నెలకు రూ.5వేలతో... ఇలా కోటి రూపాయల నిధి ఏర్పడుతుంది!

ఇన్వెస్ట్ మెంట్ ఎక్కడ చేయాలో తెలిసినవాడే అసలైన పొదుపరి, మదుపరి. రోజంతా కష్టపడి సంపాదించినదాన్ని సంపదగా మార్చుకోవాలంటే దీటైన రాబడినిచ్చే వాటిని వెతికి పట్టుకోవాలి. 15 శాతం వార్షిక రాబడినిచ్చే సాధనంలో నెలకు రూ.5వేల రూపాయలు చొప్పున ఇన్వెస్ట్ చేస్తే 20 నుంచి 25 ఏళ్లలో కోటి రూపాయలను చేరుకుంటారు. ఇలా తక్కువ కాలంలో ఎక్కువ సంపాదనకు ఎంత ఇన్వెస్ట్ చేయాలి, అందుకు ఉన్న మార్గాలేంటో చూద్దాం. 

కోటీశ్వరులు అవ్వాలనే ఆశయం చాలా మందిలో ఉంటుంది. ఇది వెనుకటి నుంచీ వస్తున్నదే. కరెన్సీ విలువ తగ్గిపోయిన నేటి రోజుల్లోనూ కోటి రూపాయలను ఇప్పటికీ ఓ లక్కీ మార్క్ గానే చాలా మంది భావిస్తుంటారు. తెలివిగా ఇన్వెస్ట్ చేస్తే కోటి మార్కును చేరుకోవడం చాలా సులభం. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, బ్యాంకు డిపాజిట్లు, రియల్ ఎస్టేట్, బంగారం ఇలా ఎన్నో రకాల పెట్టుబడి సాధనాలు ఉన్నాయి. కానీ, అన్నింటిలోకి చారిత్రికంగా చూసుకుంటే ఈక్విటీలే అధిక రాబడులను ఇచ్చాయి.

represenattion image

ఈక్విటీల్లో రాబడులు ఎక్కువ

బీఎస్ఈ సెన్సెక్స్ ప్రస్తుతం 28వేలకు పైన ఉంది. 1979లో ఇది కేవలం 113 పాయింట్లు మాత్రమే. ఈ 36 ఏళ్లలో ఎన్ని రెట్లు పెరిగిందో అర్థమయ్యే ఉంటుంది. చారిత్రకంగా చూస్తే ఈక్విటీల రాబడులు 16 శాతానికి మించి ఉన్నాయి. మార్కెట్ల ఇండెక్స్ లు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ వాటితో సంబంధం లేకుండా స్టాక్స్ ధరల్లో హెచ్చు, తగ్గులు ఉంటాయి. ఉదాహరణకు ఐచర్స్ మోటార్ షేరు ధర 2013 మే నెలలో 3వేల రూపాయల దగ్గర ఉంది. అదే షేరు ధర 2016 సెప్టెంబర్ 15న 22,491 రూపాయలు. మూడేళ్ల కాలంలో ఏడు రెట్లకు పైగా పెరిగింది.

ఎందుకని...?

ఈ మూడేళ్లలో సెన్సెక్స్ 50 శాతమే వృద్ధి చెందింది. కానీ ఐచర్ మోటార్స్ షేరు ధర ఎందుకంత పెరిగింది? దేశీయ ఆటో మొబైల్ రంగానికి ఈ కాలం బాగా కలసి వచ్చింది. ఐచర్స్ మోటార్స్ వాణిజ్య వాహనాలు నాణ్యమైనవి కావడతో అమ్మకాలు బాగా పెరిగాయి. ఆదాయాలు, లాభాలు గణనీయంగా పెరిగిపోవడంతో స్టాక్ ధర కూడా భారీగా వృద్ధి చెందింది. ఇలా స్టాక్స్ పనితీరు ఆధారంగా వాటిల్లో వృద్ధి ఉంటుంది. ఇలాంటి వృద్ధికి అవకాశం ఉన్న షేర్లను ఎంచుకుని మ్యూచువల్ ఫండ్స్ మేనేజర్లు పెట్టుబడులు పెడుతుంటారు. కనుక మిగిలిన ఇన్వెస్ట్ మెంట్ సాధనాలతో పోలిస్తే రాబడులు ఈక్విటీల్లో ఎక్కువగా ఉంటాయి. అందుకే మంచి ఫండ్స్ ను ఎంపిక చేసుకుని పెట్టుబడి పెడుతూ వెళ్లడం వల్ల త్వరగా కోటీశ్వరులు అయిపోవచ్చు. అలా అని ఏదో ఒక ఫండ్ స్కీమ్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా కోటి మార్కును చేరుకోవచ్చనుకుంటే పొరపాటే. ఎంపిక పక్కాగా ఉండాలి. 

దేనిపై ఎంత...?

ఫిక్స్ డ్ డిపాజిట్లపై రాబడి 7 శాతంగా ఉంది. పీపీఎఫ్, ఈపీఎఫ్ లపై రాబడి 8 - 9 శాతం మధ్యలో ఉంది. బంగారంపై కూడా రాబడి బ్యాంకు డిపాజిట్లతో పోలిస్తే కొంచెం మెరుగ్గా ఉంటుంది. రియల్టీ సైతం ఈక్విటీ మార్కెట్లకు దీటుగా రాబడులు ఇవ్వగల అస్సెట్ క్లాస్. అయితే, రియల్ ఎస్టేట్ కు వచ్చే సరికి నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలు అనే తేడాతోపాటు భవిష్యత్తులో ఆ ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందన్న అనేక అంశాల ఆధారంగా వచ్చే రాబడి ఆధారపడి ఉంటుంది. అయితే, రియల్టీపై రాబడులు ఏ విధంగా చూసుకున్నా బ్యాంకు డిపాజిట్లు, బంగారం కంటే కూడా ఎక్కువగానే ఉంటాయన్నది వాస్తవం. రియల్టీ మార్కెట్ అన్నది ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది కాబట్టి, ఇంత శాతం వస్తుందని అంచనా కట్టలేం. భవిష్యత్తులోనూ మన ఈక్విటీ (స్టాక్) మార్కెట్లు 12 శాతం నుంచి 15 శాతం వరకు రాబడులను ఇవ్వగలవని విశ్లేషకుల అంచనా. 

represenattion image

20 ఏళ్లలో కోటి రూపాయలు ఇలా....

లక్ష్యాన్ని ముందుగా చేరుకోవాలంటే రాబడి అధికంగా ఉండాలి. రాబడి తక్కువగా వచ్చే సాధనాల్లో పెట్టుబడి పెడితే లక్ష్యం ఆలస్యమవుతుంది. ఉదాహరణకు 20 ఏళ్లలో కోటి రూపాయల నిధిని సృష్టించాలన్నది మీ లక్ష్యం. మరి దీన్ని చేరుకోవాలంటే నెలకు ఎంత పెట్టుబడి పెట్టాలి.... వార్షికంగా 5 శాతం రాబడినిచ్చే సాధనాల్లో అయితే నెలకు 24,328 రూపాయలు పెట్టుబడి పెట్టాలి. బ్యాంకు డిపాజిట్లలో అయితే 7 శాతం రాబడి వస్తుందనుకుంటే నెల నెలా 19,196 రూపాయలు ఇన్వెస్ట్ చేయాలి. 10 శాతం రాబడినిచ్చే వాటిలో అయితే ప్రతీ నెలా 13,168 రూపాయలు కావాలి. 15 శాతం రాబడినిచ్చే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో అయితే నెలకు కేవలం 6,679 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే చాలు. ఈక్విటీ ఫండ్స్ లో నెలకు 5వేల రూపాయలు ఇన్వెస్ట్ చేసినా కోటి రూపాయల లక్ష్యం 20 నుంచి 25 ఏళ్లలోపే నెరవేరుతుంది. 5 శాతానికి 15 శాతానికి మధ్య ఇన్వెస్ట్ మెంట్ లో ఎంత తేడా ఉందో చూశారుగా.

6,300 రూపాయల పెట్టబడితో రూ.11 లక్షలు

మ్యూచువల్ ఫండ్స్ లో రాబడులు సగటున చూస్తే గరిష్టంగా 25 శాతానికి మించి లేవు. ఇలా కాకుండా కంపెనీలు వాటి వ్యాపారం, వృద్ధి అవకాశాలను విశ్లేషించగల సామర్థ్యమే మీకుంటే నేరుగా మల్టీ బ్యాగర్ వంటి స్టాక్స్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా స్వల్ప కాలంలోనే కుబేరులు కావచ్చు. ఉదాహరణకు బజాజ్ ఫైనాన్స్ షేరు ధర 2008 డిసెంబర్ 31న 63 రూపాయలు. అది 2016 సెప్టెంబర్ లో సుమారు 1,100 రూపాయలుగా ఉంది. కానీ 63 రూపాయలు ఉన్నప్పుడు అది 10 రూపాయల ముఖ విలువ కలిగినది. దాన్ని ఇటీవలే కంపెనీ 2 ముఖ విలువ కలిగిన ఐదు షేర్లుగా మార్చడంతోపాటు ప్రతీ షేరుకు మరో షేరును బోనస్ గా ఇచ్చింది. అంటే వీటన్నింటినీ కలిపి చూస్తే ఒక షేరు రూ.11 వేల రూపాయలుగా ఉన్నట్టు. దీని ప్రకారం 2008 డిసెంబర్ లో బజాజ్ ఫైనాన్స్ 100 షేర్లను 6,300 రూపాయలు పెట్టి కొనుంటే ప్రస్తుతం 11 లక్షల రూపాయలు మీ దగ్గర ఉండేవి. అన్ని స్టాక్స్ లో ఈ స్థాయి రాబడులు అసాధ్యం. మరి ఏది మల్టీ బ్యాగర్ (ఎన్నో రెట్లు) అవుతుందనేది అధ్యయనం ద్వారానే సాధ్యం. 

రియల్టీ సైతం...

భాగ్యనగరంలోని కూకట్ పల్లి ప్రాంతంలో 15 ఏళ్ల క్రితం గజం 10 వేల రూపాయలు కూడా లేదు. కానీ ఇప్పుడు 50 వేల రూపాయల కంటే తక్కువ లేదు.

15 ఏళ్లలో కోటి రూపాయలు కావాలంటే

6 శాతం రాబడినిచ్చే ఎండోమెంట్ బీమా పాలసీలలో అయితే నెలకు రూ.34,386; 8.5 శాతం రాబడినిచ్చే పీపీఎఫ్, ఈపీఎఫ్ వంటి వాటిలో నెలకు రూ.27,641; 9 శాతం రాబడి రాగల డెట్ ఫండ్స్ లో రూ.26,427, యూనిట్ లింక్డ్ పాలసీలు, బ్యాలన్స్ మ్యూచువల్ ఫండ్స్ లలో నెలకు రూ.24,127; 12 శాతం రాబడి వచ్చే ఈక్విటీ ఫండ్స్ లో అయితే రూ.20,017; 15 శాతం రాబడినిచ్చే ఈక్విటీ ఫండ్స్ లో అయితే రూ.14,959 పెట్టుబడి పెడితే 15 ఏళ్లలో కోటి రూపాయలు సమకూరతాయి. అయితే, పీపీఎఫ్ సాధనంలో వార్షికంగా 1.5 లక్షల రూపాయలకు మించి పెట్టుబడి పెట్టడానికి అవకాశం లేదని గమనించాలి. కేవలం ఉదాహరణగా పేర్కొనాల్సి వచ్చింది.

represenattion image

10 ఏళ్లలో కోటి రూపాయలకు

9 శాతం రాబడి వచ్చే వాటిలో ప్రతీ నెలా రూ.51,291; 10 శాతం రాబడినిచ్చేవి అయితే రూ.48,414; 11 శాతం రాబడి వచ్చేవి అయితే రూ.45,665; 12 శాతం రాబడినిచ్చేవాటిలో రూ.43,041; 15 శాతం రాబడి నిచ్చేవాటిలో రూ.35,886; 18 శాతం రాబడి వచ్చేవి అయితే రూ.29,739 రూపాయలను ప్రతి నెలా 10 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.

కొన్ని టిప్స్

పెట్టుబడి పెట్టడమే కాదు. కొన్ని టిప్స్ ను కూడా ఫాలో అయితే సంపద తొందరగా వృద్ధి చెందుతుంది. కంపెనీలు, ఉద్యోగాలు మారినప్పుడు ఈపీఎఫ్ నిధిని వెనక్కి తీసుకోవద్దు. దాన్ని కొత్త సంస్థకు బదిలీ చేసుకోవాలి. ఈక్విటీ ఫండ్స్ లో సిప్ విధానంలో పెట్టుబడి పెట్టేందుకు వాటికి స్టాండింగ్ ఇన్ స్ట్రక్షన్ ఇవ్వాలి. ప్రతీ నెలా 1వ తేదీ కటాఫ్ గా పెట్టుకుంటే వేతనం వచ్చిన వెంటనే ఇన్వెస్ట్ మెంట్ కు వెళ్లిపోతుంది. ఏటా వేతనం పెరిగినప్పుడు అందులో సగం శాతాన్ని కూడా ఇన్వెస్ట్ మెంట్ కు మళ్లించండి. అలాగే, బోనస్ వచ్చినప్పుడు సైతం అందులో సగాన్ని పెట్టుబడికి మళ్లించాలి. 

ఏ అవసరాలు ఉన్నా కూడా అప్పటికే ఉన్న సేవింగ్స్ ను కదిలించవద్దు. కావాలంటే వాటిపై ఓడీ (ఓవర్ డ్రాఫ్ట్) ని తీసుకోవాలి. అంటే రుణం అన్నమాట. దీనిపై వడ్డీ తక్కువగా ఉంటుంది. అప్పు ఉందన్న స్పృహతో నెలనెలా తప్పకుండా రుణ వాయిదా చెల్లిస్తుంటారు. అంటే ఆ మేరకు వేతనంలో అదనంగా పొదుపు చేసినట్టే. పైగా సేవింగ్స్ కూడా తరగవు. ప్రతీ ఆరు నెలలు, ఏడాదికోసారి పెట్టిన పెట్టుబడులపై రాబడులు ఏ స్థాయిలో ఉన్నాయో సమీక్షించుకోవాలి. తక్కువ అనిపిస్తే మరో మంచి సాధనంలోకి నిధులను మళ్లించాలి. 

represenattion image

స్వల్ప కాలంలో భారీగా కూడబెట్టాలంటే

సంప్రదాయ సాధనాలలో రిటర్నులు ఇలానే ఉంటాయి. క్రమానుగత పెట్టుబడి అనేది క్రమానుగతంగా వృద్ధి చెందుతుంది. అంటే ఓ నిర్ణీత కాలానికి ఇంత మొత్తం నిధి సమకూరుతుంది. అంతేకానీ, అతి స్వల్ప కాలంలో కోట్లు సంపాదించాలంటే అది దాదాపుగా క్రమానుగత పెట్టుబడుల వల్ల సాధ్యం కానే కాదు. ఒకేసారి పెద్ద మొత్తంగా పెట్టుబడి పెట్టాలి. అది సరైన ఎంపిక అవ్వాలి. అప్పుడే అనుకున్న ఆశయం సఫలం అవుతుంది. 

ఐదేళ్లలో కోటి ఎలా?

ఐదేళ్లలోనే కోటి రూపాయలు సంపాదించాలని కొందరు ఆశ పడతారు. అంటే ఏడాదికి రూ.20 లక్షలు. నెలకు రూ.1.67 లక్షలు. ఇది సాధ్యమేనా...? ఆలోచించండి. నిజానికి ఇలాంటి లక్ష్యాల చేధనకు వ్యాపారాలే అనువైన సాధనాలు. ఉదాహరణకు మీ దగ్గర ప్రత్యేక టేలంట్ ఉంటే ఒక స్టార్ట ప్ పెట్టేయండి. ఉత్పత్తి కావచ్చు, సేవ కావచ్చు. ఓ యాప్ తయారు చేయండి. దాన్ని పాప్యులర్ చేసి ఐదేళ్ల తర్వాత మరో కంపెనీకి విక్రయించడం ద్వారా కోటి రూపాయలు మాత్రమే కాదు, అంతకు పది రెట్లు అధికంగా సంపాదించడం సాధ్యం అవుతుంది. లేదా ఓ ఉత్పత్తిని తయారు చేయండి. ఒక్కోటీ వెయ్యి రూపాయల చొప్పున పది వేల మందికి విక్రయించేయండి. ఐదేళ్లు ఎందుకు ఏడాదిలోనే రూ.కోటి సంపాదించుకోవచ్చు. 

represenattion image

మరో ఉదాహరణ ప్రకారం (కేవలం అవగాహన కొరకు మాత్రమే) ... మీకు వెబ్ డిజైనింగ్ నైపుణ్యం ఉందనుకోండి. అప్పుడు రంగంలోకి దిగి చిన్న చిన్న వ్యాపార సంస్థలను సంప్రదించడం ద్వారా వారికి రూ.15వేలకే వెబ్ సైట్ తయారు చేస్తామని కన్విన్స్ చేయవచ్చు. వంద మందిని కలిస్తే 10 మంది ఓకే అనే అవకాశం ఉంటుంది. రూ.15వేలు వారికి భారం కాబోదు. రోజుకు పది మందిని సంప్రదించడం ద్వారా కనీసం ఒక్కరిని ఒప్పించి, నెలలో 30 సైట్లను చేయడం ద్వారా, ప్రతీ సైట్ పై రూ.10వేలు మార్జిన్ చూసుకున్నా... రూ.3 లక్షలు లాభం. ఇది మొదటి మూడు నెలలు మాత్రమే. అప్పటికే మీకు చాలా మంది క్లయింట్లు ఉండి ఉంటారు. వారి సాయంతో మరిన్ని ఆర్డర్లు స్వీకరించి సిబ్బందిని పెంచుకుని మరింత నాణ్యతతో ఒక్కో సైట్ రూ.25వేల చొప్పున మార్కెట్ చేసుకోవడం ద్వారా ఏడాదిలోనే కోటీశ్వరుడు కావచ్చు. 

మరో మార్గంలో స్టాక్ మార్కెట్ లోనూ స్వల్ప కాలంలో కుబేరులు కావచ్చు. కానీ ఇది స్టాక్ పండితులకే సాధ్యం. ఉదాహరణకు పైన చెప్పుకున్నట్టు బజాజ్ ఫైనాన్స్ స్టాక్ లో కేవలం రూ.63వేల రూపాయలను 2008లో ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడవి రూ.1.1 కోట్లు అయ్యేవి. కానీ మన దగ్గర రిటైల్ ఇన్వెస్టర్లలో స్టాక్ మార్కెట్ లో ఎలా పెట్టుబడి పెట్టాలో తెలిసిన వారు కేవలం ఒక శాతం మందే. అందుకే టేలంట్ ఉంటే వ్యాపారం ప్రారంభించండి. అది స్వయం ఉపాధి కావచ్చు. ఏదైనా గానీ, సంపాదించిన దాన్ని పెట్టుబడులకు మళ్లించండి. సాధ్యమైనంత సంపాదించాలి. సాధ్యమైనంత గరిష్ఠ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడు ధనలక్ష్మి అనుగ్రహించడం ఖాయం.   


More Articles