మీరు తింటున్నవి నిజమైన కోడిగుడ్లేనా...? చెక్ చేసుకోండి...!
‘అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాద్ అన్నా సంభవహ’... అన్నం నుంచే సమస్త ప్రాణి కోటి ఉద్భవం అవుతుందని గీతలో భగవానుడు చెప్పాడు. ఆహారం మనిషికి ప్రాణాన్ని ఇస్తుంది. చైతన్యాన్ని ఇస్తుంది. కానీ ఒక్క మాటలో నేడు అదే ఆహారం విషతుల్యంగా మారి మనిషి ఆరోగ్యానికి ముప్పు తెస్తోంది. అందుకే మీ ప్లేట్ లో ఉన్నది ఆరోగ్యకరమైన ఆహారమా...? ఆరోగ్యాన్ని కుళ్లబొడిచే విషమా...? ఓ సారి పరిశీలించుకోండి.
నిద్ర లేచిన వెంటనే కడుపులోకి వేడివేడిగా దిగే కాఫీ, టీల దగ్గర్నుంచి రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు తీసుకునే పాల వరకు... కోడిగుడ్డు నుంచి బియ్యం వరకు... ఇలా ప్రతీ ఆహార పదార్థం కలుషితం... కల్తీ... విషతుల్యం. ఎందుకు ఆహార పదార్థాలు ఇలా కల్తీ, కలుషితం అవుతున్నాయో సమగ్రంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
నూడుల్స్ నుంచి సమోసా వరకు...
దేశంలో ఆహార భద్రత ప్రమాణాలు అత్యంత దారుణ స్థితిలో ఉన్నట్టు ఎన్నో అధ్యయనాలు గొంతు చించుకుంటున్నాయి. అయినా ఎవరికీ పట్టదు. మనం ఏమి తింటున్నాం... తీసుకునే ఆహారం ఎంత సురక్షితం అనే దాని గురించి ఎవరూ ఆలోచించరు. మ్యాగీ నూడుల్స్ లో లెడ్ (సీసం) యాసిడ్ ఉందంటూ గతేడాది వెలుగు చూసిన వార్త విని చాలా మంది నోరెళ్లబెట్టారు. మరీ ముఖ్యంగా నూడుల్స్ లో సీసం ఉంటుందన్న విషయం అప్పుడే ప్రజలకు తెలిసింది. నిజానికి నూడుల్స్ లో సీసం ఎప్పుడూ ఉంటుంది. నూడుల్స్ లోనే కాదు మరికొన్ని ఆహార పదార్థాల్లోనూ సీసం ఉంటుంది. ఆటా పిండిలో ఉంటుంది. సమోసాల్లోనూ ఉంటుంది.
మరి దీన్ని కలుపుతున్నారా...? లేకుంటే దానంతట అదే వచ్చి చేరుతోందా..? లెడ్ అనేది ఖరీదైనది. దీన్ని ఆహార పదార్థాల్లో కలపరు. నూడుల్స్ తయారీకి వినియోగించే పదార్థాల ద్వారానే ఇది వచ్చి చేరుతుంది. మంచి హోటల్లో ఆహారం తింటే ఆరోగ్యం పదిలంగా ఉంటుందనుకుంటాం. కానీ, అక్కడ ఉపయోగించిన ఆహార పదార్థాలు కల్తీ లేనివి, కలుషితం కానివి అయి ఉంటేనే ఆహారం భద్రమని తెలుసుకోవాలి.
కూల్ డ్రింక్స్ లో పురుగు మందులు
కూల్ డ్రింక్స్ లో, బాటిల్డ్ వాటర్ లో పురుగు మందుల అవశేషాలు ఉన్నాయని కొన్నేళ్ల క్రితం సంచలన విషయాలను సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్ అనే ప్రతిష్టాత్మక సంస్థ బయటపెట్టడంతో అందరూ ఉలిక్కిపడ్డారు. కూల్ డ్రింక్స్, బాటిల్డ్ వాటర్, కూరగాయల్లో ఈ పురుగు ముందులు ఎలా వచ్చి చేరుతున్నాయో అని ఎప్పుడైనా ఆలోచించారా...? నిజానికి మనదేశ వ్యవసాయ రంగంలో పురుగు మందులను విచ్చలవిడిగా వినియోగించడం పెరిగిపోయింది. వారికి ప్రత్యామ్నాయ విధానాలు తెలియకపోవడం ఇందుకు కారణం. సాగు కోసం రైతులు వినియోగిస్తున్న పురుగు మందుల్లో కేవలం 1 శాతమే పంటలకు నష్టం కలిగించే పురుగులను చంపడానికి వినియోగం అవుతోంది. మిగిలిన 99 శాతం నీరు, గాలి ద్వారా పర్యావరణంలో కలిసిపోయి తిరిగి మన ఆహారంలోకి వచ్చి చేరుతోంది.
స్ప్రే పెయింట్ మన శ్వాసనాళాల్లోకి
స్ప్రే పెయింట్ గురించి తెలిసే ఉంటుంది. వాహనాలు, బోర్డులపై దీన్ని ఉపయోగిస్తుంటారు. పెయింట్ ద్రావకాన్ని స్ప్రే చేయడం వల్ల అందులో కొంత వాహనానికి అంటుకుని, కొంత గాలిలో కలిసిపోతుంది. ఆ గాలిని పీల్చడం ద్వారా పెయింట్స్ లో ఉన్న హానికారక రసాయనాలు ఊపిరితిత్తులలోకి వచ్చి రక్తంలో కలసిపోయి విష ప్రభావం చూపడం మొదలుపెడతాయి.
కోడి గుడ్ల గురించి కళ్లు తిరిగే వాస్తవాలు
మనం తింటున్న కోడి గుడ్లు నిజంగా సహజసిద్ధంగా తయారైనవేనా అన్న సందేహం ఎప్పుడైనా వచ్చిందా...?. నిజానికి నేడు మార్కెట్లలో లభిస్తున్న గుడ్లు ఎక్కువ శాతం హాప్లాయిడ్ ఎగ్స్. అంటే రెండు కోళ్లు (ఆడ, మగ) జత కట్టడం వల్ల తయారయ్యేవి కావు. ఈస్ట్రోజెన్ హార్మోన్ తో గుడ్లు ఉత్పత్తయ్యేలా చేస్తున్నారు. సందేహం వస్తే వాటిని పొదిగించి చూడండి. లోపలి నుంచి పిల్లలు బయటకు రావు. వచ్చాయంటే అవి సహజసిద్ధమైన కోడిగుడ్లేనని అర్థం.
ఈస్ట్రోజన్ తో తయారైన ఎగ్స్ తింటే ఆరోగ్యపరంగా వచ్చే సమస్యలు కూడా ఉంటాయి. ముఖ్యంగా అమ్మాయిుల్లో యుక్త వయసు చాలా ముందుగానే రావడానికి ఇది కూడా ఒక కారణం. 10, 11 ఏళ్లకే వారు మెచ్యూర్ అవుతున్న ఘటనలను చూస్తున్నాం. గైనిక్ సమస్యలు పెరగడానికి కూడా ఇదొక కారణం. పురుషుల్లోనూ బ్రెస్ట్ పెరిగిపోతుంది. ఓ సర్వే ప్రకారం దేశంలో జరుగుతున్న బ్రెస్ట్ రిమూవింగ్ సర్జరీలలో అధిక శాతం పురుషులు చేయించుకుంటున్నవేనట. కారణం ఆహార పదార్థాల్లో గ్రోత్ హార్మోన్లను ఉపయోగించడమే.
గుడ్డు తింటే గ్రీన్ డయేరియా బారిన పడే ప్రమాదం ఉంది సుమా! ఎందుకంటే మీరు తింటున్న గుడ్డులో సాల్మోనెల్లా బ్యాక్టీరియా ఉండి ఉండవచ్చు. దేశంలో 5 నుంచి 7 శాతం గుడ్లు కలుషితానికి గురవుతున్నట్టు ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ 2012 నాటి అధ్యయనంలో వెల్లడైంది. బోనుల్లో పరిమితికి మించి కోళ్లను ఉంచడం, పేడ, వ్యర్థ పదార్థాలతో అవి అపరిశుభ్రంగా మారడం, ఖర్చు తగ్గించుకునేందుకు కోళ్ల కడుపు మాడ్చడం వంటి ఎన్నో కారణాలు ఈ పరిస్థితికి కారణంగా సంస్థ తెలిపింది.
పండ్లు... తింటే పుండ్లు
కృత్రిమంగా కాయలను మాగబెట్టి పళ్లుగా మారుస్తున్న వైనం మీడియాలో తరచూ వస్తుండడం తెలిసే ఉంటుంది. ప్రజారోగ్యాన్ని కుళ్లబొడిచే ఈ తరహా అనైతిక వ్యాపార విధానాలకు చెక్ పెట్టాలని, దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉమ్మడి తెలుగు రాష్ట్రాల హైకోర్టు సుమోటోగా కేసు విచారిస్తూ రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసిన విషయం కూడా తెలుసు.
ఏప్రిల్ లోనే మామిడి పండ్లు దర్శనమివ్వడం చూసుంటారు. క్యాల్షియం కార్బైడ్ రసాయనంతో కృత్రిమంగా వాటిని పండించి మార్కెట్ చేస్తుండడం ఇటీవల బాగా పెరిగిపోయింది. క్యాల్షియం కార్బైడ్ ను చిన్న పౌచ్ లలో ఉంచి వాటిని మామిడి కాయల మధ్యలో ఉంచుతారు. ఇది విడుదల చేసే అసెటిలేన్ గ్యాస్ మామిడి కాయలు పండేలా చేస్తుంది. వాటిని తినడం ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదకరం. కేన్సర్ కు దారితీసే ప్రమాదం ఉంది. అంతేకాదు, క్యాల్షియం కార్బైడ్ లో ఆర్సెనిక్, పాస్ఫరస్ ఉండడంతో చర్మ, మూత్రపిండాలు, లివర్, ఉదర సంబంధ సమస్యలకు కారణమవుతాయి.
యాపిల్స్ నిగనిగలాడుతూ కనిపిస్తుంటాయి. నిజంగా యాపిల్స్ అలా షైనీగా ఉండవు. అమెరికాలోని క్యాలిఫోర్నియా రాష్ట్రంలో పండిన యాపిల్స్ ఇక్కడకు దిగుమతి అయ్యి రోజుల తరబడి దుకాణాల్లో ఉండి వినియోగదారుడి చేతికి వచ్చే వరకు అవి పాడవకుండా ఎలా ఉంటున్నాయి. వాటిపై మైనం పొర వేయడం వల్ల, రసాయనాలను స్ప్రే చేయడం వల్ల. యాపిల్ ను కొంత సేపు ఫ్రిజ్ లో ఉంచి బయటకు తీసి చాకు తీసుకుని యాపిల్ పై భాగంలో గీరి చూడండి. మైనం పొర ఊడి వస్తుంది.
పుచ్చకాయ చూడ్డానికి భారీ సైజులో ఉండడంతో తినాలనే ముచ్చటతో కొని ఇంటికి తీసుకెళతాం. కోసిన తర్వాత ఎర్రగా ఉండేసరికి సూపర్ టేస్ట్ ఉంటుందని ఆశ పడతాం. కానీ తీరా ముక్క నోట్లో పెట్టుకుంటే చప్పగా ఉంటుంది. ఎందుకలా...? పుచ్చకాయ పెద్దగా పెరగడానికి రైతులు ఆక్సిటోసిన్ అనే ఇంజక్షన్లను బయటి నుంచి ఇవ్వడం చేస్తున్నారు. దీంతో సైజు, రంగు అలా కృత్రిమంగా ఏర్పడినవే. అందుకే నేడు మార్కెట్లో లభించే పుచ్చకాయల్లో ఎక్కువ శాతం రుచీ పచీ లేకుండా ఉంటున్నాయి.
* 99 శాతం యాపిల్ పండ్లలో, పీచెస్ లో కనీసం ఒక పురుగు మందు అవశేషమైనా ఉంటున్నట్టు పరీక్షల్లో వెల్లడైంది.
* స్ట్రా బెర్రీస్ లో 13 రకాల పురుగు ముందులు ఉంటున్నాయి.
* ద్రాక్ష పళ్లల్లో 15 రకాల పురుగు ముందులు ఉంటున్నాయట.
క్షీరం కాదు విషం
నేడు ప్యాకెట్ పాలు సురక్షితం అని చెప్పేందుకు లేదు. ఇప్పటి వరకు ఎన్నో అధ్యయనాలు పాలను సింథటిక్ మిల్క్ తో కల్తీ చేస్తున్నట్టు వెలుగులోకి తెచ్చాయి. యూరియా, కాస్టిక్ సోడా, తక్కువ రకం రిఫైన్డ్ ఆయిల్, సబ్బు ద్రావకాలను కలపడం ద్వారా కృత్రిమ పాలను తయారు చేస్తుంటారు. శుద్ధి చేసిన నూనెకు తొలుత సబ్బు ద్రావకాన్ని కలిపి, తర్వాత నీటిని చేర్చుతారు. తర్వాత యూరియా, సోడియం సల్ఫేట్ లేదా గ్లూకోజ్, మాల్టోజ్ ను కలుపుతారు. నూనెను పాలలో ఫ్యాట్ కంటెంట్ కోసం కలుపుతారు. కాస్టిక్ సోడాను అసిడిటీ న్యూట్రలైజ్ కోసం కలుపుతారు. దీంతో రవాణాలో పాలు చెడిపోకుండా ఉంటాయి. యూరియా/షుగర్ ను ఎస్ఎన్ఎఫ్ (సాలిడ్ నాట్ ఫ్యాట్) కోసం కలుపుతారు. దీంతో ఈ కృత్రిమ పాలు సాధారణ పాల వలే కనిపిస్తాయి. కానీ రుచి, పోషక విలువల పరంగా తేడా గుర్తించవచ్చు. ఈ కృత్రిమ పాలను లీటర్ 5 రూపాయలకే తయారు చేయవచ్చు. అందుకే వెయ్యి లీటర్ల అసలైన పాలల్లో కృత్రిమ పాలు 100 లీటర్ల పరిమాణం మేర కలిపినా కంపెనీలకు అంత మేర లాభం అదనంగా మిగిలినట్టే.
కానీ, యూరియా, కాస్టిక్ సోడా గుండెకు, లివర్, కిడ్నీలకు హానికరం. యూరియాను బయటకు పంపించేందుకు కిడ్నీలు మరింత శ్రమించాల్సి వస్తుంది. కాస్టిక్ సోడాలో ఉండే సోడియం గుండె జబ్బులు, రక్తపోటు సమస్యలతో బాధపడుతున్నవారికి స్లో పాయిజన్ తో సమానం. పైగా కాస్టిక్ సోడా అన్నది శరీరానికి లైసిన్, అమైనో యాసిడ్స్ అందకుండా అడ్డుకుంటుంది. ఎదిగే పిల్లలకు ఇవి ఎంతో అవసరం. ఈ నేపథ్యంలో ఎదిగే పిల్లలకు ఈ కృత్రిమ పాలను ఇవ్వడం హానికరం. మరీ ముఖ్యంగా గర్భవతులకు, లోపల పిండానికి, గుండె, మూత్రపిండాల వ్యాధులు ఉన్నవారికి మరింత హానికరం.
దేశంలో ప్రతి ముగ్గురిలో ఇద్దరు సబ్బు ద్రావకం, కాస్టిక్ సోడా, యూరియా, పెయింట్ కలిసిన పాలు తాగుతున్నట్టు సాక్షాత్తూ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి హర్ష్ వర్ధన్ ఈ ఏడాది బడ్జెట్ సమావేశాల్లో పార్లమెంటుకు తెలిపారు. దేశంలో విక్రయమవుతున్న పాలలో 68 శాతం ఎఫ్ఎస్ఎస్ఏఐ నిర్ణయించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉండడం లేదని అయన చెప్పారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) దేశంలో ఆహార ప్రమాణాలను పర్యవేక్షించే సంస్థ. 2014 నవంబర్ లో మహారాష్ట్రలోని థానేలో ఆహార భద్రతా అధికారులు పాల నమూనాలను సేకరించి పరీక్షించగా... ఐదు ప్రముఖ కంపెనీల పాలు కల్తీవేనని తేలింది. గుజరాత్ కోపరేటివ్ మిల్క్ (అమూల్) పాలు కూడా వీటిలో ఉన్నాయి.
అయితే, పాలలో కలిసిన యూరియా, కాస్టిక్ సోడా, స్టార్చ్/గ్లూకోజ్, షుగర్, బావినీరు, నైట్రేట్లను గుర్తించవచ్చు. సాధారణంగా పాలు నిల్వ ఉంచగా వాటి రంగు మారదు. కానీ, కృత్రిమ పాల రంగు మాత్రం లేత పసుపురంగులోకి మారుతుంది. సాధారణ పాలను కొన్ని తీసుకుని చేతిపై వేసి రుద్దండి. ఎలాంటి మార్పు ఉండదు. కానీ, కల్తీ పాలను తీసుకుని చేతిపై వేసి రుద్దినప్పుడు నురగ వస్తుంది. పాలను వేడి చేసినాగానీ సాధారణ పాల రంగు మారదు. కల్తీ పాలు మాత్రం లేత పసుపు రంగులోకి మారిపోతాయి. పాల చుక్కలు తీసుకుని పాలీష్డ్ ఫ్లోర్ పై వేయండి. తెల్లటి మరక పడిందంటే స్వచ్ఛమైనవేనని అర్థం. ఎలాంటి మరక పడలేదంటే కల్తీవని తెలుసుకోవాలి. సింథటిక్ పాలు కొంచెం చేదుగా ఉంటాయి.
బీటీపై సందేహాలు
బీటీ విత్తనాలపై ఆందోళల గురించి వినే ఉంటారు. జన్యుపరంగా మార్పు చేసిన విత్తనాలనే బీటీ విత్తనాలు అంటారు. బీటీ అంటే బేసిల్లస్ తురింజెనిసిస్ (బీటీ). ఈ బ్యాక్టీరియం క్రిస్టల్ ప్రొటీన్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఎన్నోకీటకాలకు ప్రాణాంతకం. ఈ బీటీని విత్తనాల్లోకి చొప్పించి మార్పు చేసిన విత్తనాలను బీటీ విత్తనాలు అంటారు.
రైతులు కీటకాలను చంపేందుకు వాడే పురుగు మందుల్లో 99 శాతం పర్యావరణంలో కలిసిపోతుందని చెప్పుకున్నాం. ఇటువంటి పరిస్థితిని నివారించేందుకు తీసుకొచ్చిందే బీటీ విత్తనాలు. అంటే కీటకాలు పంటను ఆశ్రయించి తినడం మొదలు పెడితే అందులో ఉన్న బేసిల్లస్ తురింజెనిసిస్ వాటిని చంపేస్తుంది. దీని ద్వారా పురుగు ముందుల దుర్వినియోగం ఉండదన్నది వీటిని సమర్థించే శాస్త్రవేత్తల వాదన.
కానీ, వ్యతిరేకించే వారి ఆందోళన ప్రకారం... ఆ పంటను తిన్న మనుషులు, జంతువుల ఆరోగ్యం పరిస్థితి ఏంటన్నది వారి ప్రశ్న. దీనిపై శాస్త్రీయంగా ఎన్నో ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది. అందుకే సుప్రీంకోర్టు బీటీ వంగ విత్తనాలను అనుమతించే విషయంలో మరో పదేళ్ల వరకు దేశంలో వీటి అవసరం లేదని స్పష్టం చేసింది.
విచ్చలవిడిగా పురుగు మందుల వినియోగం
అదే పనిగా పురుగు మందుల వాడకంతో పురుగుల్లోనూ వాటిని తట్టుకుని బతికే శక్తి సంతరించుకుంటుంది. దాంతో రైతు వాటి కోసం మరింత వ్యయం చేసి మరిన్ని రకాల పురుగు ముందులను వాడతాడు. దీనివల్ల పర్యావరణానికి, మానవ ఆరోగ్యానికి తీవ్ర హానికరం. దేశంలో వ్యవసాయ రంగంలో అనియంత్రిత పురుగు ముందులను భారీగా వాడడం ఆహార కలుషితానికి ముఖ్య కారణంగా సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్ సంస్థ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనివల్ల దీర్ఘకాలంలో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయంటున్నారు. ఎండోక్రైన్ గ్రంధిని దెబ్బతీస్తాయని, పుట్టుక లోపాలు, కేన్సర్ల ప్రమాదం పొంచి ఉందంటున్నారు. పొలాల్లో బొద్దింకల నివారణకు ఉపయోగించే బోరిక్ యాసిడ్ మనుషుల కిడ్నీలను దెబ్బతీస్తుంది. బోరిక్ యాసిడ్ నీటిలో కలుస్తుంది. మొక్కల్లోకి చేరుతుంది. తర్వాత మన శరీరాల్లోకి ప్రవేశిస్తుంది.
భారత్ లోనే ఉల్లంఘనలు ఎక్కువ...
ప్రపంచంలో ఆహార ప్రమాణాల ఉల్లంఘనలు భారత్ లో ఎక్కువని ఫుడ్ సెంట్రీ అనే సంస్థ చెబుతోంది. సముద్ర ఉత్పత్తులు, కూరగాయలు, పండ్లు, మసాలా దినుసులు, పాల ఉత్పత్తులు, మాంసం, ధాన్యాలు ఎక్కువగా కల్తీ, కలుషితానికి గురవుతున్నాయట. ప్యాకేజ్డ్ ఆహార ఉత్పత్తుల నాణ్యత నిజంగా మన దేశంలో ప్రశ్నార్థకమే. బయట లేబుల్ పై వివరాలు చక్కగానే ఉంటాయి. కానీ లోపలున్న పదార్థాల ప్రమాణాలు పేర్కొన్న మేరకు ఉండడం లేదని ఇప్పటికే పలు అధ్యయనాలు తేల్చాయి.
నిప్పులాంటి నిజాలివే...
దేశంలో ప్రతీ ఐదు నమూనాల్లో ఒక నమూనా ప్రమాణాలకు నిలబడడం లేదు. ఎఫ్ఎస్ఎస్ఏఐ 2014-15 సంవత్సరం వార్షిక నివేదిక ఈ విషయాన్ని తెలియజేస్తోంది. 49,290 ఆహార నమూనాలను దేశవ్యాప్తంగా ఈ సంస్థ సేకరించి ల్యాబ్ లో పరీక్షించగా... 8,469 నమూనాలు ఆహార భద్రత ప్రమాణాల ప్రకారం లేవు. అంటే 20 శాతం సురక్షితం కాదు. 2011-12లో ఇది 13 శాతంగానే ఉంది. అంతేకాదు, ఎఫ్ఎస్ఎస్ఏఐ జరిమానాలు విధించిన రాష్ట్రాల్లో 90 శాతం యూపీ, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, కేరళ, ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నాయి.
ఆహార కల్తీ, కలుషితం వల్ల గ్యాస్ట్రో ఇంటెస్టినల్, గైనలాజికల్, ఇమ్యునోలాజికల్ సమస్యలు ఎదురై అవయవాల వైఫల్యం, కేన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన 2015 నాటి నివేదికలో స్పష్టం చేసింది. భారత్ లో ఏటా 4 లక్షల మంది చిన్నారులు డయేరియో కారణంగా మరణిస్తున్నారని కూడా తెలిపింది.
నూడుల్స్ సంగతేంటి...?
మ్యాగీ నూడుల్స్ లో లెడ్ అనుమతించిన దాని కంటే అధిక పరిమాణంలో ఉందని ఎఫ్ఎస్ఎస్ఏఐ నిషేధం విధించడం, ఆ తర్వాత కోర్టు అనుమతితో తిరిగి మ్యాగీ మార్కెట్ ప్రవేశం చేయడం జరిగిపోయింది. నిజానికి ఇరు సంస్థల వాదోపవాదాలు ఎలా ఉన్నా... అసలు జరిగిందేమిటి, జరుగుతుందేమిటి, అసలు ప్రమాణాల మేరకు ఉన్నాయా...? వీటికి మన దేశంలో జవాబులు రావు. ఎందుకంటే అవినీతి వ్యవస్థలో తప్పు ఎవరు చేశారు, ఎవరు ప్రలోభానికి గురయ్యారు అన్న నిజానిజాలు బయటకు రావు. మ్యాగీలో హానికారక స్థాయిలో లెడ్ లేకుంటే ఎఫ్ఎస్ఎస్ఏఐ ఎందుకు నిషేధిస్తుంది...? ఆలోచించండి.
ఎడ్వర్డ్ ఫుడ్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ సెంటర్ (ఈఎఫ్ఆర్ఏసీ) అనేది ప్రముఖ ప్రైవేటు ల్యాబ్. కేంద్ర ప్రభుత్వం, అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ మండలి నుంచి ఈ ల్యాబ్ కు 12 గుర్తింపులు ఉన్నాయి. ఈ సంస్థ గతేడాది మ్యూగీ ఉదంతం బయటపడిన తర్వాత 800 మ్యాగీ నూడుల్స్ శాంపిల్స్ ను నెల రోజుల వ్యవధి లో పరీక్షించగా హానికారక కెమికల్స్ ఆమోదించలేని స్థాయిలో ఉన్నాయని తేలింది. ఈ సంస్థ సీఈవో బల్వీందర్ బజ్వా మాట్లాడుతూ... ‘నా మెషిన్లు 21 సీఎఫ్ఆర్ పార్ట్ 11 ప్రమాణాల ప్రకారం ఉన్నాయి. నేను మ్యాగీని సర్టిఫై చేయను. నా ఫలితాలనే సర్టిఫై చేస్తాను’ అంటూ మ్యాగీ ఫలితాలకు కట్టుబడి ఉందీ సంస్థ. మరి జరిగిందేమిటి... మ్యాగీపై ఆరోపణలు పటాపంచలైపోయాయి. చక్కగా మళ్లీ మార్కెట్ చేసుకుంటోంది. అయితే, దేశంలో ఆహార పరీక్షల విధానం కూడా సరిగా లేదని కొందరు అంటున్నారు. ఏదన్నా, ఏం జరిగినా మన దగ్గరే సాధ్యమన్నట్టుగా పరిస్థితులు ఉన్నాయి.
కూల్ డ్రింక్స్ సంగతేంటి?
తాగే నీటిలో, శీతల పానీయాల్లో పురుగుమందుల అవశేషాలు ఉన్నాయంటూ వార్తలు వచ్చింది మన దేశంలోనే. వార్తలు కాదు సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్ వంటి అత్యున్నత సంస్థల పరీక్షల్లో వెల్లడైన నిజాలు. అలాగే నూడుల్స్ విషయంలోనూ ప్రాణాంతక లెడ్ అధికంగా ఉందని పరీక్షలు నిర్వహించి మరీ తేల్చింది కూడా అత్యున్నత సంస్థ అయిన ఎఫ్ఎస్ఎస్ఏఐ. అధిక పురుగు మందుల వినియోగం కారణంగా భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయి. కానీ, లీటర్ నీటిని 25 రూపాయలకు విక్రయిస్తూ, శీతల పానీయాల పేరుతో వేలాది కోట్ల రూపాయలను పోగేసుకుంటున్న బహుళజాతి సంస్థలు ఆ అవశేషాలను తొలగించాల్సిన బాధత్యను విస్మరించడం, అయినా వాటిని మార్కెట్ చేసుకునేందుకు అనుమతించడం మనలాంటి దేశాల్లోనే సాధ్యమేమో. నెస్లే కూడా సాధారణ కంపెనీ కాదు. స్విడ్జర్లాండ్ దేశానికి చెందిన బహుళజాతి కంపెనీ. దేశంలో వేల కోట్ల రూపాయల ఆహార ఉత్పత్తులను తయారు చేస్తూ మార్కెట్ చేసుకుంటున్న సంస్థపై కచ్చితంగా ప్రమాణాలను పాటించాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ వాస్తవంలో జరుగుతున్నది ఏంటో ప్రతి ఒక్కరికీ తెలుసు.
బ్రెడ్ సైతం...
బ్రెడ్ లోనూ లెడ్ ఉంటుందని నూడుల్స్ ఉదంతం అనంతరం చాలా మందికి తెలిసింది. చపాతీ కూడా సురక్షితమేమీ కాదండోయ్. గోధుమలు, ఓట్స్, మొక్కజొన్న, బార్లీలో ఫంగస్ ఉంటున్నట్టు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్ లక్నో విభాగానికి చెందిన శాస్త్రవేత్త సాక్షి మిశ్రా వెలుగులోకి తెచ్చారు. తాను సేకరించి పరీక్షించిన నమూనాల్లో 30 శాతం వాటిలో ఫంగస్ ఉందని, వాటిలోనూ 7 శాతం నమూనాల్లో మరీ అధిక స్థాయుల్లో ఉందని ఆయన వెల్లడించారు. జర్నల్ ఆఫ్ సైన్స్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ లో ప్రచురితమైన కథనం ప్రకారం... ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పండే పంటల్లో అధిక స్థాయిలో ఫంగస్ ఉంటోందని, దీని వల్ల కామెర్లు, జీర్ణకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని తెలిపింది.
రంగులతోనూ ముప్పే
పసుపు పొడి మంచి రంగుతో చూడ్డానికి ముచ్చటగా ఉందా...? దీనికి మెటానిల్ ఎల్లో రంగు కలిసి ఉండవచ్చు. కారం రంగు కూడా నిగనిగలాడుతోందా...?, మసాలా దినుసులు కూడా కళకళలాడుతున్నాయా... రెడ్ లెడ్ ఆక్సైడ్ ను కలిపి ఉండవచ్చు. పచ్చళ్లు, స్వీట్లు సైతం మంచి రంగుతో నోరూరిస్తున్నాయా..? తస్మాత్ జాగ్రత్త. మెటానిల్ ఎల్లో కలిసిన ఆహార పదార్థాలను తీసుకుంటే దీర్ఘకాలంతో నాడీ, మస్తిష్క సమస్యలు ఎదురవుతాయి. ఇది కేన్సర్ కు కారణమవుతుంది. కారంలో కల్తీని గుర్తించేందుకు గ్లాస్ నీళ్లలో చెంచాడు కారం వేసి చూడండి. నీరు ఎర్ర రంగులోకి మారితే అందులో కల్తీ జరిగినట్టే.
ఆహార కల్తీ నిరోధక చట్టం 1954... ఎన్నో రకాల సింథటిక్ కలర్స్ ను నిషేధించింది. కానీ, వీటిని పర్యవేక్షించే వారు ఎవరు...? మన దేశంలో ఫుడ్ ఇన్ స్పెక్టర్లు చాలా తక్కువ ముంది ఉన్నారు. చట్టాలు సైతం కఠినంగా లేవు. దీంతో కల్తీరాయుళ్ల ఆటలు కొనసాగుతున్నాయి. అమెరికాతోపాటు మరెన్నో పాశ్చాత్య దేశాల్లో నిషేధించిన ఆహార రసాయనాలను మన దేశంలో అనుమతిస్తున్నారు. దుష్ప్రభావాల నేపథ్యంలో విదేశాల్లో నిషేధానికి గురైన ఎన్నో ఔషధాలు మన దగ్గర అధికారికంగానే మార్కెట్ అవుతున్నాయి.
నీరు కూడా
కేంద్ర ఆరోగ్య శాఖ 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విడుదల చేసిన వివరాల ప్రకారం.... నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 70 శాతం బాటిల్డ్ వాటర్ కల్తీయే. చండీగఢ్ లో ఇది 100 శాతం, కర్ణాటకలో 68 శాతం ఉంది. ఔషధ, రసాయన పరిశ్రమలు ప్రమాదకరమైన రసాయన వ్యర్థ జలాలను నిబంధనల మేరకు శుద్ధి చేయకుండా వాటిని కాలువల్లోకి, బావుల్లోకి విడిచిపెడుతున్నాయి. దీనివల్ల భూ గర్భ జలాలు విషతుల్యం అవుతున్నాయి. అయితే, వాటర్ ప్యూరిఫయర్ల ద్వారా వీటిని తొలగించుకోవచ్చు. కానీ, ఎంతో ఖరీదైన ఆహార ఉత్పత్తుల్లో కల్తీని ప్యూరిఫై చేసుకుని తినలేము కదా.
తేనె
దేశంలో విక్రయం అవుతున్న తేనెలో అధిక భాగం కల్తీయే. నీరు, షుగర్ కలుపుతున్నట్టు పరీక్షల్లో తేలింది. ఎఫ్ఎస్ఎస్ఏఐ వెల్లడించిన వివరాల మేరకు చాలా వరకు బ్రాండెడ్ తేనెలో ఎంతో కొంత యాంటీ బయోటిక్స్ పాళ్లు ఉంటున్నాయట. దీన్ని వాడడం వల్ల దీర్ఘకాలంలో రక్తానికి సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి. తేనెలో చిన్న వస్త్రాన్ని ముంచి దాన్ని అగ్గిపుల్లతో వెలిగించండి. అందులో నీరు కలిపి ఉంటే కాలదు.
ఐస్ క్రీమ్
మనం తినే ఐస్ క్రీమ్ అంత సురక్షితమని నమ్మడానికి లేదు. ఎందుకంటే చాలా శీతల వాతావరణంలో ఐస్ క్రీమ్ తయారవుతుంది. దీంతో వాటిలోని ఫ్యాట్ గట్టిగా మారుతుంది. అందుకని కొన్ని రకాల పదార్థాలు కలుపుతారు. అలాగే వాటిపై గమ్ కూడా వేయడం చూసే ఉంటారు. ఈ గమ్ ను జంతువుల అవయవాలను ఉడికించడం ద్వారా తయారు చేస్తుంటారు.
కాఫీ పొడుం సైతం కల్తీయే
నిజంగా కాఫీ గింజల పొడుమేనా... లేక కాఫీ రంగులో ఉన్న మట్టి, గంజి పొడుం కావచ్చేమో...? టీయేనా లేక బొగ్గు పొడుంను కషాయంగా మార్చి పాలు కలిపి ఇచ్చారా..? కాఫీ పౌడర్ లో చింతగింజల పొడి, చికోరీ పౌడర్ కలుపుతుంటారు. వీటి కారణంగా డయేరియా, ఉదర సంబంధ సమస్యలు, కీళ్ల నొప్పులు వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. టీ పొడుంలో కూడా ఇతర ఆకులు ఏవేవో కలపడం జరుగుతోంది.
ఇలా చేస్తే కాదూ...
ఇప్పుడు ఆర్గానిక్ సాగు పెరుగుతోంది. సాధారణ సాగుతో పోలిస్తే ఆర్గానిక్ ఉత్పత్తుల ధర 50 శాతం వరకు ఎక్కువగా ఉంటోంది. వీలుంటే వీటిని తక్కువ పరిమాణంలో అయినా కొనుక్కుని వాడుకోవడం మంచిది. ఎండు మిరపకాయలు కొనుక్కుని వాటిని కారం పట్టించుకుని వాడే వాళ్లం గతంలో. మరి ఇప్పుడు కూడా అదే విధానం అనుసరించడం శ్రేయస్కరం. అన్నదాతలు చీడపీడల నుంచి రక్షణ కోసం మిరప పంటపై రసాయనాలు చల్లి ఉంటారు. కానీ, ఆ ప్రభావాన్ని ఎలానూ తప్పించుకోలేము. పసుపు కొమ్ములను మర ఆడించుకుని వాడుకోవడం సూచనీయం. సాధ్యమైనంత వరకు ప్యాకేజ్డ్, రెడీమేడ్ ఆహార పదార్థాలను ఆశ్రయించకపోవడం మంచిది. ఇంట్లోనే తయారు చేసుకుని తినడం వల్ల ఆరోగ్యం కొంతలో కొంతయినా భద్రంగా ఉంటుంది.
ముఖ్యంగా ప్రతీ ఇంట్లోనూ ఖర్చు అయినా సరే ఆర్వో వాటర్ ప్యూరిఫయర్ ఉండడం మంచిది. పాలను తెలిసిన రైతు నుంచి నేరుగా కొనుగోలు చేసి వాడుకోవడం సురక్షితం. మసాల, పప్పు దినుసులను ప్రముఖ కంపెనీలు మార్కెట్ చేస్తున్నాయి. ఇవి కొంతలో కొంత నమ్మదగినవి. ఉడికీ ఉడకని ఆహార పదార్థాలను తినవద్దు. పాలను కూడా బాగా కాచిన తర్వాతే వాడుకోవాలి.
పండ్లపై తొక్కు తీసి అవే చేతులతో తినడం వల్ల పొట్టుపై ఉన్న విషపూరిత పురుగు మందులు శరీరంలోకి ప్రవేశిస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మనరోజువారీ ఆహారంలో కాడ్మియం, సీసం, ఆర్సెనిక్, పాదరసం వంటి భారీ లోహాలు ఉంటున్నాయి. ఇటువంటప్పుడు వైద్యుల సలహాతో విటమిన్ సీ సప్లిమెంట్లను తీసుకోవడం వల్ల విషపూరితాలను తొలగించుకోవచ్చని నిపుణుల సూచన.
ఆహార పదార్థాల్లో కల్తీలు ఇవే...
పసుపులో లీడ్ క్రెమేట్ అనే రసాయం కలిపితే అనీమియా, గర్భస్రావం, పక్షవాతం, మెదడు దిబ్బతినడం వంటి దుష్ప్రభావాలు ఉంటాయి. ఆల్కహాలిక్ లిక్కర్ లో మెంథాల్ కలపడం వల్ల కంటి చూపు మసకబారడం, చూపు కోల్పోవడం, ప్రాణాపాయం కలగవచ్చు. యాపిల్ వంటి పండ్లపై ఆర్సెనిక్ ను స్ప్రే చేయడం వల్ల ఈ యాపిల్స్ తింటే కళ్లు తిరగడం, తిమ్మిర్లు, పక్షవాతం వంటి ముప్పు ఉంటుంది. దేశంలో ఆహార పదార్థాల్లో జరుగుతున్న కల్తీ, బ్యాక్టీరియా, ఫంగస్ కారణంగా కలుషితం, సహజంగా జరిగే కలుషితం, కల్తీలను గుర్తించేది ఎలా అన్నది http://agmarknet.nic.in/adulterants.htm ఇక్కడ చూడవచ్చు. దేశంలో వ్యవసాయ ఉత్పత్తుల ప్రమాణాలను ధ్రువీకరించే కేంద్ర ప్రభుత్వ సంస్థ అగ్ మార్క్ ఈ జాబితాను రూపొందించింది.
ఒకప్పుడు అంటే 50 ఏళ్ల క్రితం అందరూ దాదాపుగా ఆరోగ్యంగా జీవించారు. ఇప్పుడు అన్నీ విషతుల్యమై మనుషుల ఆరోగ్యాన్ని మింగేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో సామాన్యులుగా మనవంతు అవగాహన పెంచుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారానే ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం సాధ్యమవుతుంది.