ఇన్సూరెన్స్ పత్రాలను ఎలక్ట్రానిక్ రూపంలో దాచుకున్నారా?
బీమా ప్రతి ఒక్కరికీ అవసరం. మన దేశంలో దాదాపుగా ప్రతీ ఇంట్లోనూ బీమా కలిగిన వారు తప్పకుండా ఉంటారు. సంపాదన పరుల పేరు మీద కనీసం రెండు పాలసీలకు తక్కువ కాకుండా అయినా ఉంటాయి. ఐదు, పది పాలసీలు కలిగిన వారు కూడా ఉన్నారు. మరి ఇన్నేసి పాలసీ పత్రాలను ఇంట్లో ఉంచుకోవడం భద్రమేనా...?
పేపర్ రూపంలో ఉండే పత్రాలను ఇంట్లో జాగ్రత్తపరచడం అన్నది శ్రమే. తడిసినా, చిరిగినా ఇబ్బందే. ఎక్కడైనా తప్పిపోతే క్లెయిమ్ సమయంలో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఒకటికి మించి పాలసీలు కలిగి ఉన్న వారు చిరునామా మారినప్పుడు దాన్ని మార్చుకోవడానికి అన్ని కంపెనీలకు వరుసపెట్టి లెటర్లు రాయాల్సి ఉంటుంది. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారమే ఇన్సూరెన్స్ రిపాజిటరీ (ఐఆర్).
ఇన్సూరెన్స్ రిపాజిటరీ అంటే...?
బీమా పత్రాలను పాలసీదారుల తరఫున ఎలక్ట్రానిక్ రూపంలో భద్రంగా ఉంచే సంస్థే ఇన్సూరెన్స్ రిపాజిటరీ. షేర్లను, మ్యూచువల్ ఫండ్ యూనిట్లను, సెక్యూరిటీలను డీమ్యాట్ ఖాతా ద్వారా ఎలక్ట్రానిక్ రూపంలో ఉంచుకున్నట్టే... ఈ ఇన్సూరెన్స్ ఖాతా ద్వారా డిజిటల్ రూపంలో బీమా పత్రాలను దాచుకోవచ్చు. ఒక్కరు ఒక రిపాజిటరీ ఖాతా మాత్రమే కలిగి ఉండాలన్నది నిబంధన. 2013 నుంచి ఈ సేవలు మన దేశంలో అమల్లో ఉన్నాయి.
ఏఏ సంస్థలు
ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్ మెంట్ అథారిటీ ఐదు సంస్థలకు రిపాజిటరీ సేవల నిర్వహణకు గాను అనుమతించింది. వీటిలో ఎన్ఎస్డీఎల్ డేటాబేస్ మేనేజ్ మెంట్, సెంట్రల్ ఇన్సూరెన్స్ రిపాజిటరీ లిమిటెడ్, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్స్, క్యామ్స్ రిపాజిటరీ సర్వీసెస్, కార్వీ ఇన్సూరెన్స్ రిపాజిటరీ ఉన్నాయి. తొలిగా సేవలు ప్రారంభించినది మాత్రం క్యామ్స్ రిపాజిటరీ.
• NSDL Database Management Limited – www.nir.ndml.in
• Central Insurance Repository Limited – www.cirl.co.in
• SHCIL Projects Limited– – www.shcilir.com
• Karvy Insurance Repository Limited – www.kinrep.com
• CAMS Repository Services Limited – www.camsrepository.com
ఉపయోగాలు ఏంటి..?
రిపాజిటరీలలో ఈ-పత్రాల రూపంలో దాచుకోవడం వల్ల ఇంట్లో భౌతిక పత్రాలను ఉంచుకునే ఇబ్బంది తప్పుతుంది. ఎన్ని పాలసీలు ఉన్నా... ఒకే ఖాతా ద్వారా అన్నింటినీ నిర్వహించుకోవడం వల్ల సులభంగా ఉంటుంది. అన్ని రకాల జీవిత బీమా, ఆరోగ్య బీమా, సాధారణ బీమా, యాన్యుటీ ప్లాన్లను ఈ రూపంలో భద్రపరచుకోవడానికి అవకాశం ఉంది.
నామినీ వివరాలు మార్చుకోవడం, చిరునామా మార్చుకోవడం చిటికెలో పని. ఎన్ని పాలసీలు ఉన్నాగానీ రిపాజిటరీకి సమాచారం ఇస్తే... పాలసీదారుడు తరఫున రిపాజిటరీయే బీమా కంపెనీలకు సమాచారం పంపిస్తుంది. అంటే సేవల్లో వేగం పెరుగుతుంది. పాలసీ పత్రం పోతుందన్న భయం ఉండదు. అన్ని రకాల పాలసీలకు ఒకటే వేదిక అవుతుంది. పరిహారం సమయంలో తప్పితే బీమా కంపెనీ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఖర్చులు తగ్గడం వల్ల ప్రీమియం కూడా తగ్గుతుందన్నది ఐఆర్డీఏ చెబుతున్న మాట.
చార్జీల సంగతి..?
ఖాతా తెరిచేందుకు, ఖాతాలో బీమా పత్రాలను దాచుకున్నందుకు గాను ఎటువంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. అన్ని సేవలు ఉచితం. ప్రస్తుతం పత్రాల రూపంలో ఉన్న బీమా పాలసీలను ఎలక్ట్రానిక్ రూపంలో మార్చుకునేందుకు కూడా చార్జీలు లేవు. ఇన్సూరెన్స్ కంపెనీలే కొంత చార్జీలను రిపాజిటరీ సంస్థలకు చెల్లిస్తాయి. అయితే, భవిష్యత్తులో ఈ ఖాతాలపై నిర్వహణ చార్జీలు, సేవల (చిరునామా, నామినీ తదితర వివరాల మార్పు) చార్జీలు చెల్లించాల్సి రావచ్చు.
పాలసీ తీసుకోవడం సులభం
ఇన్సూరెన్స్ రిపాజిటరీ ఖాతా ఉంటే కొత్తగా పాలసీ తీసుకోవడం చాలా సులభం. కొత్త పాలసీ దరఖాస్తులో రిపాజిటరీ ఖాతా నంబర్ వేస్తే సరిపోతుంది. పాలసీ పత్రం కూడా వేగంగా జారీ అవుతుంది. కేవైసీ (మీ కస్టమర్ గురించి తెలుసుకోండి) నిబంధనలు కూడా రిపాజిటరీ ఖాతా ప్రారంభంలో పాటించి ఉంటారు కనుక కొత్త పాలసీ సమయంలో వేరే ఇతరత్రా పత్రాలు ఇవ్వాల్సిన అవసరం లేదు.
ప్రస్తుత పత్రాలను ఈ పత్రాలుగా మార్చుకోవడం ఎలా?
ముందుగా ఇన్సూరెన్స్ రిపాజిటరీ వద్ద ఖాతా ప్రారంభించాలి. అందుబాటులో ఉన్న ఐదు సంస్థల్లో ఏదో ఒక దాని నుంచి ఖాతా ప్రారంభించవచ్చు. ఇప్పటికే ఫిజికల్ రూపంలో పాలసీ పత్రాలను కలిగి ఉన్నవారు ఎలక్ట్రానిక్ రూపంలో మార్చుకోవాలనుకుంటే... దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు బీమా పత్రాలను జతచేసి బీమా కంపెనీకి సమర్పించాలి. అప్పుడు కంపెనీ పరిశీలన అనంతరం ఈ రూపంలో బీమా పాలసీ జారీ చేస్తుంది.
దరఖాస్తు చేసుకున్న అనంతరం ఈ ఇన్సూరెన్స్ ఖాతా ఏడు రోజుల్లోపల ప్రారంభం అవుతుంది. ఖాతా ప్రారంభించిన వెంటనే ఖాతాదారులకు యూజర్ ఐడీ, పాస్ వర్డ్ జారీ చేస్తారు. దాంతో ఎక్కడి నుంచి అయినా ఈ ఇన్సూరెన్స్ ఖాతాలో లాగిన్ అయి వివరాలు పరిశీలించుకోవచ్చు. పాలసీ ప్రీమియంను రిపాజిటరీ ద్వారా కూడా చెల్లించవచ్చు. భవిష్యత్తులో అన్ని పాలసీలు ఎలక్ట్రానిక్ రూపంలో జారీ చేయాలని ఐఆర్డీఏ ఆదేశించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకుని రిపాజిటరీ ఖాతా తెరిచి బీమా పత్రాలను ఎలక్ట్రానిక్ రూపంలోకి మార్చుకోవడం బెటర్.
పాలసీలు ఉన్నవారే కాదు, భవిష్యత్తులో పాలసీలు తీసుకోవాలనుకునే వారు సైతం ఈ ఇన్సూరెన్స్ ఖాతా తీసుకోవడం మంచి ఆలోచనే. ఒక రిపాజిటరీ దగ్గర ఈ ఇన్సూరెన్స్ ఖాతా కలిగి ఉన్నవారు దాన్ని మరో రిపాజిటరీ సంస్థకు మార్చుకోవాలనుకుంటే అందుకు అవకాశం ఉంది. దేశంలో అతిపెద్ద బీమా సంస్థ ఎల్ఐసీ తమ పాలసీదారులు పత్రాలను ఎలక్ట్రానిక్ రూపంలో మార్చుకునేందుకు వీలుగా ఐదు రిపాజిటరీ సంస్థలతో ఒప్పందం చేసుకుంది.