‘స్మార్ట్’ వేగానికి ప్రాసెసరే కీలకం
మనకు మెదడు ఎలాగో స్మార్ట్ ఫోన్లకు ప్రాసెసర్ అలాంటిది. ఫోన్ లోని ప్రతి చర్య కూడా ప్రాసెసర్ పైనే ఆధారపడి ఉంటుంది. ఫోన్ డిజైన్ ఎంత బాగున్నా.. డిస్ప్లే ఎంత బాగున్నా.. అందులో సరైన ప్రాసెసర్ లేకపోతే వృథానే! ప్రాసెసర్ సరైనది కాకపోయినా, వేగం తక్కువగా ఉన్నా.. మనం ఫోన్ వినియోగిస్తున్నప్పుడు స్టక్ అయిపోతుంటుంది. ఏవైనా యాప్ లను ఓపెన్ చేస్తే చాలా మెల్లగా పనిచేస్తాయి. కొన్ని రకాల హై ఎండ్ గేమ్ లను కూడా ఆడలేము. అసలు స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీలు తమ ఫోన్ల స్పెసిఫికేషన్స్ లో వివిధ ప్రాసెసర్లు, వాటి మోడల్స్, వేగాలను పేర్కొంటూ ఉంటాయి. బడ్జెట్ స్మార్ట్ ఫోన్ల కంపెనీలు కూడా ఎన్నో ప్రకటనలు గుప్పిస్తుంటాయి. మరి ఏ కంపెనీ ప్రాసెసర్, ఏ మోడల్ మంచిది, దేని వేగం ఎంత ఉంటుంది, దేని మన్నిక ఎలా ఉంటుందనే దానిపై ఎన్నో సందేహాలు వస్తుంటాయి. ఈ వివరాలు తెలుసుకుందాం..
ప్రాణం ప్రాసెసరే..
సాధారణంగా కంప్యూటర్ లో ప్రాసెసర్, గ్రాఫిక్స్, మెమరీ కంట్రోలర్, డిజిటల్ సిగ్నల్స్, రేడియో ఫ్రీక్వెన్సీ పనులు.. ఇలాంటి వాటన్నింటికీ వేర్వేరు చిప్ లు ఉంటాయి. కానీ స్మార్ట్ ఫోన్లలో ఇలాంటి పనులన్నీ ఒకే చిప్ లో అంతర్గతంగా ఏర్పాటు చేయబడి ఉంటాయి. వీటినే SoC (System on a Chip)గా పేర్కొంటారు. స్మార్ట్ ఫోన్లతోపాటు ట్యాబ్లెట్లు, నోట్ బుక్ కంప్యూటర్లు, స్మార్ట్ వాచ్ లు, స్మార్ట్ టీవీలు, ఇతర స్మార్ట్ ఎలక్ట్రానిక్ ఉపకరణాల్లో ఈ ప్రాసెసర్లను వినియోగిస్తున్నారు. కంప్యూటర్ ప్రాసెసర్లలో టాప్ గా ఉన్న ఇంటెల్ కంపెనీతో పాటు క్వాల్ కోమ్, మీడియాటెక్ కంపెనీలు మొబైల్ ప్రాసెసర్లను తయారు చేస్తున్నాయి. వీటితో పాటు సామ్సంగ్, సోనీ, యాపిల్ తదితర సంస్థలు వాటికి ప్రత్యేకమైన ప్రాసెసర్లను అభివృద్ధి చేసుకుని తమ ఫోన్లలో వినియోగిస్తున్నాయి. మిగతా కంపెనీలన్నీ ప్రధానంగా క్వాల్ కోమ్, మీడియాటెక్, ఇంటెల్ ప్రాసెసర్లను వినియోగిస్తున్నాయి.
మీడియాటెక్ (MediaTek) ప్రాసెసర్
మీడియాటెక్ తైవాన్ కు చెందిన సెమీకండక్టర్ల తయారీ సంస్థ. మొబైల్ తయారీ ప్రాసెసర్ల తయారీలోకి ఆలస్యంగా అడుగుపెట్టినా... విస్తృతంగా ప్రాధాన్యం పొందింది. అందుకు కారణం నాణ్యతతో కూడిన ప్రాసెసర్లను తక్కువ ధరలకు అందించడమే. దీంతో బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు, ఓ మోస్తరు పెద్ద ఫోన్ల తయారీలో ఈ ప్రాసెసర్లను వినియోగిస్తున్నారు. అంతేకాదు మీడియాటెక్ సంస్థ అత్యంత అధునాతనమైన, అత్యంత వేగవంతమైన ప్రాసెసర్లను కూడా ప్రవేశపెట్టింది.
- మీడియాటెక్ ప్రాసెసర్లు.. MT6552, MT6582, MT6592, MT6595, MT6732, MT6735, MT6737, MT6738, MT6750, MT6752, MT6753, MT6795, Helio P10, Helio P20, Helio X10, Helio X20
- ఇందులో ప్రాసెసర్ నంబర్ పెరిగిన కొద్దీ వాటి సామర్థ్యం ఎక్కువగా ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. ఇందులో హీలియో సిరీస్ ప్రాసెసర్లు అత్యాధునికమైనవి. అత్యంత వేగవంతమైనవి.
- సింగిల్ కోర్ నుంచి ఆక్టాకోర్ వరకు వివిధ రకాల ప్రాసెసర్లను తయారు చేసిన ఈ సంస్థ.. ఇటీవల పది కోర్ల (డెకా కోర్)తో కూడిన ప్రాసెసర్లను కూడా విడుదల చేసింది.
క్వాల్ కోమ్ (Qualcomm) ప్రాసెసర్లు..
ప్రస్తుతం మొబైల్స్, ట్యాబ్లెట్లు, ఇతర స్మార్ట్ పరికరాలకు సంబంధించి ప్రాసెసర్ల తయారీలో అగ్రగామి సంస్థ క్వాల్ కోమ్. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ఈ సంస్థ స్నాప్ డ్రాగన్ (Snapdragon) పేరుతో ప్రాసెసర్లను తయారుచేస్తోంది. ముఖ్యంగా బడ్జెట్ ఫోన్ల నుంచి హై ఎండ్ ఫోన్ల వరకు ఈ ప్రాసెసర్లను వినియోగిస్తారు. ఈ సంస్థ వివిధ రకాల శ్రేణుల్లో సింగిల్ కోర్ నుంచి ఆక్టా కోర్ వరకు ప్రాసెసర్లను తయారు చేస్తుంది. పలు సిరీస్ లలో స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్లు అందుబాటులో ఉన్నాయి.
- 200 సిరీస్: తొలుత వచ్చిన ప్రాసెసర్లు ఇవి. ఈ సిరీస్ లో 200, 208, 210, 212 ప్రాసెసర్లను విడుదల చేశారు. బడ్జెట్ స్మార్ట్ ఫోన్లలో వీటిని వినియోగిస్తున్నారు.
- 400 సిరీస్: ఇందులో 400, 410, 412, 415, 425, 430, 435 ప్రాసెసర్లు విడుదలయ్యాయి. ఇవి 200 సిరీస్ కంటే వేగవంతమైనవి. వీటిని బడ్జెట్, మధ్యతరహా స్మార్ట్ ఫోన్లలో వినియోగిస్తున్నారు.
- 600 సిరీస్: ఇందులో 600, 602ఏ, 615, 616, 617, 625, 650, 652 ప్రాసెసర్లు విడుదలయ్యాయి. ఇవి ఇంతకు ముందటి సిరీస్ ల కన్నా వేగవంతమైనవి.
- 800 సిరీస్: ఇందులో 800, 801, 805, 808, 810, 820, 821 ప్రాసెసర్లు అందుబాటులో ఉన్నాయి. హైఎండ్ మొబైల్ ఫోన్లలో ఈ సిరీస్ ప్రాసెసర్లను వినియోగిస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని ప్రాసెసర్లలో కన్నా వేగవంతమైనది స్నాప్ డ్రాగన్ 821 ప్రాసెసర్.
ఇంటెల్ (Intel) ప్రాసెసర్లు
ఇది అందరికీ చిరపరిచితమైన పేరు. కంప్యూటర్ ప్రాసెసర్ల రంగాన్ని శాసిస్తున్న ఇంటెల్ సంస్థ ఆటమ్ (Atom) పేరుతో మొబైల్ ప్రాసెసర్లను తయారు చేసింది. తక్కువ విద్యుత్ ను వినియోగించుకుని కూడా అత్యుత్తమ పనితీరు చూపడం ఈ ప్రాసెసర్ల ప్రత్యేకత. నోట్ బుక్ లలో, ట్యాబ్లెట్లలో ఆటమ్ ప్రాసెసర్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. పలు రకాల మొబైల్ ఫోన్లలోనూ వీటిని వినియోగిస్తున్నారు. ఇందులో నాలుగు కోర్ లు ఉండే ఒకే తరహా ప్రాసెసర్ ను మాత్రమే విడుదల చేశారు. ఆ తర్వాత కొత్త ప్రాసెసర్లేమీ విడుదల కాలేదు.
సామ్సంగ్ ఎక్సినోస్ (Exynos) ప్రాసెసర్లు
సామ్సంగ్ సంస్థ తమ మొబైల్ ఫోన్లలో వినియోగించే ప్రాసెసర్లను ‘ఎక్సినోస్’ పేరిట తానే అభివృద్ధి చేసింది. తక్కువ బ్యాటరీ శక్తిని వినియోగించుకుని.. సమర్థవంతంగా పనిచేసేలా ఎక్సినోస్ సిరీస్ ప్రాసెసర్లను తయారు చేసింది. ఇంతకుముందు సామ్సంగ్ ఎస్ సిరీస్ లో S3C, S5L, S5P వంటి ప్రాసెసర్ యూనిట్లను తయారుచేసి, తమ మొబైల్స్, ట్యాబ్లెట్స్, ఇతర ఉత్పత్తులలో వినియోగించింది. ప్రస్తుతం దాదాపుగా అన్ని సామ్సంగ్ ఫోన్లలో ఈ ప్రాసెసర్ యూనిట్ లనే వినియోగిస్తోంది. ఎక్సినోస్ సిరీస్ లో ప్రస్తుతం విడుదలైన అత్యాధునిక ప్రాసెసర్ ‘Exynos 8 Octa 8890’. దీనిని తమ గెలాక్సీ ఎస్ 7, ఎస్ 7 ఎడ్జ్ ఫోన్లలో వినియోగిస్తున్నారు.
యాపిల్ ఏ సిరీస్
ప్రఖ్యాతి గాంచిన యాపిల్ సంస్థ తమ ఐఫోన్లు, ఐప్యాడ్ లు, ఐపోడ్ లలో వినియోగించేందుకు స్వయంగా యాపిల్ పేరిట ప్రాసెసర్లను అభివృద్ధి చేసింది. ఏ సిరీస్ లో వీటిని ఏ4, ఏ5, ఏ6.. ఇలాంటి పేర్లతో ఈ ప్రాసెసర్లను వినియోగిస్తోంది. అత్యధిక సామర్థ్యం, ఎక్కువగా వేడిని ఉత్పత్తి చేయకపోవడం యాపిల్ ప్రాసెసర్ల ప్రత్యేకత. ఈ ప్రాసెసర్లు కేవలం యాపిల్ ఉత్పత్తుల్లో మాత్రమే వినియోగిస్తారు. యాపిల్ ఏ సిరీస్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యాధునిక ప్రాసెసర్ యూనిట్ A10 Fusion. దీనిని తాజాగా విడుదలైన ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ లో వినియోగించారు.
హువే కిరిన్ (Kirin) ప్రాసెసర్లు
చైనాకు చెందిన ప్రఖ్యాత కంప్యూటర్, నెట్ వర్కింగ్ ఉపకరణాల సంస్థ హువే (Huawei) అనుబంధ కంపెనీ హైసిలికాన్ (Hisilicon) అభివృద్ధి చేసిన ప్రాసెసర్ యూనిట్లే కిరిన్ సిరీస్ ప్రాసెసర్లు. వీటిని హువే సంస్థ తమ స్మార్ట్ ఫోన్లలో, ముఖ్యంగా ఆనర్ సిరీస్ ఫోన్లలో వినియోగిస్తోంది. ఇవి కూడా తక్కువ విద్యుత్ ను వినియోగించుకుని అత్యధిక ప్రాసెసింగ్ సామర్థ్యం అందించేలా అభివృద్ధి చేయబడినవి. ఈ సిరీస్ లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యాధునిక ప్రాసెసర్ కిరిన్ 950.
ఎన్ వీడియా టెగ్రా (Tegra) ప్రాసెసర్లు
గ్రాఫిక్స్ కార్డుల తయారీలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచి ఎన్ వీడియా సంస్థ అభివృద్ధి చేసిన ప్రాసెసర్లే Tegra సిరీస్ ప్రాసెసర్లు. అత్యంత సామర్థ్యం గల ఈ ప్రాసెసర్ యూనిట్ లను చాలా కంపెనీలు తమ స్మార్ట్ ఫోన్లలో వినియోగిస్తున్నాయి. ముఖ్యంగా హైఎండ్ గేమ్స్ వంటి అత్యధిక సామర్థ్యాన్ని వినియోగించుకునే అవసరాలకు, 3డీ విజువల్ కంప్యూటింగ్ లో ఈ ప్రాసెసర్లు అద్భుతంగా ఉపయోగపడతాయి. Tegra మోడల్ లో కే, ఎక్స్ సిరీస్ లలో ప్రాసెసర్లను విడుదల చేశారు.
గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ (GPU)
ప్రతి స్మార్ట్ ఫోన్ లో వీడియోలు, గేమ్స్ వంటి గ్రాఫిక్స్ ను ప్రాసెస్ చేసేందుకు ప్రాసెసర్ యూనిట్ (SoC)లో ప్రత్యేకంగా గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ (GPU) ఉంటుంది. మీడియాటెక్ నుంచి యాపిల్ ఏ సిరీస్ వరకు అన్ని ప్రాసెసింగ్ యూనిట్లలోనూ మూడు రకాల జీపీయూలను వినియోగిస్తారు. అవి అడ్రెనో(Adreno), పవర్ వీఆర్ (PowerVR), మాలి-టీ (Mali-T) సిరీస్ జీపీయూలు. ప్రాసెసింగ్ యూనిట్ సామర్థ్యం జీపీయూతో మరింత పెరుగుతుంది. ఈ మూడు జీపీయూలలోనూ అత్యుత్తమ వెర్షన్లు అందుబాటులో ఉన్నాయి.
2016 సెప్టెంబర్ నాటికి టాప్ ప్రాసెసర్లు, వాటిని వినియోగించిన ఫోన్లు
(AnTuTu రేటింగ్ ఆధారంగా..)
- క్వాల్ కోమ్ స్నాప్ డ్రాగన్ 820 : మార్కెట్లో అందుబాటులో ఉన్న ప్రాసెసర్లలో ఇదే టాప్. సామ్సంగ్ గెలాక్సీ ఎస్7, లీఎకో లీమాక్స్ ప్రొ, జియోమి ఎంఐ5, ఎల్ జీ జీ5, సోనీ ఎక్స్ పీరియా ఎక్స్ పర్ఫామెన్స్, హెచ్ పీ ఎలైట్ ఎక్స్3లో దీన్ని వినియోగించారు.
- యాపిల్ ఏ9 : రెండో స్థానంలో నిలిచిన ఈ ప్రాసెసర్ ను యాపిల్ ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ ఎస్ఈలలో ఉపయోగించారు.
- ఎక్సినోస్ 8890 : సామర్థ్యంలో మూడో స్థానంలో నిలిచిన ఈ ప్రాసెసర్ ప్రస్తుతం సామ్సంగ్ గెలాక్సీ ఎస్7 లో మాత్రమే వినియోగిస్తున్నారు.
- కిరిన్ 950 : మంచి పర్ఫార్మెన్స్ లో దీనిది నాలుగో స్థానం. హువే ఫోన్లు పీ9, మేట్ 8, పీ9 మాక్స్ లో వాడుతున్నారు.
- ఎక్సినోస్ 7420 : ఐదో స్థానంలో నిలిచిన ఈ ప్రాసెసర్ ను సామ్సంగ్ గెలాక్సీ ఎస్6, ఎస్6 ఎడ్జ్, ఎస్6 ఎడ్జ్ ప్లస్, మీజు ప్రొ5 లలో వినియోగిస్తున్నారు.
- స్నాప్ డ్రాగన్ 810 : మంచి పనితీరుతో ఇది ఆరో స్థానంలో నిలిచింది. హెచ్ టీసీ వన్ ఎం9, లూమియా 950 ఎక్స్ఎల్, నెక్సస్ 6పీ, వన్ ప్లస్ 2లలో ఉపయోగిస్తున్నారు.
- స్నాప్ డ్రాగన్ 652 : మంచి ఫర్మార్మెన్స్ కనబరిచే బడ్జెట్ ఫోన్లలో వినియోగించే మంచి ప్రాసెసర్ ఇది. ఏడో స్థానంలో నిలిచిన దీనిని సామ్సంగ్ గెలాక్సీ ఏ9, ఏ9 ప్రో, లీఎకో లీ2, లెనెవో యోగా ట్యాబ్ 3లలో వినియోగిస్తున్నారు.
- యాపిల్ ఏ 8 : పర్ఫార్మెన్స్ లో ఎనిమిదో స్థానంలో నిలిచిన ఈ ప్రాసెసర్ ను ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ లలో వాడారు.
- స్నాప్ డ్రాగన్ 650 : తొమ్మిదో స్థానంలో నిలిచిన బెటర్ ప్రాసెసర్ ఇది. దీనిని రెడ్ మి నోట్3, సోనీ ఎక్స్ పీరియా ఎక్స్, లూమియా 650 వంటి ఫోన్లలో ఉపయోగిస్తున్నారు.
- స్నాప్ డ్రాగన్ 808 : పర్ఫార్మెన్స్ లో ఇది పదో స్థానంలో నిలిచింది. ఇది ఎల్ జీ జీ4, మోటరోలా మోటో ఎక్స్ స్టైల్, నెక్సస్ 5ఎక్స్, లూమియా 950 వంటి ఫోన్లలో ఉంది.
ఇవి గుర్తుంచుకోండి
- స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసేముందు అందులోని కెమెరా, డిస్ప్లే పరిమాణం వంటి వాటితోపాటు ఏ ప్రాసెసర్ ను వినియోగించారనేది కచ్చితంగా గమనించండి.
- ప్రాసెసర్ వేగం ఎక్కువగా ఉన్నంత మాత్రాన ఫోన్ మంచి పనితీరును కనబరుస్తుందని చెప్పలేం. ప్రాసెసర్ వేగంతో పాటు అందులోని జీపీయూనూ పరిగణనలోకి తీసుకోవాలి.
- ఏ సంస్థ తయారు చేసినదైనా ఎక్కువ కోర్ లు ఉన్న ప్రాసెసర్ వేడెక్కడం ఖాయం. కానీ కొన్ని ప్రాసెసర్లు మరీ ఎక్కువగా వేడెక్కుతాయి. అందువల్ల ఫోన్ దెబ్బతినే అవకాశం ఎక్కువ. అలాంటి ఫోన్లను ఎక్కువ సేపు నాన్ స్టాప్ గా వినియోగించలేం.
- వివిధ ఫోన్ తయారీ సంస్థలు తమకే ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్ ను అందిస్తుంటాయి. అయితే ఫోన్ లోని ప్రాసెసింగ్ యూనిట్ ఎంత సమర్థవంతమైనదైనా సాఫ్ట్ వేర్ సరిగా లేకపోతే వేగవంతంగా పనిచేయలేదు.
- ప్రాసెసర్ ఎంత వేగవంతమైనదైనా తగిన ర్యామ్ లేకపోతే ఫోన్ వేగంగా పనిచేయదు. ప్రాసెసర్ సాధారణమైనదైతే ఎంత ఎక్కువ ర్యామ్ వున్నా వృథాయే. బడ్జెట్ ఫోన్లను అందించే కంపెనీలు సాధారణ ప్రాసెసర్ ను అందిస్తూ.. 3జీబీ, 4జీబీ ర్యామ్ అంటూ ప్రకటనలు గుప్పిస్తుంటాయి.
- ప్రాసెసర్ వేగం తక్కువగా ఉన్నా బ్రాండెడ్ ఫోన్లు మంచి వేగాన్ని కనబరుస్తాయి. ప్రాసెసర్ తో పాటు ఫోన్ లోని ఇతర భాగాలకు సరైన అనుసంధానం ఉండడమే దానికి కారణం.