మీ సంపాదనలో ఎదుగుదల లేదా?

కొన్ని తప్పులు, కొంత ఆలోచనా లేమి, ఆసక్తి లేకపోవడం ఎన్నో కారణాలు... ఎన్నెన్నో అంశాలు సంపాదన పెరగకపోవడానికి కారణాలు కావచ్చు. కాలం కదులుతుంటుంది. కరెన్సీ విలువ తగ్గుతుంటుంది. కానీ సంపాదన పెరగకపోతే పెనంపై పడిన గుడ్డు మాదిరిగానే ఉంటుంది సామాన్యుల, మధ్య తరగతి ప్రజల పరిస్థితి. అందుకే సంపాదన పెరగాలి. పెరగడం లేదంటే కారణాలపై దృష్టి పెట్టాలి.

representation imageఖర్చులు కాదు... సంపాదన పెంచుకోవాలి

రెండు రకాల వారు ఉంటారు. ఒకరేమో సంపాదన పెంచుకోవడం ఎలా? అని ఆలోచించే వారు అయితే, ఎప్పటికప్పుడు ఖర్చులు తగ్గించుకుని సర్దుబాటు చేసుకోవడం రెండో రకం వారు చేస్తుంటారు. ఎవరి విధానం సరైనది...? ఖర్చులు అన్నవి పూర్తిగా మన చేతుల్లో ఉండవు. కడుపులోకి మూడు పూటలా ముద్దలు వెళ్లాలి. వేళకు కాఫీ, టీ పడాలి. అందుకోసం పాలు, టీపొడి, కాఫీ పొడి కావాలి. ఇంట్లో కాలక్షేపం కోసం టీవీ చూడాలి. దానికి డిష్ ఉండాలి. సొంతిల్లు ఉంటే పర్వాలేదు. అద్దె ఇల్లు అయితే వేలల్లో అద్దె కట్టాలి. ఇవన్నీ నియంత్రించుకునేవి కావు. పెట్రోల్ ఈ రోజు 65 రూపాయలు ఉంటే ఏడాది తర్వాత 100కు వెళ్లొచ్చు. పెరగకుండా దాన్ని ఆపలేం కదా. అదే సంపాదన అయితే, కూటి కోసం కోటి విద్యలు అన్నట్టుగా ఎన్నో రకాల పనులతో ఆదాయాన్ని పెంచుకోవచ్చు. దానికి తోడు పెట్టే పెట్టుబడులు మంచి రాబడులను ఇచ్చేవై ఉండాలి. 

అసలు విషయాన్ని గ్రహించాలి

ప్రస్తుతం నెలకు రూ.20వేల వేతనం వస్తోంది. ప్రైవేటు కంపెనీల్లో ఏడాదికోసారి ఉద్యోగులకు వేతనాలు పెంచే సంప్రదాయం ఉంది. ఏటా వేతనం కచ్చితంగా పెరిగితేనే పెరిగే ఖర్చులను తట్టుకోగలరు. వేతనం పెరగలేదంటే కారణాన్ని అన్వేషించాలి. దురదృష్టం అంటూ కూర్చుంటే ఫలితం ఉండదు. కంపెనీ కష్టాల్లో ఉండి పెంచలేదంటే అది వేరే విషయం. అలా కాకుండా మిగిలిన వారికి వేతనాలు పెరిగి మీకు పెరగలేదంటే...? లేదా మిగిలిన వారికి పెరిగిన స్థాయిలో మీకు పెరగలేదంటే కారణాలు ఏమై ఉంటాయని ఆలోచించారా...? కుళ్లు రాజకీయాలంటూ నెపం వేరొకరిపై వేసి కూర్చుంటే జీతం పెరగదు. కార్యాలయంలో మీ పనితీరు గొప్పగా ఉందా? అన్నది సమీక్షించుకోవాలి. పనిలో నైపుణ్యం పెరగాలి. బాస్ ప్రశంసలు పొందేలా పనితీరు మార్చుకోవాలి. వేళకు కార్యాలయానికి వెళ్లాలి. మీ వంతు సంస్థకు ప్రతిఫలం అందించే స్థాయిలో పనిచేయాలి. ఇన్నీ చేసి వేతనాన్ని పెంచుకోలేకపోతే అదే సంస్థలో ఉద్యోగం చేయడం కంటే మీ ప్రతిభకు తగ్గ పారితోషికం ఇచ్చే మరో సంస్థలో ఉద్యోగం కోసం అన్వేషణకు బయల్దేరడం బెటర్. 

ఆశించొద్దు... ఇష్టంతో  చేస్తే అదే వస్తుంది

ప్రతిఫలాన్ని ఆశించి పని చేసే విధానం ఎదుగుదలకు అడ్డు. ఉదాహరణకు అదో పెద్ద రెస్టారెంట్. సోను, జాను ఇద్దరు యవకులైన వెయిటర్లు. సోను పనల్లా టిప్ కోసం కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేయడమే. అత్యుత్సాహంలో కస్టమర్లు ఏం చెబుతున్నదీ శ్రద్ధగా వినేవాడు కాదు. దాంతో వచ్చిన నలుగురిలో ఒకరు మాత్రమే టిప్ ఇచ్చేవారు. కానీ, జాను టిప్ కోసం పనిచేసేవాడు కాదు. ఇష్టంతో ఉద్యోగం చేసేవాడు. కస్టమర్లను గౌరవిస్తూ... వారు చెప్పే ఐటమ్స్ ను వేగంగా అందించేవాడు. చక్కగా సర్వ్ చేసేవాడు. అతడి పనితీరు చూసి కస్టమర్లకు సైతం ముచ్చటేసేది. దాంతో చేయి చాచకపోయినా చేతిలో టిప్ పెట్టి వెళ్లేవారు.

ఏ పనైనా ఇష్టంతో చేయడం వల్ల వచ్చే ఫలితాలు ఇలానే ఉంటాయి. మీ దగ్గర అపార నైపుణ్యాలు, తెలివితేటలు ఉన్నప్పటికీ... మూస ధోరణిలో వెళ్లడం అలవాటుగా మార్చుకోవడం వల్ల అదే మీ ఎదుగుదలకు అడ్డుగా మారిందేమో ఒక్కసారి ఆలోచించుకోండి. అదే అయితే, మార్పును ఈ రోజే మొదలు పెట్టాలి. అసలు ఉద్యోగం చేసే చోట వేతనం పెరిగే పరిస్థితులు లేనప్పుడు ఎక్కువ వేతనం వచ్చే అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. అది సాధ్యం కాకపోతే మీలో ఉన్న నైపుణ్యాలను పెంచుకోవాలి. కళ్ల ముందున్న అపార అవకాశాల్లో మంచిదాన్ని వెతికి పట్టుకోవాలి. 

కొంత ధనం... కొంత సమయం

డబ్బులు రాల్చే నైపుణ్యాలు కావాలి. అందుకోసం మెరుగులు దిద్దుకోవాలి. అలా చేయాలంటే మనపై మనమే కొంత పెట్టుబడి పెట్టుకోవాలి. కొంత వీలు చేసుకుని శిక్షణ తీసుకోవాలి. ఉచిత శిక్షణ లభిస్తుందేమో అన్న ఆలోచనతో కాలయాపన పనికిరాదు. ఏటా కొద్ది మొత్తాన్ని శిక్షణ కోసం పక్కన పెట్టుకోండి. అధ్యయనం ద్వారా నైపుణ్యం పెంచుకోగలిగే అవకాశం ఉంటే రోజూ కొంత సమయం కేటాయించుకోండి. 

మార్గదర్శనం

చిన్నప్పుడు అమ్మా, నాన్న చేయి పట్టుకుని బుడి బుడి అడుగులు వేయించినట్టుగా... కొంత మందికి ఏ పని చేయాలన్నా ఎవరో ఒకరు ముందుండి నడిపించాలి. మార్గదర్శనం లేక కొంత మంది శూన్యంగా ఉండిపోతారు. తప్పులేదు. ఒక మంచి మార్గదర్శకుడిని వెతుక్కోండి. అనుభవం, నిపుణులు అయిన వారిని కలవండి. మీకు నైపుణ్యాలు ఉన్న రంగంలోనే మంచి మెరుగైన అవకాశాల కోసం చూస్తే ఆ రంగంలోనే లబ్ద ప్రతిష్టుల మార్గదర్శనం తీసుకోండి. వారు మీకు దారి చూపుతారు. మరింత ఆదాయం ఎలా తెచ్చుకోవాలన్నది సూచిస్తారు. సలహాలు కూడా ఇస్తారు. 

సమయం సద్వినియోగం

సమయాన్ని ఎంతలా సద్వినియోగం చేసుకుంటున్నారు? అన్నది సంపాదనలో కీలకం. అసలు ఏ పనికి ఎంత సమయం కేటాయిస్తున్నారో ఓ పేపర్ పై రాయండి. అప్పుడు మీకు స్పష్టత వస్తుంది. సంపాదన పెంచుకోలేని వారిలో అధికం సమయాన్ని సద్వినియోగం చేసుకోలేనివారే. రూపాయి రాబడి కూడా ఇవ్వని పనుల కోసం, తక్కువ రాబడినిచ్చే పనుల కోసం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తుంటారు. కానీ, ఇది మారాలి. అంటే అధిక ఆదాయం వచ్చే పనులకే ఎక్కువ సమయం కేటాయించడం ద్వారా అధిక సంపాదనకు బాటలు వేసుకోవాలి. వ్యాపారం అయితే విక్రయాలు పెంచుకునేందుకు మార్కెట్ వ్యూహాలపై సమయం కేటాయించాలి. స్వయం ఉపాధి అయితే, ఎక్కువ మందితో పరిచయాలు పెంచుకోవడం ద్వారా మరింత మందికి మీ సేవలను చేర్చి ఆదాయాన్ని పెంచుకోవాలి. ఉద్యోగం అయితే, పనిని సులభంగా వేగంగా చేయడం ద్వారా మీకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకోవాలి. ఇదే తర్వాత మిమ్మల్ని ఉన్నత స్థానానికి తీసుకెళుతుంది. ఆదాయాన్ని పెంచుతుంది.

మాట్లాడండి... మాట్లాడండి

కమ్యూనికేషన్ అన్నది ఎన్నో కొత్త మార్గాలు చూపిస్తుంది. అందుకే ఇతరుల అనుభవాలను తెలుసుకోవాలి. ఆచరణలోకి తీసుకోవాలి. వృత్తి పరంగా, ఉద్యోగ పరంగా, వ్యక్తిగతంగానూ గొప్పగా ఉండేందుకు కృషి చేయాలి. మిమ్మల్ని కలుసుకున్న వారెవరైనా తిరిగి వెళ్లే సమయంలో 'ఎంత బాగా మాట్లాడారు.. వావ్' అనుకోవాలి. అది కూడా మీకు పాకెట్ ప్లస్సే!


More Articles