రుణం ఎగ్గొడితే జాబ్ రాదు... మరి ఎలా..?
ఐఐటీ గ్రాడ్యుయేట్ అయి ఉండవచ్చు. బిజినెస్ స్కూల్ నుంచి పట్టా పుచ్చుకుని ఉండవచ్చు. లేదా బీకామ్ టాప్ అయినా కావచ్చు. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా నిర్వహించిన ఉద్యోగ రాత పరీక్షల్లో అఖిల భారత స్థాయిలో నం 1 స్థానం సొంతం చేసుకుని ఉండవచ్చు. కానీ ఒకే ఒక్క అంశం మీకు ప్రతికూలంగా ఉంటే మీకు కచ్చితంగా ఉద్యోగం రాదు.
సాధారణంగా ఉద్యోగ నియామకాల సమయంలో అభ్యర్థులకు సంబంధించిన వేటిని పరిగణనలోకి తీసుకుంటారో మనకు తెలియంది కాదు. అత్యుత్తమ ప్రతిభ. నడవడిక, విధేయత, తెలివితేటలు. రాత పరీక్షలో మెరుగ్గా ఉన్నప్పటికీ ఇంటర్వ్యూలో వెనకపడిపోయేది ఈ అంశాల్లోనే. ఇక్కడ నడవడిక అంటే సత్ప్రవర్తన. రుణం తీసుకుని ఎగ్గొడితే మీ క్యారక్టర్ పై నల్లమచ్చ పడినట్టే కదా. ఫలితంగా అలాంటి వారికి ఇకపై ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు.! ముఖ్యంగా బ్యాంకులు మాత్రం అలాంటి రుణ బకాయిదారులను ఉద్యోగాలకు అనర్హులుగా తేల్చేశాయి.
సిబిల్ స్కోరు
క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సిబిల్) గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఒక వ్యక్తి ఒక్కసారి ఏదైనా రుణం తీసుకుంటే చాలు... అతడి పేరిట ఈ సంస్థ ఓ రికార్డునే నిర్వహిస్తుంది. సక్రమంగా చెల్లిస్తే మంచి స్కోరు ఇస్తుంది. సరిగ్గా చెల్లించకపోయినా... ఎగ్గొట్టినా తన నివేదికలో తేటతెల్లం చేస్తుంది. అందుకే ఎవరు ఎలాంటి రుణానికి దరఖాస్తు చేసుకున్నా సంస్థలు ముందుగా సిబిల్ స్కోరును పరిశీలిస్తాయి. ఫర్వాలేదు అన్న స్కోరు ఉంటేనే రుణం జారీ చేస్తున్నాయి. స్కోరు బాగా లేకుంటే రుణ దరఖాస్తును తిరస్కరిస్తున్నాయి. అయితే, తాజాగా బ్యాంకులు ఉద్యోగాలిచ్చే ముందు అభ్యర్థుల సిబిల్ రిపోర్ట్ లను చూడడం మొదలు పెట్టాయి.
అంటే సిబిల్ స్కోరు బాగోలేకుంటే రుణానికే దెబ్బ కాదు, జీవనోపాధి కూడా ఎసరేనని తెలుస్తోంది. సిబిల్ స్కోరు బాలేదని ఉద్యోగ దరఖాస్తులను తిరస్కరించినట్టు ఇప్పటికే పలు ఆరోపణలు వచ్చాయి. కానీ, 2016లో ఎస్ బీఐ విడుదల చేసిన ఉద్యోగ భర్తీ నోటిఫికేష్ ను పరిశీలిస్తే ఇది నిజమేనని స్పష్టమవుతోంది. కస్టమర్ సపోర్ట్, సేల్స్ విభాగాల్లోకి జూనియర్ అసోసియేట్స్ ను నియమించుకునేందుకు ఎస్ బీఐ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ పరిశీలిస్తే స్పష్టంగా కనిపించిన విషయం ఏమిటంటే సిబిల్ స్కోరు, రుణ బకాయిల గురించి!
ఇక్కడున్న ఎస్ బీఐ నోటిఫికేషన్ దృశ్యాలను పరిశీలించండి విషయం మీకే తెలుస్తుంది. రెండో ఇమేజ్ కింది పేరాలను చూడండి. "రుణాలు తిరిగి చెల్లించని చరిత్ర ఉన్న అభ్యర్థులు, క్రెడిట్ కార్డులపై బకాయిలు ఉన్న అభ్యర్థులు సిబిల్, ఇతర ఎజెన్సీల ప్రతికూల జాబితాలో పేర్లు కలిగి ఉంటే అటువంటి వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులు" అని ఇంగ్లిష్ లో పేర్కొని ఉంది.
ఎందుకిలా
నిజానికి ఈ విధమైన పరిశీలన విధానం ఇతర దేశాల్లో ఉంది. కానీ, రుణాలు ఎగ్గొట్టే వారు పెరుగుతుండడంతో ఈ విధానాన్ని ఇక్కడ కూడా అమలు చేయడం ప్రారంభమైంది. ఒక అభ్యర్థి రుణం తీసుకుని ఎగ్గొడితే అది బాధ్యతారాహిత్యమే కదా. అంటే ఆ వ్యక్తి చట్టాలకు, నిబంధలకు కట్టుబడి ఉండే వైఖరి లేదని తెలుస్తోంది. మరి అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఉద్యోగం ఇస్తే... విధుల్లో ఎంత బాధ్యతగా వ్యవహరిస్తారో తెలియంది కాదు. మరీ ముఖ్యంగా నగదు వ్యవహారాలతో ముడి పడి ఉన్న బ్యాంకు ఉద్యోగంలో దుర్వినియోగం చేయరన్న భరోసా ఏమైనా ఉందా...? ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉన్నత ఉద్యోగాల్లో సిబిల్ స్కోరును చూస్తున్నారని సమాచారం. ఇప్పుడిప్పుడే ఇది ఇతర ఉద్యోగాల విషయంలోనూ ఆచరణలోకి వస్తోంది. మరీ ముఖ్యంగా బ్యాంకులు, ఐటీ సంస్థలు, ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూట్స్ ఉద్యోగాలిచ్చే ముందు సిబిల్ స్కోరును పరిశీలిస్తున్నాయి.
ఇది చట్టబద్ధమేనా....?
అభ్యర్థి నైతిక నియమావళి, చరిత్ర మంచిగా ఉంటేనే సంస్థలు మనుగడ సాగిస్తాయి. అందుకే ఈ విధమైన ప్రక్రియలు చట్టపరంగా చెల్లుబాటు అవుతాయని నిపుణులు అంటున్నారు. అభ్యర్థుల చరిత్ర, గుణగణాల్లో ఒక భాగమే సిబిల్ పరిశీలన అని నియామక సంస్థలు అంటున్నాయి. అయితే, రుణ చరిత్ర బాగా లేని ప్రతి వ్యక్తీ రుణాలు ఎగ్గొట్టినట్టు కాదు. ఇతరులకు హామీగా ఉండవచ్చు. లేదా రుణానికి సహ దరఖాస్తులుగా ఉండడం వల్ల అలాంటి పరిస్థితి ఏర్పడి ఉండవచ్చు.
కారణం ఏదైనాగానీ, ఆయా వ్యక్తులు ముందు జాగ్రత్త పడాల్సిందే. సకాలంలో చెల్లించినా సిబిల్ స్కోరులో తప్పిదం ఉండవచ్చు. అందుకే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే ముందే స్కోరును చూసుకుని తప్పులుంటే సరిచేసుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ‘సిబిల్ స్కోరు భేషుగ్గా ఉంది ఉద్యోగం ఇచ్చేత్తారా...?’ అని అమాయకంగా అడగొద్దు. అభ్యర్థుల చరిత్ర, ప్రవర్తన, వ్యక్తిత్వం తెలుసుకోవడంలో భాగమే సిబిల్ స్కోరు పరిశీలన. అందుకే ఉద్యోగం రావాలన్నా... అప్పు పుట్టాలన్నా సిబిల్ స్కోరు మంచిగా ఉండాలి. ఇతర అంశాల్లోనూ మెరుగ్గా ఉంటేనే ఉద్యోగం.