స్మార్ట్ ఫోన్ కెమెరాల్లో ఏది బెటరో తెలుసుకోవడం ఎలా?

స్మార్ట్ ఫోన్ కొనేటప్పుడు దాని కెమెరా ఎంత అని ఆలోచిస్తుంటాం. కొన్ని కంపెనీలు 5 మెగాపిక్సెల్ అని, మరికొన్ని 8, 13 మెగాపిక్సెల్ అని ప్రకటనలు గుప్పిస్తుంటాయి. మరికొన్ని ఫోన్లలో సెల్ఫీల కోసం ఎక్కువ మెగాపిక్సెల్ ఉన్న ఫ్రంట్ కెమెరాలు ఇస్తుంటాయి. అపార్చర్ లెక్కలు చెబుతుంటాయి. వేర్వేరు లెన్సులను, వేర్వేరు సెన్సర్లను తమ ఫోన్ల ప్రత్యేకతలుగా పేర్కొంటుంటాయి. కానీ చివరికి చూస్తే ఎక్కువ మెగాపిక్సెల్ ఉన్న ఫోన్ కెమెరాతో తీసిన ఫొటోలు కూడా నాసిరకంగా ఉంటుంటాయి.

 ఇక ఎల్ఈడీ ఫ్లాష్ అని, డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ అని చెబుతుంటాయి. ఫోకస్, ఆటో ఫోకస్ వంటి ఆప్షన్లూ ఉంటాయి. ఇప్పుడైతే కొత్తగా డ్యూయల్ బ్యాక్ కెమెరాలు ఉన్న ఫోన్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. మరి అసలు కెమెరాల్లో ఉండే ఆప్షన్లలో ఏది బెటర్? ఎలాంటి కెమెరా ఫోన్ తీసుకుంటే మంచిదో పూర్తిగా తెలుసుకుందాం..

ఎక్కువ మెగాపిక్సెల్ ఉండగానే మంచి కెమెరా కాదు

ఎక్కువ మెగాపిక్సెల్ సామర్థ్యం ఉండగానే అది మంచి కెమెరా కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. మెగాపిక్సెల్ సామర్థ్యంతోపాటు కెమెరా సెన్సర్, లెన్స్ నాణ్యత, అపార్చర్ స్థాయి, షట్టర్ పరిమాణం వంటివెన్నో ఫొటోల నాణ్యతపై ప్రభావం చూపుతాయి. అంతేకాదు ఫోన్ కెమెరాతో తీసిన చిత్రం పరిమాణం పెద్దగా ఉండడం ముఖ్యం కాదు.. చుక్కలు చుక్కలు (పిక్సలేట్)గా కనిపించకుండా, స్పష్టంగా ఉండాలి. వివిధ రంగులను సహజంగా చూపించగలగాలి. అప్పుడే అది మంచి కెమెరా అవుతుంది. 13 మెగాపిక్సెల్ సామర్థ్యముండి సాధారణ సెన్సర్, లెన్సులు, తక్కువ అపార్చర్ ఉన్న కెమెరాతో తీసిన ఫొటో కంటే.. మంచి సెన్సర్, లెన్సులు, ఎక్కువ అపార్చర్ ఉన్న కెమెరాతో తీసిన ఫొటో మరింత నాణ్యంగా, స్పష్టంగా వస్తుంది.

కెమెరా సెన్సర్ పరిమాణం ముఖ్యం

ఫోన్ లో ఇచ్చే కెమెరా సెన్సర్ పరిమాణం ఎంత పెద్దగా ఉంటే అంత నాణ్యమైన ఫొటోలు, వీడియోలు వస్తాయి. సెన్సర్ పెద్దగా ఉండడం వల్ల కెమెరా ఎక్కువ వెలుగును స్వీకరించి ప్రాసెస్ చేయగలుగుతుంది. అందువల్ల తక్కువ వెలుగు ఉన్న పరిస్థితులు, రాత్రి వేళల్లోనూ మంచి నాణ్యతతో కూడిన ఫొటోలు వస్తాయి. నాయిస్ (ఫొటోపై చుక్కలు చుక్కలుగా కనిపించడం) తగ్గుతుంది. అంతేగాకుండా పెద్ద సెన్సర్ ఉంటే ఆటోమేటిగ్గా ఆ కెమెరా మెగాపిక్సెల్ సామర్థ్యం కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే కెమెరా సెన్సర్ పెద్దగా ఉంటే ఫోన్ లావు (థిక్ నెస్), పరిమాణం మరింత పెరుగుతుంది. ధర కూడా పెరుగుతుంది. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లు రోజు రోజుకూ మరింత సన్న (స్లిమ్)గా వస్తున్నందున పెద్ద సెన్సర్ అమర్చడం సమస్యగా మారింది. ధర కూడా పెరగవద్దన్న ఉద్దేశంతో చాలా కంపెనీలు పెద్ద సెన్సర్లను ఇవ్వడం లేదు.

  • చాలా ఫోన్లలో కెమెరా సెన్సర్లను 1/3.2 ఇంచ్ సెన్సర్, 1/3 ఇంచ్ సెన్సర్లుగా పేర్కొంటూ ఉంటారు. అంటే ఒక అంగుళంలో 3.2వ వంతు/3వ వంతు అన్న మాట. కొన్నింటిలో మాత్రం నేరుగా 4.54X3.42 మిల్లీమీటర్లు, 4.8X3.6 మిల్లీమీటర్లుగా చెబుతారు. మొత్తంగా పెద్ద సెన్సర్ ఉన్న కెమెరా మంచిదని గుర్తుంచుకోవాలి.
  • కెమెరా సెన్సర్ పై ఉండే పిక్సెళ్ల సైజు ఎక్కువగా ఉంటే అవి ఎక్కువ కాంతిని గ్రహిస్తాయి. తద్వారా ఫొటో నాణ్యంగా వస్తుంది.
    చాలా కంపెనీలు ఎక్కువ మెగాపిక్సెల్ కెమెరాలను అందిస్తుంటాయి. 13, 16 మెగాపిక్సెళ్లుగా కూడా చెబుతుంటాయి. వాటిలో కెమెరా సెన్సర్ పరిమాణం మాత్రం చిన్నగానే ఉంటుంది. అంటే కాంతిని గ్రహించే పిక్సెళ్ల సైజును తగ్గించి.. చిన్న సెన్సర్ లోనే ఎక్కువ పిక్సెళ్లను అందిస్తాయి. దీనివల్ల ఫొటో పరిమాణం పెద్దగా ఉన్నా నాణ్యత మాత్రం తక్కువగా ఉంటుంది.
  • మంచి బ్రాండెడ్ కంపెనీల ఫోన్లలో అందించే కెమెరాల సెన్సర్లు అత్యుత్తమంగా ఉంటాయి. తక్కువ మెగాపిక్సెల్ సామర్థ్యమున్నా మంచి ఫొటోలు వస్తాయి.
  • బీఐఎస్ (BIS) సెన్సర్లు ఉన్న ఫోన్లు తక్కువ వెలుతురులోనూ మంచి ఫొటోలు తీయగలుగుతాయి. ఎక్స్ మోర్ ఆర్ (Exmor R) సెన్సర్లు, సోనీ ఐఎంఎక్స్ (Sony IMX) సెన్సర్లు ఉన్న కెమెరాలను బెస్ట్ కెమెరాలుగా చెప్పవచ్చు.

అపార్చర్ పరిమాణాన్నీ గమనించాలి

స్మార్ట్ ఫోన్ కెమెరాలకు సంబంధించి గమనించాల్సిన మరో ముఖ్యమైన అంశం అపార్చర్ పరిమాణం. అపార్చర్ అంటే కెమెరా లెన్సుల వెనుక ఉండే చిన్న రంధ్రంగా చెప్పుకోవచ్చు. ఇది లెన్సుల ద్వారా వచ్చిన కాంతి లోపలికి వెళ్లి సెన్సర్ పై ఫోకస్ కావడానికి తోడ్పడుతుంది. ఈ అపార్చర్ పెద్దగా ఉంటే సెన్సర్ పై ఫోకస్ అయ్యే కాంతి అంత ఎక్కువగా ఉండి.. ఫోటోలు అంత నాణ్యంగా వస్తాయి. ఈ అపార్చర్ పరిమాణాన్ని ఆంగ్ల అక్షరం ఎఫ్-నంబర్లలో సూచిస్తుంటారు. అంటే ఉదాహరణకు f/2.2, f/2.0.. ఇలా పేర్కొంటారు.

  • అపార్చర్ పెద్దగా ఉండడం వల్ల ఫొటోలో మనం ఫోకస్ చేసిన ప్రాంతం మరింత షార్ప్ (పూర్తి స్పష్టంగా)గా కనిపిస్తూ.. వెనుక, చుట్టూ ఉన్న ప్రాంతం స్వల్పంగా బ్లర్ (మసక)గా అవుతుంది. దీంతో మనం తీయాలనుకున్న చిత్రం ఫోకస్ అయి అత్యంత స్పష్టంగా, ఆకర్షణీయంగా వస్తుంది. అదే అపార్చర్ చిన్నగా ఉండడం వల్ల ఫొటోలోని అన్ని ప్రాంతాలు సమానంగా ఫోకస్ అవుతాయి. షార్ప్ నెస్ తక్కువగా ఉంటుంది. ప్రత్యేకత ఉండదు.
  • పెద్ద అపార్చర్ ఉంటే షట్టర్ స్పీడ్ ఎక్కువగా ఉంటుంది. వెంట వెంటనే ఆపకుండా చాలా ఫొటోలు తీసుకోవచ్చు. తక్కువగా ఉండడం వల్ల ఫొటోకు ఫొటోకు మధ్య సమయం పడుతుంది.
  • ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే, అపార్చర్ ను సూచించే ‘ఎఫ్/’ పక్కన ఉండే సంఖ్య ఎంత తక్కువగా ఉంటే.. అపార్చర్ పరిమాణం అంత ఎక్కువగా ఉంటుందన్న మాట. ఉదాహరణకు f/2.2 గా పేర్కొన్న కెమెరా కంటే f/2.0 గా పేర్కొన్న కెమెరా అపార్చర్ పెద్దది. అదే f/1.6 అపార్చర్ ఈ రెండింటికన్నా ఇంకా పెద్దది, ఇంకా ఉత్తమమైనది కూడా.

మెగాపిక్సెల్ అంటే..?

మెగాపిక్సెల్ అంటే ఆ కెమెరా తీసే చిత్రంలో గరిష్టంగా ఉండే రిజల్యూషన్ (పిక్సెళ్ల సంఖ్య). ఒక మెగాపిక్సెల్ అంటే ఒక మిలియన్ (పది లక్షల) పిక్సెల్స్ అన్నమాట. మెగాపిక్సెల్ లను MP లలో సూచిస్తారు. 2MP అంటే 2 మిలియన్ పిక్సెళ్లు, 5MP అంటే 5 మిలియన్ పిక్సెళ్లుండే చిత్రాలను అందిస్తాయి. మెగాపిక్సెల్ పెరిగిన కొద్దీ ఫొటోల పరిమాణం పెరుగుతూ ఉంటుంది కానీ నాణ్యత మాత్రం సెన్సర్, లెన్సులు, అపార్చర్ వంటి ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది. మెగాపిక్సెల్ పెరిగిన కొద్దీ వచ్చే లాభం ఏమిటంటే.. ఏదైనా సీన్ లోని చిన్న చిన్న అంశాలను కూడా ఫొటోలు తీయడానికి వీలు కలుగుతుంది. దీనికి మిగతా నాణ్యమైన భాగాలు తోడైతే అద్భుతమైన ఫొటో వస్తుంది.

బ్యాక్ డ్యూయల్ కెమెరా/ డ్యూయల్ లెన్స్ కెమెరాలు

ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి వచ్చిన మరింత ఆధునికమైన టెక్నాలజీతో రూపొందిన బ్యాక్ డ్యూయల్ కెమెరాలు లేదా డ్యూయల్ లెన్స్ కెమెరాలు ఉన్న ఫోన్లు అందుబాటులోకి వస్తున్నాయి. బ్యాక్ డ్యూయల్ కెమెరా అన్నా డ్యూయల్ లెన్స్ కెమెరా అన్నా.. ఫోన్ వెనుక వైపు రెండు కెమెరాలు ఉంటాయి. అయితే ఈ రెండూ వేర్వేరుగా కాకుండా ఒకేసారి పనిచేస్తూ.. ఒకేసారి ఫొటో తీస్తాయి. ఆ రెండు ఫొటోలను ఫోన్ లోని సాఫ్ట్ వేర్ కలిపేసి ఒకే చిత్రంగా అందజేస్తుంది. ఈ డ్యూయల్ లెన్స్ కెమెరాతో అత్యంత నాణ్యమైన డీఎస్ఎల్ఆర్ (DSLR) కెమెరాల స్థాయి ఫొటోలు తీసుకోవడానికి వీలవుతుంది. ఫొటోలు తీసుకోవడానికి ప్రాధాన్యమిచ్చేవారు ఈ డ్యూయల్ లెన్స్ కెమెరాలున్న ఫోన్లు తీసుకోవడం మంచిది.

  • డ్యూయల్ లెన్స్ కెమెరా ఫోన్ లో రెండు కెమెరాలు వేర్వేరు ఫోకల్ లెంత్ (ఏదైనా దూరంలో ఉన్న ఒక అంశంపై ఫోకస్ చేయగలిగే) సామర్థ్యంతో ఉంటాయి. అంటే ఈ రెండు కెమెరాలు ఏదైనా దృశ్యంలోని వేర్వేరు దూరాల్లో ఉన్న అంశాలపై ఒకేసారి ఫోకస్ చేస్తాయి. దీనిద్వారా అత్యంత నాణ్యమైన ఫొటో వస్తుంది.
  • కొన్ని ఫోన్లలో ఒక కెమెరా బ్లాక్ అండ్ వైట్ లో, మరో కెమెరా కలర్ లో ఫొటోలను తీస్తాయి. తర్వాత ఆ రెండూ మెర్జ్ అవుతాయి. దీనివల్ల ఫొటోలోని అన్ని రంగులు వాటి షేడ్ లతో సహా స్పష్టంగా వస్తాయి. అంటే సహజమైన రంగులతో కూడిన ఫొటో వస్తుంది.
  • డ్యూయల్ లెన్స్ కెమెరా ఫోన్లతో ఉన్న మరో ప్రయోజనం ఏమిటంటే.. ఫొటో తీసేసిన తర్వాత కూడా ఫొటోలో ఫోకస్ చేయాల్సిన భాగాన్ని మార్చుకోవచ్చు. ఉదాహరణకు ఓ సీన్ లో ఫొటో దిగారు. అందులో తొలుత మనుషులను ఫోకస్ చేశారు. కానీ ఫొటో తీశాక బ్యాక్ గ్రౌండ్ ఫోకస్ అయి ఉంటే బాగుండేది అనుకుంటే.. దానిని ఫోకస్ చేస్తూ ఫొటో మారిపోయేలా ఆప్షన్ కూడా ఉంటుంది.

లెన్స్ నాణ్యత కూడా ముఖ్యం

ఫోన్ కెమెరాలకు ఉపయోగించే లెన్సుల నాణ్యత కూడా ఫొటోల నాణ్యతపై ప్రభావం చూపిస్తుంది. లెన్సులు పూర్తి క్లియర్ గా ఉంటే.. కెమెరా స్వీకరించే కాంతికి ఎటువంటి అడ్డంకీ ఉండదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాటిలో కార్ల్ జీస్ (Carl Zeiss) లెన్సులు అత్యుత్తమమైనవి. ప్రస్తుతం హై ఎండ్ ఫోన్లతోపాటు ఓ స్థాయి బడ్జెట్ ఫోన్లలోని కెమెరాల్లోనూ ఈ లెన్సులను అందజేస్తున్నారు.

డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్

సాధారణంగా అన్ని స్మార్ట్ ఫోన్లకు కెమెరాలతోపాటు ఫ్లాష్ సౌకర్యం కూడా ఉంటుంది. వెలుతురు తక్కువగా ఉన్న సందర్భాల్లో ఫొటోలు తీసుకోవడానికి ఫ్లాష్ పనికొస్తుంది. అయితే ఈ ఫ్లాష్ లు కేవలం ఒకే విధమైన తెల్లని కాంతిని మాత్రమే వెదజల్లుతాయి. దాంతో ఫ్లాష్ తో తీసిన ఫొటోల్లో సహజమైన రంగులు కనిపించవు. ఈ సమస్యను అధిగమించేందుకు వచ్చినవే డ్యూయల్ టోన్ ఫ్లాష్ లు. అంటే రెండు ఫ్లాష్ లు ఉంటాయి. అందులో ఒకటి తెల్లని కాంతిని, మరొకటి కొంచెం ఎరుపు కలిసిన కాంతి (సాధారణ ఫిలమెంట్ బల్బు తరహా కాంతి) ని ఇస్తాయి. ఈ రెండూ కలిస్తే పగటిపూట ఉండే సాధారణ వెలుగు తరహా కాంతి తయారవుతుంది. దీనివల్ల పూర్తి స్థాయిలో సహజమైన రంగులతో కూడిన ఫొటోను పొందవచ్చు. 

  • ప్రస్తుతం చాలా ఫోన్లలో ఫ్లాష్ సౌకర్యం ఇస్తున్నా.. వాటిల్లో నాణ్యత ఉండడం లేదు. ఏదో కొంచెం వెలుగును మాత్రమే ఇస్తున్నాయి. అందువల్ల ఫోన్ కొనేటపుడే ఫ్లాష్ ఎలా వస్తుందో చూసుకుంటే మంచిది.
  • కొన్ని ఫోన్లలో జెనాన్ (Xenon) ఫ్లాష్ ను కూడా అందిస్తున్నారు. ఇది ఎల్ఈడీ ఫ్లాష్ లకంటే ఏకంగా 1000 రెట్లు ఎక్కువ వెలుగును ఇస్తుంది. 

వైడ్ యాంగిల్ లెన్స్

ఒక చిన్న గదిలో నిలబడి ఉన్నవారిని స్మార్ట్ ఫోన్ లో ఫొటో తీయాలంటే ఎలా..? ఎక్కువ మంది ఉన్న చోట ఫొటో తీయాలంటే ఎలా? కష్టం కదా.. చాలా దూరం వెనుకకు జరిగి ఫొటో తీయాల్సి ఉంటుంది. దీనికి పరిష్కారమే వైడ్ యాంగిల్ లెన్స్. అంటే తక్కువ దూరం నుంచే ఎక్కువ వెడల్పు ఉన్న ప్రాంతాన్ని ఫొటో తీయవచ్చు. ప్రస్తుతం చాలా ఫోన్లలో వైడ్ యాంగిల్ లెన్స్ అందజేస్తున్నారు. మీరు కొనాలనుకుంటున్న ఫోన్ లో ఈ సౌకర్యం ఉందోలేదో చూడండి. ఒకవేళ మీకు నచ్చిన ఫోన్ లో వైడ్ యాంగిల్ లేకపోయినా పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదు. కేవలం రెండు మూడు వందల రూపాయలు ఖర్చుచేస్తే.. ఫోన్లకు అదనంగా అమర్చుకునేలా వైడ్ యాంగిల్ లెన్స్ మార్కెట్లో దొరుకుతున్నాయి. వాటిని కొని అవసరమైనప్పుడు అమర్చుకోవచ్చు. 

హెచ్ డీఆర్ (HDR) మోడ్ ఉంటే మంచిది

హెచ్ డీఆర్ అంటే హై డైనమిక్ రేంజ్. అంటే అతి తక్కువ ఎక్స్ పోజర్ (Exposure) నుంచి అతి ఎక్కువ ఎక్స్ పోజర్ వరకు పలు ఫొటోలను తీసి.. వాటన్నింటినీ సమర్థవంతమైన రీతిలో కలిపేయడం (మెర్జింగ్). దీనివల్ల ఎటువంటి వెలుతురు ఉన్న పరిస్థితుల్లో అయినా అత్యుత్తమ నాణ్యత గల ఫొటోలను పొందవచ్చు. క్లోజ్ అప్ ఫొటోలతో పాటు దూరంగా ఉన్న వాటిని సైతం హెచ్ డీఆర్ మోడ్ లో చిత్రించొచ్చు. ఈ మోడ్ లో వీలైనంత వరకు ఫ్లాష్ ఉపయోగించకపోవడం బెటర్. హెచ్ డీఆర్ మోడ్ తో ఫొటో తీసేటప్పుడు తప్పనిసరిగా కొన్ని సెకన్ల పాటు కెమెరాను కదిలించకుండా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే వేర్వేరు ఫొటోలు తీసి మెర్జ్ చేసేటప్పుడు.. కదలడం వల్ల ఫొటోలు వేర్వేరుగా వచ్చి నాణ్యత దెబ్బతింటుంది. ప్రస్తుతం చాలా ఫోన్లలో హెచ్ డీఆర్ మోడ్ ను అందిస్తున్నారు.

ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) / ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (EIS)

సాధారణంగా కెమెరాతో ఫొటో తీసేటప్పుడు కొంచెం అటూ ఇటూ కదిలినా ఫొటోలు బ్లర్ గా వస్తాయి. అదే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటే.. కెమెరా కొంచెం అటూ ఇటూ కదిలినా కూడా స్పష్టమైన ఫొటోలు వస్తాయి. ఈ టెక్నాలజీలో కెమెరాలో దేనిపై అయినా ఫోకస్ చేసినప్పుడు లెన్స్ దానివైపు ఉండేలా కొంత వరకూ లాక్ అవుతుంది. అంటే కెమెరా కొంచెం అటూ ఇటూ కదిలినా.. లెన్స్ కూడా పక్కాగా సీన్ పైనే ఫోకస్ చేసేలా కదులుతుంది. ఇది హైఎండ్ స్మార్ట్ ఫోన్లలో అందుబాటులో ఉంది. ఇక ఈఐఎస్ ఇది కూడా దాదాపు ఓఐఎస్ తరహాలోనే పనిచేస్తుంది. కానీ ఇందులో లెన్స్ కదలదు. కెమెరా ఫోకస్ చేసి, క్యాప్చర్ చేస్తున్న సమయంలో కదిలితే దానిని సెన్సర్లు గుర్తించి.. ఇమేజ్ ను స్వల్పంగా అడ్జస్ట్ చేస్తాయి. దాంతో ఫొటో స్పష్టంగా నాణ్యంగా వస్తుంది. అయితే ఎలక్ట్రానిక్ స్టెబిలైజేషన్ కంటే ఆప్టికల్ స్టెబిలైజేషన్ చాలా మంచిది.

ఆటో ఫోకస్ Auto Focus (AF)

ఫోన్లలోని కెమెరాతో మనం ఫొటో తీయాలనుకున్న ప్రత్యేకమైన అంశాన్ని బాగా వచ్చేలా చేసేదే ఫోకస్. ఏదైనా సీన్ లో ఫొటో తీస్తున్నప్పుడు మనుషులు, ఆ వెనుకాల, చుట్టూ ఉన్న దృశ్యాలలో ఏది ప్రధానంగా కనిపించాలో దీని ద్వారా సెట్ చేసుకోవచ్చు. ఫోన్ స్క్రీన్ పై సంబంధిత ఏరియాను టచ్ చేయడం ద్వారా ఫొటోలో ఆ ప్రాంతాన్ని ఫోకస్ చేయాల్సి ఉంటుంది. కానీ ఆటో ఫోకస్ కెమెరా ఉన్న ఫోన్లలో.. మనం కెమెరాను నిలిపిన తీరును బట్టి ప్రధానమైన అంశాలపై ఆటోమేటిగ్గా ఫోకస్ అవుతుంటుంది. ఫోన్ ను అటూ ఇటూ స్వల్పంగా జరపడం ద్వారా ఫోకస్ ఆటోమేటిగ్గా మారుతుంటుంది. అంతేకాదు.. ఆ సీన్ లో మనుషులు ఎటువైపు ఉన్నా గుర్తించి ఫోకస్ చేస్తుంది. దీనివల్ల ఫొటో తీసేప్పుడు మ్యాన్యువల్ గా ఫోకస్ చేసే పని తప్పుతుంది. ఫొటోలు బాగా వస్తాయి.

స్మైల్ డిటెక్షన్

కొన్ని స్మార్ట్ ఫోన్ల కెమెరాల్లో మన నవ్వును గుర్తించే ఆప్షన్ కూడా ఇస్తుంటారు. దీనివల్ల సీన్ లో ఉన్న వారిలో ఎవరైనా నవ్వితే కెమెరా దానిని గుర్తించి ఫోకస్ చేస్తుంది. అంతేకాదు ఆటో కాప్చర్ (దానంతట అదే ఫొటో తీసే ఆప్షన్) కూడా చేస్తుంది. అంటే ఒకరుగానీ, కొందరుగానీ కలసి సెల్ఫీ తీసుకుంటున్నప్పుడు.. ఎవరైనా జస్ట్ నవ్వితే చాలు ఎలాంటి బటన్ నొక్కాల్సిన అవసరం లేకుండానే ఫొటో క్యాప్చర్ అవుతుంది.

వీడియో రికార్డింగ్ సామర్థ్యం చూడాలి

మంచి కెమెరా అంటే ఉత్తమ స్థాయిలో వీడియో రికార్డింగ్ సామర్థం కూడా ఉండాలి. చాలా కెమెరాలలో 13 మెగాపిక్సెల్ ఆ పైన సామర్థ్యం ఉన్న కెమెరాను ఇస్తున్నా.. అందుకు తగిన ఫుల్ హెచ్ డీ, 4కె వీడియో రికార్డింగ్ సామర్థ్యాన్ని అవి అందించలేవు. ఫుల్ హెచ్ డీ, 4కె వీడియోలు అత్యంత స్పష్టంగా.. హెచ్ డీ మానిటర్లు, ఫుల్ హెచ్ డీ టీవీల్లో కూడా స్పష్టంగా కనిపించేలా ఉంటాయి. అందువల్ల కెమెరా ఫోన్ తీసుకునేటప్పుడు అది ఏ స్థాయిలో ఎటువంటి వీడియోను రికార్డు చేయగలదో కూడా పరిశీలించడం ముఖ్యం.

ఇంటర్నెట్ లో వెతకండి

మీరు కొనదలచుకున్న ఫోన్ లోని కెమెరా స్పెసిఫికేషన్స్ ను వాటికి సంబంధించిన వెబ్ సైట్లో తెలుసుకోవచ్చు. లేదా ఇంటర్నెట్ లో సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. పూర్తి వివరాలు లభించకపోతే ఆ ఫోన్ తయారు చేసే కంపెనీ కస్టమర్ సపోర్ట్ కు మెయిల్ చేసిగానీ, ఫోన్ చేసిగానీ తెలుసుకోవచ్చు.

2016 సెప్టెంబర్ నాటికి మార్కెట్లో ఉన్న బెస్ట్ కెమెరా ఫోన్లు
సెన్సర్లు, లెన్సులు, మెగాపిక్సెల్ సామర్థ్యం వంటి అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకుని బేరీజు వేయగా 2016 సెప్టెంబర్ నాటికి భారతదేశంలో లభించే కొన్ని ఉత్తమ కెమెరా ఫోన్లను నిపుణులు ఎంపిక చేశారు. ఆ జాబితా..

హై ఎండ్ ఫోన్లలో.. సామ్సంగ్ గెలాక్సీ ఎస్ 7 ఎడ్జ్, యాపిల్ ఐఫోన్ 6 ఎస్, హెచ్ టీసీ 10, హువాయ్ పీ9, హువాయ్ నెక్సస్ 6పీ, ఎల్ జీ జీ5, వన్ ప్లస్ 3, సామ్సంగ్ గెలాక్సీ నోట్ 5, సోనీ ఎక్స్ పీరియా ఎక్స్, ఎల్ జీ జీ4, లెనోవో వైబ్ ఎక్స్3 ఫోన్లు బెస్ట్ కెమెరా ఫోన్లుగా టాప్ లో నిలిచాయి.

రూ.20 వేల కన్నా తక్కువ ధర ఉండే మధ్య శ్రేణి, బడ్జెట్ ఫోన్ల లో.. మోటో ఎక్స్ ప్లే,  జెడ్ టీఈ నుబియా జెడ్9 మినీ, జియోనీ ఈలైఫ్ ఎస్6,  మోటో జీ4, సామ్సంగ్ గెలాక్సీ జే7, లెనోవో వైబ్ ఎస్1, లెనోవో వైబ్ కె5, షియోమీ ఎంఐ 4ఐ, రెడ్ మీ నోట్ 3, లీఎకో లీ2 వంటి ఫోన్లలో మంచి కెమెరా అందుబాటులో ఉంది.


More Articles