బీమా రెగ్యులేటరీ, అంబుడ్స్ మెన్ వల్ల ప్రయోజనాలు
మార్కెట్లో పదుల సంఖ్యలో బీమా కంపెనీలు, ప్రతీ కంపెనీకి లక్షల సంఖ్యలో పాలసీదారులు ఉన్నారు. బీమా నియంత్రణ ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏ) ఒకవైపు పాలసీదారుల ప్రయోజనాల పరిరక్షణకు చర్యలు తీసుకుంటూనే, మరోవైపు బీమా కంపెనీలను నియంత్రిస్తూ, నిబంధనల మేరకు నడుచుకునే విధంగా చర్యలు తీసుకుంటూ ఉంటుంది. బీమా రంగ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తుంది. ఐఆర్డీఏతోపాటు బీమా అంబుడ్స్ మెన్ వల్ల ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం.
ప్రతీ సేవకు కాలపరిమతి ఉంది
పాలసీదారుల ప్రయోజనాల పరిరక్షణ నియంత్రణలు 2002 కింద బీమా కంపెనీల సేవలకు ఐఆర్డీఏ కాలపరిమితి విధించింది. సాధారణ బీమా పాలసీ దరఖాస్తును 15 రోజుల్లోగా ప్రాసెస్ చేయాలి. పాలసీ జారీ, పాలసీ రద్దు 30 రోజుల్లోగా పూర్తి చేయాలి. పాలసీ జారీ అనంతరం అందులో ఏవైనా తప్పులు ఉన్నా వాటిని సరి చేసేందుకు, రద్ధు కోరితే చెల్లించిన ప్రీమియంను (చార్జీలు పోను) వెనక్కి ఇచ్చేయడానికి 10 రోజులకు మించి సమయం తీసుకోరాదు. సర్వే రిపోర్టు సమర్పించడానికి గరిష్ఠ కాల వ్యవధి 30 రోజులు. అదే జీవిత బీమా అయితే, మరణం సంభవించిన సందర్భాల్లో బీమా పరిహారం కోసం క్లెయిమ్ దాఖలైతే... 30 రోజుల్లోగా నామినీలకు పరిహారం చెల్లించాలి. మరణం ఎలా సంభవించిందీ అన్న విచారణ అవసరం లేని క్లెయిమ్ లకే ఇది వర్తిస్తుంది. ఒకవేళ విచారణ అవసరమైన కేసుల్లో గరిష్ఠంగా ఆరు నెలల్లోపు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. గడువు తీరిన తర్వాత పాలసీదారుడు జీవించి ఉంటే... అతడికి రావాల్సిన ప్రయోజనాలను క్లెయిమ్ తర్వాత 15 రోజుల్లోగా అందించాలి. పాలసీ సరెండర్ చేస్తే 10 రోజుల్లోపు చెల్లింపులు పూర్తి చేయాలి. ఏదైనా ఫిర్యాదు దాఖలైతే మూడు రోజుల్లోగా దానిపై స్పందించాలి. 15 రోజుల్లోపు పరిష్కరించాలి.
కంపెనీ సేవల విషయంలో సంతృప్తి చెందకుంటే
బీమా కంపెనీ లేదా కంపెనీ తరఫున మధ్యవర్తిత్వపు కంపెనీ సేవలు నచ్చకపోతే పాలసీదారులు ముందుగా కంపెనీ ఫిర్యాదుల పరిష్కార విభాగం అధికారికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయాలి. వీలైతే తగిన ఆధారాలను జత చేయాలి. తన ఫిర్యాదును బీమా కంపెనీ పట్టించుకోకపోతే, నిర్ణీత కాల వ్యవధిలోపు పరిష్కరించకపోతే ఐఆర్డీఏ కార్యాలయంలోని వినియోగదారుల వ్యవహారాల విభాగాన్ని సంప్రదించి ఫిర్యాదును దాఖలు చేయవచ్చు. ఫిర్యాదు అందిన తర్వాత ఐఆర్డీఏ సంబంధిత బీమా కంపెనీతో సంప్రదింపులు జరిపి సమస్య పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటుంది.
ఐఆర్డీఏ వద్ద ఫిర్యాదు దాఖలుకు ఫిర్యాదుల పరిష్కార విభాగం టోల్ ఫ్రీ నంబర్ 155255 లేదా 1800 425 4732, ఈ మెయిల్ complaints@irda.gov.in, www.igms.irda.gov.in వెబ్ సైటులో ఫిర్యాదు నమోదు చేయవచ్చు. ఫిర్యాదును పోస్ట్, కొరియర్, ఫ్యాక్స్ ద్వారానూ పంపవచ్చు. consumers affairs department, IRDA, 3-5-817/818, United India Towers, 9th floor, hyderguda, basheerbagh, Hyderabad 500029, FAx 040 66789768. టోల్ ఫ్రీ నంబర్ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఇంగ్లిష్, హిందీ, ప్రాంతీయ భాషల్లో సేవలు అందిస్తుంది.
ఇంటెగ్రేటెడ్ మేనేజ్ మెంట్ సిస్టమ్
ఫిర్యాదులు, సమస్యల పరిష్కారం కోసం గాను ఐఆర్డీఏ ఏకీకృత నిర్వహణ విధానాన్ని (ఐజీఎంఎస్) 2011లో అమల్లోకి తీసుకొచ్చింది. బీమా కంపెనీలు, పాలసీదారులను ఇది ఒకే వేదికపైకి తీసుకొస్తుంది.
ఫిర్యాదుపై ఐఆర్డీఏ ఏం చేస్తుంది?
ఫిర్యాదు నమోదు చేసి దానికో ప్రత్యేక టోకెన్ నంబర్ ను జారీ చేస్తుంది. ఫిర్యాదు అందినట్టు, టోకెన్ నంబర్ ను మెయిల్ ఐడీ, అది ఇవ్వని సందర్భాల్లో పోస్ట్ ద్వారా ఫిర్యాదు దారుడి చిరునామాకు పంపిస్తుంది. ఏజీఎంఎస్ లో ఫిర్యాదు గురించి పేర్కొంటుంది. ఫిర్యాదును పరిష్కారం కోసం బీమా కంపెనీకి పంపిస్తుంది. ఈ ఫిర్యాదును పరిశీలించి రెండు వారాల్లోగా బీమా కంపెనీ ఫిర్యాదు దారుడికి పరిష్కారం చూపాల్సి ఉంటుంది. ఫిర్యాదుపై తీసుకున్న చర్యల గురించి బీమా కంపెనీ సైతం ఐజీఎంఎస్ లో అప్ డేట్ చేస్తుంది. తన ఫిర్యాదుపై తీసుకున్న చర్యల గురించి పాలసీదారుడు ఐజీఎంఎస్ నుంచి తెలుసుకోవచ్చు. లేదా ఐఆర్డీఏలోని ఫిర్యాదుల పరిష్కార విభాగానికి కాల్ చేసి కూడా తెలుసుకోవచ్చు. బీమా కంపెనీ చర్యలపై పాలసీదారుడు 8 వారాల్లోపు ఏమీ స్పందించకుంటే... దానిపై సంతృప్తి చెందినట్టు భావించి ఫిర్యాదును మూసివేస్తారు. ఒకవేళ బీమా కంపెనీ తన ఫిర్యాదుపై 15 రోజుల్లోగా స్పందించకపోతే లేదా కంపెనీ స్పందనపై సంతృప్తి అనిపించకపోతే అప్పుడు పాలసీదారుడు బీమా అంబుడ్స్ మెన్ లేదా న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు.
ఇన్సూరెన్స్ అంబుడ్స్ మెన్ ఎందుకు..?
అంబుడ్స్ మెన్ ను స్వతంత్ర న్యాయాధికారిగా పేర్కొనవచ్చు. బీమా కంపెనీలతో పాలసీదారులకు, వారి చట్టబద్ధ వారసులకు మధ్య వివాదం ఏర్పడిన సందర్భాల్లో, సమస్యల పరిష్కారానికి గాను కేంద్ర ప్రభుత్వం బీమా చట్టం 1938 ప్రకారం ‘రిడ్రెస్సల్ ఆఫ్ పబ్లిక్ గ్రివెన్సెన్ రూల్స్ 1998’ పేరిట నిబంధనలను రూపొందించింది. ఇవి అదే ఏడాది నవంబర్ 11 నుంచి అమల్లోకి వచ్చాయి. వీటిని అమలు చేసేందుకు వీలుగా బీమా అంబుడ్స్ మెన్ ఏర్పడింది. ఇది 1999 నుంచి ఆచరణలో వచ్చింది. అంబుడ్స్ మెన్ ను కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. దేశంలో వివిధ ప్రాంతాల్లో మొత్తం 12 అంబుడ్స్ మెన్ లు ఉన్నాయి. ఇవి తమ ప్రాంతం పరిధిలో పాలసీదారుల ఫిర్యాదులు, బీమా కంపెనీలతో నెలకొన్న వివాదాల పరిష్కారానికి కృషి చేస్తాయి.
అంబుడ్స్ మెన్ దగ్గర ఫిర్యాదు ఎలా..?
తొలుత బీమా కంపెనీకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయాలి. దీనిపై 30 రోజుల్లోపు స్పందించకపోయినా, ఫిర్యాదును తిరస్కరించినా, సమాధానం సంతృప్తికరంగా లేకపోయినా అప్పటి నుంచి ఏడాది లోపు బీమా అంబుడ్స్ మెన్ దగ్గర ఫిర్యాదు దాఖలు చేయవచ్చు. ఇందులో పాలసీదారుడు లేదా, అతడి చట్టబద్ధ వారసులు తమ పేరు చిరునామాను స్పష్టంగా పేర్కొనాలి. ఫిర్యాదు దాఖలు చేసిన బీమా కంపెనీ శాఖ వివరాలు, ఫిర్యాదు ముట్టినట్టు అక్నాలెడ్జ్ మెంట్, తమ సమస్య, దానికి సంబంధించిన ఆధారాలు, జరిగిన నష్టం ఇలా అన్ని వివరాలను ఇవ్వాలి. అయితే, ఈ సమస్యపై అప్పటికే కోర్టు లేదా వినియోగదారుల ఫోరం లేదా ఇర్బిట్రేటర్ ను ఆశ్రయించి ఉన్నా, లేదా వాటి దగ్గర తీర్పు జారీ అయినా అంబుడ్స్ మెన్ ను ఆశ్రయించడానికి వీల్లేదు.
ఎలా పరిష్కరిస్తారు...?
పాలసీదారుడు లేదా అతని చట్టబద్ధ వారసుల నుంచి వచ్చిన ఫిర్యాదును బీమా కంపెనీ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి అంబుడ్స్ మెన్ మధ్యవర్తిత్వ పాత్ర పోషిస్తుంది. ఇరు వర్గాల మధ్య పరస్పర అంగీకారం కుదిర్చేలా చేస్తుంది. ఫిర్యాదులో ఉన్న అంశాల ఆధారంగా నెలలోపు తగిన సిఫారసులు చేస్తుంది. ఈ సిఫారసులను బీమా కంపెనీ, పాలసీదారుడికి పంపుతుంది. ఈ సిఫారసులపై పాలసీదారుడు లేదా చట్టబద్ధ వారసులు సంతృప్తి చెందితే అదే విషయాన్ని బీమా కంపెనీకి తెలియజేస్తుంది. ఈ సిఫారసులను 15 రోజుల్లోగా అమలు చేయాలి. ఇది ఫలితం ఇవ్వకుంటే మూడు నెలల్లోపు అంబుడ్స్ మెన్ తనకు తానుగా ఆదేశాలు జారీ చేస్తుంది. పరిహారం చెల్లింపునకు ఆదేశిస్తుంది. ఇదే విషయాన్ని ఫిర్యాదుదారుడు, బీమా కంపెనీలకు తెలియజేస్తుంది.
దీనిపై ఫిర్యాదు దారుడు తన అంగీకారాన్ని నెలలోపు బీమా కంపెనీకి తెలియజేయాల్సి ఉంటుంది. ఫిర్యాదు దారుడు స్పందించకుంటే అంబుడ్స్ మెన్ ఆదేశాలను బీమా కంపెనీ అమలు చేయకపోవచ్చు. ఫిర్యాదుదారుడు అంగీకారాన్ని తెలియజేస్తే బీమా కంపెనీ 15 రోజుల్లోపు అంబుడ్స్ మెన్ ఆదేశాలను అమల్లో పెట్టాలి. మరిన్ని వివరాలకు ఏపీ, తెలంగాణ, యానాం, పుదుచ్చేరి ప్రాంత వాసులు దిగువ బీమా అంబుడ్స్ మెన్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. లేదా www.policyholder.gov.in, www.irda.gov.in వెబ్ సైట్ల నుంచి వివరాలు తెలుసుకోవచ్చు. Office of the Insurance Ombudsman, 6-2-46, 1st floor, "Moin Court" Lane Opp. Saleem Function Palace, A. C. Guards, Lakdi-Ka-Pool, Hyderabad - 500 004. Tel.:- 040-65504123/23312122, Fax:- 040-23376599, Email:- bimalokpal.hyderabad@gbic.co.in