శునక పోషణ గురించి తెలుసుకోవాల్సిన ఎన్నో విషయాలు

ఇంటికి రక్షణ కోసం, ఇంట్లో వారికి ఓ నేస్తంగా కుక్కలను పెంచుకునే సంస్కృతి పట్టణాలు, నగరాల్లో పెరుగుతూ వస్తోంది. ఇంట్లో కుక్క పిల్లలు ఉంటే మంచి టైమ్ పాస్. నిజమే, కానీ ఇంట్లో ఓ పెంపుడు కుక్కను పోషించాలంటే ఆర్థికంగా కాస్త బలం కూడా కలిగి ఉండాలి. అంతకంటే ఎక్కువ ఓపిక ఉండాలి. బాధ్యత ఉండాలి. ఎందుకన్నది పరిశీలిద్దాం. అలాగే, ఏ అవసరానికి ఏ జాతి శునకం అనువైనదో కూడా తెలుసుకుందాం.

ఓ శునక ప్రేమికుడు ఎంతో ఉత్సాహంగా ఓ కుక్క పిల్లను కొనుక్కుని ఇంటికి తెచ్చుకున్నాడు. అందుకు 30వేల రూపాయలకు పైగా ఖర్చు చేశాడు. కొన్ని రోజుల పాటు దానితో ఆటలు, వాకింగ్ తో ఎంతో సంతోషాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ శునక చేష్టలు చూసి చిన్నతనంలో తాను చేసిన అల్లరి, జ్ఞాపకాలు గుర్తుకు రావడంతో తెగ ఆనందపడ్డాడు. కానీ, నెల తిరిగే సరికి అతడికి అసలు విషయం బోధపడింది. ముద్దుగా పెంచుకుంటున్న శునకం కోసం ఆ నెలలో అతడికి అయిన ఖర్చు సుమారు 10వేల రూపాయలు. వైద్యం, పోషణ కోసం అయిన ఖర్చు ఇది. కానీ, అతడి నెల సంపాదన చూస్తే 30వేల రూపాయలు. ఇక ఆ శునకాన్ని కాలకృత్యాలు తీర్చుకునేందుకు వీలుగా బయటకు తీసుకెళ్లే బాధ్యత కూడా అతడిపైనే పడింది. ఇంట్లో భార్య సహా ఎవరూ దాన్ని చూసుకునేందుకు ముందుకు రాలేదు. స్నానం దగ్గర నుంచి దాన్ని వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లే వరకు అన్ని పనులూ అతడిపైనే పడ్డాయి. అందుకే శునకాన్ని కొనుక్కునే ముందు అన్ని విషయాలను జాగ్రత్తగా తరచి చూసుకోవాలన్నది సూచన.

శునకం కోసం పెట్టుబడి

ఇంట్లో పెంచుకునేందుకు అనువైన ఎన్నోజాతుల కుక్క పిల్లలు ఉన్నాయి. వీటి ధర 5 వేల రూపాయల నుంచి 2.5 లక్షల వరకు ఉంటుంది. అందుకే శునకాన్ని కొనుక్కోవాలన్న ఆలోచన వస్తే అందుకు కొద్దిగా ముందు నుంచే బడ్జెట్ సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. కొన్న వెంటనే దాని కోసం పొదుపు మొదలు పెట్టండి. ఎందుకంటే మనం పస్తులున్నా... దాన్ని పస్తులతో పడుకోబెట్టలేము కదా. చికిత్స చేయించకుండా ఉండలేముగా..!  

representation image

అనారోగ్యం వస్తే...

కుక్కలకు పలు రకాల వైరస్ ల వల్ల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. పైగా అవి ఎవరినైనా కరిస్తే వారికి రేబిస్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే కుక్క ఆరోగ్యంతోపాటు... దారిన పోయే వాళ్ల క్షేమం, ఇంకా ఇతరత్రా వైద్య చికిత్సల కోసం భారీగానే ఖర్చవుతుంది. కనీసం ఏడాదికి రెండు వేల రూపాయలు, ఇంకా ఎక్కువే ఖర్చు ఉంటుంది.

కుక్క కోసం షాపింగ్

ప్రతి నెలా బ్యాంకు ఖాతాలో జీతం పడిన వెంటనే ముందుగా బకాయిలు తీర్చడం, కిరాణా, పాలవాడు, పేపర్ బిల్లు, ఇంటి అద్దె చెల్లించడం అలవాటు. కానీ, పెంపుడు కుక్క ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత పై జాబితాతోపాటు పెట్ షాపింగ్ కూడా చేరిపోతుంది. జీతం వచ్చిన వెంటనే శునక అవసరాల కోసం షాపింగ్ చేయక తప్పదు. చిన్నారులకు ఏ మాత్రం తీసిపోకుండా కుక్కపిల్లలు ఆడుకునేందుకు కూడా మార్కెట్లో బొమ్మలు వచ్చేశాయి. పైగా కారులో బయటకు వెళ్లే సమయంలో శునకాలను వాహనంలోకి ఎక్కించుకుని వెళ్లడం కొందరికి అలవాటు. ఒక్కసారి కుక్కను కారులో తీసుకెళితే చాలు. తర్వాత నుంచి మీరు బయల్దేరడానికి ముందే కుక్క పరుగున వెళ్లి కారు డోరు దగ్గర రెడీగా ఉంటుంది. ఎందుకంటే కారు రైడింగ్ అంటే శునకాలకు కూడా మహా ఇష్టమట. కనుక వాటి కోసం కారులో సీట్లపై ప్రత్యేక కవర్లు, బెల్ట్ లు అవసరం అవుతాయి.  

ఆహారం

ఊరకుక్కలకు నాలుగు మెతుకులు పెట్టినా ఆకలి తీర్చుకుంటాయి. కానీ పెంపుడు కుక్కలకు ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. మరీ ముఖ్యంగా కుక్క పిల్లలు అయితే అవి మంచి బలంగా పెరిగేందుకు (ఇంటికి, ఇంట్లోని వారికి  రక్షణ కావాలంటే బలం ఉండాలిగా!) తోడ్పడే ఆహారం ఇవ్వాలి. దీనికి అయ్యే ఖర్చును భరించే శక్తి ఉండాలి కదా.

ఇల్లు విశాలంగా ఉందా..?

దంపతులు, ఇద్దరు పిల్లలుండి సింగిల్ బెడ్ రూమ్ ఇంట్లో నివసిస్తుంటే... కొత్తగా ఎవరైనా వస్తే స్పేస్ విషయంలో అసౌకర్యంగానే ఉంటుంది. మరి ఓ శునకం ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. అందుకే కుక్కను పెంచుకోవాలంటే మనసే కాదు ఇల్లు కూడా కొంచెం విశాలంగా ఉండాలి. తక్కువ స్థలంలోనే ఇమిడిపోయేవి కూడా ఉన్నాయిలేండి. ఒకవేళ అద్దె ఇళ్లల్లో పెంపుడు కుక్కకు కూడా చోటివ్వాలంటే యజమానులు కాస్త అధికంగా డిమాండ్ చేసే పరిస్థితి కూడా ఉంది. దీనివల్ల శునక పోషణ బడ్జెట్ పెరిగిపోతుంది. పిండికొద్దీ రొట్టె అన్నట్టు వీటిలో పెంపుడు కుక్కకు అన్నీ కల్పించాల్సిన పనిలేదు. కానీ, దాని పోషణ ఎంతో కొంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. పైగా దానిని చూసుకోవాల్సిన బాధ్యత ఎలానూ ఉంటుంది. కారులో టూర్ కు వెళితే దాన్ని తీసుకెళ్లగలరు. కానీ ఓ రైల్లో తిరుపతికి, కాశీకి వెళుతుంటే తిరిగి వచ్చే వరకు మీ పెంపుడు శునకం బాధ్యత ఎవరు నెత్తికెత్తుకుంటారు?

ఏ జాతి శునకం ఎలా ఉంటుంది?

ఏ అవసరం కోసం శునకాన్ని పెంచుకోవాలని అనుకుంటున్నారు...? అందం కోసం, రక్షణ కోసం, తోడు కోసం, పిల్లల కోసం ఇలా తమ అవసరాలను తీర్చే శునకాన్ని తెచ్చుకుంటే ఖర్చయినా తగిన ఫలితం ఉంటుంది. ప్రస్తుతం మన దేశంలోని ఇళ్లల్లో పెరుగుతున్న కుక్కల్లో అధిక శాతం పాశ్చాత్య దేశాలకు చెందిన జాతి కుక్కలే. వీటిలో రకాలు, వాటి ప్రత్యేకతలు, ఇతర వివరాలు చూద్దాం. 

representation image

లాబ్రాడర్ రిట్రీవర్ Labrador

వంటిపై మృదువైన, సిల్కీ హెయిర్ తో ఉంటుంది. 32 అంగుళాల వరకు వెంట్రుకలు పెరుగుతాయి. కనుక ఎప్పటికప్పుడు కట్ చేయిస్తూ ఉండాలి. బరువు 25 నుంచి 34 కిలోల వరకు ఉంటుంది. బ్లాక్, డార్క్ బ్రౌన్, లైట్ బ్రౌన్, గోల్డెన్, క్రీమ్ తదితర రంగుల్లో ఉంటుంది. తిండి అంటే దీనికి చాలా ఇష్టం. దాంతో బరువు పెరిగిపోతూ ఉంటుంది. అందుకే దీనితో కలసి యజమాని కూడా ప్రతి రోజూ వ్యాయామానికి వెళ్లాల్సి ఉంటుంది. వ్యాయామం లేకుండా ఈ శునకాన్ని ఇంట్లోనే అట్టిపెట్టారనుకోండి. ఫర్నిచర్ ను నమలడం మొదలెడుతుంది. అలాగే దీన్ని ఎక్కువ సమయం పాటు ఒంటరిగా వదిలివేయకూడదు. 

చాలా స్నేహంగా, ఆటలాడే తత్వంతో ఉంటుంది. మరీ ముఖ్యంగా చిన్నారులు అంటే దీనికి ఎంతో ఇష్టం. వారిని ఏమీ అనదు. పిల్లలతో స్నేహపూర్వకంగా ఉండే శునకాల్లో ఇదే ముందుంటుంది. అందుకే ఎక్కువ మంది ఇళ్లల్లో దీన్ని పెంచుకుంటుంటారు. అయితే, దీని నిర్వహణకు ఓపిక ఉండాలని తెలుసుకోండి. యజమానులకు రక్షణగా, స్పందించే గుణం దీనిలో కనిపిస్తుంది. స్విమ్మింగ్ పూల్లోకి దీన్ని తోసేశారనుకోండి. క్షేమంగా బయటకు వచ్చేస్తుంది. కెనడాలోని లాబ్రాడర్ తీరంలో గడ్డ కట్టేంత శీతల జలాల్లో చేపల కోసం మత్స్యకారులు ఏర్పాటు చేసిన వలలను బయటకు తీసుకొచ్చేందుకు ఈ శునకాలను ఉపయోగించేవారు. అందుకే వీటికి లాడ్రాడర్ రిట్రీవర్ అనే పేరు స్థిరపడింది.

representation image

పగ్ The Pug

ఎలాంటి ప్రమాదం లేని శునకం. హచ్ (ప్రస్తుతం వొడాఫోన్) ప్రకటనలో చిన్న కుక్కను చూసే ఉంటారు. అదే ఇది. నిజానికి ఈ యాడ్ తర్వాతే దీనిపై ఎక్కువ మందిలో ఆదరణ పెరిగింది. 15 అంగుళాల వరకు పెరుగుతుంది. బరువు 6 నుంచి 8 కిలోల వరకు ఉంటుంది. ఇవి అందంగా కనిపిస్తాయి. అపార్ట్ మెంట్ కల్చర్ కు సరిపోతాయి. అరవవు. కామ్ గా ఉంటాయి. ఇంటికి వచ్చిన అతిథులపైకి దూసుకుపోవు. వీటి జీవిత కాలం 15 ఏళ్లు.

ముఖంపై చర్మం ముడతలతో ఉంటుంది. ఆహారం ఎక్కువగా ఇస్తే వీటి బరువు పెరిగిపోతుంది. మరీ వేడిని, తేమ వాతావరణాన్ని తట్టుకోలేవు. వేసవిలో చల్లగా ఉండేట్టు చూసుకోవాలి. ఎందుకంటే వీటికి కండరాలు పల్చగా ఉంటాయి. వ్యాధి నిరోధక శక్తి కూడా తక్కువే. దాంతో పలు రకాల వ్యాధులకు గురి అవుతుంది. కళ్లకు పెద్దగా రక్షణ ఉండదు. కనుక కుక్కను ఎప్పటికప్పుడు జాగ్రత్తగా పరిశీలిస్తూ క్రమం తప్పకుండా పశువైద్యుడి వద్దకు తీసుకెళ్లాల్సి ఉంటుంది.  

representation image

డాచ్ షండ్ Dachshund

వీటిలో మూడు రకాలు ఉన్నాయి. తక్కువ వెంట్రుకలతో, తీగలాంటి జుట్టు, పొడవు జట్టుతోనూ ఉండే వీటిలో సైజు విషయంలోనూ రెండు రకాలు ఉన్నాయి. ఒక రకం పొట్టిగా, మరోకటి మధ్యస్తంగా ఉంటాయి. పొట్టి రకం 15 అంగుళాల వరకు పొడవు ఉంటాయి. బరువు 6 నుంచి 12 కేజీల వరకు పెరుగుతాయి. వీటికి ఎక్సర్ సైజు పెద్దగా అవసరం లేదు. అదే సమయంలో తక్కువ ఆహారం సరిపోతుంది. ఇవి చాలా తెలివైనవి, చురుకైనవి. సరదాగా ఉంటాయి. ఇంట్లోని వారి పట్ల  చాలా ప్రేమతో వ్యవహరిస్తాయి. చిన్న ఇళ్లల్లో ఇవి అనువుగా ఉంటాయి.

representation image

పొమేరనియన్ Pomeranian

చాలా మంది ఇళ్లల్లో కనిపించే తెల్లటి బొచ్చు కుక్క పిల్లలు ఇవి. జర్మన్ స్పిట్జ్ జాతికి చెందినవి. బొచ్చు దట్టంగా ఉంటుంది కనుక ఎప్పటికప్పుడు శుభ్రంగా స్నానం చేయిస్తూ, జుట్టును కత్తిరిస్తూ ఉండాలి. ఇవి చిన్న సైజులో ఉంటాయి. బరువు 3.5 కేజీల వరకు, ఎత్తు 11 అంగుళాల వరకే పెరుగుతాయి. చాలా చురుగ్గా ఉండే వీటికి వ్యాయామాలు అవసరం లేదు. సరదాగా, ఆటలాడడంలో ముందుంటుంది. పిల్లలు, పెద్దలతోనూ ఫన్నీగా వ్యవహరిస్తుంది. నిర్వహణ ఖర్చు తక్కువ. కాపలా గుణం ఉన్నప్పటికీ చిన్నగా ఉండడంతో తగిన రక్షణ ఇవ్వలేదు.

representation image

జర్మన్ షెఫర్డ్ German Shepherd

వీటినే ఆల్సేషన్ కుక్కలు అని కూడా అంటుంటారు. పోలీసు జాగిలం. చాలా దేశాల్లో వంద సంవత్సరాలకు పైగా పోలీసులకు, సైనికులకు ఇది సేవలు అందిస్తోంది. ఇంటికి రక్షణనివ్వడంలో సాటిలేనిది. 25 అంగుళాల ఎత్తు, బరువు 34 నుంచి 43 కిలోల మధ్య ఉంటుంది. చాలా బలంగా, చురుగ్గా ఉండే ఇవి ఇంట్లోకి ఆగంతకులు, కొత్త వారు వస్తే జడుసుకునేలా చేస్తాయి. కట్టేసి ఉండకపోతే కొత్త వ్యక్తులు గేటు దాటితే వారి పని అయిపోయినట్టే. బలంగా ఉండే వీటిని దారికి తేవాలంటే తగినంత బలం ఉండాలి. వీటి జీవిత కాలం 12 ఏళ్లు. కొన్ని స్నేహంగా ఉంటే, కొన్ని చాలా విపరీత మనస్తత్వంతో వ్యవహరిస్తాయి. శిక్షణ ఇస్తే ఈజీగా నేర్చుకుంటాయి. ఎప్పటికప్పుడు జుట్టు కత్తిరిస్తూ వుండాలి.

representation image

డాబర్ మ్యాన్ Doberman

చూడ్డానికి సన్నగా కనిపించే వీటి బరువు 40 కిలోల వరకు ఉంటుంది. 34 అంగుళాల వరకు ఎత్తు పెరుగుతాయి. దీని చూపు, చురుకుదనం చూసి గేటు దాటి రావడానికి ఎవరూ సాహసించరు. రక్షణనివ్వడంలో జర్మన్ షెఫర్డ్ తర్వాత ఇవే ఉంటాయి. శిక్షణ ఇవ్వడానికి అనువైన ఈ రకం కుక్కలు చాలా తెలివైనవి. చాలా శక్తితో ఉండే ఇవి పరుగు మొదలు పెడితే దొంగ దొరికి తీరాల్సిందే. యజమానులకు విధేయంగా ఉంటాయి. జుట్టు తక్కువగానే పెరుగుతుంది కనుక నిర్వహణ ఖర్చు కూడా తక్కువే.

representation image

డాల్మేటిన్ Dalmatian

తెల్లగా ఉండే వీటి చర్మంపై మధ్య మధ్యలో నల్లటి మచ్చలు కనిపిస్తాయి. సరదాగా ఉండే వీటిని పిల్లలు ఇష్టపడతారు. ఆప్యాయంగా ఉంటాయి. చాలా చురుగ్గా ఉండే వీటికి వ్యాయామాలు అవసరం లేదు. చాలా వేగంగా పరుగెత్తగలవు. పుట్టినప్పుడు వీటి శరీరంపై ఎలాంటి మచ్చలు కనిపించవు. మూడు నాలుగు వారాల తర్వాత నుంచి బ్లాక్ లేదా బ్రౌన్ రంగులో మచ్చలు మొదలవుతాయి. 24 అంగుళాల ఎత్తు పెరిగే వీటి బరువు 28 కేజీల వరకు ఉంటుంది. జీవిత కాలం 13 ఏళ్లు. ఇంట్లో ఉన్న శునకం ఆరోగ్యంగా, చురుగ్గా ఉండాలంటే వాటికి సమతులాహారం, ఎంతో కొంత వ్యాయామం, వెటర్నరీ వైద్యులతో పరీక్షలు క్రమం తప్పకుండా చేయించాలని నిపుణుల సూచన.

representation image

రాట్ వీలర్ Rottweiler

చాలా బలమైనవి. అదే సమయంలో శాంతంగా ఉండే రకం. 24 నుంచి 27 అంగుళాల ఎత్తు వరకు పెరుగుతుంది. బరువు 40 నుంచి 60 కిలోల మధ్య ఉంటుంది. నలుపు రంగంలో చూడ్డానికి అందంగా కనిపిస్తుంది. కుటుంబ సభ్యులు, పిల్లల పట్ల స్నేహంగా ఉంటుంది. అదే సమయంలో ఇంటికి వచ్చిన వారిని తీక్షణంగా చూస్తూ భయపెడుతుంది. తనను పెంచుకునే ఇంటి కుటుంబ సభ్యుల జోలికి వస్తే ఒక సెకను కూడా ఆలస్యం చేయకుండా వారిపై దాడికి దిగుతుంది. శిక్షణ తప్పనిసరి. మస్టిఫ్ తర్వాత అత్యంత బలమైన కాటు రాట్ వీలర్ దేనని అమెరికా కెన్నెల్ ఫౌండేషన్ చెబుతోంది.

చిన్నారులతో స్నేహంగా ఉండేవి...

బీగిల్ రకం శునకాలకు శిక్షణనిస్తే ఇంట్లో రోజువారీ పనుల్లో పాలు పంచుకుంటాయి. చిన్నారులు ఎటు వెళితే వారి వెనుకే తిరుగుతూ ఉంటాయి. అందుకే ఓ కన్ను వేసి ఉంచాలి. కాకర్ స్పానియల్ అనే రకం కూడా చిన్నారులతో స్నేహ పూర్వకంగా ఉంటుంది. చిన్నారులతో కలసి ఆటలాడడంలో కూడా ముందుంటుంది. చాలా వేగంగా నేర్చుకునే గుణం దీని సొంతం. 

representation image

పిల్లలతో ఉన్న చిన్న కుటుంబానికి అనువైనది బుల్ డాగ్. ఇది కూడా చిన్నారులతో స్నేహపూర్వకంగా మసలుకుంటుంది. నిదానం, స్నేహం, సాహసోపేతంగా ఉంటుంది. పేరులో బుల్ ఉన్నట్టు చూడ్డానికి పొట్టిగా లావుగా కనిపిస్తుంది. పగ్ వలే దీని ముఖం కూడా ముడతలతో కనిపిస్తుంది. గోల్డెన్ రిట్రీవర్ రకం కుక్క కూడా ఆటల్లో ముందుంటుంది. కొత్త వారితోనూ చాలా తొందరగా స్నేహంగా మారిపోతుంది. బాల్ క్యాచ్, స్విమ్మింగ్, గంతులు వేయడం, నడవడంలోనూ ఉత్సాహం చూపిస్తుంది. ఇంకా ఆస్ట్రేలియా షెఫర్డ్, బాక్సర్ రకాలను కూడా చిన్నారులకు అనువైన శునక జాతులుగా పేర్కొంటారు.

అపార్ట్ మెంట్ వాసులకు అనువైనవి

అపార్ట్ మెంట్లలో ఉండేవారికి పగ్, మస్టిఫ్, ఫ్రెంచ్ బుల్ డాగ్, చిహుహువా, గ్రేహౌండ్, హావనీస్, యార్క్ హైర్ టెర్రీర్, గ్రేట్ డేన్, షిహు జు రకాలు సరిపోతాయి. అపార్ట్ మెంట్లు అంటే కొందరికి స్పేస్ తక్కువగా ఉండవచ్చు. కొందరికి కావాల్సినంత ఉండి ఉండవచ్చు. అపార్ట్ మెంట్లో పెంచుకోవాలంటే ఆ కుక్కలు అరవకుండా ఉండాలి. లేదంటే పక్క అపార్ట్ మెంటు వాసులు గగ్గోలు పెడతారు.

representation image

మస్టిఫ్

30 అంగుళాల వరకు పెరిగే వీటి బరువు 70 కిలోల వరకు ఉంటుంది. చాలా అరుదుగా అరుస్తాయి. సోఫాలంటే వీటికి ఇష్టం. ఓ చిన్న సోఫా కేటాయిస్తే చాలు దానిలో కూర్చుని గుర్రు పెడుతుంది. చాలా బద్దక జీవి. రోజులో కనీసం 15 నిమిషాల పాటు అయినా నడిపించాలి. చిన్నారులతో, ఇతరులతోనూ స్నేహపూర్వకంగా మసలుకుంటుంది. శిక్షణ ఇవ్వకపోతే మాట వినే రకం కాదు.

ఫ్రెంచ్ బుల్ డాగ్

12 అంగుళాలు పెరిగే ఇవి 10 నుంచి 12 కేజీల బరువు ఉంటాయి. ఆటలాడటానికి ఉత్సాహం చూపిస్తాయి. ఇతర శునకాలతోనూ స్నేహంగానే ఉంటాయి. అదే పనిగా అరవవు. ఇవి కూడా పగ్ వలే అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోలేవు.

representation image

చిహుహువా

బ్యాగులో కూడా పట్టేసేటంత చిన్నగా ఉంటుంది. ఏడు నుంచి ఎనిమిది అంగుళాల ఎత్తు పెరిగే దీని బరువు 3కేజీలు మించదు. ఇంటికి రక్షణ కోసం కాకుండా అందం కోసం పెంచుకోవాలనుకునే వారికి ఇది సరిపోతుంది. ఇంట్లో ఎవరో ఒకరికి సన్నిహితంగా ఉంటుంది. ముద్దుగా ఉన్నాయని అదే పనిగా వీటిని ఒళ్లో ఉంచుకోకుండా స్వేచ్ఛగా వదిలి వేయడం మంచిది. దీని అరుపులు చాలా తక్కువ శబ్ద స్థాయితో ఉంటాయి. అరవకుండా కొద్దిగా శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. 10 నుంచి 18 ఏళ్లపాటు జీవిస్తాయి. నిర్వహణ వ్యయం తక్కువ. కాకపోతే గోళ్లు కత్తిరిస్తూ, రెండు మూడు రోజులకొకసారి అయినా పళ్లు శుభ్రం చేస్తూ ఉండాలి.

హావనీస్

పది అంగుళాల ఎత్తు పెరిగే వీటి బరువు ఆరు కేజీలకు మించదు. కొద్దిగా వ్యాయామం సరిపోతుంది. ఇంట్లో చిన్నారులతో ఆడుకుంటుంది. ఇంటికి వచ్చిన అతిథులతోనూ కలిసిపోతుంది. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది కనుక ఎప్పటికప్పుడు కత్తిరిస్తూ ఉండాలి.  

రక్షణ కోసం

ఇంటికి, ఇంట్లోని వారికి రక్షణ కోసం చాలా మంది కుక్కలను పెంచుకుంటుంటారు. ఈ అవసరాలను తీర్చేందుకు జర్మన్ షెఫర్డ్, డాబర్ మ్యాన్, బుల్ మస్టిఫ్, రాట్ వీలర్ మందుంటాయి. రక్షణ కోరుకునే వారు వీటిలో తమ బడ్జెట్, నిర్వహణ  ఇతర అంశాలకు సరిపోయే దాన్ని విక్రయదారుడిని విచారించి ఎంపిక చేసుకోవాలి.

తక్కువ నిర్వహణ

లాబ్రాడర్, పగ్, చిహుహువా, బీగిల్, రాట్ వీలర్, గ్రేట్ డేన్, బీగిల్, బుల్ డాగ్, ఫ్రెంచ్ బుల్ డాగ్ లను తక్కువ నిర్వహణ వ్యయం, శ్రమతో కూడిన రకాలుగా పేర్కొంటారు.


More Articles