మనం కొనే బంగారంలో అసలు బంగారం ఎంత...?

మన వంటిపై ఉన్న ఆభరణాల్లో ఉన్న బంగారం ఎంత...? షాపులో విక్రయిస్తున్న ఆభరణాల్లో ఉన్న స్వచ్ఛమైన బంగారం పాళ్లు ఎంత..? అసలు బంగారం విలువ ఎంత... మనం పెడుతున్నది ఎంత..? ఎన్ని క్యారట్లు ఉందన్న విషయం ఎలా తెలుస్తుంది...? బంగారం పట్ల మక్కువ ఉన్నవారు ఇవన్నీ తెలుసుకోవాల్సినవే.    

బంగారం స్వచ్ఛతను క్యారట్ల రూపంలో చెబుతారు. 99.9 శాతం స్వచ్ఛత ఉంటే అది 24 క్యారట్ల బంగారం అని అర్థం. ఇది చాలా సాఫ్ట్ గా ఉంటుంది. కనుక 24 క్యారట్ల స్వచ్ఛతతో ఆభరణాలను తయారు చేయరు. ధరించే ఆభరణాలు గట్టిగా, మన్నికగా ఉండాలి. అందుకే స్వచ్ఛమైన బంగారాన్ని గట్టి చేయడం కోసం రాగి, వెండి, కాడ్మియం, జింక్ వంటి ఇతర లోహాలను కలుపుతారు. ఈ ఇతర లోహాలు ఎంత శాతం కలిశాయన్న దాని ఆధారంగా బంగారం స్వచ్ఛత 22 క్యారట్లు, 18 క్యారట్లు, 14 క్యారట్లు అంతకంటే తక్కువ క్యారట్లకు తగ్గిపోతుంది.

24 క్యారట్లు అంటే 99.9 శాతం స్వచ్ఛత అని చెప్పుకున్నాం కదా. 22 క్యారట్లు అంటే 91.6 శాతమే ఉన్నట్టు. 8.4 శాతం ఇతర లోహాలు కలిశాయని అర్థం. అదే 18 క్యారట్లు అయితే అందులో ఉన్న బంగారం స్వచ్ఛత 75 శాతం. 14 క్యాటర్లలో బంగారం 58.5శాతం మాత్రమే. 12 క్యారట్లలో 50 శాతం మాత్రమే బంగారం ఉంటుంది. 10 క్యారట్లలో 41.7 శాతానికి మించి బంగారం ఉండదు.  

represemttaion image courtesy fingyan.com

స్వచ్ఛతకు నిదర్శనం హాల్ మార్క్

బంగారు ఆభరణాల్లో స్వచ్ఛతను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) ధ్రువీకరిస్తుంది. ఈ ధ్రువీకరణ హాల్ మార్క్ రూపంలో ఉంటుంది. కొనే సమయంలో ఆభరణాలపై ఈ గుర్తు ఉందేమో చూసుకోవాలి. భారతీయ ప్రమాణాల సంస్థ నగలను పరీక్షించిన అనంతరం హాల్ మార్క్ ను వర్తకులకు జారీ చేస్తుంది. కనుక ఈ మార్క్ ఉన్న ఆభరణాలను నాణ్యమైనవిగా పరిగణించవచ్చు. హాల్ మార్క్ లో బీఐఎస్ స్టాండర్డ్ మార్క్ ఉంటుంది. తర్వాత బంగారం స్వచ్ఛతను తెలియజేసే నంబర్ ఉంటుంది. 99.9 స్వచ్ఛత ఉంటే దాన్ని 999గా పేర్కొంటారు. అలాగే, 23 క్యారట్లకు 958, 22 క్యారట్లు అయితే 916 నంబర్, 21 క్యారట్లకు 875, 18 క్యాటర్లకు 750, 17 క్యారట్లకు 708, 14 క్యారట్లకు 585 నంబర్ సూచిస్తారు.

ఈ నంబర్ తర్వాత హాల్ మార్క్ వేసిన సెంటర్ మార్క్ కూడా ఉంటుంది. తయారైన సంవత్సరం ఇంగ్లిష్ అక్షరం కోడ్ రూపంలో ఉంటుంది. ఎలా అంటే 2000 సంవత్సరానికి A కేటాయించారు. ఇక అక్కడి నుంచి ఒక్కో సంవత్సరానికి వరుసలో ఇంగ్లిష్ అక్షరాలను కేటాయిస్తుంటారు. చివరిలో బీఐఎస్ ధ్రువీకరించిన ఆభరణాల తయారీదారుల గుర్తు ఉంటుంది. నిజానికి మన దేశంలోనే 22 క్యారట్ల బంగారం ఎక్కువగా వినియోస్తున్నది. ఇతర దేశాల్లో 14 క్యారట్ల నుంచి 18 క్యారట్ల మధ్యనున్న ఆభరణాలే ఎక్కువగా వాడుతుంటారు.  

భూతద్దం సాయంతో ఆభరణంపై ఉన్న హాల్ మార్క్ వివరాలను పరిశీలించవచ్చు. అనుమానం ఉంటే హాల్ మార్క్ టెస్టింగ్ సెంటర్ కు వెళ్లి పరీక్షించుకోవచ్చు. హాల్ మార్క్ బంగారు ఆభరణాలకే కాదు, వెండి ఆభరణాలకు కూడా వినియోగిస్తుంటారు. అయితే, వాస్తవంలో హాల్ మార్క్ వెండి ఆభరణాల విక్రయం చాలా తక్కువగానే ఉంది. కొనుగోలు దారుల్లో అంతగా అవగాహన లేకపోవడంతో వెండిలో మోసాలు కొనసాగుతూనే ఉన్నాయి. బీఐఎస్ లైసెన్స్ పొందిన ఆభరణాల వర్తకుల వివరాలను http://www.bis.org.in/ లింక్ నుంచి తెలుసుకోవచ్చు.

ధర, ఎన్నో రకాల చార్జీలు

బంగారం ధర క్యారట్లు, బరువును బట్టి మారిపోతుంటుంది. ఆభరణాల తయారీ సమయంలో బంగారం కొంత వృధా అవుతుందని చెప్పి వేస్టేజీ చార్జీలను బంగారం వర్తకులు రాబడుతుంటారు. ఆభరణాలను బట్టి ఈ వృధా చార్జీలు ఆధారపడి ఉంటాయి. ఆభరణాలు అన్నీ ఒకేలా ఉండవు. కొన్ని అధిక డిజైన్లతో ఉంటాయి. కొన్ని సాధారణంగా ఉంటాయి. ఈ డిజైన్, వాటి తయారీకి పట్టే సమయాన్ని బట్టి మేకింగ్ చార్జీలు వేస్తుంటారు. రాష్ట్ర ప్రభుత్వం నిబంధనల మేరకు వ్యాట్ చార్జీ కూడా ఉంటుంది. బంగారం కొనుగోలుపై ఇన్ని రకాల చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. వాస్తవంలో చూస్తే ఈ చార్జీలు అన్ని షాపుల్లో ఒకే విధంగా ఉండవు. తయారీ చార్జీలు, వృధా, ఇతర చార్జీలు కూడా షాపును బట్టి మారిపోతుంటాయి.

తులం (10 గ్రాములు) బంగారు నెక్లెస్ కొంటున్నారు. షాపు నిర్వాహకుడు తులం 30వేల రూపాయలు అని చెప్పాడనుకోండి. అప్పుడు... తులం బంగారం ధర రూ.30వేలు అవుతుంది. దీనిపై 12 శాతం వృధా చార్జీ అనుకుంటే రూ.3600 అవుతుంది. తయారీ చార్జీలు గ్రాముకు 50 చొప్పున రూ.500. ఈ మొత్తం రూ.34,100. దీనిపై ఒక శాతం వ్యాట్ రూ.341. ఇప్పుడు మొత్తం రూ.34,441.

బేరమాడితే ఈ చార్జీల్లో తగ్గింపు లభిస్తుంది. తులం బంగారం మార్కెట్ ధరపై కొంత తగ్గింపు ఇవ్వవచ్చు. అలాగే, తయారీ, వృధా చార్జీలు కూడా తగ్గుతాయి. కొనే సమయలో కచ్చితంగా బిల్లు తీసుకోవాలి. ఎస్టిమేషన్ పేపరుపై రాతలు చెల్లవు. తిరిగి అవసరం అనుకుంటే కొన్న ఆభరణాలను వెనక్కి తీసకుంటారేమో ముందే తెలుసుకోవాలి. తీసుకునే సదుపాయం ఉన్నచోట కొనుగోలు చేయడం మంచిది. రాళ్లు పొదిగిన ఆభరణాల్లో మొత్తం తూకం నుంచి రాళ్ల బరువు తీసేశారో లేదా పరిశీలించాలి. మోసం చేస్తున్నట్టు గుర్తిస్తే 1860 425 3333 నంబర్ కు కాల్ చేసి తెలియజేయవచ్చు.  

ఇదో మోసం

పూర్వం రోజుల్లో బంగారు ఆభరణాలను చేతితో తయారు చేసేవారు. దాంతో కొంత బంగారం వృధా అవుతుందని చెప్పి ఆ చార్జీలను వినియోగదారుల నుంచి రాబట్టేవారు. కానీ, నేడు చాలా వరకు ఆభరణాలు మెషిన్లపై తయారవుతున్నాయి. ఏ మాత్రం వృధా ఉండదు. అయినా ఈ పేరుతో కస్టమర్ల నుంచి వసూళ్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ చార్జీలు కూడా షాపులను బట్టి, ఆభరణాలను బట్టి  10 నుంచి 18 శాతంగా ఉంటున్నాయి. కొన్ని షాపుల్లో 24 శాతం వరకు కూడా వసూలు చేస్తున్నారు. అందుకే బంగారం వర్తకుల ఆర్జన అధిక స్థాయిలో ఉంటుంది.

courtesy karatmeter

క్యారట్ మీటర్లు

క్యారట్ మీటర్లు అని ఉంటాయి. బంగారంలో బంగారం ఎంత, ఇతర లోహాలు ఎంత కలిశాయన్నది ఎక్స్ రే కిరణాల సాయంతో ఈ మెషిన్ చెప్పేస్తుంది. కానీ ఈ మెషిన్ కచ్చితంగా చెప్పలేదని బీఐఎస్ అంటోంది. హైదరాబాదు గాంధీ నగర్ ప్రాంతంలోను, గోల్కొండ క్రాస్ రోడ్స్ లోను తూనికలు కొలతల శాఖ ఎక్స్ రే ఫ్లోరోసెంట్ మెషిన్ ఏర్పాటు చేసింది. ఇక్కడ ఎవరైనా సరే తమ ఆభరణాల స్వచ్ఛత గురించి తెలుసుకోవచ్చు. 30 నిమిషాల్లోనే పరీక్ష పూర్తవుతుంది.  

కేడీఎం అర్థమే వేరయా

కేడీఎం బంగారం అని వినే ఉంటారు. అంటే ఆభరణం తయారీలో క్యాడ్మియంతో సోల్డరింగ్ చేస్తారు. కేడీఎం బంగారం ఆభరణాలు 916 స్వచ్ఛత గలవి. క్యాడ్మియం వల్ల ఆరోగ్యానికి హానికరమని భావించిన చాలా దేశాలు దీని వాడకాన్ని నిషేధించాయి. క్యాడ్మియం కరిగే సమయంలో వచ్చే పొగను పీలిస్తే తీవ్ర అనారోగ్యాలు తలెత్తుతాయి. కేడీఎం ఆభరణాలు ఆరోగ్యానికి హానికరమని తెలియజేయాలంటూ చాలా దేశాల్లో నిబంధన ఉంది. కానీ, దురదృష్టకరం ఏమిటంటే మన దగ్గర కేడీఎం అంటే అదేదో నాణ్యమైన ఉత్పాదనకు మారుపేరుగా మార్చేసి విక్రయిస్తున్నారు. 

వన్ గ్రామ్ గోల్డ్

వన్ గ్రామ్ గోల్డ్ పేరుతో ఆభరణాల విక్రయం కూడా జరుగుతోంది. ఈ ఆభరణాలు బంగారంతో చేసినవి కావు. వెండి, రాగితో చేసిన ఆభరణాలకు బంగారం పూత పూస్తారు. అందుకే వీటిని వన్ గ్రామ్ గోల్డ్ గా పేర్కొంటారు. ఇమిటేషన్ జ్యుయెలరీ కంటే వన్ గ్రామ్ గోల్డ్ ఆభరణాలు ఎక్కువ కాలం రంగు పోకుండా ఉంటాయి. అంతేకానీ, ఈ ఆభరణాల్లో ఒక గ్రాము బంగారాన్ని వినియోగిస్తారని కాదు.

caratకు karatకు మధ్య తేడా ఉంది

బంగారంలో స్వచ్ఛతను తెలియజేసేది karat. carat అంటే స్వచ్ఛతకు నిదర్శనం కాదు. వజ్రాలు, రత్నాల్లో బరువు పరిమాణాన్ని సూచించేదని తెలుసుకోవాలి. ఒక carat అంటే 200 మిల్లీ గ్రాములకు సమానం. గ్రాములో 20 శాతం. ఐదు caratలు ఉన్న వజ్రం అయితే దాని బరువు ఒక గ్రాముగా ఉంటుంది. 

బంగారం స్వచ్ఛతను ఎలా తెలుసుకునేది?

* ఆభరణం అంచులను జాగ్రత్తగా పరిశీలించాలి. రంగు పోయి ఉంటే తెలుస్తుంది. అక్కడ బంగారు వర్ణం కాకుండా ఇతర వర్ణం కనిపిస్తుంటే అది కచ్చితంగా బంగారు పూత పూసిన ఆభరణంగా అర్థం చేసుకోవాలి.  

* పళ్ల మధ్యలో పెట్టి మోస్తరు బలంతో ఆభరణాన్ని నొక్కి చూడండి. స్వచ్ఛమైన బంగారమా... బంగారు పూతదా అన్నది సులభంగా తెలిసిపోతుంది.

* బంగారంలో ఇనుము కలిసి ఉంటే అయస్కాంతంతో గుర్తించవచ్చు. ఆభరణం అయస్కాంతానికి అతుక్కుంటే ఇనుము కలిసినట్టే అర్థం.

* షైనింగ్ లేని సిరామిక్ ప్లేట్ పై బంగారు ఆభరణాన్ని రుద్దితే నల్లటి చారలు పడ్డాయనుకోండి. అది స్వచ్ఛమైనది కాదని అర్థం. బంగారు రంగు గీతలు పడితే స్వచ్ఛమైందని తెలుసుకోవాలి.

* అనుమానం ఉంటే కొనుగోలుకు ముందే షాపు దగ్గరే నైట్రిక్ యాసిడ్ తో టెస్ట్ చేయాలని కోరండి. ఆభరణంపై ఓ చుక్క నైట్రిక్ యాసిడ్ వేసిన వెంటనే రసాయనిక చర్య ప్రారంభం అవుతుంది. ఆకుపచ్చ రంగులో కనిపిస్తే బేస్ మెటల్ లేదా బంగారం పూత వేసిందని తెలుసుకోవాలి. బంగారు వర్ణంలోనే రియాక్షన్ కనిపిస్తే బంగారం పూత వేసిన ఇత్తడి అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. పాల రంగులో కనిపిస్తే బంగారం పూత వేసిన వెండి ఆభరణంగా గుర్తించాలి. ఎటువంటి రియాక్షన్ లేకపోతే దాన్ని అసలైన బంగారు ఆభరణంగా అర్థం చేసుకోవాలి.

courtesy karat meter

బంగారంలోనూ రకాలు

బంగారు ఆభరణం తయారీలో నికెల్, మాంగనీస్ లేదా పల్లాడియం వంటి లోహాలను కలిపితే అప్పుడు అది బంగారు వర్ణంలోనే కొంచెం తెల్లని ఛాయతో ఉంటుంది. రాగి ఎక్కువగా కలిపితే ఎరుపు, గులాబీల చాయలో కనిపిస్తుంది. రోజ్ గోల్డ్ అంటే అందులో 25 శాతం రాగి కలిపినట్టు అర్థం చేసుకోవాలి. అప్పుడు ఆ బంగారం 18 క్యారట్లు మాత్రమేనని అర్థం చేసుకోవాలి. వెండి, మాంగనీసు, రాగిని ఉపయోగించినట్టయితే బూడిద రంగు చాయలో ఉంటుంది. కేవలం వెండిని మాత్రమే కలిపితే గ్రీనిష్ లో కనిపిస్తుంది. పరిశీలించి చూస్తే తప్పించి బంగారానికి ఉన్న ప్రత్యేకత వల్ల ఇవన్నీ స్వచ్ఛమైన బంగారు ఆభరణాలుగానే కనిపిస్తాయి. అమెరికాలో పల్లాడియం లేదా వెండి కలిపిన వైట్ గోల్డ్ ఆభరణాలను పెళ్లిళ్ల సమయంలో ధరిస్తుంటారు. 

టిప్స్

మీ దగ్గరున్న పాత బంగారాన్ని ఎక్సేంజ్ చేసుకుంటున్నా, విక్రయిస్తున్నా నష్టపోకూడదు. 22క్యారట్ల ఆభరణాలు అయితే పూర్తి ధర చెల్లించాల్సిందే. ఇందులో వేస్టేజీ ఏమీ ఉండదు. అయినా కొందరు షాపువారు పాత ఆభరణాలు కరిగించేందుకు చార్జీలు, హ్యాండ్లింగ్ చార్జీలు అంటూ వసూలు చేస్తుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లించాల్సిన పని లేదు. మరో షాపుకు వెళ్లి మార్చుకోండి.

మీ దగ్గర అమ్మేవి లేదా ఎక్సేంజ్ చేసుకునేవి ఒకటికి మించి ఉంటే అన్నీ కలిపి కాకుండా ఒక్కో దాన్ని విడిగా తూకం వేయించండి. కొనే ప్రతీ ఆభరణానికి పూర్తి వివరాలతో బిల్లు తీసుకోవాలి. ఎందుకంటే చోరీకి గురైనా, ఇతర అవసరాల్లో ఈ బిల్లే ఆధారం. పేరున్న బ్రాండెడ్ స్టోర్లలో అయితే హాల్ మార్క్ ఆభరణాలు లభించడమే కాదు, అవసరమైతే వాటిని తిరిగి అదే స్టోర్లలో ఎక్సేంజ్ చేసుకోవచ్చు. పైగా మోసపూరిత యత్నానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. 

representation image

వెండి

వెండి లోహం కూడా పూర్తి స్వచ్ఛత గలది సాఫ్ట్ గానే ఉంటుంది. అందుకే వెండి ఆభరణాలను సైతం ఇతర లోహాలను కలిపే చేస్తుంటారు. రాగి, జింక్, నికెల్ ఎక్కువ శాతం ఉపయోగిస్తుంటారు. అందుకే గాలి, నీరుకి ఎక్స్ పోజ్ కావడం వల్ల వెండి ఆభరణాలు నల్లగా మారుతుంటాయి. బంగారు ఆభరణాల వలే వెండి ఆభరణాలకు సైతం హాల్ మార్క్ గుర్తింపు ఉంటుంది. వెండిలో స్వచ్ఛతను శాతాల్లో చూపిస్తారు. వెండి నాణేలు, బార్లు 999 శాతం స్వచ్ఛమైన వెండిని కలిగి ఉంటాయి. అదే స్టెర్లింగ్ సిల్వర్ అంటే, 92.5 శాతం వెండి, 7.5శాతం ఇతర లోహాలు ఉన్నట్టు. వెండిలో స్వచ్ఛతకు గుర్తులుగా 999.9, 999.5, 999, 990, 970, 925, 900, 835, 800 నంబర్లను పేర్కొంటారు. వెండి వస్తువా? కాదా? అన్న అనుమానం కలిగితే కొంచెం బ్లీచింగ్ వేసి చూడండి. వెంటనే అక్కడున్న మడ్డిని పొగొట్టి నల్లగా అయితే  అప్పుడు అది వెండి వస్తువే అవుతుంది. 


More Articles