ఎన్ని స్టార్లు ఉంటే అంత ఆదా.. అసలు ఏమిటీ స్టార్ రేటింగ్?


ఇంట్లో ఎన్నో అవసరాలు.. ప్రతి పనికీ ఓ సరికొత్త ఉపకరణం అందుబాటులోకి వచ్చేసింది. మరి అవన్నీ నడవాలంటే విద్యుత్ అవసరం. మరోవైపు విద్యుత్ వినియోగం శ్లాబ్ లు మారిన కొద్దీ బిల్లులు మోత మోగిపోతూ వుంటుంది. అందువల్ల విద్యుత్ పొదుపు చేసుకోవడం ఎంతో అవసరం. ఇంట్లో విద్యుత్ పొదుపు చేసుకోవడంతోపాటు మనం కొనుగోలు చేసే పరికరాలన్నీ ఉత్తమ నాణ్యతతో, తక్కువ విద్యుత్ వినియోగించుకునేలా ఉండాల్సిందే. 

ఈ నేపథ్యంలోనే ఎలక్ట్రానిక్ పరికరాలకు స్టార్ రేటింగ్ అమల్లోకి వచ్చింది. మనం టీవీ, ఫ్రిజ్ వంటి ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువు కొనుగోలు చేసేందుకు వెళ్లినప్పుడు సేల్స్ మెన్ ఆయా పరికరాల స్టార్ రేటింగ్ లనూ చెబుతుంటారు. మరి ఈ స్టార్ రేటింగ్ లు ఏమిటి? వాటిని ఎలా ఇస్తారు? వాటివల్ల ఉపయోగం ఏమిటి? స్టార్ రేటింగ్ పై వివరాలను ఎలా పరిశీలించాలి? ఎప్పటికప్పుడు ప్రమాణాలు ఎలా మారుతాయి.. వంటి అంశాలను వివరంగా తెలుసుకుందాం..

ఏమిటీ బీఈఈ స్టార్ రేటింగ్?
వివిధ పరికరాల విద్యుత్ వినియోగ సామర్థ్యాన్ని అంచనా వేసి, ర్యాంకులు కేటాయించడం, ప్రజల్లో విద్యుత్ పొదుపుపై అవగాహన కల్పించే లక్ష్యంతో భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖ ‘బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ)’ని నెలకొల్పింది. ఈ సంస్థ 2006 నుంచి వివిధ ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు రేటింగ్ ఇచ్చే ‘స్టాండర్డ్స్ అండ్ లేబులింగ్ ప్రోగ్రామ్’ను ప్రారంభించింది. కొన్ని రకాల పరికరాలకు స్టార్ రేటింగ్ తీసుకోవడం తప్పనిసరి చేసింది. మరికొన్ని రకాల పరికరాలకు తయారీదారులు స్వచ్ఛందంగా ‘బీఈఈ’ తనిఖీ చేయించుకుని స్టార్ రేటింగ్ ను నమోదు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఎయిర్ కండిషనర్లు (ఏసీలు), రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, టెలివిజన్లు, కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లు,  గీజర్లు, ట్యూబ్ లైట్లు, ఫ్యాన్లకు స్టార్ రేటింగ్ అమల్లో ఉంది. మరికొన్నింటికి కూడా త్వరలోనే విస్తరించనున్నారు.

రేటింగ్ ఎలా ఇస్తారు..?
వివిధ రకాల పరికరాల పనితీరుకు సంబంధించి బీఈఈ కొన్ని ప్రమాణాలను, పరీక్షలను రూపొందించింది. ఆయా ప్రమాణాలు, పరీక్షల ఫలితాలతో విద్యుత్ వినియోగాన్ని అంచనా వేసి స్టార్ రేటింగ్ ను ఖరారు చేస్తుంది. ఎవరైనా ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తిదారు ఏదైనా కొత్త పరికరాన్ని తయారు చేస్తే.. ఆయా ప్రమాణాలకు లోబడి పరికరాల పనితీరును పరీక్షిస్తారు. ఈ ప్రమాణాలు, పరీక్షల ఫలితాలను బీఈఈకి నివేదిస్తారు. బీఈఈ వాటిని పరిశీలించడంతోపాటు తనిఖీ నిర్వహించి స్టార్ లేబుల్ ను ఖరారు చేస్తుంది. బీఈఈ ఎప్పటికప్పుడు ప్రమాణాలను మెరుగుపర్చుతుంది. లేదా ఎవరైనా ఉత్పత్తిదారే మరింత మెరుగైన ఉత్పత్తిని రూపొందిస్తారు. దాంతో ఆ ఉత్పత్తికి 5 స్టార్ రేటింగ్ ఇచ్చి... దాని ఆధారంగా తక్కువ ప్రమాణాల మేరకు ఉన్నవాటికి తక్కువ రేటింగ్ ఇస్తారు.


ఎంతో మిగులు..

రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండిషనర్లు వంటి పరికరాలను ఒకసారి కొనుగోలు చేస్తే.. కొన్నేళ్ల పాటు వాటిని మనం వినియోగిస్తూనే ఉంటాం. అలాంటి సమయంలో అవి ఏ కొంత విద్యుత్ ను పొదుపు చేసినా.. అది మొత్తంగా మనకు ఎంతో డబ్బును మిగిలిస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అందువల్ల మొదటిసారిగా పరికరాలను కొనుగోలు చేస్తున్నా.. ఇప్పటికే ఉన్నవాటిని పక్కనపెట్టో, అమ్మేసో కొత్తవి తెచ్చుకుంటున్నా.. ఆయా పరికరాల సామర్థ్యం, ఫీచర్స్ తో పాటు స్టార్ రేటింగ్ కూడా తప్పనిసరిగా చూడండి. మనకు నచ్చినవాటిలో ఎక్కువ స్టార్ రేటింగ్ ఉన్నదానినే ఎంచుకోవడం మంచిది.


ప్రతి ఏడాదీ ప్రమాణాలు మారుతుంటాయ్.. చూడండి
వివిధ పరికరాలకు స్టార్ రేటింగ్ లు ఇచ్చేందుకు పరిగణనలోకి తీసుకునే ప్రమాణాలు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఉదాహరణకు 2014లో ఒక 210 లీటర్ల రిఫ్రిజిరేటర్ కు స్టార్ రేటింగ్ ఇచ్చేందుకు తీసుకునే ప్రమాణాలు, తక్కువ విద్యుత్ వినియోగం, నాణ్యత కంటే అదే రిఫ్రిజిరేటర్ కు 2016లో రేటింగ్ ఇచ్చేందుకు ప్రమాణాలు, నాణ్యత మరింత మెరుగ్గా ఉంటాయి. వినియోగించుకునే విద్యుత్ మరింతగా తక్కువగా ఉండాల్సి ఉంటుంది. అందువల్ల స్టార్ రేటింగ్ తోపాటు పక్కన ఉండే ఏడాదిని కూడా కచ్చితంగా పరిశీలించాలి. ఉదాహరణకు 2012లో 3 స్టార్ రేటింగ్ ఉన్న ఒక టన్ను సామర్థ్యం గల ఎయిర్ కండిషనర్ నెలకు సుమారు 400 యూనిట్ల విద్యుత్ ను వినియోగించుకుంటే... 2016లో 3 స్టార్ రేటింగ్ ఉన్న ఒక టన్ను సామర్థ్యం గల ఎయిర్ కండిషనర్ వినియోగించుకునే విద్యుత్ నెలకు కేవలం 250 యూనిట్లే ఉంటుంది. ఇదే తరహాలో భవిష్యత్తులోనూ ప్రమాణాలను మరింతగా మెరుగుపరుస్తూ స్టార్ రేటింగ్ అమలు చేస్తారు.

ఇవి గుర్తుంచుకోండి..

  • సాధారణంగా ఏదైనా పరికరం కొనుగోలు చేసేముందు దాని ధరకే ప్రాధాన్యం ఇస్తుంటాం. ఆ పరికరాన్ని వినియోగిస్తున్నప్పుడు జరిగే వ్యయం గురించి తక్కువగా ఆలోచిస్తాం. కానీ పరికరం ధర కాస్త ఎక్కువైనా.. మనం దీర్ఘకాలంలో దానిని వినియోగిస్తున్నపుడు ఖర్చు చాలా తగ్గుతుంది. అందువల్ల ధర ఎక్కువగా ఉందని ఎక్కువ స్టార్ రేటింగ్ ఉన్న పరికరాలు ఎంచుకోవడానికి మొహమాటపడవద్దు.
  • ఒక్కోసారి పరికరం ప్రస్తుత ఏడాదిలో తయారు చేసినా.. గతేడాదికి సంబంధించిన స్టార్ రేటింగ్ లేబుల్ ను పెడుతుంటారు. ప్రమాణాల ప్రకారం చూస్తే ఆ ఏడాదిలో అదే తరహా పరికరాల సామర్థ్యం మెరుగుపడి ఉండవచ్చు. అందువల్ల ప్రస్తుత సంవత్సరానికి సంబంధించిన పరికరాన్నే తీసుకోండి. బీఈఈ స్టార్ లేబుల్ పై ఆకుపచ్చ రంగు బాక్స్ లో ఆ రేటింగ్ ఇచ్చిన సంవత్సరం ముద్రించబడి ఉంటుంది. దానిని కూడా కచ్చితంగా పరిశీలించండి. గత సంవత్సరం 5 స్టార్ రేటింగ్ ఉన్న పరికరం, ఈ ఏడాది 4 స్టార్ రేటింగ్ ఉన్న పరికరం సమానంగా విద్యుత్ ను వినియోగించుకునే అవకాశం ఉంటుంది. దీనికి కారణం పరికరాల నాణ్యత, సామర్థ్యం మరింతగా పెరగడమే.
రెండు రకాలుగా లేబుళ్లు
బీఈఈ స్టార్ రేటింగ్ లేబుళ్లు రెండు రకాలుగా ఉంటాయి. టీవీలు, కంప్యూటర్లు, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్ల వంటి వాటికి చిన్న పరిమాణంలో లేబుల్ ఉంటుంది. దీనిలో ఆకుపచ్చని బ్యాక్ గ్రౌండ్ లో స్టార్లు ఉంటాయి. ఇక ఏసీలు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు, గీజర్లు వంటి పెద్ద పరికరాలకు లేబుల్ పెద్దగా ఉంటుంది. దీనిలో ఎరుపు రంగు బ్యాక్ గ్రౌండ్ లో స్టార్లు ఉంటాయి. పరికరానికి సంబంధించి మరిన్ని అదనపు వివరాలూ ఉంటాయి.

పరికరాలు నాణ్యంగా ఉంటాయి..
బీఈఈ స్టార్ రేటింగ్ ఉన్న పరికరాలు సాధారణంగా భారత ప్రభుత్వం నిర్ధారించిన ఉత్తమ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయి. ఎందుకంటే స్టార్ రేటింగ్ ఇచ్చే ముందు ఆయా పరికరాలు ప్రమాణాల మేరకు ఉన్నాయా? లేదా? అని బీఈఈ పరిశీలిస్తుంది. అయితే అవి కనీస ప్రమాణాల మేరకు ఉంటాయిగానీ అత్యుత్తమమైనవని చెప్పలేం. ఎక్కువ స్టార్ రేటింగ్ ఉన్నవి మరింత ఎక్కువ నాణ్యమైనవని మాత్రం భావించవద్దు. స్టార్ రేటింగ్ ఉంటే కనీస నాణ్యతా ప్రమాణాల మేరకు ఉంటాయని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు.

ఇన్వర్టర్ టెక్నాలజీతో రేటింగ్ మార్పులు
స్టార్ రేటింగ్ అనేది పరికరం నిర్ధారిత ప్రమాణాలు, నాణ్యతను ఆధారంగా చేసుకుని ఇస్తారు. కాబట్టి ఇన్వర్టర్ టెక్నాలజీ ఉన్న పరికరాల విషయంలో స్టార్ రేటింగ్ నిర్ణయం కొంత క్లిష్టమైన అంశం. ఎందుకంటే ఇన్వర్టర్ టెక్నాలజీ ఉన్న పరికరాలు ఆయా సందర్భాలకు, వాతావరణానికి, వినియోగించే విధానానికి అనుగుణంగా వాటి పనితీరును, వేగాన్ని మార్చుకుంటాయి. అందువల్ల కచ్చితంగా ఇంత విద్యుత్ వినియోగం జరుగుతుందని నిర్ధారించలేం. ఈ కారణం వల్లే ఇప్పటి వరకూ ఇన్వర్టర్ టెక్నాలజీ ఉన్న పరికరాలకు స్టార్ రేటింగ్ ఇవ్వలేదు. కానీ ఇటీవలే ఇన్వర్టర్ టెక్నాలజీ ఉన్న పరికరాలకు విభిన్న ప్రమాణాలను నిర్ధారించిన బీఈఈ.. వాటికి స్టార్ రేటింగ్ ఇవ్వడం ప్రారంభించింది.

అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా..
బీఈఈ స్టార్ రేటింగ్ ఇచ్చేందుకు అత్యుత్తమ ప్రమాణాలను అనుసరిస్తుంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్ట్స్ (బీఐఎస్) నిర్ధారించిన ప్రమాణాలతోపాటు, అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్న ఈఈఆర్ వంటి రేటింగులనూ, ఎనర్జీ స్టార్ ప్రమాణాలనూ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) అనుసరిస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాల్లోనూ భారతదేశ పరిస్థితులకు అనుగుణంగా ఎంపిక చేసి వివిధ పరికరాలకు వర్తింపజేస్తుంది. అంటే స్థానిక పరిస్థితులతోపాటు, ఉత్తమ ప్రమాణాలకు అనుగుణంగా బీఈఈ స్టార్ రేటింగ్ ఉంటుందని గమనించాలి.

ఏసీలకు ఐఎస్ఈఈఆర్ రేటింగ్
బీఈఈ స్టార్ రేటింగ్ ఇచ్చిన తరహాలోనే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఈఈఆర్ రేటింగులను పాటిస్తారు. ఈఈఆర్ అంటే ‘ఎనర్జీ ఎఫిషియెన్సీ రేషియో (ఎంత విద్యుత్ తో ఎంత మేర పనిచేసిందనే నిష్పత్తి)’. దీనినే ఎస్ఈఈఆర్ గా కూడా చెబుతారు. అంటే ‘సీజనల్ ఎనర్జీ ఎఫిషియెన్సీ రేషియో’. ఈ రేటింగ్ కు కారణం వాతావరణంలో జరిగే మార్పులే. ఎందుకంటే ఎండాకాలంలో ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది. అందువల్ల ఏసీలు వంటి చల్లబరిచే పరికరాలు ఎక్కువగా పనిచేయాల్సి ఉంటుంది, ఎక్కువ విద్యుత్ కావాలి. అదే చలికాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. అలాంటి సమయంలో పరికరాలపై పెద్దగా శ్రమ ఉండదు. విద్యుత్ వినియోగం తక్కువగా ఉంటుంది. అందువల్ల కచ్చితమైన విద్యుత్ వినియోగాన్ని అంచనా వేయడం కష్టం కావడంతో... ఏసీలు, రూమ్ హీటర్లు వంటి పరికరాలకు  ‘ఎస్ఈఈఆర్’ రేటింగ్ ఇస్తుంటారు. ఈ రేటింగ్ నే భారత ప్రమాణాలకు అనుగుణంగా సిద్ధం చేసి ‘ఇండియన్ సీజనల్ ఎనర్జీ ఎఫిషియెన్సీ రేటింగ్ (ఐఎస్ఈఈఆర్)’ రేటింగ్ ను బీఈఈ ఇస్తోంది. మన దేశంలో ముఖ్యంగా ఎయిర్ కండిషనర్లకు ఐఎస్ఈఈఆర్ రేటింగ్ ను ఇస్తారు. ఈ రేటింగ్ ఎంత ఎక్కువగా ఉంటే ఆ ఏసీ తాను వినియోగించుకునే విద్యుత్ కు అంత సమర్థవంతంగా చల్లదనాన్ని ఇస్తుందన్న మాట.

ఎనర్జీ స్టార్ రేటింగ్ కూడా..
పర్యావరణ కాలుష్యాన్ని నిరోధించాలనే ఉద్దేశంతో తక్కువ విద్యుత్ వినియోగించుకునే, నాణ్యమైన పరికరాలకు ఎనర్జీ స్టార్ రేటింగ్ ఇస్తారు. ఈ రేటింగ్ ను అమెరికా పర్యావరణ పరిరక్షణ సంస్థ (ఈపీఏ) ప్రారంభించింది. కంప్యూటర్లు, మానిటర్లు వంటి చిన్న పరికరాలకు కూడా ఈ సంస్థ స్టార్ రేటింగ్ ను ఇస్తుంది. అయితే ఇది పూర్తిగా స్వచ్ఛందం. ఎవరైనా పరికరాల ఉత్పత్తిదారు తాము తయారుచేసిన ఉత్పత్తులను ఈపీఏతో పరీక్షింపజేసుకుని ఎనర్జీ స్టార్ రేటింగ్ ను పొందవచ్చు. ఎనర్జీ స్టార్ రేటింగ్ పొందే ఉత్పత్తులు అత్యుత్తమ విద్యుత్ పొదుపును కనబరుస్తాయి.
ఉదాహరణకు ఒక డెస్క్ టాప్ కంప్యూటర్ ను తీసుకుంటే... ఆ కంప్యూటర్ సగటున 50 నుంచి 90 వాట్ల వరకు విద్యుత్ ను వినియోగించుకుంటుంది. అదే ఎనర్జీ స్టార్ రేటింగ్ ఉన్న కంప్యూటర్లలో ప్రత్యేకంగా పవర్ మేనేజ్ మెంట్ వ్యవస్థ ఉంటుంది. ఇది నిర్ణీత సమయం పాటు కంప్యూటర్ పై ఎలాంటి పనీ చేయకపోతే దానిని స్లీప్ లేదా స్టాండ్ బై మోడ్ లోకి తీసుకెళుతుంది. హార్డ్ డిస్క్ వంటి అత్యవసర పరికరాలకే విద్యుత్ ను అందించి.. మిగతా వాటికి నిలిపేస్తుంది. మళ్లీ ఎలాంటి యాక్టివిటీని గమనించినా.. యాక్టివ్ గా మార్చుతుంది. ఇలాంటప్పుడు విద్యుత్ వినియోగం కంప్యూటర్ స్లీప్ మోడ్ లో 2 వాట్లు, స్టాండ్ బై మోడ్ లో 4 వాట్లు మాత్రమే ఉంటుంది. అంటే ఏకంగా 80% నుంచి 90% విద్యుత్ ఆదా అవుతుంది.




More Articles