చర్యల వల్ల ఆ ఉద్యోగం నుంచి తొలగిస్తే కంపెనీలు పరిహారం చెల్లించవు. వేరే వేలీడ్ రీజన్స్ తో ఉద్యోగంలోంచి తొలగిస్తే పరిహారం చెల్లించేందుకు బీమా కంపెనీలు అభ్యంతర పెట్టవు. అయితే, కవరేజీ చాలా పరిమితం. అంటే పైన చెప్పుకున్నట్టు 1,20,000పై కేవలం 2 నుంచి 6 శాతం వరకే పరిహారం చెల్లించడం వల్ల పెద్దగా అక్కరకు రాదు. పైగా ఏటా ప్రీమియం రూపంలో 1,200 వరకు చెల్లించాల్సి ఉంటుంది. అది కూడా మూడు నెలలకే పరిమితం. అందులోనూ నికరంగా నెలకు అందుకునే వేతనంలో గరిష్టంగా సగం మేరకే పరిహారం అనే పరిమితి కూడా ఉంటుంది.
ప్రీమియాన్ని పరిగణనలోకి తీసుకుని చూసినప్పుడు... ఉద్యోగం పోవడానికి ఎక్కువ అవకాశాలున్న సమయాల్లోనే ఈ కవరేజీ తీసుకోవాలని నిపుణుల సూచన. కొంత మందికి ముందుగానే ఉద్యోగం పోయే అవకాశం ఉందన్న విషయం తెలుస్తుంది.
మరి రక్షణ ఎలా...?
ప్రతీ ఉద్యోగి ఈ పరిస్థితులను ముందుగానే విశ్లేషించుకుని ఎమర్జెన్సీ ఫండ్ కోసం నెలనెలా ఇన్వెస్ట్ మెంట్ కొనసాగించాలని నిపుణులు సూచన. అవసరంలో ఆదుకుంటుందనే ఉద్దేశంతో నెలకు రూ.50వేల వేతనం ఉన్న ఉద్యోగి జాబ్ లాస్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నప్పటికీ పరిహారంగా ఏటా 1,500 రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది. దీనికి బదులు నెలకు 2,000 రూపాయల చొప్పున ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తే ఓ ఐదేళ్ల కాలంలో లక్షన్నర రూపాయలపైనే అత్యవసర నిధి ఏర్పడుతుంది. ఏ ఉద్యోగి అయినా ముందుగా సిద్ధం చేసుకోవల్సింది అత్యవసరం నిధే. కనుక నెలకు ఎంత వీలయితే అంత మొత్తాన్ని ప్రత్యేకంగా పక్కన పెడుతూ మూడు నుంచి ఆరు నెలల వేతనానికి సరిపడా నిధి సమకూర్చుకుని దాన్ని ఫిక్స్ డ్ డిపాజిట్ రూపంలో ఉంచుకోవాలి. అవసరం ఏర్పడినప్పుడు దీన్ని కేన్సిల్ చేసుకోవచ్చు. లేదా ఈ డిపాజిట్ పై 90 శాతం వరకు రుణం తీసుకోవడానికి వీలుంది.
ప్రత్యామ్నాయాలు
వేతనం కొంతే ఉండి అత్యవసర నిధి అంటూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోలేని వారు ఉద్యోగం కోల్పోయిన సందర్భాల్లో ప్రత్యామ్నాయ అవకాశాలను చూడాలి. ఉదాహరణకు పెళ్లయిన దంపతుల వద్ద బంగారు ఆభరణాలు ఎంతో కొంత ఉంటాయి. వాటిపై తాకట్టు రుణాన్ని నెలకు రూపాయిన్నర వడ్డీపై పొందడం చాలా సులభం. ఉద్యోగం కోల్పోయి ఉంటారు గనుక పర్సనల్ లోన్ రావడం గగనమే.