మీ మొబైల్ ఫోన్ డిస్ప్లే ఏ టైప్.. ఏ తరహా డిస్ప్లేలు బెటర్?
మొబైల్ ఫోన్లలో మనం అత్యంత ప్రాధాన్యమిచ్చేది వాటి స్క్రీన్లకే. స్క్రీన్ పెద్దగా ఉండడమే కాదు, మంచి ఇమేజ్ క్వాలిటీ కూడా ఉండాలి. అంతేకాదు స్మార్ట్ ఫోన్లలో ఎక్కువగా బ్యాటరీని వినియోగించుకునేది డిస్ప్లేలే. వివిధ మొబైల్ ఫోన్ల కంపెనీలు ఎన్నో రకాల డిస్ప్లేలు, ఎన్నో రకాల రిజల్యూషన్లను పేర్కొంటూ ఉంటాయి. అసలు ఎన్ని రకాల డిస్ప్లేలు ఉన్నాయి? ఏ డిస్ప్లే మంచిది, దేని మన్నిక ఎంత, ఏ డిస్ప్లే ఎంత విద్యుత్ ను వినియోగించుకుంటుంది.. ఇలా మనకు ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి.
స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు TFT, TFD, IPS LCD, LED, OLED, AMOLED, Capacitive Touchscreen, Resistive Touchscreen వంటి స్పెసిఫికేషన్స్ ను గమనిస్తుంటాం. వీటన్నింటి పూర్తి వివరాలు తెలుసుకుంటే మనకు తగిన, మంచి డిస్ల్పే ఉన్న ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు. డిస్ప్లేలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం..
ప్రధానంగా LCD, LEDగా రెండు రకాలు
మొబైల్ ఫోన్లలో తొలితరం నుంచి ఇప్పటి వరకు ప్రధానంగా రెండు రకాల డిస్ప్లే లు అందుబాటులో ఉన్నాయి. అవే లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే - ఎల్ సీడీ (LCD), లైట్ ఎమిటింగ్ డయోడ్-ఎల్ఈడీ (LED) స్క్రీన్లు. తొలితరంలోని బ్లాక్ అండ్ వైట్ మొబైల్ ఫోన్ల నుంచి.. ప్రస్తుతం వినియోగిస్తున్న స్మార్ట్ ఫోన్లలో అత్యధికం LCD రకానికి చెందినవే. అయితే ఇందులోనే చాలా రకాల టెక్నాలజీలు అందుబాటులోకి వచ్చాయి. ఇక ఇటీవలి కాలంలో వచ్చిన నాణ్యమైన స్క్రీన్లు LED రకానికి చెందినవి. ఇందులోనూ పలు రకాలున్నాయి. ఇంకా వీటికన్నా అత్యాధునికమైన రెటీనా డిస్ప్లేలు కూడా అందుబాటులోకి వచ్చాయి. మొత్తంగా డిస్ప్లేల రకాలను పరిశీలిద్దాం..
STN - CSTN డిస్ప్లేలు
మొబైల్ ఫోన్లలో తొలి తరంలో వచ్చిన ఎల్ సీడీ డిస్ప్లేలు ఇవి. నోకియా నుంచి మోటరోలా, సోనీ ఎరిక్సన్ వంటి మనకు తెలిసిన తొలి తరం ఫోన్లన్నీ ఇవే డిస్ప్లేలతో వచ్చాయి. తొలుత వచ్చినవి STN (సూపర్ ట్విస్టెడ్ నెమాటిక్) తరహావి. నోకియా 3310, నోకియా 1100 వంటివాటి డిస్ప్లేలు ఇవే. ఆ తర్వాత మోనో కలర్, కలర్ స్క్రీన్లు వచ్చాయి. వీటిని CSTN (కలర్ సూపర్ ట్విస్టెడ్ నెమాటిక్) డిస్ప్లే గా పేర్కొంటారు. ఈ తరహా డిస్ప్లేలను ఇప్పటికీ బేసిక్ మొబైల్ ఫోన్లలో వినియోగిస్తున్నారు. వీటిలో ఇమేజ్ క్వాలిటీ బాగా తక్కువగా ఉంటుంది. కానీ ధర అతి తక్కువ. చాలా తక్కువగా విద్యుత్ ను వినియోగించుకుంటాయి.
TFT LCD డిస్ప్లేలు
ఎల్సీడీ టెక్నాలజీని మరింతగా మెరుగుపర్చి TFT 'థిన్ ఫిలిం ట్రాన్సిస్టర్ టెక్నాలజీ (టీఎఫ్‌టీ)' డిస్ప్లేను అభివృద్ధి చేశారు. ప్రస్తుతం వీటిని విస్తృతంగా వినియోగిస్తున్నారు. అంతకు ముందు వచ్చిన ఎల్‌సీడీ డిస్ప్లేల కంటే ఇవి ఎక్కువ ఇమేజ్ క్వాలిటీని ఇస్తాయి. అయితే బ్యాటరీని కూడా ఎక్కువగా వినియోగించుకుంటాయి. ఈ స్క్రీన్లలో వ్యూ యాంగిల్ తక్కువగా ఉంటుంది. అంటే స్క్రీన్‌కు ఎదురుగా ఉంటేనే స్పష్టంగా కనిపిస్తుంది. పక్కల నుంచి చూస్తే డిస్ప్లే నల్లగా కనిపిస్తుంది. అంతేకాదు ఎండ, వెలుతురు ఎక్కువగా ఉన్నప్పుడు స్క్రీన్ సరిగా కనిపించదు. అయితే ఈ TFT డిస్ప్లేల ధర తక్కువగా ఉంటుంది కాబట్టి.. తక్కువ ఖరీదు కలిగిన స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
TFD డిస్ప్లేలు
TFT టెక్నాలజీని కొద్దిగా అభివృద్ధి చేసి రూపొందించినదే TFD (థిన్ ఫిల్మ్ డయోడ్) టెక్నాలజీ. ఇవి TFT డిస్ప్లేలతో పోల్చితే ఎక్కువ నాణ్యతతో ఉంటాయి. మరికొంచెం వేగంగా పనిచేస్తాయి. విద్యుత్ వినియోగం, ధర కూడా స్వల్పంగా తక్కువ. అయితే ఈ టెక్నాలజీ పూర్తిగా అందుబాటులోకి వచ్చేటప్పడికే.. అంతకన్నా మెరుగైన టెక్నాలజీలను అభివృద్ధి చేయడంతో ఇది పెద్దగా వినియోగంలోకి రాలేదు. కొన్ని రకాల ఫోన్లలో మాత్రమే ఈ డిస్ప్లేలు కనిపిస్తాయి.
IPS LCD డిస్ప్లేలు
TFT, TFD డిస్ప్లేల కంటే ఆధునికమైనవి, మరింత నాణ్యమైనవి IPS (ఇన్ ప్లేన్ స్విచింగ్) LCD డిస్ప్లేలు. స్క్రీన్ రిజల్యూషన్ కూడా మరింత ఎక్కువగా అందించేందుకు ఈ టెక్నాలజీ వీలు కల్పించింది. దీనికన్నా ముందటి LCD టెక్నాలజీలతో పోలిస్తే IPS టెక్నాలజీ అత్యుత్తమమైనది. డిస్ప్లే మరింత ప్రకాశవంతంగా, స్పష్టంగా కనిపిస్తుంది. తక్కువగా బ్యాటరీని వినియోగించుకుంటుంది. వ్యూ యాంగిల్ ఎక్కువ. అంటే పక్కల నుంచి చూసినా డిస్ప్లే కనిపిస్తుంది. ఎండ, ఎక్కువ వెలుతురులో కూడా కొంత వరకు డిస్ప్లే కనిపిస్తుంది. అయితే ఈ డిస్ప్లేల ఖరీదు కొంచెం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మధ్య తరహా బడ్జెట్ ఫోన్లు, చిన్న సైజు హైఎండ్ ఫోన్లలో ఈ తరహా టెక్నాలజీని వినియోగిస్తున్నారు.
ఓఎల్ఈడీ (OLED) డిస్ప్లేలు
LCD డిస్ప్లేల కంటే ఆధునికమైన టెక్నాలజీ LED (లైట్ ఎమిటింగ్ డయోడ్). ఈ డిస్ప్లేలు మరింత నాణ్యంగా ఉండి, తక్కువ విద్యుత్ ను వినియోగించుకుంటాయి.LED మొబైల్ డిస్ప్లేలలో తొలుత వచ్చిన టెక్నాలజీయే OLED (ఆర్గానికి లైట్ ఎమిటింగ్ డయోడ్). LCD డిస్ప్లేల కన్నా ఈ డిస్ప్లేల ధర కొంచెం ఎక్కువ. కానీ మరింత ప్రకాశవంతమైన, నాణ్యమైన పిక్చర్ క్వాలిటీ ఉంటుంది. మరిన్ని ఎక్కువ రంగులను వీక్షించవచ్చు. అంతేకాదు బ్యాటరీని కూడా తక్కువగా వినియోగించుకుంటాయి. వేగంగా పనిచేస్తాయి. సన్నగా ఉంటాయి, బరువు కూడా తక్కువ. వ్యూ యాంగిల్ చాలా ఎక్కువ. అంటే పక్కల నుంచి కూడా డిస్ప్లే దాదాపు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఎండ, వెలుతురు ఎక్కువగా ఉన్నప్పుడు వీటి డిస్ప్లే సరిగా కనిపించదు.
అమోలెడ్ (AMOLED) డిస్ప్లేలు
LED డిస్ప్లేలలో మరింత ఆధునికమైన టెక్నాలజీయే అమోలెడ్ (ఆక్టివ్ మాట్రిక్స్ ఆర్గానిక్ లైట్ ఎమిటింగ్ డయోడ్). వీటి పనితీరు, నాణ్యత దాదాపుగా ఓఎల్ఈడీ డిస్ప్లేల తరహాలోనే ఉంటాయి. ప్రకాశవంతం, పిక్చర్ క్వాలిటీ, అత్యుత్తమమైన రంగులు, వ్యూ యాంగిల్ విషయంలో ఒకేలా ఉంటాయి. కానీ అమోలెడ్ డిస్ప్లేలు మరింత సన్నగా ఉంటాయి, బరువు మరింత తక్కువ. బ్యాటరీని కూడా మరింత తక్కువగా వినియోగించుకుంటాయి. అంతేకాదు ఎండ, ఎక్కువ వెలుతురులో డిస్ప్లే కనిపిస్తుంది. అయితే ఈ డిస్ప్లేల ధర కొంత ఎక్కువ. అందువల్ల హైఎండ్ స్మార్ట్ ఫోన్లలో మాత్రమే అమోలెడ్ డిస్ప్లేలను అందిస్తున్నారు.
సూపర్ అమోలెడ్ (Super - AMOLED) డిస్ప్లేలు
అమోలెడ్ డిస్ప్లేలకన్నా అత్యాధునికమైన టెక్నాలజీ ఇది. దీనిని సామ్సంగ్ కంపెనీ అభివృద్ధి చేసింది. ప్రపంచంలో ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న అతి సన్నని డిస్ప్లే ఇదే. మిగతా అన్ని రకాల డిస్ప్లేలతో పోలిస్తే ఇది మెరుగ్గా ఉంటుంది. ధర ఎక్కువ. వీటిలోనే సూపర్ అమోలెడ్ ప్లస్, సూపర్ అమోలెడ్ ప్లస్ హెచ్ డీ అనే రకాలూ అందుబాటులోకి వచ్చాయి.
సూపర్ ఎల్ సీడీ (SLCD) డిస్ప్లే
LCD టెక్నాలజీలో అత్యంత అధునాతనమైన టెక్నాలజీ ఇది. అమోలెడ్ డిస్ప్లేతో పోలిస్తే మరింత మెరుగైన నాణ్యత, స్పష్టత ఉండేలా దీనిని అభివృద్ధి చేశారు. అంతేకాదు రంగులను ప్రకాశవంతంగా చూపడంలో ఈ డిస్ప్లేలు అత్యుత్తమమైనవి. ఎండ, ఎక్కువ వెలుతురులో కూడా ఈ డిస్ప్లే బాగా కనిపిస్తుంది. విద్యుత్ వినియోగం కూడా చాలా తక్కువ. అయితే ఈ SLCD ధర కూడా కొంచెం ఎక్కువ. ఇటీవలే ఈ డిస్ప్లేల వినియోగం పెరుగుతోంది.
రెటీనా (Retina) డిస్ప్లే
IPS LCD టెక్నాలజీని కొంత మెరుగుపర్చి ఎక్కువ రెజల్యూషన్ అందించేందుకు యాపిల్ సంస్థ అభివృద్ధి చేసిన టెక్నాలజీయే రెటీనా డిస్ప్లే. నిర్ణీత దూరం నుంచి చూసినప్పుడు డిస్ప్లేపై పిక్సెల్స్ ను విడిగా గమనించడానికి వీలు లేనంత PPI ని అందించడమే దీని లక్ష్యం. దీనిని తొలుత ఐఫోన్లలో అందుబాటులోకి తెచ్చారు. అయితే ప్రస్తుతం రెటీనా డిస్ప్లే కంటే ఎక్కువ రిజల్యూషన్ ఉన్న స్మార్ట్ ఫోన్ డిస్ప్లేలు ఎన్నో అందుబాటులోకి వచ్చాయి. ఇక సోనీ కంపెనీ మొబైల్ బ్రేవియా ఇంజన్, ఎల్ జీ కంపెనీ నోవా పేరుతో టెక్నాలజీలను ప్రవేశపెట్టాయి. ఇవి ఇతర ఎల్ సీడీ, ఎల్ఈడీ టెక్నాలజీలను ఉపయోగించి హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్లను అభివృద్ధి చేయడం ద్వారా ఆ టెక్నాలజీలను రూపొందించాయి.
కెపాసిటివ్ - రెసిస్టివ్ టచ్ స్క్రీన్లు ఏమిటి?
ఇప్పుడున్న స్మార్ట్ ఫోన్లన్నీ టచ్ స్క్రీన్ తరహావే. ఈ టచ్ స్క్రీన్లలో రెసిస్టివ్, కెపాసిటివ్ టచ్ స్క్రీన్లు అనే రెండు రకాలు ఉన్నాయి. ఈ రెండూ కూడా ప్రధానమైన డిస్ప్లేపై ఏర్పాటు చేసే పారదర్శకమైన భాగాలు.
రెసిస్టివ్ టచ్:
రెసిస్టివ్ టచ్ స్క్రీన్లో విద్యుత్ వాహక లక్షణం గల రెండు అతి సన్నని పొరలు కొద్దిపాటి గ్యాప్ తో ఏర్పాటు చేయబడి ఉంటాయి. దీనిలో పై పొరపై దేనితోనైనా ఒత్తిడి కలిగించినప్పుడు అది కింది పొరకు తాకి విద్యుత్ ప్రసారం జరగడం ద్వారా ఆ ప్రాంతంలో ‘టచ్’ చేసినట్లు సంకేతాలు వెళతాయి. అంటే మన వేలు, స్టైలస్, ఇతర పరికరాలు దేనితో తాకినా, ఒత్తిడి కలిగించినా స్క్రీన్ స్పందిస్తుంది. ముఖ్యంగా ఫోన్లు, ట్యాబ్లెట్ల స్క్రీన్ పై హ్యాండ్ రైటింగ్, సంతకాలు తీసుకోవడం, ఏదైనా రాసి భద్రపర్చుకోవడం, పెయింటింగ్, చిత్రాలు వేయడం వంటి పనులను చేసేవారికి ఈ రెసిస్టివ్ టచ్ స్క్రీన్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. తొలుత వచ్చిన అన్ని రకాల స్మార్ట్ ఫోన్లు, చైనా నుంచి దిగుమతైన టచ్ ఫోన్లన్నింటిలో ఉపయోగించినది ఈ రెసిస్టివ్ టచ్ స్ర్రీన్లనే. ఇప్పుడు కూడా కొన్ని రకాల మొబైల్ ఫోన్లలో, ట్యాబ్లెట్లలో వీటిని ఉపయోగిస్తున్నారు. వీటి ధర కూడా చాలా తక్కువ. కానీ వీటి మన్నిక తక్కువ. త్వరగా పాడవుతాయి. ఆలస్యంగా స్పందిస్తాయి. టచ్ స్క్రీన్ అనుభూతిని పూర్తిగా పొందలేం.
కెపాసిటివ్ టచ్:
ప్రస్తుతమున్న స్మార్ట్ ఫోన్లలో చాలా వరకు కెపాసిటివ్ టచ్ స్క్రీన్ తోనే వస్తున్నాయి. ఈ టచ్ స్క్రీన్ ఒకే పొరతో కూడుకుని ఉండి.. మనిషి వేలిలోని విద్యుత్ వాహకత్వాన్ని ఆధారంగా చేసుకుని పనిచేస్తాయి. అందువల్ల మనం తాకితే తప్ప స్టైలస్, ఇతర పరికరాలతో ఈ టచ్ స్క్రీన్ పనిచేయదు. అయితే ఇవి చాలా వేగంగా పనిచేస్తాయి. పెద్దగా ఒత్తిడి చేయాల్సిన అవసరం లేకుండా.. వేలితో తాకీ తాకగానే స్పందిస్తాయి. వీటి మన్నిక, ధర కూడా ఎక్కువ. అయితే ఈ కెపాసిటివ్ టచ్ స్క్రీన్లపై పనిచేయగల ప్రత్యేక స్టైలస్ లు కూడా అందుబాటులోకి వచ్చాయి. వాటిని ఉపయోగించి హ్యాండ్ రైటింగ్ వంటివి చేయవచ్చు.
ఎంచుకునే ముందు గమనించాల్సినవి..
- ఇంటర్నెట్ ద్వారాగానీ, ఫోన్లో లోడ్ చేసుకుని గానీ వీడియోలు ఎక్కువగా చూసేవారికి, గేమ్స్ ఎక్కువగా ఆడేవారికి ఎల్ఈడీ (ఓఎల్ఈడీ, అమోలెడ్, సూపర్ అమోలెడ్) తరహా డిస్ప్లేలు ఉన్న ఫోన్లు బెటర్.
- ఇంటర్నెట్ బ్రౌజింగ్, టెక్స్ట్ టైప్ చేసి పంపడం, టెక్ట్స్ (ఆన్ లైన్ పుస్తకాలు) చదవడం వంటి అవసరాలు ఎక్కువగా ఉన్నవాళ్లు ఎల్ సీడీ (TFT LCD, IPS LCD, SLCD) తరహా డిస్ప్లేలు ఉన్న ఫోన్లు తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఎల్ సీడీ డిస్ప్లేలలో టెక్స్ట్ స్పష్టంగా కనిపిస్తుంది. కళ్లకు ఇబ్బంది ఉండదు.
- తక్కువ బడ్జెట్ లో మంచి ఫోన్లు కొనాలనుకునే వారు డిస్ప్లే సైజు కొంచెం చిన్నదిగా అయినా సరే మంచి డిస్ప్లే ఉన్న ఫోన్ తీసుకోవడం బెటర్. ఎందుకంటే డిస్ప్లే క్వాలిటీగా ఉంటే ఫోన్ వినియోగంలో సంతృప్తి ఉంటుంది.
- ఏదైనా డిజైనింగ్ వంటి పనులు చేసేవారు. హ్యాండ్ రైటింగ్ కోసం, సంతకాలు వంటివి డిజిటల్ రూపంలో తీసుకోవడం కోసం కెపాసిటివ్ టచ్ ఉన్న ఫోన్లు, ట్యాబ్లెట్లు తీసుకోవచ్చు.