ప్రభుత్వ హామీతో కూడిన పెన్షన్ పథకం...అటల్ పెన్షన్ యోజన పథకం!

60వ ఏట నుంచి ప్రతి నెలా నిర్ణీత మొత్తంలో పెన్షన్ అందించే లక్ష్యంతో కూడినదే అటల్ పెన్షన్ యోజన పథకం. కేంద్ర ప్రభుత్వం 2015-16 బడ్జెట్లో ప్రకటించిన ఈ పథకంలో ఈ ఏడాది మార్చిలోపు చేరితే... ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాల వ్యవధిలో రూ.5వేల వరకు వారి పెన్షన్ ఖాతాలో జమ చేస్తుంది. ఆ ప్రయోజనం అందుకోవాలంటే మార్చి లోపు పథకంలో చేరాలి. కచ్చితమైన హామీతో కూడిన పెన్షన్ పథకం ఇది. నెలనెలా చెల్లించే చందా మొత్తాన్ని బట్టి 1,000 రూపాయల నుంచి 5,000 రూపాయల వరకు పెన్షన్ అందుకోవచ్చు. ఈ స్కీమ్ ను ప్రభుత్వ రంగంలోని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ (పీఎఫ్ ఆర్డీయే) నిర్వహిస్తోంది. ఈ పథకంలో ఉన్న మంచి చెడుల గురించి నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం... 

అందరూ అర్హులే...

భారతీయ పౌరులు ఎవరైనా ఇందులో చేరవచ్చు. అయితే, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్ సౌకర్యం ఉన్నఇతర వర్గాల వారికి, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం తన వంతు రూ.5వేల చందా చెల్లించదు. ఇది తప్ప మిగతా ప్రయోజనాలన్నీ అందరికీ ఒకటే. 18 ఏళ్ల నుంచి 40 ఏళ్లలోపు వయసు ఉన్నవారు ఈ పథకంలో చేరేందుకు అర్హులు. 60వ ఏట నుంచి పెన్షన్ ప్రారంభం అవుతుంది. 

బ్యాంకు ఖాతాతో

ముందుగా ఈ ఖాతా ప్రారంభించాలంటే బ్యాంకు ఖాతా తప్పనిసరి. ఖాతా లేకపోతే ఏదేనీ బ్యాంకులో ఖాతా ప్రారంభించడం ద్వారా ఇందులో చేరవచ్చు. ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, నామినీ వివరాలు తప్పనిసరి. స్కీమ్ లో చేరే సమయంలో ఆధార్ నంబర్ లేకపోతే తర్వాత అయినా సమర్పించాల్సి ఉంటుంది. బ్యాంకులు నెలవారీ చందాను వారి ఖాతా నుంచి నిర్ణీత తేదీన ఉపసంహరించుకుంటాయి. కనుక చెల్లింపు తేదీనాటికి చందా మొత్తాన్ని అందులో ఉంచాలి.

రూ.5,000 వేల వరకు పెన్షన్

representational imageచెల్లించే చందాను బట్టి పెన్షన్ 1,000 రూపాయల నుంచి 5,000 రూపాయలు వస్తుంది. ఉదాహరణకు 18 ఏళ్ల వ్యక్తి 60వ ఏట నుంచి నెలకు 1,000 రూపాయల పెన్షన్ కోరుకుంటే ప్రతి నెలా 42 రూపాయల చొప్పున 42 ఏళ్లపాటు చెల్లించాల్సి ఉంటుంది. అదే వ్యక్తి 2వేల పెన్షన్ కోరుకుంటే.. ప్రతి నెలా 84 రూపాయలు, 3వేల పెన్షన్ కోరుకుంటే 126 రూపాయలు, 4వేల పెన్షన్ కోరుకుంటే 168 రూపాయలు, 5వేల పెన్షన్ కోరుకుంటే నెలనెలా 210 రూపాయలు చందా చెల్లించాలి. 

40 ఏళ్ల వ్యక్తి అయితే వెయ్యి రూపాయల పెన్షన్ కోసం 291 రూపాయలు, 2వేల పెన్షన్ కోసం 582 రూపాయలు, 3వేల పెన్షన్ కోసం 873 రూపాయలు, 4వేల పెన్షన్ కోసం 1,164 రూపాయలు, 5వేల పెన్షన్ కోసం 1,454 రూపాయలు నెల నెలా చెల్లించాలి. ఒకవేళ 2వేల రూపాయల పెన్షన్ కోసం చందా కడుతుంటే… కావాలంటే దాన్ని 5వేల పెన్షన్ ఆప్షన్ కిందకు మార్చుకుని అదనపు చందా చెల్లించే సదుపాయం కూడా ఉంది. అలాగే, పెన్షన్ మొత్తాన్ని తగ్గించుకోవచ్చు. ఇందుకు ఏటా ఏప్రిల్ నెలలో అవకాశం ఉంటుంది. అలా మార్చుకున్నప్పుడు నెలవారీ చెల్లించే మొత్తం కూడా మారుతుంది. 

ప్రభుత్వ సహకారం... 

ఎటువంటి సామాజిక భద్రతా స్కీముల్లోను సభ్యులు కానివారు, ఈపీఎఫ్ వంటి స్కీముల్లో లేని వారు, అవ్యవస్థీకృత రంగంలోని వారికి వారి వార్షిక చందాలో సగం లేదా వెయ్యి రూపాయలు ఏది తక్కువైతే అంత మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం ఐదు సంవత్సరాల పాటు అందిస్తుంది. ఉదాహరణకు... 18 ఏళ్ల వ్యక్తి 5వేల పెన్షన్ కోసం నెల నెలా 210 రూపాయల చొప్పున చెల్లిస్తున్నట్లయితే... వార్షికంగా ఇది  2520 రూపాయలు అవుతుంది. ఇందులో సగం అంటే 1260 రూపాయలు. దీనికంటే వెయ్యి రూపాయలే తక్కువ కనుక అంతమేర ప్రభుత్వం ఏటా పెన్షన్ ఖాతాలో జమచేస్తుంది. 

వైదొలగడానికి అవకాశం ఉందా...?

సాధారణ సందర్భాల్లో ఈ స్కీమ్ నుంచి వైదొలగడానికి అవకాశం లేదు. చందాదారుడు మరణించిన సందర్భాల్లో.. లేదా మరణానికి దారితీసే వ్యాధికి గురైనప్పుడు మాత్రమే స్కీమ్ నుంచి వైదొలగేందుకు అవకాశం ఇస్తారు. 

నెలవారీ చెల్లించడంలో విఫలమైతే...

100 రూపాయల చందాకు నెలకు ఒక రూపాయి జరిమానా ఉంటుంది. 101 నుంచి 500 రూపాయల్లోపు చందాకు రెండు రూపాయలు, 501 నుంచి 1000 రూపాయల్లోపు చందాకు 5 రూపాయలు, 1000 రూపాయలకు పైబడిన చందా మొత్తానికి నెలకు 10 రూపాయల చొప్పున జరిమానా వసూలు చేస్తారు. వరుసగా ఆరు నెలల పాటు చందా చెల్లించనట్లయితే ఆ పెన్షన్ ఖాతాను స్తంభింపజేస్తారు. 12 నెలలు దాటితే డీయాక్టివేట్ అవుతుంది. 24 నెలల తర్వాత ఖాతా మూసివేయబడుతుంది. 

representational image

60 ఏళ్లకు చేరుకోగానే.. 

ఎంపిక చేసుకున్న ఆప్షన్ ప్రకారం నెలనెలా పెన్షన్ అందుతుంది. అయితే అప్పటి వరకు సమకూరిన పెట్టుబడులను వెనక్కి ఇవ్వరు. దానిపై వడ్డీని  పెన్షన్ గా అందిస్తారు. పెన్షనర్ లేదా అతడి జీవిత భాగస్వామి బతికి ఉన్నంత వరకూ పెన్షన్ అందుతుంది. 60 ఏళ్ల తర్వాత అనుకోని పరిస్థితుల్లో పెన్షన్ దారుడు మరణిస్తే జీవిత భాగస్వామికి నెలనెలా పెన్షన్ మొత్తాన్ని అందిస్తారు. దంపతులు ఇద్దరూ మరణించినట్లయితే వారి నామినీకి కార్పస్ మొత్తాన్ని ఇచ్చేస్తారు. 1,000 రూపాయల పెన్షన్ చందాదారుల కార్పస్ 60 ఏళ్లు వచ్చేసరికి 1.7 లక్షల రూపాయలకు చేరుతుంది. అదే 2,000 రూపాయల పెన్షన్ అందుకునే వారి కార్పస్ 3.4 లక్షల రూపాయలు, 3,000 రూపాయల పెన్షన్ అందుకునే వారి కార్పస్ 5.1 లక్షల రూపాయలు, 4,000 రూపాయల పెన్షన్ అందుకునే వారి కార్పస్ 6.8 లక్షల రూపాయలు, 5,000 రూపాయల పెన్షన్ అందుకునే వారి కార్పస్ 8.5 లక్షల రూపాయలుగా ఉంటుంది. మరణానంతరం నామినీలకు ఈ మొత్తం అందుతుంది. పూర్తి వివరాలకు, ఇతరత్రా ఏవైనా సందేహాలు ఉంటే https://www.npscra.nsdl.co.in/nsdl-faq.php వెబ్ సైట్ నుంచి తెలుసుకోవచ్చు. లేదా అన్ని బ్యాంకు శాఖల్లోనూ సంప్రదించడం ద్వారా వివరాలు పొందవచ్చు. 

5వేల రూపాయల పెన్షన్ సరిపోతుందా..?

ప్రభుత్వ హామీ... నెల నెలా 1,000 రూపాయల నుంచి 5,000 రూపాయల వరకు కచ్చితమైన పెన్షన్ ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఈ పెన్షన్ ఓ వ్యక్తి అవసరాలకు సరిపోతుందా? అంటే అవును అని చెప్పడం కష్టమే. ఉదాహరణకు 40 ఏళ్ల వ్యక్తి మరో 20 ఏళ్ల తర్వాత నుంచి నెల నెలా 5వేల పెన్షన్ అందుకుంటాడని అనుకుంటే... అప్పటి జీవన వ్యయం, ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే 5 వేల రూపాయల విలువ ఏ మూలకు? అన్నది నిపుణుల విశ్లేషణ. 

ఉదాహరణకు 30 ఏళ్ల వ్యక్తికి ప్రస్తుతం రోజువారీ జీవన వ్యయం 100 రూపాయలుగా ఉంటే నెలకు 3వేల రూపాయలు సరిపోతాయి. కానీ, ఇదే వ్యక్తికి 60 ఏళ్ల వయసుకు వస్తే నెలకు 12 వేల రూపాయలకుపైన అవసరం అవుతాయి. అంటే మూడు రెట్లు అదనంగా కావాలి. ఆ విధంగా చూస్తే 5వేల రూపాయల పెన్షన్ చాలదు. ఒకవేళ ఇందులో చేరినప్పటికీ అదనపు పెన్షన్ కోసం వీలుగా తగిన మొత్తాన్ని సమకూర్చుకోవాల్సి ఉంటుందని తెలుసుకోవాలి. 

ఏది నయం..?

representational imageఈ స్కీమ్ లో చందాదారులు చెల్లించే మొత్తంపై 7.9 శాతం వడ్డీ లభిస్తుంది. ఆర్థిక క్రమ శిక్షణ కలిగిన వారు ఈ స్కీమ్ కు  చెల్లించే మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్ లో సిప్ విధానంలో పెట్టుబడి పెడితే ఇంతకంటే ఎక్కువ మొత్తమే వస్తుందని నిపుణులు చెబుతున్నమాట. కానీ, అటల్ పెన్షన్ యోజన ఈక్విటీ మార్కెట్లతో సంబంధం లేకుండా రాబడి, పెన్షన్ కు కచ్చితమైన హామీ కలది. మ్యూచువల్ ఫండ్స్ స్కీముల్లో రాబడులకు హామీ ఉండదన్న విషయం తెలిసిందే. 

ఎన్ పీఎస్ లో ఎక్కువ కానీ…?!

ఈ స్కీమ్ లో కంటే నేషనల్ పెన్షన్ స్కీమ్ లో చేరి నెలవారీ పెట్టుబడి పెట్టడం వల్ల అటల్ పెన్షన్ యోజనలో వచ్చినంత రాబడికీ, నిర్వహణ బావుంటే ఇంకా అధిక రాబడికి కూడా అవకాశం ఉంటుందని భావించవచ్చు. పైగా ఎన్ పీఎస్ లో 60 ఏళ్లు వచ్చిన తర్వాత 60 శాతం మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. 

అయితే అటల్ పెన్షన్ యోజనలో 5వేల రూపాయల పెన్షనర్ కార్పస్ 8.5 లక్షలుే ఉంటుంది. 8.5 లక్షలకు 7.1 శాతం నెలవారీ వడ్డీ కింద కేంద్రం 5 వేల పెన్షన్ అందిస్తుంది. ఒకవేళ ఎన్ పీఎస్ స్కీమ్ లో పెట్టుబడితో వారి కార్పస్ 11 లక్షల రూపాయలు అయిందనుకుందాం. కానీ, 20 ఏళ్ల తర్వాత కూడా ప్రస్తుతమున్న స్థాయిలోనే వడ్డీ రేట్లు ఉంటాయని ఆశించలేము కదా. అందుకని ఒక్కసారి ఈ స్కీమ్ మీకు సరిపోతుందా? లేదా? యోచించుకుని ముందడుగు వేయండి. 


More Articles