బీపీ మెషిన్ ఎలాంటిది తీసుకోవాలి...? బీపీ ఉన్నట్టు ఎలా తెలుస్తుంది..?
సైలంట్ కిల్లర్. రక్తపోటు (బ్లడ్ ప్రజర్/బీపీ)కి మరోపేరు. బీపీని నియంత్రణలో ఉంచుకోకపోతే అది ఎన్నో సమస్యలకు కారణమవుతుంది. హార్ట్ ఎటాక్, పక్షవాతం, కిడ్నీ ఫెయిల్యూర్ బారిన పడే ప్రమాదం ఉంటుంది. మరి బీపీ నియంత్రణలో ఉందా? లేదా? అన్నది ఎలా తెలుస్తుంది...? బీపీ మానిటర్ ద్వారా క్రమం తప్పకుండా పరీక్షించుకుంటే సరి. అందుకోసం ఆస్పత్రి చుట్టూ తిరగడం కంటే ఓ మంచి బీపీ మానిటర్ ను ఇంట్లో ఉంచుకోవడం ఉపయోగకరం. మరి కొనే ముందు పరిశీలించాల్సిన విషయాలు ఉన్నాయి. అలాగే, బీపీ గురించి చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఆరోగ్యవంతులకు రక్తపోటు 120/80కి మించి ఉండరాదు. కానీ, నేడు మధ్య వయసు దాటిన చాలా మందిలో బీపీ ఈ లెవల్స్ కు పైనే ఉంటోంది. అది కొంత కాలానికి హైపర్ టెన్షన్ గా మారుతోంది. జీవన విధానం మారిపోయింది. ఉద్యోగం, ఇంట్లోనూ రకరకాల ఒత్తిళ్ల కారణంగా బీపీ నియంత్రణ దాటుతోంది. రక్తపోటు నియంత్రణలో ఉంచుకోకపోతే ధమనులను దెబ్బతీస్తుంది. శరీరంలోని కీలక అవయవాలపై ప్రభావం చూపెడుతుంది. అందుకే వైద్యుడి సూచనల మేరకు బీపీ నియంత్రణలో ఉంచుకోవడానికి మందులు వాడాల్సి ఉంటుంది. బీపీ ఎంతుంటుందో క్రమం తప్పకుండా పరీక్షించుకోవాల్సి ఉంటుంది.
ఏందుకు ఈ రక్తపోటు...?
గుండె నుంచి రక్తాన్ని ధమనులు శరీరంలోని అన్ని భాగాలకు తీసుకెళతాయి. గుండె రక్తాన్ని చాలా ఒత్తిడితో పంప్ చేస్తుంది. దాంతో అది వేగంగా ధమనుల ద్వారా ప్రయాణం చేస్తుంది. ఈ ఒత్తిడినే రక్తపోటు అంటారు. బ్లడ్ ప్రజర్ అందరిలోనూ ఉంటుంది. 120/80కు తక్కువగా ఉన్నంత వరకూ ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు రావు. కానీ ఈ ఒత్తిడి పెరిగిపోతేనే ఎన్నో రకాల సమస్యలు మొదలవుతాయి. 120/80కు మించి 140/90 లోపు ఉంటే దాన్ని ప్రీ హైపర్ టెన్షన్ గా చెబుతారు. అదే 140/90 అంతకంటే ఎక్కువ ఉంటే స్టేజ్ 1 హైపర్ టెన్షన్ (అధిక రక్తపోటు) గా చెబుతారు.
160/100 కంటే ఎక్కువ ఉంటే స్టేజ్ 2 హైపర్ టెన్షన్ గా, అంతకంటే అధికంగా ఉంటే తీవ్ర సమస్యగా పరిగణించాలి. 60 ఏళ్లు దాటిన వారికి 150/90 ఉంటేనే హైపర్ టెన్షన్ ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. అదే విధంగా ఈ రక్తపోటు 85/55 వరకు తగ్గినా ఇతరత్రా ఎలాంటి లక్షణాలు లేకుంటే కంగారు పడక్కర్లేదు. తక్కువగా ఉండి కళ్లు తిరుగుతున్నా, తల తిరుగుతున్నా, మూర్చిల్లుతున్నా, ఏకాగ్రత లేకపోయినా, కళ్లు బైర్లు కమ్ముతున్నా, వెంటనే వైద్యుడి వద్దకు వెళ్లాలి. హైపర్ టెన్షన్ ఉన్న సమయంలో తలపోటు, తల వెనుక మెడపై భాగంలో బాగా లాగినట్టు ఉండడం, చిరాకు, కోపం తదితర లక్షణాలు కొందరిలో కనిపించవచ్చు. కొంత మందిలో పైకి ఎలాంటి లక్షణాలు కనిపించవు.
హైపర్ టెన్షన్ ఉంటే వైద్యుడి చెకప్ అవసరం
హైపర్ టెన్షన్ ఉన్నవారు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. అప్పుడు మీ వైద్య చరిత్ర, ఏవైనా గుండె జబ్బులు ఉన్నాయా, పొగ తాగే అలవాటు ఉందా తదితర సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. కొలెస్టరాల్, డయాబెటిస్ ఉందేమోనన్న అనుమానంతో రక్త పరీక్షలకు సిఫారసు చేస్తారు. దీనికితోడు వైద్యులు స్టెతస్కోప్ తో హృదయ స్పందనలను పరిశీలిస్తారు. వేగంగా కొట్టుకుంటుంటే ధమనుల పరిస్థితిని తెలుసుకునేందుకు ఈసీజీ, ఎకో, అల్ట్రాసౌండ్ పరీక్షలను సూచించవచ్చు. దీంతో ముందస్తుగా గుండె సంబంధిత సమస్యల బారిన పడకుండా జాగ్రత్తపడవచ్చు.
ఇంట్లో బీపీ మానిటర్ ఉంటే సేఫ్
ప్రీ హైపర్ టెన్షన్ లేదా హైపర్ టెన్షన్ సమస్య ఉంటేనే బీపీ మానిటర్ అవసరం అన్న భావన ఉంటే దాన్ని చెరిపేయండి. ఇంట్లో బీపీ మానిటర్ ఉంటే రక్తపోటు నియంత్రణ తప్పకుండా ముందుగానే కట్టడి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 25 ఏళ్ల వయసు దాటిన వారందరూ నెలకోసారి అయినా బీపీ చూసుకోవడం ద్వారా అది నియంత్రణలో ఉన్నదీ, లేనిదీ తెలుస్తుంది. ప్రారంభంలోనే డాక్టర్ ను సంప్రదించి సూచనల మేరకు జీవన విధానాన్ని మార్చుకోవడం ద్వారా హైపర్ టెన్షన్ గా మారకుండా జాగ్రత్త పడవచ్చు.
సిస్టోలిక్ ప్రజర్ 180 నుంచి 200 పాయింట్లు దాటితే వారి శరీర ధర్మాన్ని బట్టి పక్షవాతం బారిన పడే ప్రమాదానికి చేరువ అవుతున్నట్టు గుర్తించాలి. శరీరంలో తీవ్ర సమస్య ఉందని తెలుసుకోవాలి. హైపర్ టెన్షన్ ఉన్నవారు ఉదయం వేళ బీపీ మానిటర్ తో రోజుకు ఒక్కసారి అయినా చెక్ చేసుకోవడం ద్వారా ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. స్ట్రోక్ కు గురయ్యే ప్రమాదం ఉన్నవారికి ఉదయం బీపీ ఎక్కువగా ఉంటుందట. వీలుంటే హైపర్ టెన్షన్ బాధితులు ఉదయం, సాయంత్రం కూడా పరీక్షించుకోవడం క్షేమదాయకం.
బీపీ మానిటర్లలో రకాలు...
డిజిటల్, మాన్యువల్ అని రెండు రకాల బీపీ పరీక్షా యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. మాన్యువల్ అయితే అందులో పాదరసంతో కూడిన స్కేల్ కు ఓ ఎయిర్ బ్యాగ్ (కఫ్) ను పైపు ద్వారా అనుసంధానించి దాన్ని చేతి భుజం కింద కట్టుకోవాలి. 180 పాయింట్ల వరకు గాలి పంప్ చేసి నిదానంగా విడిచిపెట్టాలి. ఆ తర్వాత చేయి మడత భాగంలో కఫ్ కింద స్టేతస్కోప్ ను ఉంచడం ద్వారా బీపీ ఎంతుందో తెలుసుకోవచ్చు. అదే డిజిటల్ అయితే, ఇంత శ్రమ ఉండదు. చేతి పై భాగంలో కఫ్ కట్టేసి బటన్ నొక్కేస్తే చాలు. దానంతట అదే పౌచ్ లోకి గాలిని పంపిస్తుంది. వెంటనే బీపీ ఎంతుందో మానిటర్ లో అంకెల రూపంలో కనిపిస్తుంది. డిజిటల్ లో కూడా మూడు రకాలు ఉన్నాయి. అప్పర్ ఆర్మ్, రిస్ట్, ఫింగర్ బీపీ మానిటర్లు. అప్పర్ ఆర్మ్ అంటే భుజం కింద చేతికి పై భాగంలో కట్టుకునేది. రిస్ట్ కు కట్టుకుని పరీక్షించుకునే దానిని రిస్ట్ మానిటర్ గా పేర్కొంటారు. వేలుకి కట్టుకునే మానిటర్ ఫింగర్ మానిటర్.
వైర్ లెస్
వైర్ లెస్ గా పనిచేసేవి కూడా ఉన్నాయి. కఫ్ ను చేతికి కట్టుకోవాలి. బ్లూటూత్ ద్వారా యాండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో బీపీ ఎంతుందో చూసుకోవచ్చు. క్వార్డియో, ఐ హెల్త్ తదితర బ్రాండ్లు ఈ రకం మానిటర్లను విక్రయిస్తున్నాయి. ఇందులో ఐ హెల్త్ మానిటర్ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.5వేలు.
ఫలితాల్లో కచ్చితత్వం
వైద్యులు నాణ్యమైన, ప్రమాణాలతో కూడిన బీపీ మానిటర్లను ఉపయోగిస్తుంటారు. మరి ఇంట్లో పరీక్షించుకోవడానికి సౌకర్యంతో పాటు ఫలితాల కచ్చితత్వం కూడా అవసరం. డిజిటల్ లో రిస్ట్ మానిటర్లు కంటే హృదయానికి దగ్గరగా చేతికి కట్టే అప్పర్ ఆర్మ్ మానిటర్లలో ఫలితాల కచ్చితత్వం ఎక్కువ. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కూడా అప్పర్ ఆర్మ్ డిజిటల్ మానిటర్లను మాత్రమే సిఫారసు చేస్తోంది. రిస్ట్, వేలికి ధరించే బీపీ మానిటర్లలో ఫలితాల కచ్చితత్వం తక్కువ కనుక వాటిని సూచించలేదు. ఇక సంప్రదాయ బీపీ మానిటర్ లోనూ ఫలితాలు కచ్చితంగానే ఉంటాయి.
ఫీచర్లు.... బీపీ లెవల్ ఇండికేటర్
డిజిటల్ బీపీ మానిటర్లలో బీపీ ఎక్కువగా ఉంటే రెడ్ కలర్, సాధారణంగా ఉంటే గ్రీన్ కలర్ లో ఫలితాలు కనిపించే సౌకర్యం ఉంది. హైపర్ టెన్షన్ రేంజ్ లో ఉంటే హెచ్చరించే మెషిన్లు కూడా ఉన్నాయి. గతంలో చూసుకున్న రీడింగ్స్ ను భద్రపరిచే సౌలభ్యం కూడా అన్నింటిలో ఉంటోంది. సుమారు 100 నుంచి 200 వరకు రీడింగ్స్ స్టోర్ అయి ఉంటాయి. వైద్యుడు దగ్గరకు వెళ్లినప్పుడు చూపించేందుకు ఈ డేటా ఉపయోగకరంగా ఉంటుంది.
కఫ్ సైజు
కఫ్ సైజు చేతికి సరిపోయే విధంగా ఉండాలి. అలాగే సరిగా ధరించాలి. అప్పుడే కచ్చితమైన రీడింగ్ వస్తుంది. పిల్లలకు, పెద్దలకు ఒకే సైజు కఫ్ సరిపోదు. అందుకే వాడే కఫ్ సరిపోకపోతే పెద్దల కోసం మరొకటి కొనుగోలు చేసుకుంటే సరి. కఫ్ లలో స్మాల్, మీడియం, లార్జ్ సైజులు ఉంటాయి. స్మాల్ అంటే 7.1నుంచి 8.7 అంగుళాల మేర కఫ్ పొడవు ఉంటుంది. మీడియంలో 8.8 నుంచి 12,8 అంగుళాలు, లార్జ్ లో 12.8 నుంచి 18 అంగుళాల మేర ఉంటుంది. ఎక్కువ శాతం బీపీ మానిటర్లు మీడియం సైజు కఫ్ తో విక్రయానికి వస్తుంటాయి.
అడాప్టర్లు ఉన్నవి అయితే బెటర్
డిజిటల్ మానిటర్లు బ్యాటరీల సాయంతో పనిచేస్తాయి. బ్యాటరీలతోపాటు అడాప్టర్లతో పనిచేసేవి కూడా ఉన్నాయి. అడాప్టర్ అయితే నేరుగా కరెంట్ ప్లగ్ పిన్ కు అనుసంధానించుకుని పరీక్షించుకోవచ్చు. ఈ రెండు సౌకర్యాలు ఉన్నదాన్ని తీసుకోవడమే సరైనది. మానిటర్ బరువు, సైజును కూడా గమనించాలి.
వైద్యుడి సలహా మేరకు...
ఇంట్లో పరీక్షించుకోవడానికి అనువైన బీపీ మానిటర్ ఏదో వైద్యుడిని సలహా కోరవచ్చు. కొనుగోలు చేసిన దాన్ని అప్పుడప్పుడు వైద్యుడి వద్దకు తీసుకెళ్లి రీడింగ్ కచ్చితత్వాన్ని నిర్ధారించుకోవడం మంచిది. ఎందుకంటే కొన్న తర్వాత కొన్నేళ్లకు పనితీరులో మార్పు రావచ్చు.
ఎప్పుడు చెక్ చేసుకోవాలి?... ఎప్పుడు చేసుకోవద్దు...?
కొంత మంది వైద్యుడన్నా, హాస్పిటల్ అన్నా తెలియని ఆందోళన, భయానికి గురవుతారు. అలాంటి వారికి హాస్పిటల్ లో పరీక్షించినప్పుడు బీపీ ఎక్కువగా ఉండవచ్చు. కానీ, ఇంట్లో చూసుకున్నప్పుడు ఈ భయమేమీ ఉండదు కనుక తక్కువగా చూపించవచ్చు. ఇది తెలుసుకోకుండా మానిటర్ సరిగా పనిచేయడం లేదనుకోవద్దు.
ప్రెడ్నిస్ లోన్ సహా కొన్ని రకాల మందుల వల్ల బీపీ పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే బీపీ ఎక్కువగా అనిపించిన సందర్భాల్లో వాడే మందుల విషయమై వైద్యుడి సలహా తీసుకోవాలి.
మూత్రసంచి నిండి ఉన్నా సిస్టోలిక్ 15 పాయింట్లు, డయాస్టోలిక్ 10 పాయింట్ల మేర పెరుగుతుందట. అందుకే మూత్ర విసర్జన తర్వాతే బీపీ చెక్ చేసుకోవాలి.
ఒత్తిడి, ఆందోళనలో ఉన్నా, అప్పుడే పొగత్రాగినా, శీతల వాతావరణంలో ఉన్నా, అప్పుడే వ్యాయామం చేసి ఉన్నా, కాఫీ తీసుకున్నా, ఉప్పు ఎక్కువగా ఉన్న పదార్థాలు తిన్న తర్వాత బీపీ ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే ఇలాంటివి చేసిన వెంటనే బీపీ ఎంతుందో చూసుకోవద్దు.
కూర్చునే భంగిమా ముఖ్యమే
కుర్చీలో నిటారుగా వీపును వెనక్కు ఆనించి కూర్చోవాలి. కాళ్లు రెండు వంకర్లు లేకుండా నేలపై ఆనించాలి. కఫ్ కట్టుకునే చేయి బల్లపై ఉంచాలి. బీపీ పరీక్షించే సమయంలో మాట్లాడకుండా ఉండాలి. బీపీ ఎక్కువగా, మరీ తక్కువగా నమోదైతే... పది నిమిషాల తర్వాత మరోసారి పరీక్షించి నిర్ధారించుకోవాలి. బీపీ పరీక్షించే సమయంలో కదలకూడదు. ఫలితాలను నమోదు చేస్తున్న సమయంలో అసాధారణ కదలిక ఏదైనా చోటు చేసుకుంటే తిరిగి మరోసారి పరీక్షించుకోవాలి.
సాధారణంగా ఎడమచేతికి కఫ్ కట్టుకుని పరీక్షించుకోవాలని ఎక్కువ మంది సూచిస్తుంటారు. ఎందుకంటే గుండెకు దగ్గరగా ఉంటుందని. షర్ట్ మీదే కట్టేసి బీపీ చూసుకోవడం సరైనది కాదు. పల్చగా ఉంటే పర్వాలేదు కానీ వస్త్రం మందంగా ఉంటే దాన్ని పక్కకు తప్పించి కఫ్ కట్టాలి. అలాగే కఫ్ ను చాలా గట్టిగా బిగించి కట్టేయవద్దు. ఇలా చేస్తే ఒత్తిడి పెరిగి బీపీ ఎక్కువగా రీడ్ అవుతుంది. లూజ్ లేకుండా బిగుతుగా కట్టండి.
అట్రియల్ ఫిబ్రిలేషన్
ఈ సమస్య ఉన్న వారిలో నాడి స్పందనలు అసాధారణంగా ఉంటాయి. దీంతో డిజిటల్ బీపీ మానిటర్లు రీడింగ్స్ ను కచ్చితంగా చూపించలేవు. ఆగకుండా నాడి పది నుంచి 15 సార్లు కొట్టుకుని నిదానించి మళ్లీ ఒకేసారి ఆగకుండా పది పదిహేను సార్లు కొట్టుకుంటూ ఉంటుంది. ఈ సమస్య ఉన్నవారిలో నాడీ స్పందనలు నిమిషానికి 200 వరకు కూడా వెళ్లవచ్చు. అయితే, సంప్రదాయ బీపీ మానిటర్లలో దీన్ని స్టెతస్కోప్ తెలియజేస్తుంది.