కారుకు యజమాని కావాలంటే ఇవి తెలుసుకోవాల్సిందే
కారు కొనడానికి ఏం కావాలి...? తగిన బడ్జెట్ ఉండాలి. అర చేతిలో క్రెడిట్ కార్డు లేదా జేబులో పాన్ కార్డు, చెక్ బుక్ ఉన్నా చాలు. కానీ, నిజానికి కారు యజమాని కావాలంటే బోలెడు విషయాలు తెలిసి ఉండాలి. పాత కారా... కొత్త కారా...?, నగదుతోనా, రుణంపైనా...? పెట్రోలా, డీజిల్ కారా...? ఇలా అన్నింటి సమాహారమే ఈ కథనం.
కారు కొనాలంటే దాన్ని పోషించే శక్తి కూడా ఉండాలి. బైక్ సర్వీసింగ్ కంటే మూడు రెట్లు అదనంగా కారు సర్వీసింగ్ కు ఖర్చు అవుతుంది. చేతిలో కారుంటే కొందరికి మనసు నిలకడగా ఉండదు. దాంతో కారు తిరుగుతుంది... పర్సు ఖాళీ అవుతుంది.
పెట్రోల్, డీజిల్, సీఎన్జీ, ఎల్పీజీ
కార్లలో వాడే ఇంధనాన్ని బట్టి వాటి ధరలు, నిర్వహణ వ్యయం, ఇతర ఖర్చులు వేర్వేరుగా ఉంటాయి. పెట్రోల్ కార్ల ధరలు మిగతా కార్ల కంటే తక్కువగా ఉంటాయి. పెట్రోల్ కారు కంటే డీజిల్ కార్ల ధరలు లక్ష రూపాయలకు పైగా ఎక్కువ ఉంటాయి. సీఎన్జీ కార్ల ధరలు 35 వేల నుంచి 40వేలు ఎక్కువగా ఉంటాయి. ఎల్పీజీ కార్ల ధరలు 25వేల వరకు ఎక్కువ ఉంటాయి. కానీ, ఇంధనం పరంగా చూస్తే, అన్నింటి కంటే పెట్రోల్ ధర ఎక్కువ. ఢిల్లీ మార్కెట్లో పెట్రోల్ ధర లీటరు 65 రూపాయలుగా ఉందనుకుందాం. డీజిల్ 55 రూపాయలు, సీఎన్జీ కిలోకు రూ.40, ఎల్పీజీ కిలోకు రూ.55గా ఉందుకుందాం. దీన్ని బట్టి చూస్తే పెట్రోల్ ఎక్కువగా... సీఎన్జీ తక్కువగా ఉంది. నిజానికి సీఎన్జీ కార్ల నిర్వహణ వ్యయమే చాలా తక్కువ.
డీజిల్ ధర తక్కువ... కానీ, డీజిల్ కార్ల నిర్వహణ వ్యయం ఎక్కువ. అందుకే రోజూ ఎన్ని కిలోమీటర్లు తిరుగుతారు... నెల మొత్తం మీద కారు వినియోగం ఎంతన్న దాని ఆధారంగా కారు ఎంచుకోవాలి. ఉదాహరణకు పైన చెప్పుకున్న ఇంధన ధరల ఆధారంగా లెక్కిస్తే... నెలకు సగటున 500 కిలోమీటర్లు తిరిగితే పెట్రోల్ కారు (లీటర్ కు 13కి.మీ చొప్పున)కు 2,450 రూపాయలు ఖర్చవుతుంది. డీజిల్ కారుకు (లీటర్ కు 16కి.మీ) 1,700 రూపాయలు, సీఎన్జీ కారుకు (18కి.మీ కిలోకు) రూ.1,100, ఎల్పీజీ (కిలోకు 11కి.మీ) కారుకు 2,200 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది.
నెలకు సగటున 1000 కిలోమీటర్లు తిరిగితే పెట్రోల్ కారుకు రూ.5వేలు, డీజిల్ కారుకు రూ.3,400, సీఎన్జీ కారుకు రూ.2,200, ఎల్పీజీ కారుకు రూ.4,400 ఖర్చవుతుంది. అదే నెలకు 1500 కిలోమీటర్లు తిరిగితే పెట్రోల్ కారుకు రూ.7,300, డీజిల్ కారుకు రూ.5వేలు, సీఎన్జీ కారుకు రూ.3,500, ఎల్పీజీ కారుకు రూ.6,500 వ్యయం చేయాల్సి వస్తుంది.
వీటిని పరిగణనలోకి తీసుకుంటే నెలకు 500 కిలోమీటర్లు కంటే తక్కువ తిరిగే వారు పెట్రోల్ కారు కొనుక్కోవడం హాయి. అదే నెలకు వెయ్యి కిలోమీటర్ల లోపు తిరిగే అవసరం ఉన్న వారు, అదీ నగరాల్లో ఉంటే సీఎన్జీ కారు కొనుక్కోవడం మంచిది. నెలకు 1500 కిలోమీటర్లు అంతకంటే ఎక్కువ తిరిగే వారికి డీజిల్ కార్లే అనువుగా చెప్పవచ్చు. నిర్వహణ వ్యయం ఎక్కువగా ఉన్నా, కారు కొనుగోలు ధర ఎక్కువగా ఉన్నప్పటికీ ఎక్కువ వాడడం వల్ల ఇంధన రూపంలో ఆదా కలసి వస్తుంది.
ఇక్కడ అన్నింటి కంటే నిర్వహణ వ్యయం తక్కువ సీఎన్జీనే. కాకపోతే సీఎన్జీ సిలిండర్లు 10 నుంచి 12 కేజీల వరకే ఉంటాయి. మరొకటి స్పేర్ గా పెట్టుకున్న రెండూ కలిపి 360 కిలోమీటర్లకు మించి రావు. కనుక దూర ప్రాంతాలకు వెళ్లే వారు ఇంధన సౌలభ్యాన్ని చూసుకోవాలి. నగరంలో అయితే ఎక్కువ దూరం తిరిగే అవసరం ఉన్నవారు తరచూ సిలిండర్లను ఫిల్ చేయించుకునే ఓపిక ఉంటే సీఎన్జీ కార్లు కొనుక్కోవడమే బెటర్. పెట్రోల్ కంటే డీజిల్ కార్ల పికపే ఎక్కువగా ఉంటుంది. పెట్రోల్ కార్ల వైబ్రేషన్ తక్కువ. డీజిల్ కార్ల స్పేర్ల ధరలు ఎక్కువ. సీఎన్జీ వాహనాల పికప్ ఈ రెండింటి కంటే తక్కువ. పైగా సీఎన్జీ కార్లలో తరచూ ఎయిర్ ఫిల్టర్, స్పార్క్ ప్లగ్, సీఎన్జీ కాట్రిడ్జ్ లను మార్చుకోవాల్సి వస్తుంది. వినియోగదారుల అనుభవాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
ఎలక్ట్రికల్ కారు
ఎలక్ట్రికల్ కార్లు అనేవి మన దేశంలో అంతగా ప్రాచుర్యానికి నోచుకోలేదు. కారణం పికప్, దూర ప్రయాణాలు, రీచార్జింగ్ వసతులు ఇలా ఎన్నో కారణాలు ఉన్నాయి. దేశంలో అందుబాటులో ఉన్న ఎలక్ట్రికల్ కార్లలో ప్రముఖంగా పేర్కొనతగినది మహీంద్రా రెవా ఈ2ఓ. ధర సుమారు రూ.5 లక్షలు. పర్యావరణ అనుకూలమైనది. వేగం గంటకు 80కిలోమీటర్లు. ఒకసారి చార్జ్ చేస్తే 100 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు.
సాధారణ చార్జింగ్ కి ఐదు గంటల సమయం పడుతుంది. అయితే, రెవా చార్జింగ్ పాయింట్ లో చార్జింగ్ చేయిస్తే గంట చాలు. అలాగే, ఇండికా విస్టా ఎలక్ట్రికల్ మోడల్ ను విడుదల చేసే ప్రయత్నాల్లో టాటామోటార్స్ ఉంది. అలాగే బీఎండబ్ల్యూ కూడా ఓ మోడల్ ను విడుదల చేయనుంది. చెవ్రోలెట్ బీట్ ఎలక్ట్రికల్ మోడల్ కూడా రానుందని సమాచారం. నగరాల్లో తిరిగే వారికి ఇవి చాలా అనువుగానే ఉంటాయి. కానీ, వచ్చిన సమస్యల్లా చార్జింగ్ తోనే. ఇంట్లో చార్జింగ్ కు అధిక సమయం పట్టడం, బయట చార్జింగ్ పాయింట్ల అందుబాటు తక్కువగా ఉండడం ప్రతికూలతలు.
ఎప్పుడు కొనాలి...?
డిసెంబర్ నెలలో కంపెనీలు డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. పేరుకుపోయి ఉన్న వాహనాలను ఆ ఏడాది ముగిసేలోపు వదిలించుకోవడానికి కంపెనీలు డిస్కౌంట్లు, ఆఫర్లు ప్రకటిస్తాయి. జనవరి వచ్చిన తర్వాత ఆ ఏడాదికి కొత్త మోడళ్లను లాంచ్ చేస్తుంటాయి. అందుకే కనీసం ఏడెనిమిదేళ్లు వాడాలనుకునేవారు డిసెంబర్ నెలలో కారు కొనుక్కోవడం సరైనదే. మూడు నాలుగేళ్లకు మార్చే ఉద్దేశం ఉంటే మాత్రం ఏడాదిలో చివరి నెలలో కొనుక్కోవడం కన్నా మరో నెలా, రెండు నెలలు ఆగి కొత్త మోడల్ కొనుక్కోవడమే మంచిది. కారు మోడల్ ను బట్టే రీసేల్ వేల్యూ ఉంటుంది. కనీసం ఎనిమిదేళ్లు వాడుకుంటేనే పెట్టిన పెట్టుబడికి తగిన ప్రయోజనం. తక్కువ కాలం వాడుకుని మారిస్తే ఎంతో కొంత నష్టం భరించక తప్పదు.
ఎలాంటి కారు కొనాలి...?
4 సీటరా, 6 సీటరా, 8 సీటరా, హంగూ ఆర్భాటాలుండాలా..? దర్పానికి పోయి తాహతుకు మించిన బడ్జెట్ తో కారు కొనడం తెలివైన పని కానే కాదు. కొనబోతున్న కారు ధర సదరు వ్యక్తి వార్షిక వేతనంలో 60 శాతాన్ని మించి ఉండకూడదు. అదే రుణంపై తీసుకుంటే నెల వాయిదా (ఈఎంఐ) నికర వేతనంలో 15 శాతం మేరకే ఉండాలి. 6 లక్షల రూపాయల కారును రుణంపై తీసుకోవాలనుకున్నారు. డౌన్ పేమెంట్ కింద 2 లక్షలు చెల్లించి మిగిలిన 4 లక్షల రూపాయాలను 60 నెలల కాలంలో చెల్లించే విధంగా రుణం తీసుకున్నారు. అప్పుడు 12 శాతం వార్షిక వడ్డీ ప్రకారం నెలకు రూ.9వేలు చెల్లించాల్సి వస్తుంది. ఒకవేళ డౌన్ పేమెంట్ 2 లక్షల కంటే తక్కువ కట్టినా, కాల వ్యవధి తక్కువగా ఫిక్స్ చేసుకున్నా ఈఎంఐ పెరిగిపోతుంది. ఈ మేరకు ఆర్థిక వెసులుబాటును చూసుకుని తగిన విధంగా ప్లాన్ వేసుకోవాలి.
డెలివరీకి ముందు వీటిని చెక్ చేసుకోవాలి
కారును డెలివరీ తీసుకునే ముందు దాన్ని క్షుణంగా పరిశీలించుకుకోవాలి. ముఖ్యంగా పగటి పూట ఉత్తమం. అప్పుడే ఏవైనా లోపాలు ఉంటే కనిపిస్తాయి. జనవరి, ఫిబ్రవరిలో కొంటున్నట్టయితే అంతకుముందు ఏడాది మోడల్స్ ను అంటగట్టే అవకాశం ఉంది. కొనే ముందు వెహికల్ ఐడెంటిఫికేషన్ నంబర్ (వీఐఎన్) చూసుకోవాలి. ఇందులో తయారైన సంవత్సరం వివరాలు ఉంటాయి. కారు వివరాలతో కూడిన ఫామ్ 22ని డీలర్ ను అడిగి తీసుకోవాలి.
వ్యాట్ బిల్లు, టెంపపరీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను కూడా పరిశీలించి తీసుకోవాలి. బిల్లులో పేర్కొన్న ఇంజన్ నంబర్, చాసిస్ నంబర్, ఇతర వివరాలు సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఇన్సూరెన్స్, పొల్యూషన్స్ కంట్రోల్ సర్టిఫికెట్, బ్యాటరీ, టైర్లకు వారంటీ కార్డులను తీసుకోవడం మర్చిపోవద్దు. కారుతో పాటు వచ్చే టూల్స్, స్పేర్ వీల్, బ్యాటరీ కండిషన్, ఇంజన్ ఆయిల్ సరిపడా ఉందేమో కూడా చూసుకోవాల్సిన బాధ్యత కొనేవారిపై ఉంటుంది.
టెస్ట్ డ్రైవ్ తప్పనిసరి. కొనాలనుకునే కారును ఓ సారి నడిపి చూస్తేనే పనితీరు ఆధారంగా కొనాలా, వద్దా నిర్ణయించుకోవడానికి వెసులుబాటు లభిస్తుంది. అందుకే ఒక డీలర్ కాకుండా అందుబాటులో ఉన్న డీలర్లు అందరి వద్దకు వెళ్లి టెస్ట్ డ్రైవ్ చేయడంతోపాటు ధరలను విచారించాలి. టెస్ట్ డ్రైవ్ లో ఓకే అనిపిస్తే ధర తక్కువ ఉన్న షోరూమ్ నుంచి కారును కొనుగోలు చేసుకోవడం లాభదాయకం.
సర్వీసు
కారు కొనుగోలు తర్వాత మంచి సర్వీసు అందుబాటులో ఉండాలి. అప్పుడే అది ఎక్కువ కాలం మన్నుతుంది. వినియోగదారుడికి సౌకర్యంగా ఉంటుంది. వ్యయం తగ్గుతుంది. విక్రయానంతర సర్వీసు విషయంలో మారుతి సుజుకి టాప్ ప్లేస్ లో ఉంది. అత్యధిక సెంటర్లలో షోరూమ్ లు, సర్వీసు సెంటర్లు ఉన్నాయి. పైగా సర్వీసు, విడి భాగాల వ్యయం భరించే స్థాయిలో ఉంటుంది. తర్వాత స్థానం హోండాది. మారుతి కంటే సర్వీసు కేంద్రాలు తక్కువ. హ్యుందాయ్, మహీంద్రా, టయోటా, టాటా తర్వాత స్థానాల్లో ఉంటాయి.
భద్రత చాలా ముఖ్యం
గ్రౌండ్ క్లియరెన్స్... మన రోడ్లు గోతుల మయం అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ (నేల పై నుంచి కారు కింది భాగం మధ్య ఉండే స్థలం) ఉన్న వాటితో కొంచెం ఇబ్బంది. అందుకే మనవాళ్లు ఎస్ యూవీల(స్పోర్ట్ యుటిలిటీ వెహికల్) ను ఇష్డపడుతుంటారు. మన దగ్గర రోడ్డు ప్రమాదాలు, మరణాలు ఎక్కువ. అందుకే ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ సదుపాయం ఉన్నవి కొనడమే ఉత్తమం. అలాగే, డాష్ బోర్డులో వీడియో కెమెరా సదుపాయం ఉందేమో చూసుకోవాలి. ఇది ఉంటే ప్రమాదాల్లో ఆధారంగా ఫుటేజీ ఉపయోగపడుతుంది.
క్యాషా లేక రుణంపైనా...?
అందుబాటులో నగదు ఉంటే రుణం కంటే క్యాష్ తోనే కారు కొనుగోలు చేయడం నయమని నిపుణుల సలహా. కారు విలువ తరిగిపోయే వస్తువు. విలువ తరిగిపోయే వస్తువుకు 12 శాతం అంతకంటే ఎక్కువ వడ్డీకి రుణం తీసుకుని చెల్లించడం సరైన నిర్ణయం కాబోదు. పైగా రుణానికి ప్రాసెసింగ్ ఫీజులు, రుణం తీర్చిన తర్వాత తిరిగి రిజిస్ట్రేషన్ మార్చుకోవడం అదనపు ఖర్చు.
రుణంపై కారు తీసుకున్న తర్వాత అనుకోని పరిస్థితుల కారణంగా నెలవాయిదాలు చెల్లించలేకుంటే... రుణం ఇచ్చిన సంస్థలు ఒకటి రెండు నెలలు చూసి కారు పట్టుకుపోతాయి. అదే నగదుతో కారు కొనుక్కుంటే కష్ట కాలంలో దాన్ని విక్రయించుకోవచ్చు. ఒకవేళ వడ్డీ లేకుండా, రెండు శాతం వడ్డీకి రుణం లభించినా కారు తీసుకోవచ్చు. నగదు లేకపోతే రుణం తీసుకోకూడదా అంటే తీసుకోవచ్చు. అప్పుడు తక్కువ బడ్జెట్ కారు తీసుకోవడం, వడ్డీ రేటు తక్కువ ఉండేట్టు చూసుకోవడం మంచిది.
ఒక ఉదాహరణ చూద్దాం. 6 లక్షల రూపాయల కారును రుణంపై కొనుగోలు చేద్దామనుకున్నారు. 2 లక్షలు సొంత క్యాష్. 4 లక్షలు రుణం. దానిపై వార్షిక వడ్డీ 12 శాతం. 60 నెలల గడువు. నెలకు 9వేల ఈఎంఐ చెల్లించాలి. అంటే ఐదేళ్లలో మొత్తం 5.40లక్షలు చెల్లించుకోవాలి. 1.40లక్షలు వడ్డీ అన్నమాట. ఇప్పుడు రుణం తీసుకోకుండా మొత్తం 6 లక్షల నగదుతో కారు తీసుకున్నారనుకుందాం. నెలనెలా కట్టాలనుకున్న 9 వేలను ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో సిప్ విధానంలో పెట్టుబడి పెడితే 60 నెలలు పూర్తయ్యే సరికి 12 శాతం వార్షిక రాబడి ప్రాతిపదికన 7.4లక్షలు పోగవుతాయి. అదే రాబడి 14 శాతంగా ఉంటే 7.84 లక్షలు వస్తాయి. పైగా నగదు రూపంలో కారు కొంటే కొంత తగ్గింపు కూడా లభిస్తుంది. ఒకవేళ కారుపై రుణం తీసుకుని చెల్లించే వడ్డీ రేటు కంటే... మీ దగ్గరున్న నగదుపై రెట్టింపు రాబడి తెచ్చుకోగల అవకాశం ఉంటే అప్పుడు రుణం తీసుకుని, చేతిలోని నగదును పెట్టుబడుల వైపు మళ్లించడం సరైనది.
సెకండ్ హ్యాండ్ కారా... కొత్త కారా...?
కొత్తకారు కండీషన్ పరంగా బాగుంటుంది. కొంత కాలం వరకు ఎలాంటి సమస్యలు ఉండవు. అన్ని రకాల ఫీచర్లు కొత్తగా ఉంటాయి. తయారీదారుడి నుంచి వారంటీ లభిస్తుంది. అయితే, ధర ఎక్కువ. కారుపై తరుగుదల కూడా మొదటి రెండు మూడేళ్లలో ఎక్కువగా ఉంటుంది. అదే సెకండ్ హ్యాండ్ కారు అయితే బడ్జెట్ తక్కువ. కాకపోతే కండీషన్ ఎలా ఉందన్నది జాగ్రత్తగా చూసుకునే తీసుకోవాలి. కొత్త కారుతో పోలిస్తే నిర్వహణ వ్యయం ఎక్కువ. కొత్త కారుతో పోలిస్తే తరుగుదల తక్కువ. తిరిగి విక్రయించాల్సి వస్తే కొన్న రేటుపై పెద్దగా నష్టపోయేది ఉండదు. ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా తక్కువగానే ఉంటుంది.
అందుకే ఏ కారు తమ బడ్జెట్ కు అనువైనదన్నది కొనేవారు తేల్చుకోవాలి. ఉదాహరణకు హ్యుందాయ్ కంపెనీకి చెందిన ఒక మోడల్ ను ఎంపిక చేసుకున్నారు. ధర రూ.6 లక్షలు. పైన ఇతర ఖర్చులు కూడా చూసుకుంటే మరో రూ.50వేలు అదనం. ఓ ఐదేళ్లు వాడిన తర్వాత దీనికి రూ.2 లక్షలకు మించి సేల్ వాల్యూ రాదు. అంటే నికర నష్టం రూ.4లక్షలు.
ఇప్పుడు హ్యుందాయ్ కారు కొనే బదులు మంచి కండిషన్ లో ఉన్న పాత కారును రూ.2 లక్షలకు కొన్నారనుకుందాం. దాన్ని ఐదేళ్లు వాడి రూ.60వేలకు విక్రయించారు. అంటే నికర నష్టం రూ.1.40లక్షలు. కొత్త కారును కొనకుండా ఆదా చేసిన రూ.4.5 లక్షలను ఐదేళ్ల కాలానికి మ్యూచువ్ ఫండ్స్ లో పెట్టుబడి పెడితే 12 శాతం వడ్డీతో ఐదేళ్ల తర్వాత సుమారు రూ.8 లక్షలు వస్తాయి. అంటే పాత కారు విక్రయించే నాటికి రూ.3.5 లక్షల లాభాన్ని పొందారు. ఇప్పుడు ఏది లాభమో ఆలోచించుకోండి. పాత కారు నిర్వహణ వ్యయం ఎక్కువ అనుకున్నాం కదా. అలా చూసినా గానీ కొత్త కారుతో పోలిస్తే పాత కారు వాడకమే ఆర్థిక శాస్త్రం ప్రకారం లాభదాయకం.
ఇంకో సూత్రం ప్రకారం... హ్యుందాయ్ కారును రూ.6 లక్షలు పెట్ట ికొనడం భారం అని అనిపించిందనుకోండి. అదే సమయంలో పాత కారును కొనడం కూడా ఇష్టం లేదు. మరి ఏం చేయాలి...? కొత్త కారే కొనాలి కానీ ఖర్చు తక్కువలో ఉండాలి. అప్పుడు మధ్యే మార్గంగా రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల బడ్జెట్ (ఆన్ రోడ్ ప్రైస్) లో లభించే రెనో క్విడ్, మారుతి సుజుకి ఆల్టో, డాట్సన్ రెడిగో మోడల్స్ వైపు అడుగులు వేయడం మంచిది.
పాత కార్లను రుణాలపై పొందే వెసులుబాటు కూడా ఉంది. కాకపోతే కొత్తకార్లకిచ్చే రుణాలతో పోలిస్తే వడ్డీ రేటు 2 శాతం ఎక్కువ ఉంటుంది. సెకండ్ హ్యాండ్ కారును కొనుక్కోవడమే ఉత్తమం అనుకున్నారనుకోండి. అప్పుడు బాగా తెలిసిన వారయి ఉండి వారు కారును ఏ విధంగా వాడిందీ తెలిసి ఉంటే తీసుకోవచ్చు. ముక్కూ ముఖం తెలియని వారి దగ్గర కొనకుండా సర్టిఫయిడ్ ప్రీ ఓన్డ్ కార్లు లభిస్తాయి. కొన్ని కంపెనీలు పాత కార్లను సేకరించి వాటిని రీ కండీషన్ చేసి డీలర్ల ద్వారా విక్రయిస్తున్నాయి. వాటిని కొనుగోలు చేయడమే మంచిది. వాటికి వారంటీ కూడా లభిస్తుంది.
ఈ వారంటీ కారులోని అన్ని ముఖ్యమైన విడిభాగాలకు ఇచ్చే కంపెనీలు ఉన్నాయి. అదే సమయంలో కేవలం ఇంజన్ కు మాత్రమే సరిపెట్టే కంపెనీలు కూడా ఉన్నాయి. ఏదైమైనా సెకండ్ హ్యాండ్ కారు కొంటే అది మంచి కండీషన్ లో ఉన్నది, డీలర్ లేదా బాగా తెలిసిన వారి దగ్గర కొనడమే మంచిది. లేకుంటే అది పెట్టించే ఖర్చుకు చిరాకు రావడం ఖాయం. అందుకే కొనే ముందు మంచి మెకానిక్ తో దాన్ని చెక్ చేయించడం, మీరే స్వయంగా నడిపి చూసుకోవడం, ఇంజన్ నుంచి శబ్దాలు వస్తున్నాయేమో పరిశీలించుకోవడం తదితర జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇంధన పరంగా పొదుపైనవి
మారుతి సుజుకీ కార్లు మైలేజీ పరంగా ఉత్తమమైనవి. సియాజ్ మోడల్ (ధర సుమారు రూ.8 లక్షలు) లీటర్ డీజిల్ కు 28 లీటర్ల మైలేజీ, సెలెరియో డీజిల్ మోడల్ (ధర రూ.5 లక్షలు సుమారు) లీటర్ కు 27.62 కిలోమీటర్ల మైలేజీనిస్తాయని కంపెనీ పేర్కొంటోంది. అలానే బాలెనో మోడల్ (ధర రూ.7లక్షలు సుమారు) కూడా లీటర్ డీజిల్ కు 27.39 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది.
హోండా జాజ్ (ధర సుమారు రూ.6లక్షలకు పైగా) హచ్ బ్యాక్ డీజిల్ మోడల్ లీటరుకు 27.3 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ హామీ ఇస్తోంది. టాటా టియాగో (ధర రూ.4లక్షలకు పైగా) డీజిల్ మోడల్ లీటర్ ఇంధనంతో 27.29 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంటోంది. మారుతి స్విఫ్ట్ డిజైర్ డీజిల్ మోడల్ (రూ.6లక్షలకు పైగా) కూడా 26.59 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది. హోండా సిటీ (రూ.10 లక్షలకు పైనే) డీజిల్ మోడల్ 26 కిలోమీటర్లు, ఫోర్డ్ ఫిగో డీజిల్ మోడల్ (రూ.7లక్షలకు పైనే) 25.83 కిలోమీటర్లు, హండా అమేజ్ డీజిల్ మోడల్ ( రూ. 7లక్షలకు పైనే) 25.8కిలోమీటర్లు, చెవ్రోలెట్ బీట్ డీజిల్ (రూ.6లక్షలకు పైనే) 25.44 కిలోమీటర్లు, రెనో క్విడ్ పెట్రోల్ వెర్షన్ (రూ.3లక్షలకు పైగా) 25.17 కిలోమీటర్లు మైలేజీనిస్తున్నాయి.
రూ.5 లక్షల్లోపు ఆదరణ పొందుతున్నవి
మారుతి సుజుకి ఆల్టో, వ్యాగన్ ఆర్, సెలరియో, రెనో క్విడ్, హ్యుందాయ్ ఇయాన్, ఐ10, డాట్సన్ రెడీగో మొదలైన మోడల్స్ ఎక్కువగా అమ్ముడుపోతున్నవి.
రూ.5లక్షల్లోపు రాబోయే మోడల్స్...
టాటా కైట్ సెడాన్ సెప్టెంబర్ లో రానున్నది. దీని ధర రూ.4 నుంచి రూ.5 లక్షల మధ్య ఉంటుందని అంచనా. ఫోర్డ్ ఫిగో యాస్పైర్, మారుతి సుజుకి డిజైర్ లకు ఇది పోటీ ఇవ్వనుంది. డీజిల్ ఇంజన్ వేరియంట్ 25 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది అంచనా.
టాటా పెలికాన్
టాటాల మరో చిన్నకారు అయిన పెలికాన్ ఆగస్టులో మార్కెట్లోకి వస్తుందని అంచనా. ధర రూ.2.50లక్షల నుంచి రూ.3.80లక్షల మధ్య ఉండవచ్చు. మారుతి ఆల్టోకి ఇది పోటీ కాగలదు. ఇది 800సీసీ పెట్రోల్ ఇంజన్ తో ఉంటుంది. 22 కిలోమీటర్ల మైలేజీనిస్తుందంటున్నారు.
చెవ్రోలెట్ బీట్ కొత్త మోడల్ త్వరలో రానుంది. పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో రానున్న దీని ధర రూ.4.5లక్షల వరకు ఉండవచ్చని భావిస్తున్నారు. మారుతి సెలెరియో, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10లకు ఇది పోటీగా ఉంటుందంటున్నారు. అలాగే, చెవ్రోలెట్ బీట్ యాక్టివ్ పేరుతో రూ.5 లక్షల ధరతో మరో మోడల్ డిసెంబర్ లోపు రానుంది. హ్యుందాయ్ శాంత్రో కొత్త మోడల్ 2018లో వస్తుందని అంచనా వేస్తున్నారు. దీని ధర రూ.4 లక్షల నుంచి ప్రారంభం కావచ్చని అంచనా.