ఈ మొక్కలు మీ ఇంట్లో ఉంటే... ఆరోగ్యంతో నిండు నూరేళ్లు!
స్వచ్ఛమైన ప్రాణవాయువు అభివృద్ధి ముసుగులో విషపూరితంగా మారుతోంది. ముఖ్యంగా పట్టణాల్లో వాయు కాలుష్యం పరిమితికి మించిన స్థాయుల్లో ఉంటోంది. పరిశ్రమలు, వాహనాలు పెరిగిపోతూ, మొక్కలు తరిగిపోతూ ప్రకృతి పరంగా ఆ బ్యాలన్స్ ప్రొటెక్షన్ దెబ్బతిని పోతోంది. ఫలితమే చిన్నారి నుంచి పండు ముదుసలి వరకు ప్రతి ఒక్కరినీ ఊరిపితిత్తులు, శ్వాస కోస వ్యాధులు వేధిస్తున్నాయి.
ఎయిర్ ప్యూరిఫయర్లు అనే మెషిన్లు ఉన్నాయి. వీటిని ఇల్లు, కార్యాలయాల్లో అమర్చుకోవడం వల్ల గాలిలోని కలుషితాలను తొలగించేందుకు తోడ్పడతాయి. కానీ, వీటి వాడకం అంతగా లేదు. అవగాహన లేకపోవడం, ఖరీదు కావడం ఇందుకు కారణాలుగా పేర్కొనవచ్చు. అయితే, పదులు, వందల రూపాయల ఖర్చుతో ఈ విధమైన ప్రయోజనాలను మనం అందుకోవచ్చు. ఈ మెషిన్ల వలే గాలిని స్వచ్ఛంగా మార్చే మొక్కలు కూడా ఉన్నాయి. మెషిన్లకు మించి అద్భుతంగా పనిచేసేవీ ఉన్నాయి. వాటిని తీసుకొచ్చి పూల కుండీల్లో వేసుకుని ఇంట్లో కార్యాలయాల్లో ఉంచుకుంటే స్వచ్ఛమైన ప్రాణవాయువును అందుకోవచ్చు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇలాంటి కొన్ని మొక్కలను ధ్రువీకరించింది. ఇంట్లో పెంచుకునేందుకు సిఫారసు చేసింది.
నాసా పరిశోధన
నాసా గాలిని శుభ్రం చేసే మొక్కలపై చాలా ఏళ్ల క్రితమే ఎన్నో అధ్యయనాలు నిర్వహించింది. వాతావారణంలో ప్రమాదకమైన విషపూరిత రసాయనాలు బెంజీన్, ఫార్మల్ డీహైడ్, ట్రైక్లోరో ఎథిలేన్, గ్జైలేన్, అమ్మోనియా వంటి హానికారక విష రసాయనాలను, కాలుష్యాలను తొలగించి గాలిని స్వచ్ఛంగా మార్చే మొక్కలను తెలుసుకునే ప్రయత్నం చేసింది. అలాంటి మొక్కలు కొన్నింటిని సూచించింది కూడా. కనీసం 100 చదరపు అడుగులకు ఒక మొక్క ఉండాలన్నది నాసా సూచన.
మన చుట్టూ ఉన్న కాలుష్యాలేంటి?
ట్రై క్లోరో ఎథిలేన్: పెయింటింగ్ ఇంక్, పెయింట్స్, వార్నీషులు, అడెసివ్స్, పెయింట్ రిమూవర్ లో ట్రైక్లోరో ఎథిలేన్ అనే రసాయనం ఉంటుంది. వీటి ద్వారా అది గాలిలోకి వచ్చి చేరుతుంది. దీని ప్రభావంతో ఉద్రేకం, మైకం, తలనొప్పి, తలతిరగడం, వాంతులు, వికారం వంటివి ఎదురవుతాయి.
ఫార్మల్ డీహైడ్: పేపర్ బ్యాగులు, వ్యాక్స్ డ్ పేపర్లు, ఫేసియల్ టిష్యూస్, పేపర్ టవల్స్, టేబుల్ న్యాప్ కిన్లు, పార్టికల్ బోర్డులు, ప్లైవుడ్ ప్యానల్స్, సింథటిక్ ఫ్యాబ్రిక్స్ లో ఈ కెమికల్ ఉంటుంది. ముక్కు, నోరు, గొంతు భాగాల్లో చిరాకు, స్వరపేటిక, ఊరిపితిత్తుల్లో వాపు వంటి సమస్యలు వస్తాయి.
బెంజీన్: ప్లాస్టిక్స్, రెజిన్స్, సింథటిక్ ఫైబర్స్, రబ్బర్ లూబ్రికెంట్లు, డైస్ లో ఉంటుంది. అలాగే, సబ్బులు, డ్రగ్స్, పురుగుల మందులు, సిగరెట్ పొగ, వాహనాల నుంచి వెలువడే పొగలో, గ్లూ, పెయింట్, ఫర్నిచర్ వ్యాక్స్ లో ఈ రసాయనం ఉంటుంది. కళ్లకు అసౌకర్యం, మగత, మైకం, గందరగోళం, కొన్ని సందర్భాల్లో స్పృహ కోల్పోవడం వంటివి చోటు చేసుకుంటాయి.
గ్జైలేన్: ప్రిటింగ్, రబ్బర్, తోలు, పెయింట్ పరిశ్రమలు, సిగరెట్ పొగ, వాహనాల పొగ ద్వారా గాల్లోకి చేరుతుంది. ఈ రసాయన ప్రభావంతో నోరు, గొంతు భాగాల్లో చిరాకు, మైకం, తలనొప్పి, గందరగోళం, గుండె, లివర్, కిడ్నీ సమస్యలు ఎదురవుతాయి.
అమ్మోనియా: పురుగుల మందుల ద్వారా ఎక్కువగా గాల్లోకి వచ్చి చేరుతుంది. ఈ రసాయనాలకు ఎంత సమయం పాటు ఎక్స్ పోజ్ అయ్యారన్న దాన్ని బట్టి వచ్చే సమస్యలు ఉంటాయి. కళ్ల దురద, దగ్గు, గొంతుమంట వంటివి సాధారణంగా కనిపించే సమస్యలు.
ఫార్మల్ డీహైడ్: ఇది సహజంగా ఏర్పడే ఆర్గానిక్ మిశ్రమం. మెథలీన్ ఆక్సైడ్, ఫార్మాల్ తదితర పేర్లు కూడా దీనికి ఉన్నాయి. అడవుల్లో కార్చిచ్చు లేదా మొక్కలకు నిప్పు పెట్టడం, వాహనాల నుంచి వెలువడే పొగ, సిగరెట్ల పొగల ద్వారా వెలువడుతుంది. ఇది కేన్సర్ కు దారితీసే అత్యంత ప్రమాదకర వాయువు అని చాలా అధ్యయనాల్లో వెల్లడైంది.
అలోవెరా
అన్ని ప్రాంతాల్లోనూ అందుబాటులో ఉండే మొక్క అలోవెరా. భవనాల్లోపల గాలి నాణ్యతను మెరుగుపరచడంలో దీనికిదే సాటి. ఇంట్లో ఆక్సిజన్ లెవల్స్ ను పెంచడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. గాలిలోని బెంజీన్, ఫార్మల్ డీహైడ్, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డై ఆక్సైడ్ లను గ్రహించుకుంటుంది. ఒక్క అలోవెరా మొక్క తొమ్మిది ఎయిర్ ప్యూరిఫయర్ మెషిన్లతో సమానం అని శాస్త్రవేత్తలే తేల్చారు. ఆలోవెరాకు ఔషధ గుణాలు సైతం ఉన్నాయన్న విషయం తెలిసిందే. చర్మ సౌందర్య ఉత్పత్తుల్లో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఈ మొక్క నిర్వహణ చాలా తేలిక. నీరు పోయడం మర్చిపోయినా చాలా రోజుల పాటు చక్కగా బతికేస్తుంది.
పీస్ లిలీ
చూడ్డానికి అందంగానూ ఉండడం ఆకర్షణీయం. పైగా గాలిని ఫిల్టర్ చేసే మొక్క. భవనాల్లోపల గాలిని 60 శాతం వరకు ఫిల్టర్ చేయగలదు. ఇంటిలోపల డెవలప్ అయ్యే ఫంగస్ కు సంబంధించిన బీజాంశాలను ఇది తన ఆకుల ద్వారా గ్రహిస్తుంది. అలా గ్రహించనవి వేర్లకు వెళతాయి. అప్పుడు వాటిని తన శక్తిగా మొక్క మార్చుకుంటుంది. అందుకే ఫంగస్ కు అవకాశం ఉండే బాత్ రూమ్స్ వంటి ప్రదేశాల్లో ఈ మొక్కను ఉంచడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఇది గాలిలోని ఫార్మల్ డీహైడ్, ట్రైక్లోరో ఎథిలేన్ లను కూడా తొలగిస్తుంది.
స్పైడర్ ప్లాంట్
ఇళ్లలో సులభంగా పెరిగే మొక్క. కొన్ని రోజుల పాటు నీరు పోయడం మర్చిపోయినా జీవించి ఉండే మొక్క. చాలా తేలిగ్గా పెరుగుతుంది. ఎలాంటి ఎరువులు అవసరం లేదు. ఇంట్లోని గాలిలో ఉన్న విషపూరితాలను 90 శాతం వరకూ తొలగించే సామర్థ్యం దీనికి ఉంది. ఈ మొక్క పూర్తిగా ఆకులతో ఉంటుంది. ఇవి పొడవుగా ఉంటాయి. దుమ్ము అలెర్జీతో బాధపడే వారు ఈ మొక్కను ఇంట్లో ఉంచుకుంటే ఆ అలెర్జీ కారకాలను ఇది తనలో గ్రహించుకుని ఉపశమనం కల్పిస్తుంది.
ఫార్మల్ డీహైడ్, కార్బన్ మోనాక్సైడ్, గ్యాసోలిన్, స్టేరేన్ వంటి హానికారక వాయువులను సైతం కొంత వరకు గ్రహిస్తుంది. 200 చదరపు మీటర్లకు ఒక మొక్క సరిపోతుంది. మరో మొక్క ఉంచుకున్నా మంచిదే గానీ నష్టం లేదు. గాలిలోని కలుషితాలను చాలా ప్రభావవంతంగా తొలగిస్తుంది. కనుక ఈ మొక్క వల్ల మంచి నిద్ర కూడా సాధ్యమవుతుందని నాసా సైంటిస్టులు తెలిపారు.
ఇంగ్లిష్ ఐవీ
పెట్స్ ఉన్న ఇళ్లల్లో పెంచుకోవాల్సిన మొక్క ఇది. ఎందుకంటే పెట్స్ నుంచి వెలువడే వ్యర్థ పదార్థాల ప్రభావాన్ని ఇంగ్లిష్ ఐవీ తగ్గిస్తుంది. ఫార్మల్ డీహైడ్ ను ఇది గ్రహించుకుంటుంది. కేవలం 12 గంటల సమయంలోనే ఈ పనిచేస్తుంది. ఈ మొక్క ఉన్న ఇంట్లో ఆరు గంటల్లోపటే ఇది గాలిలోని 60 శాతం హాని కారక వ్యర్థాలను ఫిల్టర్ చేసేస్తుంది. కార్యాలయాల్లోనూ తప్పకుండా ఉంచుకోవాల్సిన మొక్క. కార్యాలయ వాతావరణంలో ఎక్కువగా ఉండే బెంజీన్ ను ఈ మొక్క తొలగిస్తుందని చాలా అధ్యయనాల్లో వెల్లడైంది. ఆస్తమా, అలర్జీ సమస్యలతో భాధపడే వారు వెంటనే ఈ మొక్కలను ఇంటికి తెచ్చుకుంటే ఉపశమనం పొందవచ్చు.
బోస్టన్ ఫెర్న్
దీనితో సౌందర్య, ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. ఈ మొక్క హుమిడిఫయర్ గా పనిచేస్తుంది. అంటే గాలిలో తగినంత తేమ ఉండేలా చూస్తుంది. డ్రై స్కిన్ తో ఇబ్బంది పడే వారికి ఈ మొక్కలతో మంచి ప్రయోజనం ఉంటుంది. ఫార్మల్ డీహైడిన్ ను తొలగిస్తుంది. కుండీల్లో ఈ మొక్కలను ఇంటి ముందు, బాల్కనీల్లో ఎత్తులో వేలాడదీయడం వల్ల చాలా అందాన్నిస్తాయి. కాకపోతే దీనికి సూర్యుని వెలుగు పడేలా ఉంచి రోజూ నీరు పోయాల్సి ఉంటుంది.
అరెకా పామ్
దీని నిర్వహణ చాలా సులభం. నీరు పోస్తే దానంతట అదే పెరుగుతుంది. ట్రైక్లోరో ఎథిలేన్, ఫార్మల్ డీహైడ్, బెంజీన్ సహా భవనాల్లోపల ఉన్న గాలి కాలుష్యాలను ఇది సమర్థవంతంగా ఫిల్టర్ చేస్తుంది. గాలిలోకి తగినంత తేమను విడుదల చేస్తుంది. చూడ్డానికి ఈతచెట్టు మాదిరిగా కనిపిస్తుంది. సూర్యుని వెలుతురు కొద్దిగా లభించే చోట దీన్ని ఉంచుకోవాలి. నీరు రోజూ పోస్తుండాలి. మూడు నుంచి ఐదు అడుగులు పెరిగే మొక్క. తక్కువ నీరు, తక్కువ వెలుతురు సరిపోతాయి.
క్రిశాంతమెమ్
చూడ్డానికి అందంగా ఉంటుంది. నర్సరీల్లో సాధారణంగా కనిపించే మొక్క. వీటికి తగినంత సూర్యరశ్మి అవసరం. నీరు మధ్యస్తంగా అవసరం ఉంటుంది. ఈ మొక్కలకు పూసే పుష్పాలు మరో ఆకర్షణ. ఇవి గాలిలోని బెంజీన్ ను ఫిల్టర్ చేస్తాయి. అలాగే, గ్జైలేన్, అమ్మోనియా, ఫార్మల్ డీహైడ్, ట్రైక్లోరో ఎథిలేన్ లను తొలగిస్తుంది.
చైనీస్ ఎవర్ గ్రీన్
చాలా రకాల గృహ కాలుష్యాలను నివారించడంలో ఈ మొక్క పనితీరు అమోఘం. గాలిలోని పలు రకాల హానికారక రసాయనాలను తొలగిస్తుంది. తక్కువ వెలుగులో సైతం బతికేస్తుంది. ఒక విధంగా ఇది మొండి ఘటం టైపు.
ఫికస్
దీనికి వెలుతురు అంతగా అవసరం ఉండదు. నిర్వహణ తేలిక. గాలిలోని ఫార్మల్ డీహైడ్ ను ఫిల్టర్ చేయడంలో దీని పరితీరు అమోఘం. అయితే దీని ఆకులు విషపూరితం. కనుక ఇంట్లో చిన్నారులు, పెట్స్ ఉన్నవారు ఈ మొక్కకు బదులు వేరేవి ఉంచుకోవడం సూచనీయం.
గోల్డెన్ పోథోస్/మనీప్లాంట్
ఇది మనీప్లాంట్ రకానికి చెందినది. చాలా వేగంగా తీగలాగా పెరుగుతుంది. ఇంట్లో వెలుతురు అంతగా లేని చోట కూడా చక్కగా పెరుగుతుంది. ఫార్మల్ డీహైడ్ ను తొలగించగలదు. గాలిని ఫిల్టర్ చేయడంలో ఇది చాలా ప్రభావవంతంగా పనిచేసే మొక్క. కనుక ఇంట్లో తప్పకుండా పెంచుకోతగినది. దీనికి రీడ్ పామ్ అనే పేరు కూడా ఉంది. గోల్డోన్ పోథోస్ అనే కాదు, మన దగ్గర అందుబాటులో ఉండే మనీ ప్లాంట్ రకాల్లో ఏదైనా ఇదే విధమైన ప్రయోజనాలు అందించగలదు. కాకపోతే దీని ఆకులను ఇంట్లోని పెట్స్, చిన్నారులు నోట్లో పెట్టుకోకుండా చూసుకోవాలి. ఎందుకంటే వీటిలో హానికారకాలు ఉంటాయి.
బాంబూ పామ్
నీడలో పెరిగే మొక్క. నేరుగా సూర్యరశ్మి పడే చోటు ఉంచరాదు. కుండీలోని మట్టిని తేమగా ఉండేలా చూసుకోవాలి. బెంజీన్, ట్రైక్లోరో ఎథిలేన్ వాయువులను ఫిల్టర్ చేస్తుంది.
రెడ్ ఎడ్జెడ్ డ్రాకెనా
గ్జైలేన్, ట్రైక్లోరో ఎథిలేన్, ఫార్మల్ డీహైడ్ వాయువులను ఫిల్టర్ చేయగల మొక్క ఇది.
వార్నెక్ డ్రాకెనా
12 అడుగుల పొడవు పెరిగే మొక్కలు. నేరుగా సూర్యుడి వెలుతురేమీ అవసరం లేదు. గాలిలోని పలు రకాల కాలుష్యాలను తొలగించగలదు.
పడకగదిలో ఉంచుకోవల్సినవి
పట్టణాల్లో నేడు చాలా మంది నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ఒత్తిడి, ఆందోళనలు ఇందుకు ప్రధాన కారణాలుగా ఉంటున్నాయి. కొన్ని రకాల మొక్కలు ఈ సమస్యకు మంచి పరిష్కారంగా చెప్పుకోవచ్చు. మంచి నిద్ర కోసం పడకగదిలో ఉంచుకోతగిన కొన్ని మొక్కలను నాసా రికమెండ్ చేసింది. సాధారణంగా గాలిలోని కాలుష్యాలను తొలగించే మొక్కలు ఏవైనా పడకగదిలో ఉంచుకోతగినవే. ఎందుకంటే స్వచ్చమైన ప్రాణవాయువు మంచి నిద్రకు దోహదం చేస్తుందన్న విషయం తెలిందే కదా.
సాధారణంగా మొక్కలు పగలు కార్బన్ డై ఆక్సైడ్ ను తీసుకుని రాత్రి వేళ ఆక్సిజన్ తీసుకుంటాయి. మరి ఇవి పడకగదిలో పెట్టుకోవడం ఎలా సూచనీయం అన్న సందేహం వస్తుంది. కానీ, మనం పెట్టుకునే రెండు మొక్కలకు ఎంత ఆక్సిజన్ అవసరమవుతుంది? ఆలోచించండి. పైగా స్నేక్ ప్లాంట్ మిగతా మొక్కల కంటే భిన్నం. ఇది రాత్రివేళ ఆక్సిజన్ విడుదల చేస్తుంది. దీనివల్ల మనకు మరింత మేలు. కనుక నాసా సూచనల మేరకు పగలు, రాత్రి కూడా పడకగదుల్లో ఉంచుకోతగిన మొక్కలు కొన్ని ఉన్నాయి.
జాస్మిన్
జాస్మిన్ పూలు చూడ్డానికి అందంగా ఉండడమే కాదు వాటి పరిమళం కూడా మనసుకు ప్రశాంతతనిస్తుంది. నిద్ర నాణ్యతను పెంచుతుందని, ఈ మొక్కకు ఒత్తిడుల నుంచి ఉపశమనాన్నిచ్చే గుణాలు ఉన్నట్టు వీలింగ్ జేసుట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. ఈ మొక్క వల్ల ఎటువంటి చెడు ప్రభావాలు మనపై ఉండవని శాస్త్రవేత్తలు తేల్చారు.
లావెండర్
లావెండర్ పూల నుంచి కూడా మంచి పరిమళాలు వెలువడుతాయి. చిరాకు పడే పిల్లలను మంచి నిద్రలోకి తీసుకెళ్లే గుణాలు లావెండర్ కు ఉన్నట్టు 2008లో యూనివర్సిటీ ఆఫ్ మియామీ మిల్లర్ స్కూల్ ఆఫ్ మెడిసన్ శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో తెలిసింది.
స్నేక్ ప్లాంట్
ఇంట్లో ఉంచుకోతగిన కీలకమైన మొక్కల్లో దీనికి కూడా స్థానం ఉంది. కళ్లలో దురద, శ్వాసకోశ సమస్యలు, తలనొప్పి, మైగ్రేన్ నొప్పి వంటి సమస్యలతో బాధపడే వారు ఈ మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఉపశమనం లభిస్తుందని నాసా అధ్యయనంలో వెల్లడైంది. ముఖ్యంగా పడకగదిలో ఉంచుకోవడానికి అనువైన మొక్క. ఎందుకంటే రాత్రి వేళల్లో ఇది ఆక్సిజన్ ను విడుదల చేస్తుంది.
ఇంట్లో కాలుష్య కారక వాయువులను శుభ్రం చేసే చక్కని మొక్కల్లో ఇది కూడా ఒకటి. గాలిలోని 107 కాలుష్యాలను ఇది తొలగిస్తుందట. కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ మోనాక్సైడ్, ఫార్మల్ డీహైడ్, బెంజీన్, ట్రైక్లోరో ఎథిలేన్, గ్జైలేన్ వంటి హానికారకాలను ఇది వడగట్టి స్వచ్చమైన ప్రాణవాయువును అందిస్తుంది. మథర్ ఇన్ లాస్ టంగ్ అని కూడా దీనికి పేరు.
వాలేరియన్
ఈ మొక్క గులాబీ రంగు పూలను పూస్తుంది. వీటి నుంచి వెలువడే పరిమళం పీల్చడం వల్ల మన మెదడులో శరీరానికి విశ్రాంతినిచ్చే భాగాల (గాబా సిస్టమ్) ను చురుగ్గా పనిచేసేలా చేస్తుందని జపాన్ కు చెందిన న్యూరోసైన్స్ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. సెడేటివ్ (మెదడుకు ఉపశమనాన్నిచ్చే ) మందుల తయారీలోనూ ఈ మొక్క వేర్లను ఉపయోగిస్తారు.
గార్డెనియా
వీటి పూలు తెల్ల గులాబీల వలే అందంగా ఉంటాయి. వీటి నుంచి వెలువడే పరిమళం కూడా మంచి మూడ్ కు దారితీస్తుంది. దీనికి కూడా సెడేటివ్ గుణాలు ఉన్నాయి. మెదడుకు, దేహానికి మంచి రిలాక్సేషన్ ఇవ్వడంలో ఈ మొక్క చాలా ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు హీన్ రిచ్ హీన్ యూనివర్సిటీ పరిశోధకలు అధ్యయనం చేసి మరీ ప్రకటించారు.
అలోవెరా
అలోవెరా గాలిని శుభ్రం చేసే అత్యుత్తమ మొక్కల్లో ఒకటిగా చెప్పుకున్నాం కదా. దీనికి ఇంకో ప్రత్యేకత కూడా ఉందండి. పడకగదిలో నిద్రకు మేలు చేసే మొక్కల్లో ఇది కూడా ఒకటి నాసా సూచించింది. ఈ మొక్క సాయంత్రం సమయాల్లో ఆక్సిజన్ ను విడుదల చేస్తుందట.
గెర్బెరా డైసీ
అచ్చం పొద్దుతిరుగుడు పూల వలే కనిపిస్తాయి. పైగా పలు రంగుల్లోనూ ఈ పూల రకాలు ఉన్నాయి. ఇంటికి చాలా అందాన్నిచ్చే మొక్కగా దీన్ని నిస్సంకోచంగా చెప్పవచ్చు. చూసిన వారు ఎవరైనా ముచ్చటపడిపోవల్సిందే. రాత్రి సమయాలలో ఇది అక్సిజన్ ను విడుదల చేసే మొక్క. కనుక నిద్రకు మేలు చేసే మొక్కగా దీన్ని నాసా సూచించింది. ఇది ట్రైక్లోరో ఎథిలేన్ ను ఫిల్టర్ చేయగల మొక్క.
పరస్పరాధారితం
ప్రముఖ బహుళజాతి సంస్థ బేయర్ క్రాప్ సైన్సెస్ ఇండోర్ ప్లాంట్స్ వల్ల కలిగే ప్రయోజనాలను కొన్ని వివరాలను తెలియజేసింది. మనం ఆక్సీజన్ తీసుకుని కార్బన్ డై ఆక్సైడ్ విడుదల చేస్తాం. కిరణజన్య సంయోగ క్రియలో భాగంగా మొక్కలు కార్బన్ డై ఆక్సైడ్ ను తీసుకుని ఆక్సిజన్ ను విడుదల చేస్తాయి. అంటే మొక్కలు మన కోసం, మొక్కల కోసం మనం అన్న ప్రకృతి సహజ సూత్రం ఇందులో ఉంది. అదే రాత్రి వేళల్లో మనకు వలే మొక్కలు ఆక్సిజన్ ను పీల్చుకుంటాయి. అయితే కొన్ని మాత్రం రాత్రుళ్లు ఆక్సిజన్ ను విడుదల చేస్తాయి. మొక్కలు తీసుకునే నీటిలో... అంటే వాటికి మనం అందించే నీరు తిరిగి 97 శాతాన్ని తేమ రూపంలో తిరిగి గాలిలోకి విడుదల చేస్తాయి. కనుక గాలిలో దాదాపు 90 శాతం వరకు కాలుష్యాలను ఇండోర్ ప్లాంట్స్ తొలగించగలవు. దీని వల్ల మనకు ఆరోగ్య ప్రయోజనం.