ప్రపంచాన్ని మార్చే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్

ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనే మాట ఇటీవలి కాలంలో తరచుగా వినిపిస్తోంది. నెట్ అందుబాటు పెరుగుతున్న కొద్దీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మరింత మందిని చేరుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే దీని పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఇంతకీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే స్పష్టంగా ఏంటో చూద్దాం.

ఇంటర్నెట్ కు అనుసంధానమై పనిచేసే పరికరాలు, సెన్సార్లను ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ గా పేర్కొంటారు. ఇంటర్నెట్ తో అనుసంధానించి పరికరాలను పనిచేయించడం. ఆన్, ఆఫ్ చేయడం. ఇంటికి మరో ఐదు నిమిషాల్లో చేరుకుంటామనగా స్మార్ట్ ఫోన్ నుంచే ఇంట్లో ఉన్న ఏసీని ఆన్ చేయడం ఎలా సాధ్యమో ఆలోచించండి. స్మార్ట్ ఫోన్, ఏసీ రెండూ ఇంటర్నెట్ తో అనుసంధానమై ఉండడం వల్లే.

సెల్ ఫోన్లు, లైట్లు, వాషింగ్ మెషిన్లు, ఫ్రిడ్జ్ ఇలా ఒక్కటేమిటి చివరికి మొబైల్ లోని ప్రతీ యాప్ వాట్సాప్ సహా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కిందకే వస్తాయి.

ఇంటర్నెట్ సాయంతో సాగరంలో ఉన్న చమురు వెలికితీత రిగ్స్ ను ఆన్ చేయగలిగితే...? అసలు డ్రైవర్ లేకుండానే కారు నడిపించలేమా...? ఇలా ఎన్నో అంశాలపై నేడు ప్రపంచ వ్యాప్తంగా విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. గూగుల్ డ్రైవర్ రహిత కారు కోసం కొన్నేళ్లుగా పరిశోధనలు నిర్వహించి చివరికి అనుకున్నది సాధించింది. కారును రూపొందించి ఏడాదిగా పరీక్షలు కూడా నిర్వహిస్తోంది. ఇది కూడా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లో భాగమే.

representation image

మన విషయం ఏంటి...?

నిజానికి ఇంటర్నెట్ ఆధారితంగా పనిచేసే సాధనాల్లో మనుషులం కూడా చేరిపోయాం. ఎందుకంటే నేడు ఇంటర్నెట్ లేకుండా ఏ పనిచేయలేని వారి సంఖ్య పెరుగుతోంది. బస్సు టికెట్, రైలు టికెట్, విమాన టికెట్ ఏదైనా ఇంటర్నెట్ ఉండాల్సిందే. నగదు చెల్లింపు, స్వీకరణకు నెట్ ఉండాల్సిందే. స్నేహితులు, మనసైన వారు, తెలిసిన వారితో సంభాషణలకు యాప్స్ ఉండాల్సిందే. స్మార్ట్ టీవీ, స్మార్ట్ కారు, స్మార్ట్ ఏసీ ఇలా చెప్పుకుంటూ పోతే వాటిని వినియోగించుకున్న మనం కూడా ఇంటర్నెట్ కు అనుసంధానమైపోతున్నాం.

గార్ట్ నర్ అనే పరిశోధనా సంస్థ అంచనా ప్రకారం 2020 నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ కు అనుసంధానమై ఉండే పరికరాలు 26 బిలియన్లు. అంటే 2600 కోట్లు. ఈ సంఖ్య 100 బిలియన్లుగా కూడా ఉండవచ్చన్నది కొందరి అంచనా. మనం ఎలా జీవించగలం, ఎలా పనిచేయగలం అనేదానిని ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ నిర్ణయించగలదు. అందుకే దీనికి అంత ప్రాధాన్యం ఏర్పడింది. భారత్ నుంచి చాలా దూరంలో ఉన్న రష్యాలో ఓ పరికరాన్ని ఆపరేట్ చేయగలడం ఇంటర్నెట్ వల్లే సాధ్యం. ఈ దృష్ట్యా భవిష్యత్తు ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చివేయగలదు ఇది. ఇంటర్నెట్ మరింత మంది ప్రజలకు చేరువ అవుతుండడంతో మరిన్ని స్మార్ట్ పరికరాల ఆవిష్కరణకూ బీజాలు పడుతున్నాయి.

బ్రాడ్ బ్యాండ్ అందుబాటు పెరుగుతోంది. ధరలు కూడా దిగివస్తున్నాయి. ఎన్నో పరికరాలు వైఫై, సెన్సార్ కు అనుసంధానమయ్యేలా తయారవుతున్నాయి. టెక్నాలజీ వ్యయాలు కూడా తగ్గుతున్నాయి. స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరుగుతోంది. ఇవన్నీ కలిసే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ విప్లవానికి దోహదపడుతున్నాయి. ఇంటర్నెట్ కు అనుసంధానం కాగల ప్రతీ పరికరం అనుసంధానం అవుతుందన్నది భవిష్యత్తు ఊహ.

representation image

ఎందుకు? దీని అవసరం ఏంటి?

ఉదాహరణకు... బెంగళూరులో మీటింగ్ ఉండడంతో హైదరాబాద్ నుంచి కారులో బయల్దేరారు. అప్పుడు వెంటనే మీ స్మార్ట్ ఫోన్ ఆ రూట్లో ట్రాఫిక్ జామ్ ఉందని చెబితే ఎంత సౌకర్యంగా ఉంటుందో ఆలోచించండి. వేరే మార్గం ఉంటే దాని ద్వారా వెళ్లేందుకు వీలుంటుంది. ఒకవేళ ట్రాఫిక్ జామ్ లో చిక్కుకుంటే ఆలస్యంగా వస్తున్నారని సమావేశం నిర్వాహకులకు సందేశం వెళుతుంది. దాంతో మీరు వస్తున్నారని వారికి స్పష్టత ఉంటుంది. ఒకవేళ బెంగళూరు రూట్ మర్చిపోయారు. అప్పుడు దారి పొడవునా కారు ఆపుతూ అడుగుతూ వెళ్లడం ఇబ్బందే కదా. దానికి బదులు స్మార్ట్ ఫోన్ లో గూగుల్ స్ట్రీట్ వ్యూ మ్యాప్ ఆన్ చేస్తే అదే దారి చూపుతుంది. ఉన్నట్టుండి కారు మొరాయించి ఆగిపోయింది. స్మార్ట్ ఫోన్ తెరిచి క్యాబ్ కు ఓకే చెప్పడం ఆలస్యం, కారు కాళ్ల దగ్గరకు వచ్చి ఆగుతుంది.

అర్ధరాత్రి అవుతోంది. ఇంట్లో గాఢ నిద్రలో ఉన్నారు. ఇంటి తలుపులు, నలు దిక్కులా అమర్చిన సీసీ కెమెరాలు పరిసరాలను అణువణువూ పరిశీలిస్తున్నాయి. నిక్కర్ వేసుకుని తాళ్లు పట్టుకుని నలుగురు దోపిడీ దొంగలు ప్రహరీ దగ్గరకు వచ్చి లోపలికి ప్రవేశించేందుకు గమనిస్తున్నారు. సీసీ కెమెరాలు వారిని చూడడం ఆలస్యం, వాచ్ మన్ దగ్గర్నుంచి ఇంట్లో వారిని అలార్మ్ కొట్టి మరీ లేపింది. ఇంటి చుట్టూ లైట్లు వెలిగిపోయాయి. దొంగలు ఒక్కసారిగా జడుసుకుని పరారయ్యారు. ఇదంతా కేవలం ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఫలితమే కదా.

సవాళ్లు

సవాళ్లు... ప్రపంచ వ్యాప్తంగా వేల కోట్ల పరికరాలు ఇంటర్నెట్ తో అనుసంధామై ఉన్నప్పుడు ఎన్నో సవాళ్లు కూడా ఎదురవుతాయి. వాటిని ఎలా ఎదుర్కొంటామన్నదే పెద్ద సవాలు. ఒకవేళ ఏదైనా హ్యాకర్ తన అపార తెలివితేటలను ఉపయోగించి వేల కోట్ల పరికరాలను పనిచేయకుండా, తన స్వాధీనంలోకి తీసుకుంటే జరిగే పరిణామాలు ఏమిటి?, కీలకమైన, సున్నితమైన సమాచారం వారి చేతిలో పడితే పరిస్థితి ఏమిటి? వీటిపైనే పరిశోధకులు, నిపుణులు కూడా దృష్టి సారించారు. ఇప్పటికిప్పుడు అయితే ఐంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పరంగా అడ్డంకులు ఏమీ లేవు. అది దూసుకుపోతూనే ఉంది. కంప్యూటర్లు ఇంటర్నెట్ కు అనుసంధానమై దశాబ్దాలు దాటింది. మరి ఇన్నేళ్లల్లో ఎన్ని కంప్యూటర్లు హ్యాక్ అయ్యయి...? ఇది కొందరి ప్రశ్న. అందుకే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ విషయంలోనూ ఆందోళన అవసరం లేదంటున్నారు.

representation image

స్మార్ట్ లైఫ్

ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మనిషి జీవనాన్ని కొత్త పుంతలు తొక్కిస్తుంది. వేగవంతం చేస్తుంది. స్మార్ట్ గా మారుస్తుంది. సుఖాన్నిస్తుంది. ఎన్నో అవకాశాలను, ఉద్యోగావకాశాలను  సృష్టిస్తుంది. ఇది నాణేనికి ఒకవైపు. భద్రతా సవాళ్లు మరో వైపు. ప్రతి కూలతలు ఉన్నాయని, అడ్డంకులు ఉన్నాయని ఉన్నచోటే ఉండిపోవడం వెనుకబడిపోవడం కిందే లెక్క. అడ్డంకులను అధిగమించి మరింత స్మార్ట్ గా ప్రపంచాన్ని మార్చేందుకు శాస్త్రవేత్తలు కృషి చేస్తూనే ఉన్నారు. నిజానికి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఇప్పుడే వచ్చి పడింది కాదు. దశబ్దాలుగా ఇది చర్చల్లో ఉన్నదే. 1982 లోనే ఈ కాన్సెప్ట్ పై చర్చ జరిగింది. అప్పుడే ఇంటర్నెట్ కు అనుసంధానమైన కోక్ మెషిన్ ను ఆవిష్కరించారు. ఆ తర్వాత ఇంటర్నెట్ కు అనుసంధానమయ్యే టోస్టర్ ను 1989లో ఆవిష్కరించారు.    

బ్రిటన్ లో స్మార్ట్ విద్యుత్ మీటర్లు ఉన్నాయి. ఇంట్లో ఎవరూ లేకపోతే విద్యుత్ ను అవే ఆపేస్తాయి. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద సెన్సార్లు ఏర్పాటు చేసి... ట్రాఫిక్ కు అనుగుణంగా లైట్లు ఆటోమేటిక్ మారిపోయేలా చేయడం కూడా ఇలాంటి ఆవిష్కరణే. ఉదాహరణకు నాలుగు రోడ్ల కూడలిలో ట్రాఫిక్ లైట్లు ప్రతీ మార్గం వైపు 30 సెకన్ల పాటు గ్రీన్ సిగ్నల్ ఉంచి మారుతూ ఉందనుకోండి. ఒకవైపు ఎక్కువ ట్రాఫిక్ ఉండి, మరోవైపు తక్కువ ట్రాఫిక్ ఉంటే అప్పుడు ట్రాఫిక్ అధికంగా ఉన్న మార్గం వైపు గ్రీన్ సిగ్నల్ పడిపోతుంది. డస్ట్ బిన్ చెత్తతో నిండిపోయింది. వెంటనే ఆ సందేశం మున్సిపల్ విభాగానికి వెళుతుంది. వారొచ్చి ఆ బిన్ ఖాళీ చేస్తారు.

representation image

చేతికి స్మార్ట్ బ్యాండ్. వైఫైతో అనుసంధానమై... మీ హృదయ స్పందనలు, కేలరీల వినియోగాన్ని ఎప్పటికప్పుడు చెప్పేస్తోంది. భాను, భాగ్యవి ఉద్యోగాలకు వెళ్లిపోయారు. ఉన్నట్టుండి భాను సెల్ ఫోన్ కు సందేశం. ఇంట్లో ఉన్న తండ్రి హార్ట్ బీట్ పెరిగిపోయింది. వెంటనే భాను ఇంటికి వెళ్లి తండ్రిని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ముప్పు తప్పిపోయింది. ఇక మాత్ర పరిమాణంలో ఉన్న కెమెరాలను జీర్ణాశయంలోకి పంపడం ద్వారా లోపలున్న పరిస్థితులను స్పష్టంగా తెలుసుకునే విధానం ఇప్పటికే అమల్లో ఉంది.

ఎలక్ట్రానిక్ టోల్ గేట్లు... కారు ఆగక్కర్లేదు. కారు నంబర్ ఆధారంగా చార్జీలు ఆటోమేటిక్ గా వసూలు చేస్తారు. విశాఖపట్నంలో ప్రతీ వీధి కుక్కకు మైక్రోచిప్ ట్యాగ్ వేస్తున్నారు. దీంతో వాటిని పర్యవేక్షించడం సులభతరం అవుతుందని అక్కడి అధికారుల యోచన. దక్షిణ కొరియా దేశంలోని సాంగ్డోను స్మార్ట్ సిటీగా చేయాలని అక్కడి ప్రభుత్వం తలపెట్టింది. ఈ నగరంలో అన్ని పరికరాలను నెట్ తో అనుసంధానం చేస్తున్నారు. ఇది ముగింపు దశలో ఉంది.

representation image

మోదీ సర్కారు స్మార్ట్ సిటీస్

మోదీ సర్కారు స్మార్ట్ సిటీ ప్రాజెక్టు గురించి వినే ఉంటారు. దేశంలో 100 పట్టణాలను స్మార్ట్ సిటీలు చేయాలన్నది సర్కారు సంక్పలం. స్మార్ట్ సిటీ అంటే నాణ్యమైన జీవనం కల్పించాలన్నది. అదీ స్మార్ట్ పరికరాలు, పరిష్కారాలతో. చక్కని నీటి సరఫరా, నిరంతరాయ విద్యుత్, పారిశుద్ధ్య నిర్వహణ, వేస్ట్ వాటర్ నిర్వహణ, చక్కని రవాణా సదుపాయాలు, ఐటీ అనుసంధానత, నగరమంతా వైఫై సేవలు, ఈ పరిపాలన, ట్రాఫిక్ జామ్ లేని నగరం, వంటివన్నీ ఇందులో భాగం.  ట్రాఫిక్ జామ్స్ చోటు చేసుకోకుండా వాహనాల రాకపోకలు నిరంతరాయంగా సాగిపోయేలా టెక్నాలజీ సొల్యూషన్లను ఉపయోగిస్తారు. అందుకు సిగ్నల్ లైట్స్ ను, సెన్సార్లతో అనుసంధానిస్తారు. ప్రస్తుతం దేశంలో 31 శాతం జనాభా పట్టణాల్లోనే నివసిస్తున్నారు. దేశం మొత్తంలో 63 శాతం  ఆర్థిక కార్యకలాపాలు ఇక్కడి నుంచే జరుగుతున్నాయి. 2030 నాటికి సగం జనాభా పట్టణాల్లోనే ఉండబోతోంది. ఈ నేపథ్యంలో ప్రజల జీవనాన్ని మెరుగుపరచాల్సి ఉంటుంది. ఈ అవసరాలను గుర్తించే కేంద్ర సర్కారు స్మార్ట్ సిటీల ప్రాజెక్టును చేపట్టింది.


More Articles